Previous Page Next Page 
విశిష్ట పేజి 40

    ఊపిరి బిగబట్టుకొని అతడికి బ్యాండేజీ చేస్తోందామె.

    అవతల గదిలో మాధవరావుతో చెబుతున్నాడు డాక్టర్.

    "........మీ అబ్బాయికి ఎంత ప్లాస్టిక్ సర్జరీ చేసినా యధారూపం రావడం అసాధ్యమే. ఏ అమెరికానో తీసుకెళ్ళి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి అతి ఖరీదయిన వైద్యం చేయించగలిగితే కొంతలో కొంత మెరుగు కావచ్చు.

    మీరెన్ని కోట్లు ఖర్చుపెట్టినా ఒక కన్ను రాదు! అది పూర్తిగా కాలిపోయింది దాని స్థానంలో గాజుకన్ను పెట్టుకోవలసిందే. రెండో కన్ను విషయం ఇప్పుడే ఏం చెప్పలేం. కాలిన నొప్పితో అతడు కన్ను తెరవలేక పోతున్నాడు. మొత్తానికి ఆ కన్ను కూడా అనుమానాస్పదమే......"

    తన అందంతో ఆడపిల్లలను శలభాలుగా మార్చాడు! లొంగని ఆడపిల్లలవెంట పులిలా పడ్డాడు, వేధించాడు. పిల్లి లాంటి పిల్ల పులిలా తిరగబడి వాడి అంతు చూసింది. బహిరంగసభలో సి.ఎం.ని కలిసి జరిగింది చెప్పి తన పదవినీ, పరువునీ పోగొట్టింది.

    ఇంత అవమానం తెచ్చిపెట్టినవాడి కోసం వాడి అందాన్ని వాడికి తెచ్చివ్వడం కోసం తను కోట్లు ఖర్చుపెట్టాలా?

    ఇప్పటికైనా వాడికి బుద్ది రావాలంటే తండ్రిగా తన బాద్యత తను నిర్వహించాలి.

    అద్దంలో తన అందవికారమైన ముఖం చూచుకొన్నప్పుడల్లా వాడికి ఆత్మవిమర్శ కలగకమానదు.

    అదే వాడి పాపాన్ని ప్రక్షాళనం చేస్తుంది!

    మాధవరావు ఇలాంటి ఆలోచనలో వుండగా యస్సై వచ్చాడు.

    "మీ అబ్బాయిని అరెస్ట్ చేయమని ఆదేశాలు జారీ అయ్యాయి సర్! ద్రాక్షతోటలో వున్న మీ గెస్ట్ హౌస్ లో దొరికిన ఖాళీ యాసిడ్ సీసా, పడక మీద నలిగిన పూలు మీ అబ్బాయి నేరాన్ని రుజువు చేయడంతోపాటు ఆమె చెప్పిన కథంతా యదార్ధమని రుజువు చేశాయి."

    "వాడి పాపానికి శిక్ష అనుభవిస్తూనే వున్నాడు కదా? మృత్యువుతో పోరాటం సాగిస్తున్నాడు. వాడు  బ్రతికి బట్టకడితే అలాగే అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి. వాడు అరెస్ట్ కాకుండా ఆపడానికి ఏ చక్రమో అడ్డువేయటానికి ఇప్పుడు నాకు పదవి లేదు - పవరు లేదు......" నీరసంగా అన్నాడు మాధవరావు.

                                           *    *    *

    ఆ రోజు కాలేజీలో విశిష్టను అభినందన వెల్లువలో ముంచెత్తారు స్టూడెంట్సూ, లెక్చరర్సూ.

    "ఇంత ధైర్యం ఎలా వచ్చిందే నీకు? అతడు గెస్ట్ హౌస్ కి రమ్మనగానే ఎలా వెళ్ళావు?"

    "ఈ విషయంలో నాకు బాపూజీ ప్రభోదం స్పూర్తినిచ్చిందని చెప్పాలి. 'భగవంతుడు నీకు గోళ్ళు, పళ్ళు ఎందుకిచ్చాడు? నిన్ను నువ్వు రక్షించుకోవడానికే' అన్నారాయన. ఆ ధైర్యంతోనే వెళ్లాను"

    "నీ దగ్గరున్న ఏసిడ్ సీసా అతడు ముందే పసిగట్టివుంటే? అది లాక్కుని నీ ముకం మీదే అది చల్లితే?"

    "పిచ్చి అనుమానాలను పెట్టుకుంటే మనల్ని పూనేది పిరికితనమే. అందుకే ఏదయినా పని చేయాలనుకున్నప్పుడు అనుమానాలు, సందేహాలు దరిదాపులకు రానివ్వను. ధైర్యం వున్నచోట విజయం కూడా వుంటుందని నమ్మే మనిషిని నేను!"

    లెక్చరర్స్ కూడా ఆమెను అభినందించారు.

