ఆయన్ని చూశాక పోయిన ప్రాణం తిరిగివచ్చినట్టుగా అయింది అన్నపూర్ణకి. గబగబా కళ్ళు తుడుచుకుని నవ్వింది.
"నేను చెప్పాకదా అన్నపూర్ణా! బావకేమీ కాదని? నువ్వనవసరంగా గాబరా పడ్డావు!" అన్నాడు రామనాధం.
"ఏమిటీ? ఏమైందీ?" ఇంట్లో గుమిగూడిన అంతమందినీ, ఏడుస్తూన్న అన్నపూర్ణనీ చూసి ఆశ్చర్యంగా అడిగాడు రామకృష్ణ.
"కారులో వాళ్ళు నిన్ను తీసుకెళ్ళగానే అన్నపూర్ణ ఏడుస్తూ మా ఇంటికి వచ్చింది. ఆటోనో, టాక్సీనో తీసుకొని నన్ను వెళ్ళమంది. అక్కడ నీకేం కాదని ఎన్నివిధాలుగా చెప్పినా ఆమె భయం ఆమెదే! ఇంతకీ ఎందుకు పిలిపించినట్లు ఆ హోంమినిస్టరు?"
రామకృష్ణ అక్కడ జరిగిందంతా చెప్పాడు.
"నువ్వింత మూర్ఖశిఖామణివిరా రామం! వయసొచ్చిన ఆడపిల్లల వెంట మగపిల్లలు పడడం ఎంతో సహజం. బస్సుల్లో క్యూలలో, షాపింగ్ సెంటర్లలో ఆడవాళ్ళపట్ల అసభ్యంగా ప్రవర్తించే మగవాళ్ళకేం తక్కువ లేదు. చూసీ చూడనట్లు పోతే తప్ప జీవితం సాఫీగా నడవదు. ఆ హోం మినిస్టరు కొడుకు మన విశిష్టని అల్లరి పెట్టాడే అనుకో దానికింత పబ్లిసిటీ ఇచ్చి పోలీసు కేసు చేసి పత్రికలకెక్కి ఇదంతా ఏమిటి? అనవసరంగా ఆ పిల్ల పేరును బజారుకీడ్చావు!
ఏ తండ్రీ చెయ్యని తెలివిమాలిన పని చేశావు. ఊరికే ఆ పిల్లను చదువు మానిపించి , ఏ సంబంధమో చూసి పెళ్ళిచేస్తే ఎక్కడిదక్కడ సద్దుమణిగే దానికి కోతి పుండు బ్రహ్మరాక్షసిలా కెలికి రాద్దాంతం చేశావు. పెద్దవాళ్ళతో వైరం తెచ్చుకున్నావు. వాళ్ళతో పోరు అంటే మామూలు విషయం అనుకొన్నావా? కత్తిమీద సాము చేసినట్లని గుర్తుపెట్టుకో. వాళ్ళకున్న ధనబలంతో, అధికార బలంతో నువ్వు నమ్ముకొన్న ధర్మాన్నీ, సత్యాన్నీ కొనేసి నిన్నొక ఫూల్ ని చేసి నిలబెడతారు ఈ సమాజం ముందు. నలుగురూ నవ్వుకోడానికి తప్ప మరెందుకూ పనికిరాదు పోరాటం" కొంచెం సీరియస్ గానే మందలించాడు రామనాధం.
"ఏ మగాడైనా భార్య కొంగుపట్టి లాగితే నీ శరీరంలో రక్తం ఉడకదా రామం?"
"ఎందుకుడకదు? పట్టుకొని ఉతుకుతాను కూడా."
"స్త్రీ వెంట పురుషుడు పడటం సహజమేనని ఎందుకు అనుకోవు?"
"అదెలా వూరుకొంటాం?"
"ఇదీ అంతే! నా కూతుర్ని చెరుస్తానన్నవాడి అంతు చూడందే నేను నిద్రపోను. ఈ పోరాటంలో నేను బలి అయినా సరే. దయచేసి నన్ను నిరుత్సాహ పరచొద్దు. చేతనైతే సపోర్ట్ ఇవ్వండి. నైతిక బలమివ్వండి. నన్ను ఒంటరివాడిని చేసి అశక్తుడుగా మార్చకండి. మీకిదే నా విన్నపం." ఆయనకి ఆవేశంతో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి.
