"మీరే కదా కరుణ ప్రసక్తి తెచ్చింది."
టీపాయ్ మీదున్న సీసాలూ, గ్లాసులూ చూసి ముఖం వికారంగా పెట్టింది. "మీకిది ఎన్నో నైటో తెలియదు కాని నాకిది ఫస్ట్ నైట్ కదా? పాలూ పళ్ళకి బదులుగా ఈ మందు సీసాలూ, గ్లాసులూ ఏమిటి? చూస్తుంటేనే నా కడుపులో తిప్పుతున్నట్టుగా వుంది"
"నీ మొహం -ఇందులోని మజా పాలూ, పళ్ళలో ఏం దొరుకుతుందిలే కాస్త రుచి చూస్తావా?"
"ఛీ!"
"నేను తాగి నువ్వు తాగకుండా వుంటే ఏం బాగుంటుందోయ్? ఒకరు భూమ్మీద ఒకరు ఆకాశంలో వున్నట్లుగా వుంటుంది. నాకు సుఖం పంచడానికి వచ్చినదానివి. నాతో అన్నీ పంచుకోవాలి ప్లీజ్! కొద్దిగా రుచిచూడు! నువ్వే మళ్ళీ కావాలంటావు. మనసులో ఎక్కడైనా ఓడిపోయానన్న బాధ వుంటే దీని దెబ్బతో ఇట్టే ఎగిరిపోతుంది"
"కావాలంటే మీరు ఎంతైనా తాగండి భరిస్తాను. నన్ను మాత్రం తాగమని బలవంతం చెయ్యొద్దు. నేను వాంతులు చేసుకోవడం మొదలుపెడితే నీకే కష్టం."
"అయితే వద్దులే. నీ చేత్తో గ్లాసులో పోసివ్వు. అందులో ఐసుంది వెయ్యి."
అతడు ఏం చెబితే అది బుద్దిగా చేసింది.
"ఎలాంటి దానివి ఎలా మారిపోయావు? నన్ను చూస్తూనే చిటపట లాడిపోయేదానివి......"
"ప్లీజ్! గతాన్ని కెలికి నా మూడు పాడుచెయ్యకు."
"ఓ! అప్పుడే మూడ్ లోకి వచ్చేశావన్నమాట. ఇక ఆలస్యమెందుకు?" ఆమె చెయ్యిపట్టి బలంగా లాగాడు.
విశిష్ట పూబంతిలా అతడి ఒడిలో పడింది.
అతడు గ్లాసులో వున్నది పూర్తిచేసి ఆమెను కౌగిలించుకోబోయాడు.
"పట్టపగల్లా ఈ లైటు.......నాకు సిగ్గేస్తుంది తీసేయండి"
"చీకట్లో ఏం మజా? ఇలా అయితేనే నీ అందాలన్నీ చూడొచ్చు. పాలరాతి శిల్పాన్ని చూడాలంటే లైటుండాల్సిందే"
"ఛీ!" సిగ్గుతో ముఖం దోసిట్లో దాచుకుంది. "ప్లీజ్! లైటు తీసేయండి."
"సరే! నీ మాట ఎందుకు కాదనాలి? చీకట్లో సైతం ఏ అందం ఎక్కడుందో తెలుసుకొనే చాతుర్యం నాకుందిలే" పృధ్వీ లైట్ తీసేసి జీరో బల్బ్ వెలిగించి వచ్చాడు.
గదిలో చల్లగా, హాయిగా నీలిరంగు కాంతి పరుచుకొంది.
అతడు మరో రౌండ్ మందు పూర్తిచేసి ఆవేశానికి హద్దులు చెరిపేసినట్టుగా ఆమెను మంచం మీదికి తోసేసి ఆమె మీద పడ్డాడు.
"అయ్యో! బాగ్ లో మల్లెపూలున్నాయి . ఇక్కడికి వచ్చాక పెట్టుకొందామని మరిచేపోయాను."
అతడ్ని పక్కకి నెట్టేసి లేచింది. బాగ్ లోంచి మల్లెపూల పొట్లం పైకి తీసింది.
గదంతా గుబాళింపుతో నిండిపోయింది.
"నేను తెప్పించి పెట్టాల్సిన మాట మల్లెపూలు. మరిచిపోయాను. ఫస్ట్ నైట్...... పందిరి మంచం మీద దీని పాత్ర ......ఓహో!" ఆమె చేతి నుంచి పొట్లం లాక్కుని ఆకులోంచి బయటికి వచ్చిన, విచ్చిన బొండు మల్లెల పరిమళాన్ని గాఢంగా ఆఘ్రాణించి పొట్లం ఆమెకిస్తూ "ఒక్కసారే కిలో మల్లెపూలు పట్టుకొచ్చినట్టున్నావే!" అన్నాడు.
"కొన్ని పూలు పరుపు మీద చల్లుకవాలని......." మాల నుంచి కొన్ని పూలు దూసి పరుపుమీద వెదజల్లింది. "నాకు ఏ పనిచేసినా ఫర్ ఫెక్ట్ గా చెయ్యడం అలవాటు. ఈ రాత్రి మనసారా మీతో ఆనందించాలని వచ్చినదాన్ని"
అతడు నిలువెల్లా మదనజ్వాలగా మారిపోయాడు. "నీలో ఇంత రసికత వుందని తెలియదు. పడకమీద సమవుజ్జీ దొరికితే స్వర్గం. వాలుతుంది. ఈ రాత్రి మరుపురాని రాత్రిగా జీవితంలో మిగిలిపోతుందన్న నమ్మకం నాకు కలిగింది"
ఆమె రెండు చేతులూ పైకెత్తి పూలదండ తల్లో తురుముకొంటుంటే అతడి చూపులు ఆమె ఎద ఎత్తులమీద వాలాయి. "రా డార్లింగ్! ఇంకా ఏమిటాలస్యం?"
"ఒక్క నిమిషం. మాల వెంట్రుకల్లో చిక్కుకుంది."
"నేను సరిచేయనా?"
"వద్దు నేను పెట్టుకుంటాను" మాలని సరిచేసుకొంటూ హఠాత్తుగా గుర్తువచ్చినట్టుగా అంది. "నా చెల్లెలి ముఖం యాసిడ్ పోసి కాలుస్తావా దాని ముఖం ఎలుకలు కన్నాలు చేసినట్టుగా కనిపిస్తుంది కదూ?"
"మూడ్ పాడు చెయ్యడానికి కాకపోతే ఇప్పుడా సంగతి ఎందుకు?" పృధ్వీ చిరాకుగా అన్నాడు.
"నీకిక రోజూ అదే ముఖం అద్దంలో కనిపిస్తుంది కాబట్టి. అదీ నీ కళ్ళు కాలిపోకుండా వుంటే" ఆ మాటతో పాటే సీసా విదిలించింది.
ముఖం, కళ్ళు కాల్చేసినట్టుగా మంట, భగభగ మంట. మనిషి కాలుతున్న వాసన. అతడు మంచంమీద దొర్లుతూ పెడుతున్న గావుకేకలు అవతలివాళ్ళు విన్నట్టున్నారు. వచ్చి తలుపు మీద దబదబా బాదసాగారు.
"క్యా హువా సాబ్? దరవాజా ఖోలియే!"
విశిష్ట బోల్టు తీసి గోడకి హత్తుకొని నిలబడింది.
వాళ్ళు తలుపులు తోసి గదిలోకి పరుగున రాగానే నిశ్శబ్దంగా బయటికి జారుకొంది.
"ఏమైంది సార్! కంట్లో ఏమైనా పడిందా?"
రెండు చేతులు ముఖం మీద కప్పుకొని బీభత్సంగా అరుస్తున్నాడు పృద్వీ.
దొర్లుతున్నాడు బాధ భరించలేకపోతున్నట్లుగా దొర్లి దొర్లి మంచం మీదనుంచి కిందపడ్డాడు.
"ఆ పిల్ల ఏది సార్! మీకేమైంది?"
"అది నా ముఖం మీద యాసిడ్ పోసి పారిపోయింది. వెదకండి! పట్టుకొని రేప్ చేసి పారేయండి. దొంగముండ!"
