Previous Page Next Page 
విశిష్ట పేజి 38

    బాత్ రూంలో చూసి బయటికి పరిగెత్తారు.

    తోట గేటవతల టాక్సీ ఒకటి అప్పుడే బయల్దేరడం కనిపించింది.

    ఆ టాక్సీని అనుసరిస్తూ పోతే ఇక్కడ ఈ అయ్యగారి పరిస్థితి విషమిస్తే? ఇద్దరూ తిరిగి వచ్చి చెప్పారు. "దొంగముండ టాక్సీలో పారిపోయింది సార్"

    "అబ్బా! మంట భరించలేకపోతున్నాను. ముఖమంతా కాలిపోతోంది. ముందు నన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి."

                                           *    *    *

    విశిష్ట ఎక్కిన టాక్సీ మెరుపువేగంతో దూసుకుపోతోంది.

    ఆలస్యమౌతున్న కొద్దీ నీ ప్లానంతా తలకిందులైపోయి నువ్వా దుర్మార్గుడి చేతిలో చిక్కుకున్నావేమోనని భయపడ్డానమ్మా! టాక్సీ దిగి వచ్చేద్దామా అని కూడా అనిపించింది. రామనాధం వారించకపోతే టెన్షన్ భరించలేక వచ్చేద్దునో ఏమో!"     "నాకు మాత్రం నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా పని పూర్తి చేసుకువస్తావన్న నమ్మకం వుంది. ఆ పిల్లకేమీ కాదని మీ నాన్నకి ధైర్యం ఇస్తూనే వున్నాను.

    అనుకున్న పని సగమే అయింది. మిగతా సగం సక్రమంగా అయితే గాని విశిష్ట ఒడ్డున పడ్డట్టుకాదు" అన్నాడు రామనాధం.

                                            *    *    *

    సి.ఎం. మరికొందరు మంత్రులూ పాల్గొంటున్న సభ ఒకటి సిటీ నడిబొడ్డున నడుస్తోంది. సి.ఎం. ఉద్వేగంతో ప్రసంగిస్తున్నాడు. తను ప్రజల మనిషినన్నాడు.

    ప్రజల కోసమే బ్రతుకుతున్నానన్నాడు. ఏ రాత్రి, ఏ పగలైనా ప్రజలు తనని కలిసి తమ కష్టసుఖాలు చెప్పుకోవచ్చునన్నాడు. తన చేత నైనంతవరకు వాళ్ళ బాధలు తీర్చడానికి ప్రయత్నిస్తానన్నాడు.

    ఆయన ప్రసంగం ముగిసి ఆయన కుర్చీలో కూర్చోబోతుండగా విశిష్ట మెరుపులా ఆయన్ని సమీపించింది. పోలీసులు గబుక్కున వచ్చి ఆమె రెక్క పట్టుకుని లాగబోయారు.

    "సార్! మీతో అయిదు నిముషాలు మాట్లాడే అవకాశం నాకివ్వండి" చక్కని ఇంగ్లీష్ లో అభ్యర్ధిచినట్లుగా అంది.

    "ఆమె ఏం చెప్పాలనుకుంటుందో చెప్పనివ్వండి."

    సి.ఎం. ఉదారంగా అన్నాడు. ఇందాకే తను ప్రజల మనిషినని చెప్పుకున్నాడు కదా.

    పోలీసులు ఆమె పొట్ట దగ్గర, నడుం దగ్గరా తడిమి ఆమె దగ్గర మారణాయుధాలేమీ లేవని నిర్ధారించుకున్నాక కొంచెం దూరం జరిగారు.

    "చెప్పమ్మా! ఏం కావాలి నీకు నా నుండి?" మరింత ప్రసన్నత తెచ్చిపెట్టుకుని అన్నాడు సి.ఎం.

    "నాకు ప్రాణరక్షణ కావాలి సార్!"

    సి.ఎం. ఆశ్చర్యంగా "నిన్నెవరు చంపాలనుకుంటున్నారు......?" అన్నాడు.

    "నేనొక వ్యక్తిమీద యాసిడ్ పోసి వచ్చాను. అతడి మనుషులు నన్ను తరుముతున్నారు."

    అక్కడ కనిపించని పిడుగేదో పడ్డట్టుగా అయింది.

    "ఏదో ఘనకార్యం చేసినట్టు మాట్లాడుతున్నావే......? ఇది పెద్ద క్రిమినల్ లా వున్నట్లుంది సార్! వెంటనే ఈమెను అరెస్ట్ చేయాలి. అది మా డ్యూటీ!" అన్నాడొక ఎస్సై.

    "దయచేసి మీరు తొందరపడొద్దు. జరిగింది ఏమిటో ఆమెను పూర్తిగా చెప్పనివ్వండి."

    "ఈ దేశంలోనే కాదు, ఏ దేశంలోనైనా స్త్రీలకి మగవాళ్ళ సెక్సువల్ హెరాస్ మెంట్ వున్నదే. కార్మిక స్త్రీలు, కర్షక స్త్రీలు ఆ తోడేళ్ళ బారినపడడం సహజమే అయినా అదిప్పుడు కాలేజీలకు, యూనివర్శిటీలకు ప్రాకిందనిపిస్తోంది. కొందరు లెక్చరర్లు, ప్రొఫెసర్లు తమ స్టూడెంట్లనే లైంగిక వేధింపులకు గురిచేస్తూ పెళ్ళి కాకుండా తల్లులను చేస్తున్నారనడానికి మీ స్పందన ఏమిటి?"

    "అలాంటి కామాంధులను కాల్చిపడేయాలి."

    "అదే పని నేను చేశాను. అతడి ముఖాన్ని నేను యాసిడ్ పోసి కాల్చి వచ్చాను."

    సభ విశేషాలు సేకరించడానికి వచ్చిన పత్రికా విలేకరులూ, ఫోటో గ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లు విశిష్టను చుట్టుముట్టారు. ఆమె మీద ఫ్లాష్ లు వెలగసాగాయి.

    "మీరు చెప్పేదంతా నిజమేనా? ఈ సంఘటన ఎక్కడ జరిగింది?"

    "హోం మినిస్టరు గెస్ట్ హౌస్ లో జరిగింది. షాద్ నగర్ వెళ్ళేదారిలో ద్రాక్షతోటలో వుంది. నన్ను తమ గెస్ట్ హౌస్ కి రప్పించుకున్నది ఎవరో కాదు హోం మినిస్టరు సుపుత్రుడు, మాకు ఆంగ్లోపన్యాసకుడూ అయిన పృధ్వీకుమార్!"

    ఒక డి.ఎస్.పి. ఆగ్రహంగా ఆమెను సమీపించాడు. "హోంమినిస్టరు కొడుకు ముఖం మీద యాసిడ్ పోసి కాల్చి వచ్చిందంటే, ఈమెను మామూలు క్రిమినల్ కింద లెక్కగట్టకూడదు. ఆమెను వెంటనే అరెస్ట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వండి సార్" సి.ఎం.తో అన్నాడు.

    "ఆగండి! ఆమె మీద చెయ్యి వేయడానికి వీల్లేదు" అదే వేదిక మీద వున్న సాంఘిక సంక్షేమశాఖ మంత్రిణి రాఘవమ్మ అంది.  

    "ఆమె తన మాన సంరక్షణ కోసం అతడి ముఖం మీద యాసిడ్ పొయ్యడమేకాదు, హత్య చేసొచ్చినా దోషిగా పరిగణిచకూడదు."

    "ఆ తీర్పు మీరు, నేను చెబితే ఎలా మేడమ్? కోర్టు చెప్పాలి"

    "మన కోర్టులూ, చట్టాలూ ప్రజలకెంత న్యాయం చేస్తున్నాయో మనం చూస్తూనే వున్నాం. నాకు తెలిసిన ఒక అమ్మాయి హైస్కూల్లో చదువుతుండగా తన క్లాస్ పిల్లగాడు ప్రేమలేఖ రాశాడని పోలీసు కంప్లయింట్ ఇస్తే కోర్టులో విచారణ జరిగి ఆరేళ్ళకి తీర్పు వెలువడింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS