"దయచేసి రెండు నిముషాలు టైమిస్తారా?" తండ్రికి ఫోన్ చేసి వచ్చేసరికి తల్లి ఇంటికి తాళం పెట్టి జీపెక్కడానికి తయారైంది. "నేనూ వస్తాను నిన్నొక్కదాన్ని ఎలా పంపను. అక్కడేమైనా జరిగితే? పోలీస్ స్టేషన్ లో జరిగే అక్రమాలు ఎంత భయంకరమైనవో మనం ఎన్ని వినలేదు? వీళ్ళకేమన్నా హృదయమా మన్నా. ఇలాంటి బాధలు చుట్టుముడుతాయనే మీ నాన్నకీ చెప్పాను ఈ కేసులవీ వద్దని. చూడు! ఇంటి ముందు పోలీసు జీపొచ్చి ఆగిందని అందరూ ఇళ్ళ గుమ్మాల్లో నిలబడి ఎలా చూస్తున్నారో? నాకు తలకొట్టేసినట్టుగా అవుతోంది" ఆవిడ అవమాన భారంతో కళ్ళలో నీళ్ళు తిరిగినట్టుగా అయ్యాయి. విశిష్ట మాత్రం స్తబ్దంగా వుండిపోయింది.
ఇద్దరూ ఎక్కగానే పోలీస్ జీపు కదిలింది.
ఇటీవలే హెడ్ కానిస్టేబుల్ నుంచి ఎస్సైగా ప్రమోషన్ దొరికి రమాకాంత్ ప్లేస్ కి వచ్చాడు నాయక్. ఎర్రటి ఎరుపు, పిల్లి కళ్ళు, బొద్దు మీసాలు, మీసాలు తెల్ల బడ్డాయిగాని క్రాప్ నల్లగానే వుంది. రంగువేసినట్టు తెలిసిపోతుంది. ముఖంలో కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్న రఫ్ నెస్. బాగా తిండికి మరిగినట్లుగా బెల్ట్ మీద నుంచి జారిన బానపొట్ట.
కానిస్టేబుల్ వెంటబెట్టుకు వచ్చిన విశిష్టనీ, ఆమె తల్లినీ ఎగాదిగా చూస్తూ ముఖ్యంగా విశిష్టని గుచ్చినట్టుగా చూస్తూ "నువ్వేనా విశిష్టవి?" అన్నాడు బొంగురు గొంతుతో.
"విశిష్ట నా పేరు!"
"అదేం పేరు?"
జవాబివ్వడం అనవసరమన్నట్లుగా ముఖం తిప్పేసుకుంది.
"ఈవిడెవరు?"
"మా అమ్మగారు"
"అరెస్ట్ చేసి తీసుకురమ్మన్నది నిన్నొక్కదాన్నే. ఈవిడెందుకు వచ్చింది?"
"వయసొచ్చిన పిల్లను పోలీస్ స్టేషన్ కి ఒక్కదాన్ని ఎలా పంపను బాబూ?" ఆమె అమాయకంగా అంది.
"మాకు గుర్తేలేదు! వయసొచ్చిన పిల్లని భలే గుర్తుచేశావే" ఒక వంకర నవ్వు నవ్వాడు నాయక్. "వయసొచ్చిన పిల్లని జాగ్రత్తగా చూసుకోవాలని తెలియదటమ్మా? పెద్దవాళ్ళ మీద కేసు పెడుతుంటే తల్లివి నువ్వైనా చెప్పకూడదా?"
విశిష్ట చురుగ్గా చూస్తూ అంది "అనవసరమైన మాటలెందుకు? నన్ను అరెస్ట్ చేసి తీసుకువచ్చామన్నారు కదా?" జైల్లో వుంచండి.
"జైల్లో పడ్డం అంటే చాలా గొప్పగా ఫీలవుతున్నట్టున్నావే! ఒక రోజు జైలు గదిలో వున్నావంటే నీకు జన్మలో పెళ్ళయయేది కష్టం. అంత చెడ్డ పేరుంది. ఈ జైళ్ళకు. మగవాళ్ళయితే ప్రాణాలూ, ఆడవాళ్ళయితే మానాలూ దక్కవన్న అభిప్రాయం వుంది ప్రజల్లో. అందులో కొంత సత్యం లేకపోలేదు. ఎందుకొచ్చిన కష్టాలివి? కేసు విత్ డ్రా చేసుకుని హోం మినిస్టరుగారికి క్షమార్పణ చెప్పుకో.
ఏదో ఆడపిల్లవని జాలిపడుతున్నాను. లేకపోతే నిన్నెంత టార్చర్ చేయవచ్చో అంతా చేయమని నాకందిన ఆదేశాలు చూడూ. పెద్దవాళ్ళతో ఎందుకు గొడవ? వాళ్ళ ఆగ్రహావేశాలతో సముద్రం మీద కేంద్రీకృతమైన వాయుగుండంలా వున్నారు. అది ఏ క్షణంలో తుఫాన్ గా మారి నీ జీవితంలో బీభత్సం సృష్టిస్తుందో తెలియదు. నేను చెప్పినట్లు విన్నావనుకో, నేను కొంతవరకు నీకు సాయపడగలను. పొగరుగా తల ఎగురవేశావనుకో నాకు తిక్కరేగుతుంది ఆ తిక్కలో నేనేం చేసేది నాకే తెలియదు."
"అలాగే సార్! కేసు విత్ డ్రా చేసుకుంటాం. అమ్మాయిని విడిచి పెట్టండి" కన్నీళ్ళతో ప్రాధేయ పూర్వకంగా అంది అన్నపూర్ణ. ఆమెకు అప్పటికే ఒళ్ళంతా చెమటతో తడిసిపోయింది. భయం! గుండె ఆగిపోతుందేమో అనిపిస్తోంది.
"నీకు తెలీదు నువ్వూరుకో అమ్మా! నాన్నకి తెలియకుండా కేసు విత్ డ్రా ఎలా చేస్తాం? కేసు విత్ డ్రా చేసుకోవడానికేనా ఇంత కష్టపడింది?" కసిరింది విశిష్ట.
నాయక్ ముఖంలో రంగులు మారిపోయాయి.
"ఏమిటో కొందరమ్మాయిలకు పొగరు అందమే. ఈ పొగరు చూసే హోం మినిస్టరుగారి కొడుక్కి మోజు పుట్టినట్టుంది."
"త్రీనాట్ వన్!"
"ఎస్సర్!"
"ఈమె చాలా సరదా పడుతున్నట్టుంది జైల్ వైభోగం అనుభవించాలని. సెల్లో వేసి మూసెయ్యి."
"వద్దు బాబూ! దాన్ని సెల్లో పెట్టొద్దు. మీ కాళ్ళు పట్టుకుంటాను" అన్నపూర్ణ కన్నీళ్ళతో ప్రాధేయపడసాగింది.
"నన్నేం చేయమంటావమ్మా? నేను చట్టప్రకారం నడుచుకోవలసిన మనిషిని కదా? తను ఆత్మహత్యకు ప్రయత్నించిన మాట నిజమే కదా! చట్ట ప్రకారం ఆమె శిక్షార్హురాలే కదా?"
"మీరంతా చట్టప్రకారమే నడుచుకొనేట్టయితే దీనికంతా కారణమైన వాడు జైలు గోడల మధ్య వుండాలే? ఏది? చురుగ్గా అడిగింది విశిష్ట.
"అదంతా నీకనవసరం! చూడూ! నిన్ను పృధ్వీకుమార్ అనబడే మీ ఇంగ్లీష్ ప్రొఫెసర్ సెక్సువల్ హెరాస్ మెంట్ కి గురిచేసి మానసికంగా చిత్రహింస పెట్టాడని నీ కంప్లైంట్ లో పేర్కొన్నావు కదా? అంటే ఏ విధంగా వేధించాడు? బట్టలు విప్పమన్నాడా? నీ శరీరంలోని ఏ భాగాలను తాకాడు? లేక మొత్తం ఆక్రమించుకోజూశాడా? అంటే అత్యాచారం చేశాడా.....? అలా గుడ్లురిమి చూడకు. ఇవన్నీ మా విచారణలో భాగంగానే అడుగుతున్నాను. రేపు కోర్టులో కూడా వాళ్ల తరపు లాయరు ఇంతకంటే భయంకరమైన ప్రశ్నలే అడుగుతాడు. అప్పుడైనా జవాబు చెప్పాలి కదా?"
"జవాబు కోర్టులోనే చెబుతాను"
"అయితే ఇంకెందుకు ఆలస్యం! ఆమెను సెల్లో వుంచి మూసెయ్యి" కానిస్టేబుల్ కి సైగ చేశాడు.
"పదమ్మా!"