    చాలా చక్కగా బుద్దిచెప్పావమ్మా! మరో లెక్చరర్ ఇలా తయారుకాకుండా మంచి శాస్తి చేశావు. నీ సోదర స్టూడెంట్లు నిన్ను స్పూర్తిగా తీసుకోగలిగితే తన స్టూడెంట్ల ను లైంగిక వేధింపులకు గురిచేసే బుద్దిమాలిన పని ఏ లెక్చరరూ చేయలేడు"

    "అసలు అతడికి పనిష్మెంటు కరుణ ఆత్మాహుతి చేసుకొన్నప్పుడే ఇవ్వాల్సింది. ఇప్పటికైనా ధైర్యంచేసి అతడి వికృత చేష్టలకు విశిష్ట అడ్డుకట్ట వేయడం అభినందనీయం."

    "లెక్చరర్ల పరువునే మంటగలిపాడండీ! గురుశిష్యుల సంబంధాన్నే కలుషితపరిచాడు. ఛీ! ఛీ! ఇలాంటి వాళ్ళు అధ్యాపక వర్గానికే మచ్చ.. అతడిప్పుడు సస్పెండేగా అయ్యింది? అది చాలదు. డిస్మిస్ కావాలి ఉద్యోగంనుండి. అతడు చేసిన నేరానికి చాలా కఠినంగా శిక్ష పడాలి. జైల్ శిక్ష!"

    "ప్రస్తుతం హాస్పిటల్లో వున్నాడు కదా?  హాస్పిటల్ నుండి డిశ్చార్జీ అవుతూనే సరాసరి జైలుకే కదా వెళ్ళేది? ఇంత జరిగాక అతడికి ఉద్యోగం ఏంవస్తుంది? ఈ దెబ్బతో వాళ్ళ ఫాదర్ పదవికూడా పోగొట్టుకున్నాడు కదా?"

    "ఈ రాజకీయ నాయకులకీ పదవులుపోతే వచ్చేది ఎంతసేపు? హోం మినిస్టీ పోతే హెల్త్ మినిస్ట్రీ పిలిచి ఇస్తారు. పలుకుబడివున్న ఒక రాజకీయనాయకుడి కొడుకును జైల్లో వుంచే ధైర్యం ఎవరికి వుంటుంది చెప్పండి?"

    "ఇలాంటి కేసుల్లో దోషులు తప్పించుకుపోకుండా వుండాలంటే మహిళా సంఘాలను ప్రవేశపెట్టాలి! వాళ్లయితే  దోషి తప్పించుకుపోకుండా వెంటపడతారు. మా అపార్ట్ మెంట్ లో ఒకామె ఒళ్ళు కాలి చనిపోయింది. పొరపాటున స్టౌ అంటుకొని కాలి చనిపోయిందని చెప్పి కేసు కాకుండా చూడాలని చూశాడు ఆమె భర్త.

    ఆమె తలిదండ్రులు మాత్రం అతడి మాటలు నమ్మలేదు. అల్లుడే తమ బిడ్డను కాల్చి చంపాడని పోలీసులకి ఫిర్యాదు చేశారు. పోలీసులకి లోపల్లోపల లంచం ముట్టిందేమో వాళ్ళ ఫిర్యాదు పట్టించుకోకుండా కేసు మూసేయాలని చూశారు. తలిదండ్రులు వెళ్ళి మహిళా సంఘం వాళ్ళను కలిసి మొరపెట్టుకొన్నారు. తమ కూతురిది ఖచ్చితంగా హత్యేనని, ఆ దుర్మార్గుడికి శిక్ష పడేలా చేసి తమ కూతురి ఆత్మకు శాంతికలిగేలా చేయమని ప్రాధేయపడ్డారు.

    అప్పుడు దిగాయి మహిళా సంఘాలు. నిజనిర్దారణ కమిటీని పంపారు. వాళ్ళు అపార్ట్ మెంట్ లోని ఆడవాళ్ళందరినీ కలిసి విచారించగా అందరూ ఒకేమాట చెప్పారు. అది పొరపాటున జరుగలేదు, హత్యేనని, రోజూ భార్యా భర్తలు కీచులాడుకొనే వాళ్ళని, తరచూ అతడు ఆమెను కొట్టేవాడని, నిన్ను చంపి నేను మళ్లీ పెళ్ళి చేసుకొంటానని అరిచేవాడని చెప్పారు.

    ఆమెకు ఒళ్ళు కాలిన రోజుకూడా ఆమె బాధతో పెడబొబ్బలు పెడుతుంటే కూడా ఆమెను హాస్పిటల్ కి తీసికెళ్ళడానికి తాత్సారం చేశాడని చెప్పారు. మహిళా సంఘం వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహంతో ఆ ఆడవాళ్ళంతా ధైర్యంగా ముందుకు వచ్చి ఇచ్చిన వాంగ్మూలంతో హతురాలి భర్తను కస్టడీలసోకి తీసుకోక తప్పలేదు పోలీసులు. ఇప్పుడ ుకేసు కోర్టులో నడుస్తోంది...."

                                                                 *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS