Next Page 
పరిహారం  పేజి 1

           
                             పరిహారం
                                               -పోల్కంపల్లి శాంతాదేవి.
    విజయలక్ష్మికి ఆయాసం ఎక్కువైంది.
    "పంతుల్ని పిలుచుకురానా?" దిక్కుతోచనివాడిలా పరిగెత్తబోయాడు కృష్ణారావు.
    "ఆయనవచ్చి ఏంచేస్తాడులెండి" నిస్పృహగా అంది విజయలక్ష్మి.  "ఆ భస్మాలు తిని తిని, ఆ కషాయాలు త్రాగి త్రాగి, ఆ పధ్యాలు ఉండి ఉండీ కాటికి మరింత దగ్గరగా జరిగాను! ఇక ఎంతోసేపు ఉండను. ఈనోట మాట పడిపోకముందే మీతో నాలుగుమాటలు మాట్లాడనివ్వండి!" మాట్లాడడానికి కూడా శక్తి చాలనట్లుగా రొప్పసాగింది ఆమె.
    ఉత్తరీయం నోటికి అడ్డుపెట్టుకుని భార్య మంచం మీద కూర్చున్నాడు కృష్ణారావు.
    "పారు ఏదీ?"
    "ఇందిర ఎత్తుకుపోయింది. పాలుపట్టి తెస్తానంది."
    "దాన్ని చూస్తే నా కడుపులో చెయిపెట్టి కలిచినట్టుగా ఉంటుంది. తొలిచూలు బిడ్డ అయినా ఎంత పొడవుగా, బలంగా పుట్టింది! హాస్పిటల్లో నర్సులే ఆశ్చర్యపోయారు. ఇప్పుడుచూడండి, ఎలా తయారైందో? సంవత్సరం నిండుతూన్నా దాని నడుములు నిలవడంలేదు. కళ్ళలో ప్రాణాలు పెట్టుకు చూస్తుంది! దానికి ఆరు నెలలు నిండకుండానే నా గుండెలో పాలు ఎండిపోయాయి. రోగిష్టి నైపోయాను! మాయదారిరోగం ఎక్కడి నుండి దాపురించిందో మీరున్న ఆ చారెడు చెక్కా అమ్మించాను! ఇక ముందు మీ బ్రతుకు ఊహించుకోడానికే కష్టంగా ఉంది!"
    "ఇప్పుడెందుకు ఆ సంగతులన్నీ? నేను మగవాణ్ణి. ఎలాగైనా బ్రతుకుతాను" గొంతు పట్టుక పోయినట్టుగా అన్నాడు.
    "పారు ఉందికదా మీ ప్రాణానికి"
    కృష్ణారావు ఉదాశీనంగా "అది తొందరలోనే నిన్ను వెదుక్కుంటూ వస్తుంది!" అన్నాడు.
    విజయలక్ష్మి శుష్కంగా నవ్వింది.  "ఈ ప్రపంచంలో మిమ్మల్ని వంటరివాళ్ళను చేసి అదీ నా దగ్గరికి వస్తుంది. నా పారు నా దగ్గరికి వస్తుంది. మరి మీరు...ఒంటరిగా...
    "విజయా! ఇప్పుడు ఎందుకీ సంగతులన్నీ? ఎలా జరగవలసి ఉందో అలాగే జరుగుతుంది. ఈకాస్సేపు మనసు ప్రశాంతంగా ఉంచుకో, విజయా! భగవంతుడిని ధ్యానించుకో, నాకేం కాదు. నేను ఏమీ అయిపోను! గాలికీ వానకూ దేనికీ చెక్కు చెదరని రాయిలా నేనూ బ్రతికేస్తాను!"
    "విజయా! పాప పడుకొంది!" భుజంమీద పడుకొన్న పాపను ఓ చాపపరిచి దానిమీద పడుకోబెట్టి వెళ్ళిపోయింది ప్రక్కింటి ఇందిర.
    తిన్న ఆహారం ఏ అవయవానికీ సరఫరా చెయ్యకుండా తనొక్కతే తీసుకున్నట్టుగా బానలా పెరిగిపోయిన పాప పొట్ట పైకీ క్రిందికీ ఆడుతోంది. ఆ పొట్టను చూస్తుంటే మృత్యువు అక్కడ దాగి ఉన్నట్టుగా అనిపించింది విజయలక్ష్మి కళ్ళకి. దుఃఖం పొంగి రాగా ముఖం గోడకేసి త్రిప్పుకొంది.
    మృత్యుచ్ఛాయలు తచ్చాడుతున్నట్టుగా ఉన్న ఆ నిశ్శబ్ద, నిర్జన గృహంలో కృష్ణారావుభార్యనూ, పాపనూ చూస్తూ మొద్దు బారిపోయినట్టుగా కూర్చున్నాడు.
    సరిగా ఏడాది క్రితం!
    ప్రక్క బస్తీ హాస్పిటలో ప్రసవించింది విజయలక్ష్మి రేపు పురుడనగా ఇంటికి తీసుకువచ్చాడు. బండిలోంచి దూదిబొమ్మలా ఉన్న పాపను పొత్తిలిలోకి తీసుకొని ఓ చేత గుండెలకు అదుముకొని రెండో చెయ్యి విజయలక్ష్మికి అందించి ఇంట్లోకి నెమ్మదిగా నడిపిస్తూన్న తన కళ్ళలో ఎన్ని కలలు మెరిసి ఉంటాయి!
    అందమైన కూతురు! అనురాగంతో అల్లుకుపోయే భార్య! చీకూ చింతా లేకుండా గడిచిపోయే సంసారం!
    తొట్టెలో వేసి పాపకు పారిజాతకుమారి అని పేరు పెట్టారు.
    మూడునెలల బాలింత తనంలో ఛాయ లేని ఒళ్ళు చేయవలసిన విజయలక్ష్మి రక్తం లేనట్టుగా , ఎండిపోయినట్టుగా కాసాగింది. నాలుగడుగులు వేస్తే ఆయాసం రాసాగింది.
    కృష్ణా రావుజాప్యం ఏదీ చెయ్యలేదు. పట్టణంలో డాక్టరుకి చూపించాడు. రోగమేమిటో నిర్ణయించకపోయినా డబ్బు మాత్రం బాగా ఖర్చు పెట్టించాడు ఆయన. ఆ తరువాత మరోడాక్టరు...... మరో డాక్టరు! డబ్బు మంచినీళ్ళలా ఖర్చు అయిపోయింది. ఉన్న కాస్త పొలం ముందు తాకట్టులోకి, తరువాత అమ్మడానికీ పోయింది. డబ్బు పోయింది. పొలం పోయింది, కాని, విజయలక్ష్మి రోగం మాత్రం పోలేదు!
    "ఇక నేను బ్రతకను. నన్ను నా ఇంట్లో చావనివ్వండి" అని విజయలక్ష్మి గొడవచేయడంతో ఆమెను ఇంటికి తీసుకు వచ్చేశాడు కృష్ణారావు. ఊళ్ళో సంబిపంతులుతో వైద్యం మొదలు పెట్టించాడు. ఆయన ఏదో చెట్ల వేళ్ళూ అవి తెప్పించి పెద్దకుండలో కషాయం దింపి త్రాగించాడు. ఏవో భస్మాలు , చూర్ణాలు తినిపించాడు.


Next Page 

  • WRITERS
    PUBLICATIONS