విశిష్ట చెల్లెలి చేతుల్ని ఒళ్ళో పెట్టుకు కూర్చుంది ధైర్యం ఇస్తున్నట్లుగా.
కాసేపటికి తల్లి తొడమీద తలపెట్టుకు పడుకుంది శర్మిష్ట.
ఆ రాత్రి అందరికీ జాగారమే. ఎవరూ పడుకోలేదు. పిల్లను చూస్తూ కూర్చున్నారు.
ఉదయమే శర్మిష్టను తమ ఫ్యామిలీ డాక్టరు దగ్గరికి తీసుకెళ్లాడు రామకృష్ణ, ఆటోలో కూర్చోబెట్టుకుని.
డాక్టరు ఇంజక్షన్ ఇచ్చి కొన్ని మందులు రాసి ఇచ్చాడు.
ఆటోలో తిరిగి వచ్చారు.
మధ్యాహ్నానికి జ్వరం తగ్గిపోతుందనుకుంటే తగ్గలేదు.
జ్వరపు మైకంలో ఏవో కలవరింతలూ, ఉలికిపడడమూ మొదలైంది.
జ్వరంతో ఒళ్లెరుగకుండా వున్న పిల్లను తీసుకుని ఊరికి ఎలా వెళ్ళాలో పాలుపోలేదు.
ఆ పల్లె కొంపలో వైద్య సౌకర్యమూ అదీ ఏం వుంటుంది. జ్వరం తగ్గాక వెళ్ళాలన్న నిర్ణయానికి వచ్చేశారు.
రెండు రోజులు గడిచాయి. జ్వరం తగ్గలేదు సరికదా పెరిగింది.
డాక్టరు టైఫాయిడ్ అన్నాడు. ఇంకేముంది రెగ్యులర్ గా మందులూ, పళ్ళరసాలు.
శర్మిష్ట నాలుగు రోజులకే బల్లిలా అంటుకుపోయింది మంచానికి. ఇంట్లో అందరికీ గుండెలు పిండేస్తున్నట్టుగా బాధ.
ప్రయాణం నిరవధికంగా వాయిదా పడింది.
వారంరోజులుగా కాలేజీకి వెళ్ళని విశిష్ట ఆరోజు వెళ్ళింది.
పృధ్వీ సెలవులో వున్నాడని తెలిసింది.
లెసన్స్ కంటిన్యూ అవుతుండగా కాలేజీకి డుమ్మా కొడుతున్నా వెందుకన్నారు కాలేజీలో పిల్లలూ, లెక్చరర్సూ. తమ కుటుంబం ఎలాంటి విషమ పరిస్థితిలో చిక్కుకుందో ఎవరికీ చెప్పలేదు విశిష్ట. చెప్పినా ఎవరు చేసే సాయం ఏం లేదు.
వట్టి సానుభూతి వాఖ్యాలు తప్ప.
కాలేజీకి వెళ్ళి వస్తున్నా చదువు మీద మనసు లగ్నం కావడంలేదు విశిష్టకు.
ఎప్పుడేం ముంచుకువస్తుందోనన్న భయం.
మంచంలో శుష్కించిపోతున్న చెల్లెలు.
ఎప్పుడేం ప్రళయం ముంచుకువస్తుందోనని ఊపిరి బిగబట్టుకొన్నట్లుగా వున్న తల్లి. మనస్థెయిర్యం సడలి పిచ్చివాలకం పడిన తండ్రి.
* * *
ఆ రోజు సిటీ బస్సు దిగి ఇంటికి నడిచివస్తోంది. సింధు, బిందు కూడా వెంట వున్నారు.
బస్సు స్టాప్ నుంచి ఇల్లు కొంచెం దూరమే.
స్పీడ్ గా వస్తోన్న కారొకటి ఆమెను రాచుకుంటూ పోవడంతో ఆ విసురుకి కిందపడింది విశిష్ట. చేతిలో వున్న పుస్తకాలు చెల్లా చెదురుగా పడ్డాయి. చెయ్యూ, కాలూ దోక్కుపోయాయి.
"ఆ కారు పృధ్వీగాడిదే. నేను చూశాను డ్రైవింగ్ అతడే చేస్తున్నాడు" అంది బిందు.
జనాలు అప్పటికే గుమిగూడారు.
"కారు నంబరు నోట్ చేసుకున్నారా?" అని అడిగారెవరో.
ఆ కారు పృధ్వీదైతే ఇది యాక్సిడెంట్ కాదు. కావాలని చేశాడు.
పృధ్వీ తనని చంపాలనుకుంటున్నాడా? చంపాలనుకుంటే కారు తన మీద నుండే పోనిచ్చేవాడు.
కాళ్ళు, చేతులు విరగ్గొట్టి అవిటిదాన్ని చేయాలనుకొంటున్నాడా?
ఇదొక శాడిస్ట్ మనస్తత్వం, ఒక్కసారి చంపడంలో ఆనందం లేదు. మనిషి బ్రతికే వుండాలి. టార్చర్ చేసి క్షణానికొకసారి చంపాలి. అదే వాళ్ళకు మహదానందం.
మరో రెండు రోజుల తరువాత కాలేజీ నుంచి వస్తూంటే అదే కారు వెంటాడసాగింది.
వెంట వున్న పిల్లలు, పక్కన నడుస్తున్న జనాలూ చెల్లా చెదురు కాగా విశిష్ట ఎటు పరుగెత్తితే అటు తిరగసాగింది.
భయంతో పరిగెత్తడం మొదలుపెట్టింది విశిష్ట.
అది మారుతీ కారయినా పెద్ద భూతంలా, తనని రక్తపు మడుగులో దొర్లించడానికి వస్తున్నట్టుగా అనిపించింది. ప్రాణభయంతో ఊపిరి ఆగిపోయేలా వుంది.
చావు తధ్యం అనుకుంది. కళ్ళముందు నల్లటి వలయాలు.
పాదాలకు అడ్డంగా చీర పడింది.
అంతే! గిరికీలు కొడుతూ కింద పడిపోయింది.
కారు ముందు చక్రం ఆమె మీద ఎక్కబోతుండగా సడన్ బ్రేక్ తో ఆగిపోయింది.
కారులోంచి దిగాడు పృధ్వీ.
చాపచుట్టలా కిందపడిన విశిష్టను రెక్కపట్టి విసురుగా పైకి లేపాడు.
"నాతో పెట్టుకుని బ్రతకాలనుకున్నావా? కాని ఒక్కసారిగా చంపను. పిల్లి ఎలుకను పట్టుకుని తినడానికి ముందు చాలా తాపీగా దానితో ఆడుకుంటుందే అలా ఆడుకుంటాను నీతో. ఆడుకొని ఆడుకొని అప్పుడూ......" ఫినిష్ అన్నట్టుగా చేత్తో సైగ చేశాడు. నిలబడలేక తూలి కారు బానెట్ మీద పడింది విశిష్ట.
"ఇప్పుడు నీ జీవితం నీది కాదు. అది నా చేతిలో వుంది. పరిస్థితిని అర్ధం చేసుకుని అన్యధా శరణం నాస్తి అని నా ముందు మోకరిల్లావా నిన్ను స్వర్గం అంచుల్లోకి తీసికెడతాను.
లేదంటే ఈసారి యాసిడ్ సీసా తప్పదు. అయితే కాల్చేది నీ ముఖాన్ని కాదు. చందమామలా వున్న నీ చెల్లెలి ముఖాన్ని. ప్రియాతి ప్రియమైన నీచెల్లెలి ముఖం......... ఎలుకలు కొరికి కన్నాలు చేసినట్లుగా వికృతంగా తయారయ్యే ఆ ముఖాన్ని చూసి చూసి నువ్వు గుండెలు బద్దలై ఛస్తావు.
