Previous Page Next Page 
విశిష్ట పేజి 33

    మార్జాలం నుంచి తప్పించుకొన్న గువ్వపిల్లలా వణికిపోతున్న శర్మిష్టను ఒళ్ళోకి తీసుకుని భయంలేదన్నట్టుగా నిమురుతూ  "కారులో ఎంతమంది వున్నారు? వాళ్ళను నువ్వు ఇంతకుముందు ఎప్పుడైనా చూశావా? మళ్ళీ చూస్తే గుర్తుపడతావా?" అనడిగాడు.

    "కారులో వున్న వాళ్ళ ముఖాలేవీ నాకు కనిపించలేదు నాన్నా! కారుకి నల్లద్దాలున్నాయి. పైగా రాత్రిపూట కదా? డోర్ తెరుచుకొని నల్లటి చెయ్యొకటి బయటికి వచ్చింది. అంతే చూశాను" భయంతో, దుఃఖంతో ఆ పిల్ల గొంతు వణికిపోతోంది.

    ఖిన్నవదనంతో నిలబడివుంది విశిష్ట. ఇదంతా తనవల్లే జరుగుతోందా?

    "ఇదంతా నావల్లే వచ్చిన ప్రమాదం అనిపిస్తోంది నాన్నా! నాకు శత్రువులున్నారు గాని దానికి లేరు. మనకు తెలిసినంత వరకు మేం ఇద్దరం ఒకేలా వుంటాం కదా? చెల్లెల్ని చూసి నన్ననుకొని దానివెంట పడివుంటారనిపిస్తంది!"

    రామకృష్ణ మనసులో ఆ మధ్య పత్రికలో చదివిన ఒక ఆర్టికల్ మెదిలింది.

    తన ప్రేమ తిరస్కరించిన ప్రేయసి మీద కసి పెంచుకున్న ఒక యువకుడు కిరాయి గూండాలకు ఆమె ఫోటో ఇచ్చి ఆమె ముఖంమీద యాసిడ్ పోసి రమ్మంటాడు. చీకట్లో వస్తున్న చెల్లెలి మీద ఆమే ఈమే అనుకొని యాసిడ్ పోసి పారిపోతారు ఆ దుర్మార్గులు.

    అభమూ, శుభమూ తెలియని ఒక ఆడపిల్ల ప్రేమను పగగా మార్చుకొన్న ఒక దుర్మార్గుడి దుర్మార్గానికి బలైపోయింది. ఆ చీకట్లో కిందపడి దొర్లుతూ ఆర్తనాదాలు చేసింది.

    సరిగ్గా అలాగే జరుగబోయిందా తన చిన్న కూతురికి?

    ఆయన ఆపాద మస్తకమూ వణికిపోయాడు.

    "భగవంతుడా! నా పిల్లలకి ఏం జరగకుండా చూడు!"

    ఎవరెన్ని విధాల భయపెట్టినా చెదరని స్థయిర్యం ఈ సంఘటనతో చెదిరిపోయింది.

    "అయితే సామాను సర్దు ఇంటికి తాళం పెట్టి వెళ్ళిపోదాం!"

    తండ్రి పూర్తిగా అశక్తుడు కావడం చూసి చలించిపోయింది విశిష్ట. ఇదంతా తన మూలానే జరిగిందనుకొంటుంటే తనమీద తనకు అసహ్యం వేయసాగింది.

    ఎందుకో తండ్రి నిర్ణయం సరైందిగా కనిపించలేదు. దుర్మార్గం ఎక్కడైనా వున్నదే కదా నాన్నగారూ?దాన్ని చూసి మనం పిరికిగా పారిపోతుంటే దుర్మార్గమే రాజ్యమేలుతుంది కదా?"

    ఆ రాత్రి ఎవ్వరూ భోజనాలు చెయ్యలేదు.

    వండుకొన్న వంటంతా అలాగే వుండిపోయింది గిన్నెల్లో.

    శర్మిష్ట భయంతో ముడుచుకు పడుకొంటే సామాను సర్దడంలో అమ్మా నాన్నలకు సాయపడసాగింది విశిష్ట.

    సామాను సర్ది సర్ది సంచుల్లో, అట్ట డబ్బాల్లో ప్యాక్ చేసి అలసిపోయారు.

    అప్పటికి అర్దరాత్రి గడిచిపోయింది.

    కాస్సేపు నడుం వాల్చి ఓ కునుకు తీద్దామని పక్కల మీద అలా వాలారో లేదో శర్మిష్ట కెవ్వున కేకపెట్టి దిగ్గున లేచి కూర్చుని భూతాన్ని చూసిదడుసుకొన్న దానిలా వణికిపోసాగింది.

    తల్లీ, తండ్రీ, అక్కా చుట్టుముట్టారు.

    "ఏమిటే? పీడకల వచ్చిందా?"

    "నల్లగా భూతాల్లా వున్నారు వాళ్ళు. కత్తులతో, యాసిడ్ సీసాలతో తరుముతున్నారు నన్ను" ఏదో ట్రాన్స్ లో వుండి మాట్లాడుతున్నదానిలా మత్తు మత్తుగా అంది.

    ఆమె చూపు ఎవరి మీదా, ఎక్కడా నిలవడంలేదు.

    తల్లి ఆ పిల్లను గుండెలో పొదువుకొంది. అప్పటికే ఆ పిల్ల శరీరం వేడి ఆవిర్లు కక్కుతోంది.

    "పిల్లకి భయంతో జ్వరం వచ్చేసిందండి! ఎలా కాలిపోతోందో  ఒళ్ళు. ఎలాగండీ?"
 
    "తెల్లవారితే డాక్టర్ కి చూపుదాం అమ్మా! చిన్నీ నీకేదో పీడకల వచ్చింది. నిన్నెవరూ తరమడంలేదు. చూడూ! అమ్మా, నేనూ అక్కయ్యా ఇక్కడే...... నీ దగ్గరే వున్నాం. నీకొచ్చిన భయమేమీ లేదు" రామకృష్ణ చిన్న కూతురు వీపు మీద చెయ్యుంచి నిమరసాగాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS