Previous Page Next Page 
విశిష్ట పేజి 35

    మీ నాన్న బజారు నుంచి వస్తూ వస్తూ ఏ లారీ కిందో పడతాడు. ఆయుష్షు గట్టిదైతే కాలూ, చెయ్యి పోయి బ్రతకొచ్చు. లేదా పార్వతీ దేవిలా కనిపించే మీ అమ్మ నుదుట కుంకుమ చెరిపేసి పోవచ్చు.

    ఇంకేముంది? మీ జీవితం అంధకార బంధురం. ఇవేవీ జరగకూడదనుకొంటే నువ్వు నాకు లొంగిపోవాలి. నా మోజు తీర్చాలి? వట్టి చేతుల్లో పంపనులే. నగలరూపంలో, చీరల రూపంలో తగిన బహుమానమే ఇచ్చి పంపుతాను. నువ్వు నాకు నచ్చావనుకో.......... పర్మినెంట్ గా వుంచేసుకొంటాను."

    విశిష్ట ఇదివరకు విశిష్ట కాదు.

    తల చితక్కొట్టబడ్డ పాములా వుందామె. పడగ ఎత్తలేదు సరికదా కనీసం బుసకొట్టే స్థితిలో కూడా లేదు.

    "లొంగిపోవడానికి నేను సిద్దమే. కాని తరవాత నన్నూ, నా వాళ్ళనీ ప్రశాంతంగా బ్రతకనివ్వాలి" పోరాడి పోరాడి అలసిపోయినదానిలా అంది. తనే డోర్ తెరుచుకుని కారులో కూర్చుంది.

    ఇంత తొందరగా ఆమె తనకు అనుకూలంగా స్పందిస్తుందని, అతడు ఎంతమాత్రం ఊహించలేదేమో. ముఖంలో కొట్టొచ్చినట్టుగా ఆశ్చర్యం వ్యక్తమయింది.

    "ప్రశాంతంగా కాదు! రాణిలా బ్రతికే ఏర్పాటు చేస్తాను."

    విరక్తిగా అంది - "రాణినై రాజభోగాలనుభవించాలని లేదు. నాకు కావలసింది ప్రశాంతత. దయతో అది నాకు ప్రసాదిస్తే చాలు."

    "ష్యూర్!" ఉబ్బితబ్బిబైపోతూ ఆమె భుజంమీద చెయ్యి వేశాడు.

    మనసులో ఎంత వికారం బయల్దేరినా దాన్ని పళ్ళబిగువున అదిమిపట్టింది.

    "రేపు సాయంత్రం కారు పంపిస్తాను వచ్చేయ్యి."

    "ఉహు. రేపు కాదు. వచ్చే ఆదివారం సాయంత్రం వస్తాను. నేను మానసికంగా సిద్దపడటానికి నాకీ టైం కావాలి."

    "అబ్బ! అంతదూరమా?" విరహం ఆపుకోలేనట్టుగా అన్నాడు.

    మాటల్లో ఇల్లు దాటిపోవడం గమనించలేదు. గమనించాక అంది.  "మా ఇల్లుదాటి ముందుకు వచ్చేశాం. ఫర్వాలేదు కారాపండి. నేను నడిచి వెళ్ళిపోతాను"

    అతడు ఆపాడు. ఆమె దిగడానికి డోర్ కూడా తెరిచాడు. ఆమె మీదుగా ఒంగి.

    "ఆదివారం సాయంకాలం ఆరింటికి రెడీగా వుండాలి. కారు పంపిస్తాను.........నువ్వు డిస్సప్పాయింట్ చేశావా......" ఫలితం బాగుండదన్నట్టుగా సైగ చేశాడు.

    "ప్రామిస్! వస్తాను"

    కారు స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయాడు.

    ఎక్కడికో వెళ్ళి వస్తున్నాడు రామనాధం.

    ఆమె కారు దిగటం, కారులో వున్నతడితో మాట్లాడటం చూశాడు. "ఆ కారు ......ఆ కారులో వున్నది పృధ్వీ కాదూ?" అన్నాడాయన ఆశ్చర్యంతో.

    అవునన్నట్లుగా తలూగించింది.

    "ఇద్దరికీ సయోధ్య ఎప్పుడు కుదిరింది?"

    "........." ఏం జవాబివ్వాలో తోచనట్లుగా నిలబడింది.

    "ఇంతాచేసి చివరికి దాసోహం అన్నావా వాడికి? ఛీ! మీ నన్నకి తెలిస్తే ఉరేసుకు చస్తాడు."

    "నాకిప్పుడు మీకు జవాబిచ్చే శక్తిలేదు అంకుల్! మనసుకు గాయం! కాలుకు గాయం! నేను కొంచెం తేరుకున్నాక మీకంతా చెబుతాను. మీరు మా కుటుంబానికి ఆప్తులు. మీకు చెప్పక ఎవరికి చెబుతాను?" అంటూ అడుగు ముందుకు వేసింది.

    రామనాధం ఆమెతోపాటు నడుస్తూ ఆమె కుంటుతూండడం చూశాడు "ఏమైంది కాలుకు?"

    "పృధ్వీ కారుకింద పడ్డాను."

                                             *    *    *

    "నువ్వేం మాట్లాడుతున్నావో తెలుస్తోందా? నీ మాటల్లో వట్టి ఆవేశం తప్ప నాకేం కనిపించడంలేదు. పులి బోనులో అడుగుపెట్టిన కుందేలు పిల్ల పులికి ఆహారమైపోతుందేగాని పులిని దెబ్బతీసి రావడం ఎక్కడైనా జరుగుతుందా?" ఆవేశంగా అన్నాడు రామకృష్ణ.

    "పులి -కుందేలు పిల్ల కథ మీరు వినలేదా నాన్నా?తెలివి అనేది వుంటే అసాధ్యమనేది వుంటుందా? ఒక అసాధ్యాన్ని సాధ్యం చెయ్యడం లోనే వుంది మన గొప్పదనం. నేనిది గొప్పతనం కోసం కూడా చెయ్యడం లేదు. నా ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం కోసం చేస్తున్నాను. మనం చాలాదూరం , మనల్ని కనిపెట్టలేని చోటికి పారిపోదామని కదా మీ ఆలోచన? కాని కబందహస్తాలు చాలా పొడవు. అవి ఎంత దూరమైనా సాగివస్తాయి. ముందు ఆ హస్తాలను ఖండిస్తే మనం బ్రతికిపోతాం. నేను వెళ్ళేది ఆ పని చెయ్యడానికే. ఆడదంటే కేవలం ఆటబొమ్మ కాదు. అవసరమయితే ఆదిశక్తిగా కూడా మారుతుందన్న నిజం ఆ దుర్మార్గుడికి చాటడానికి వెడుతున్నాను. విజయోస్తు అని దీవించి పంపండి నాన్నా!"

    "అంతా నువ్వనుకొన్నట్లు జరక్కపోతే? అక్కడ నువ్వు అవమానం పాలయితే?"

    "నా పాపిష్టి ముఖం చూసే దుర్గతి మీకు పట్టనివ్వను. మీ పెద్ద కూతురు చచ్చిపోయిన దానికింద లెక్కగట్టి దినవారాలు చెయ్యండి!" అంటుంటే విశిష్ట కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.

    తల్లి ఏడుస్తూ కూతుర్ని వాటేసుకుంది.  "నువ్వా దుర్మార్గుడి దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు. నేను నిన్ను వెళ్ళనివ్వను. ఒక దుర్మార్గుడి కామజ్వాలకు నిన్ను ఆహుతి కానివ్వను. మీ నాన్న చెప్పినట్లు మనం ఎవరూ తెలియనిచోటికి వెళ్ళిపోదాం"

    "నీకు తెలియదు. నువ్వూరుకో అమ్మా! ప్రతీకారేచ్ఛతో నా గుండెలు మండిపోతున్నాయి. ఈ మంట నేను చల్లార్చుకోకుండా నేను బ్రతకలేను నేను మీతో పారిపోయి రాలేను. నన్ను వాడి దగ్గరకు వెళ్ళనివ్వకపోతే నన్ను నేను కాల్చుకుని చచ్చిపోతాను"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS