Previous Page Next Page 
విశిష్ట పేజి 36

    శర్మిష్ట మంచంలో పడుకొని నిశ్శబ్దంగా కన్నీరు కారుస్తోంది. టైఫాయిడ్ జ్వరంతో ఆ పిల్ల చిక్కి శల్యమైపోయింది.

    చాలాసేపు తర్జన భర్జన తరువాత విశిష్టకు వెళ్ళడానికి పర్మిషన్ లభించింది.

    విధిలేక అనుమతి ఇచ్చినా వాళ్ళ హృదయాలు హాలహలం మింగినట్టుగా వున్నాయి.

                                               *    *    *

    సరిగ్గా ఆరు గంటలకి ఇంటి ముంది ఆగింది క్రీమ్ కలర్ మారుతీ కారు.

    చక్కగా సింగారించుకొన్న విశిష్ట ఇంట్లోంచి వచ్చి ఎక్కింది.

    కారు కదిలింది.

    అంతకుముందే అటుపక్కగా ఆగిన టాక్సీ ఆ కారుని అనుసరించింది.

    విశిష్ట ఎక్కిన కారు పావుగంటలో సిటీ దాటింది.

    "సిటీ దాటి వచ్చేశాం. ఇటెక్కడికి?"

    "ద్రాక్షతోటలో వున్న అయ్యగారి గెస్ట్ హౌస్ కి" చెప్పాడు డ్రయివర్.

    ఇంకేం మాట్లాడలేదు విశిష్ట

    అయిదు నిమిషాలు మించకుండా ద్రాక్షతోటలో ప్రవేశించింది కారు.

    పేరుకి ద్రాక్షతోట అయినా కనులవిందుగా రకరకాల పూల మొక్కలు, రంగు రంగుల్లో క్రోటన్ మొక్కలు పెంచబడ్డాయి.

    ఆహ్లాదంగా వున్న ఆ వాతావరణంలో అడుగుపెట్టగానే మనసు సేదదీరినట్టుగా అవుతుంది ఎవరికైనా. విశిష్టకి మాత్రం మనసు మంట ఎగద్రోసినట్టుగా అయింది.

    తోట మధ్య అత్యంత ఆధునికంగా కట్టబడిన గెస్ట్ హౌస్ యజమాని అభిరుచికీ, ఐశ్వర్యానికీ అద్దం పడుతున్నట్టుగా వుందది.

    మనిషికి వయసు మదం ఇచ్చినట్టే కొందరికి ఐశ్వర్యమూ మదం యిస్తుంది. ఆ మదం పట్టిన మనిషికి కంటికి నదురుగా కనిపించే ఆడదాన్నల్లా అనుభవించాలన్న పట్టుదల ప్రేరేపిస్తుంది. విచక్షణ కోల్పోయేలా చేస్తుంది. కళ్ళుండి అంధుడైపోతాడు.

    అందుకు పృధ్వీ ఉదాహరణ.

    డ్రైవర్ కారు డోర్ తెరిచాడు.

    విశిష్ట దిగగానే గెస్ట్ హౌస్ వైపు చెయ్యి చాపాడు. 'సాబ్ లోపలున్నారు వెళ్ళు.'

    గెస్ట్ హౌస్ గుమ్మం ముందు స్టూల్ మీద గూర్ఖా కూర్చొని వున్నాడు.

    విశిష్ట సమీపించగానే అతడు దిగ్గున లేచి ఆమెను సోదా చేస్తున్నట్లుగా నడం దగ్గరా, పొట్ట దగ్గరా తడిమి చూశాడు. ఆమె భుజానికున్న హ్యాండ్ బ్యాగ్ తీసుకొని, అందులో అన్ని అరలూ చెక్ చేశాడు.

    పెన్ను, కర్చీఫ్, చిన్నదువ్వెనా, చిన్న అద్దం, పౌడరు డబ్బా, ఆడవాళ్ళు అలంకరించుకొనే సామగ్రి కాక కొంత చిల్లరా, రశీదు కాగితాలు వున్నాయి. అవికాక దొడ్డుమల్లె చెండును అరిటాకులో చుట్టిన పొట్లం కూడా వుంది.

    అతడు వచ్చీరాని తెలుగులో అడిగాడు "అది తల్లో పెట్టుకోక బాగ్ లో ఎందుకు పెట్టుకున్నావు?"

    "తల్లో పెట్టుకొంటే వాడిపోతాయని. ఇక్కడికి వచ్చాక ఫ్రెష్ గా పెట్టుకొందామని" చక్కని హిందీలో చెప్పి నవ్వింది.

    అతడు పూలపొట్లం తిరిగి బాగ్ లో వుంచేసి బాగ్ ఆమెకు ఇచ్చేస్తుంటే  "హాయ్ డార్లింగ్" అంటూ బయటికి వచ్చాడు పృధ్వీ. "చెయ్యిస్తావేమో అనుకొన్నాను. థాంక్ గాడ్! నా ఆశ నిరాశ చెయ్యలేదు."

    విశిష్ట ఉల్లాసంగానే వుంది. "నేనొక నిర్ణయానికి వచ్చాక వెనుదిరిగే మనిషిని కాదు. జరిగేది జరుగుతుంది చింత చేసి లాభం లేదన్న ఫిలాసఫీకి వచ్చేశాను. నిశ్చింతగా వున్నాను"

    "అమ్మయ్యా! దిగేసుకున్న ముఖంతో వచ్చి నా మూడ్ ని పాడుచేస్తావేమో అనుకొన్నాను" భుజం మీద చేతిని వేసి లోపలికి నడిపించుకు పోయాడు.

    ఆమెను ఫోమ్ బెడ్ మీద కూర్చోబెట్టి వెళ్ళి తలుపులు మూసి బోల్ట్ పెట్టి వచ్చాడు.

    ఒకసారి అతడిని పరిశీలనగా చూసింది. మల్లెపువ్వులా తెల్లటి లాల్చీ పైజామాలో వున్నాడు. ఆడపిల్ల గుండె జల్లుమనిపించే అందమైన పర్సనాలిటీ , చంద్రుడికైనా మచ్చ వుంటుందేమోగాని అతడికి మచ్చలేదు. మరి కాస్సేపట్లో అందమైన ఆ ముఖం.........

    కాని అతడిని చూస్తుంటే తన మనసు ఝల్లుమనడంలేదు. భగ్గుమంటున్నది . మంచం మీద కళ్ళు వాల్చుకొని సిగ్గుల పెళ్ళికూతురిలా కూర్చొన్న విశిష్టను నఖశిఖ పర్యంతం ఒకసారి చూసి తృప్తిగా ఒక నవ్వు నవ్వి "స్వర్గంలో వున్న కరుణకు థాంక్స్ చెప్పాలనిపిస్తోంది" అన్నాడు.

    "దేనికి?"

    "కరుణ విషయంలోనే కదా నాతో లడాయి పెట్టుకొని నా దృష్టిలో పడ్డావు? నన్ను తిట్టి నేను పంతం పట్టేలా రెచ్చగొట్టావు. ఏమైతేనేం? ఒక అందమైన అనుభవం నాకు దక్కుతోంది.

    "కాని కరుణ స్వర్గంలో వుంటుందనుకోను."

    "ఎందుకనీ?"

    "తీరని కోరికలతో అలమటించిపోతూ కాలిపోయిన మనిషి అది. పగతో రగిలిపోతూ ఆత్మహత్య చేసుకొంది. పైగా గర్బిణీ కూడా. అలాంటి వాళ్ళకు స్వర్గద్వారాలే కాదు నరక ద్వారాలు కూడా తెరుచుకోవు. ప్రేతాత్మగా భూమికీ, ఆకాశానికీ అశాంతితో అలమటిస్తూ అంతరాళంలో తిరుగుతూంటుందని నా నమ్మకం. నాకెందుకో మనసులో గాఢంగా అనిపిస్తోంది. అది ఈ చుట్టుపక్కలే తిరుగుతూ ఆగ్రహంతో పళ్ళు పటపటలాడిస్తూ తిరుగుతుంటుందని."

    "ఛ! నీ పిచ్చి వర్ణనతో మూడ్ పాడుచెయ్యకు ఎప్పుడేం మాట్లాడాలో తెలియపోతే ఎలా?" చిరాకుపడిపోయాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS