"ఏమిటి తెలియదు? మీకేనా అంతా తెలిసింది? అందుకే కద వయసొచ్చిన ఆడపిల్లను పోలీసులు పట్టుకుపోయేలా చేశారు, ఇంటిముందు పోలీసు జీపు ఆగగానే ఇరుగు పొరుగు వాల్ళంతా తలలు రిక్కించి చూస్తుంటే భూదేవి విచ్చుకొని అందులోకి అదృశ్యమైతే బాగుండునని పించింది."
"నువ్వొక సీతవు భూదేవి నిన్ను తన ఒళ్ళోకి లాక్కుంటుంది" వెటకరించాడు.
"కేసు విత్ డ్రా చేసుకొంటారా లేదా?" నిక్కచ్చిగా అడిగింది.
"నువ్వేమిటి తగిలావు నాకు?" ఆయన కస్సుమన్నాడు.
"చెప్పండి. ఈ గొడవ ఇంతటితో ఆపేస్తారా లేదా?"
"ఆపను. మన సి.ఎం గారు ప్రతి వారం ప్రజాదర్బార్ నిర్వహిస్తారు కదా! వెళ్ళి ఆయన దృష్టికి తీసుకువస్తాను ఈ విషయాన్ని ఆ దుర్మార్గుడికి శిక్ష పడేదాకా విడిచిపెట్టను ఏమనుకున్నావో!"
"సరే! మీరు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. నా చావు నేను చస్తాను."
"ఏమిటే నీ బెదిరింపు? చస్తావా? చావు! పిరికితనంతో రోజూ చచ్చేకంటే ఒక్కసారి చావడమే మంచిది. కాని నువ్వోసారి, నేనోసారి పిల్లలో సారి చావడం మంచిది కాదు. అందరం ఒకేసారి చద్దాం.
అందరినీ ఒకే చితిమీద కాల్చమని రాసి చద్దాం. బజారుకు వెళ్ళి వచ్చేటప్పుడు పురుగుల మందు తెస్తాను. లే లేచి రాత్రికి మనకిష్టమైన వంటకాలన్నీ చెయ్యి. తృప్తిగా తిని అందరం వరుసగా కూర్చొని తాగేద్దాం. ముందు నేను. తరువాత నువ్వు తరువాత విశిష్ట. ఆ తరువాత చిన్నది......."
ఆవిడ వినలేకపోతున్నట్టుగా చెవులు మూసుకొంది.
"ఆపండి నాన్నా!" విశిష్ట అసహనంగా అరిచింది "హాయిగా సాగిపోతున్న సంసారంలో ఈ రోజు చావుమేళాలు వినిపిస్తున్నాయంటే నేనే కారణం కదా! నేనొక్కదాన్ని చస్తే ఈ ఇంటికి పట్టిన శని వదులుతుంది."
"నువ్వు చస్తే ఆ కడుపు చిచ్చుతో మేం బ్రతుకుతామా? అలాంటి ఆలోచన నీ మనసులోకి రానివ్వకు"
"అమ్మ పట్టుబట్టిందనే కాదు. నాక్కూడా కేసు వెనక్కి తీసుకొంటేనే మంచిదనిపిస్తోంది. ఈ రోజు పోలీస్ స్టేషన్ లో ఆ ఎస్సైగాడు ఎంత అసహ్యంగా మాట్లాడాడో మీకు తెలియదు. మరోసారి పోలీస్ స్టేషన్ కి వెడితే మానప్రాణాలతో బయటికి వస్తానన్న నమ్మకం లేదు. అలాంటి పోలీసు వాళ్ళను నమ్ముకొని గుడ్డి న్యాయదేవతను నమ్ముకొని మనం పోరు సాగిస్తే మనకి చివరికి దక్కేది అపజయం, అపహాస్యమే న్యాయం, చట్టం అన్నీ వున్నవాళ్ళ చేతిలో బందీలు. అమ్మే కాదు నేనూ చెబుతున్నాను కేసు విత్ డ్రా చేసుకుందాం నాన్నా!"
"ఎంత మంది వద్దన్నా కేసు పెట్టి అదిచేస్తా ఇది చేస్తానని ప్రగల్బాలు పలికి ఇప్పుడు నా అంతట నేను కేసు విత్ డ్రా చేసుకొంటే నన్నొక వాజమ్మగా చూస్తారు జనాలు."
అంతకుముందే అక్కడికి వచ్చిన రామనాధం "ఇందులో అంత నామోషీ పడాల్సింది ఏమీ లేదురా! నిజానికి వాళ్ళమీద కేసు పెట్టి తప్పు చేశావు. ఆ తప్పు ఇప్పుడు దిద్దుకొంటున్నావు అంతే!" అన్నాడు.
* * *
రాత్రి ఏడవుతున్నదేమో ట్యూషన్ కోసం వెళ్ళి తిరిగి వస్తోంది శర్మిష్ట.
ట్యూషన్ మాస్టారిల్లు కొంచెం దూరమే అయినా నడిచే వెళ్ళి వస్తుంటుంది శర్మిష్ట.
ఆరోజూ అలాగే వస్తూంది.
చాలా సేపటి నుంచి ఆమెను ఓ కారు వెంబడిస్తోంది. సర్రున దూసుకుపోకుండా ఆగి ఆగి నెమ్మదిగా కదిలివస్తోన్న కారుని అనుమానంగా వెనుదిరిగి చూస్తూ వస్తోంది శర్మిష్ట.
కారుకి బ్లాక్ అద్దాలుండడం వల్ల కారులో ఎవరున్నదీ తెలియడం లేదు.
బాగా చీకటిగా వుందక్కడ.
కారు ఆమె పక్కగా వచ్చేసింది. వస్తూ వస్తూనే డోర్ కూడా తెరుచుకుంది.
"చప్పుడు చేయకుండా కారెక్కు. లేకపోతే నా చేతిలో వున్న యాసిడ్ సీసా నీ ముఖం మీద పడుతుంది" సీసా పట్టుకొన్న నల్లటి చెయ్యొకటి బయటికి వచ్చింది.
ఆ చీకట్లో అది రాక్షస హస్తంలాగే గోచరించింది.
పులిని చూసిన లేడి లాగే అయింది శర్మిష్ట. పాదాలు భూమ్మీద ఆననట్టు పరిగెత్త సాగింది.
కారు కూడా అంతే వేగాన్ని పుంజుకొంది.
కాని మళ్ళీ డోర్ తెరిచి బెదిరించే అవకాశం మాత్రం వాళ్ళకి రాలేదు.
సందు మలుపు తిరిగి మెయిన్ రోడ్డు మీదికి వచ్చేసింది. రోడ్డుమీద ట్రాఫిక్ చాలా ఎక్కువగా వుంది! పట్టపగల్లా షాపుల్లో బయటా లైట్లు వెలుగుతున్నాయి.
పరిగెత్తి ఇంట్లోకి వచ్చిపడి తలుపులు మూసేసి మూసిన తలుపుల ముందు కుప్పగా కూలిపోయింది శర్మిష్ట.
"ఏమిటే? ఏమైందే........?" తల్లి ఆదుర్దాగా వచ్చి పట్టి పట్టి ఊపసాగింది.
"ట్యూషన్ నుంచి వస్త్తోంటే నన్నొక కారు వెంబడించింది. డోర్ తెరిచి నన్ను కారెక్కమన్నారు. కారెక్కకపోతే యాసిడ్ నా ముఖం మీద పోస్తామని చెప్పి సీసా చూపెట్టారు. నేను భయంతో పరిగెత్తుకు వచ్చేశాను. ఆ కారు మనింటి ముందు ఆగిందేమో కిటికీలోంచి చూడు!"
రామకృష్ణ తలుపు తెరుస్తూంటే అన్నపూర్ణన భయంతో వారించింది "ఇప్పుడు తలుపెందుకు తెరుస్తారు? వాళ్ళు ఇంట్లోకి జొరబడి ఏదైనా అఘాయిత్యానికి తలపెడితే? వద్దు ఇప్పుడు తలుపు తెరవకండి!"
"అబ్బ! అన్నిటికీ భయమేనా?" ఆయన భార్య చేతిని విదిలించి తలుపు తెరిచి రోడ్డు మీదికి వెళ్ళి అటు ఇటు తెరిపార చూశాడు.
వచ్చేపోయే కార్లు, ఆటోలు తప్ప ఆగివున్న కారేదీ కనిపించలేదు.
అనుమానాస్పదంగా ఎవరూ కనిపించలేదు.
ఆయన ఇంట్లోకి తిరిగివచ్చి తలుపు మూశాడు.
