విశిష్ట చెదరని ధైర్యంతో సెల్ వైపు నడుస్తుంటే అన్నాడు నాయక్. "నీ బిడ్డకు ధైర్యం బాగానే వుంది. కాని మా పోలీసు వాళ్ళ ముందు చూపడమే బాగా లేదు. ఏం చేస్తాం? ఆమెను ఆ దేవుడే రక్షించాలి"
"వద్దు బాబూ! దాన్ని జైల్లో పెట్టొద్దు"
అంతలో రామకృష్ణ రానే వచ్చాడు. వస్తూనే అరవడం మొదలుపెట్టాడు. "ఏం న్యాయమండీ ఇది? దీన్ని తీవ్రమైన వ్యధకు గురిచేసి ఆత్మ హత్యకు పురికొల్పినవాడు దొరబాబులా నిక్షేపంగా వున్నాడు. వాడికి ఏ విచారణలు, శిక్షలూ లేవు. దీన్ని ఆత్మహత్యకు పురికొల్పినవాడికి మీ చట్టంలో ఏ శిక్షలూ లేవా?"
నాయక్ నిర్లక్ష్యంగా "ఇంత వయసు వచ్చింది. పైగా పిల్లలకి జ్ఞానం, విజ్ఞానం బోధించే బడిపంతులువి. పెద్దవాళ్ళ జోలికి చట్టాలూ, కోర్టులూ వెళ్ళలేవని ఆ మాత్రం తెలియదా?" అన్నాడు.
"మనుషులందరికీ ఒకే చట్టం కదా! బడిపంతులు కూతురికి ఓ చట్టం, హోం మినిస్టరు కొడుకైతే ఇంకో చట్టమూనా? మీ అన్యాయాన్ని నేను సాగనివ్వను. నా కూతుర్ని ఎలా జైల్లో పెడతారో నేను చూస్తాను. చట్టం చట్టమని చెప్పి నా కూతుర్ని జైల్లో పెడితే అదే చట్టప్రకారం వాడిని జైల్లో పెట్టండి."
"ఏయ్ పంతులూ! ఇక్కడ అనవసరంగా గొడవ చెయ్యకు. ఎవరైనా పెద్దమనిషిని పట్టుకురా. జామీన్ మీద వదిలేస్తాం" చిరాకుగా అన్నాడు నాయక్.
"నేను మళ్ళీ అడుగుతున్నాను. నా కూతురు ఏం తప్పు చేసిందని అరెస్ట్ చేశారు? ఎవరినైనా హత్య చేసిందా? ఎక్కడైనా దోపిడీ చేసిందా? చేసిన వాళ్ళని విచ్చలవిడిగా బయట వదిలిపెట్టి ఏ తప్పూ చెయ్యని నా కూతుర్ని అరెస్ట్ చేస్తారా?
ఇదేం లా అండ్ ఆర్డర్? మర్యాదగా నా కూతుర్ని నా వెంట పంపండి. లేకపోతే మీ పోలీసు అరాచకాలను, మీ హోం మినిస్టరు దురాగతాలను అరిచి అరిచి పబ్లిక్ లో చెబుతాను. పత్రికలకు చెబుతాను. చెప్పి చెప్పి సి.ఎం నివాసం ముందు ఆత్మాహుతి చేసుకుంటాను.
నా కూతురుకి మీ వల్లగాని, ఆ హోం మినిస్టరు వల్లగాని ఏమైనా జరిగిందా నేను ఖచ్చితంగా హంతకుడినౌతాను" ఆయన గుండె పగిలిపోతుందేమో నన్నంత ఆవేశంతో అరుస్తుంటే అక్కడున్న వాళ్ళంతా స్తబ్దులై పోయారు. నాయక్ ముఖంలో చిన్నగా చెమటలు పట్టాయి.
కొద్ది క్షణాలు నిశ్శబ్దంగా వున్న ఆయన "నీ కూతుర్ని తీసికెళ్ళు పంతులూ! కానీ విచారణ కోసం మళ్ళీ ఎప్పుడైనా పిలువొచ్చు. సిటీ విడిచి ఎక్కడికీ వెళ్ళొద్దు" అన్నాడు. పోయే ఊపిరి వచ్చినట్టుగా అయింది అన్నపూర్ణకి.
"మీ మంచి కోరి మరోసారి చెబుతున్నాను. మీరిచ్చిన కంప్లయింట్ ని వెనక్కి తీసుకోండి"
రామకృష్ణకి మాట్లాడాలనిపించలేదు. నిర్లక్ష్యంగా ఒక చూపు విసిరి విశిష్ట చెయ్యి పట్టుకొని బయటికి నడిచాడు. బతుకు జీవుడా అన్నట్టు వాళ్ళని అనుసరించింది అన్నపూర్ణ. వాళ్ళు ఇలా బయటికి వెళ్ళారో లేదో పృధ్వీ నుంచి ఫోన్ వచ్చింది.
"దాన్ని అరెస్ట్ చేసి స్టేషన్ కి తీసుకువచ్చారా లేదా?"
"తీసుకువచ్చాం సార్!"
"గొడవేమీ చెయ్యకుండా స్టేషన్ కి వచ్చిందా?"
"వచ్చింది సార్!"
"నేనొస్తున్నాను. దానితో కాస్సేపు సరదాగా ఆడుకోవాలి నేను" హుషారుగా అన్నాడు.
"సారీ సార్! ఇంతకుముందే ఆమె ఫాదర్ వచ్చి విడిపించి తీసుకెళ్ళాడు."
"అరే ఫూల్! ఎవరు విడిచిపెట్టమన్నారు నిన్ను?" అవతలినుంచి ఆగ్రహం వ్యక్తం చేశాడు పృధ్వీ.
నాయక్ కి చెంప ఛెళ్ళున చరిచినట్టుగా అయింది. తన వయసేమిటీ? వాడి వయసేమిటి? రిటైర్ మెంట్ కు దగ్గరలో వున్నాడు తను. వీడి అబ్బ హోం మినిస్టరైతే వీడి అబ్బ ఇంటి నుంచి జీతం వచ్చి తనని పెట్టుకొన్నాడా?
వచ్చిన కోపం పళ్ళబిగువున అణచిపెట్టి శాంతంగా జవాబిచ్చాడు నాయక్. విడిచిపెట్టకపోతే అతడు చాలా గొడవ చేసి పబ్లిక్ లో మన ఇమేజ్ ని దెబ్బతీసేలా కనిపించాడు సర్! అతడు సి.ఎం. నివాసం ముందు ఆత్మాహుతి చేసుకుంటానన్నాడు కూతుర్ని విడిచిపెట్టకపోతే. మళ్ళీ పట్టుకు రావడం ఎంతసేపు?
న్యాయం న్యాయమంటూ అరిచే ఇలాంటి ఉన్మాదుల్ని స్ట్రయిట్ గా కాకుండా దొంగ దెబ్బ తీయాలి. మీకెందుకు సార్? ఆమె బోను బయటున్నా బోను లోపల వున్నట్లే. ఎప్పుడో ఆమె మీకు ఫలహారం కాక తప్పదు."
"ఇప్పుడైతే వదిలిపెట్టి డిజపాయింట్ చేశావు కదా! రేపు రాత్రి వరకు అది జైల్లో వుండాలి. గుర్తు పెట్టుకో! రేపు దానికి ఫస్ట్ నైట్ అరేంజ్ చేయాలి.
"అలాగే సార్!" వినయంగా ఫోన్ పెట్టేసిన నాయక్ ముఖంలో వెంటనే భావాలు మారిపోయాయి. "ఈ క్షణం వుండి ఏ క్షణంలో ఊడుతుందో తెలియని పదవుల్లో వుండి ఏం దర్పం ఒలకబోస్తారు. తమాషా ఏమిటంటే పదవుల్లో వున్న వాళ్ళకంటే వాళ్ళ కొడుకులకూ, బంధువులకూ ఫోజులెక్కువ. ఆ పదవులున్నంత సేపు పట్టాపగ్గాలుండవు అయ్యగారి శృంగారలీలలకి పోలీస్ స్టేషన్ శోభనం గదిగా మార్చడానికి ఇక్కడ మరీ అంత గడ్డి మేస్తున్న మనుషులెవ్వరూ లేరు. ఎంత కాకీ బట్టలేసుకున్నా పై అధికారులకు అడుగులకి మడుగులొత్తినా కాస్తో కూస్తో మానవత్వం మిగిలి వుందండీ!"
నాయక్ తనలో తను గొణుక్కుంటుంటే అక్కడున్న కానిస్టేబుల్ ఆశ్చర్యంగా చూశాడు. ఏమిటి సార్! మీలో మీరే గొణుక్కుంటున్నారు?
"ఏం లేదు. ఏం లేదు మనసులో అనుకొనేది పైకి అనడం నాకలవాటు."
"నేను మీ మనిషినే! చెప్పండి సార్!"
"రేపు పూలు, పళ్ళు, పాలూ తెచ్చిపెట్టు. చిన్నయ్యగారు ఇక్కడ శోభనం చేసుకుంటారట. రేపది పత్రికలకి చెప్పి, పై అధికారులకి రిపోర్ట్ చేసిందంటే నా ఉద్యోగం ఊడిపోయి నా నోట్లోనే కదా మన్నుపడేది."
* * *
ఇదే మీకు చెబుతున్నాను. కేసు విత్ డ్రా చేసుకొని హోం మినిస్టరు గారి కాళ్ళు పట్టుకొని "ఇహ మా జోలికి రాకండి మహాప్రభో" అని వేడుకొని రండి. మీరీ పని చేసేవరకూ నేను నోట్లో పచ్చి మంచినీళ్ళు కూడా పోయను. సత్యాగ్రహానికి కూర్చొంటున్నట్టుగా చిరిచాప వేసుకొని కూర్చుంటూ అంది అన్నపూర్ణ.
"నీ మొహం నీకేం తెలియదు. ఊరుకో" రామకృష్ణ కసిరాడు.