"మా సునీతను కాలేజీలో చేర్పించాక మగపిల్లలు ఇలాగే ప్రేమ లేఖలు వ్రాసి బ్లాక్ బోర్డులమీద పిచ్చి పిచ్చిగా బొమ్మలు వేసి ఏడిపిస్తుంటే అదొకనాడు నన్ను పట్టుకొని ఏడ్చింది. సుబ్బరంగా కాలేజీ మాన్పించి పెళ్ళి చేశాను. లక్షణంగా కాపురం చేసుకొంటుంది. నేనూ నీలాగే ఉద్రేక పడి తన్నడానికి వెడితే వ్యవహారం చాలా అసహ్యంగా తయారయ్యేది. నలుగురి నోళ్ళలోపడి వాళ్ళకి బుద్దిరావడం అలా వుంచి రెచ్చిపోయి ఇంకేమైనా చేసేవాళ్ళు అప్పుడు మనమే కదా లబోదిబో మనాల్సింది. అసలు నువ్విలా దండోరా వేయడమే బాగాలేదు........" మరో పొరుగింటాయన అన్నాడు.
"కాని నీ పిరికితనంతో నీ కూతురు నష్టపోయిందేమో తెలుసునా? చదువును, తన వ్యక్తిత్వాన్ని తీర్చి దిద్దమని మనిషిగా నిలబెట్టే చదువును! ఆ చదివి ఏం ఉద్దరిస్తారులే ఈ ఆడపిల్లలు? అదృష్టవశాత్తు ఉద్యోగం దొరికినా ఆ వచ్చే జీతం రోజుకోరకంగా కట్టే చీరలకూ, వాళ్ల షోకులకూ సినిమాలకీ, షికార్లకే సరిపోతుంది."
వారం రోజులు నిశ్శబ్దంగా గడిచిపోయాయి. ఆ రోజు క్లాసులు లేవని మధ్యాహ్నమే ఇంటికి వచ్చేసింది విశిష్ట.
తల్లి భోంచేసి పడుకుంది.
విశిష్ట తిని పుస్తకాలు ముందేసుకు కూర్చొంది. వాకిట్లో బుర్రుమని జీపొచ్చి ఆగిన శబ్దం వినిపించింది.
కాస్సేపటికి కాలింగ్ బెల్ మ్రోగింది. విశిష్ట లేచి తలుపు తీసింది.
"విశిష్ట ఎవరు? 309 సెక్షన్ కింద అరెస్ట్ చేసి తాసుకురమన్నారు ఎస్సైగారు! చట్ట ప్రకారం ఆత్మహత్యా ప్రయత్నం నేరంకదా?"
"ఆత్మహత్యా డ్రామా ఆడమని చెప్పిన ఎస్సైగారే నన్ను 309 సెక్షన్ కింద అరెస్ట్ చేసి తీసుకురమ్మన్నారా?" విశిష్ట ముఖం పాలిపోయి నట్లుగా అయింది. అప్పటికే లేచొచ్చిన అన్నపూర్ణ "ఆయన లేరు! వచ్చాక రండి" అంది. అప్పటికే ఆమెను చుట్టుముట్టిన భయం ఆమె గొంతు వణుకుతోంది.
"అరెస్ట్ చేసి తీసుకురమ్మన్నది నీ కూతుర్ని. అదీ వున్న పళంగా అరెస్ట్ చేసి తీసుకురమ్మని ఆర్డర్."
"ఎస్సై రమాకాంత్ గారే నన్ను అరెస్ట్ చేసి తీసుకురమ్మన్నారా?" ఆశ్చర్యంగా అడిగింది విశిష్ట.
"ఆయనెక్కడున్నాడు? అదిలాబాద్ అడవుల్లోకి ట్రాన్స్ ఫర్ అయ్యాడు. ఆయన ప్లేస్ కి ఎస్.పి.నాయక్ వచ్చారు."
"నాన్నగారు లేరు! వచ్చాక.......ఆయన్ని కలుస్తామని చెప్పండి......" విశిష్టకి ఏం మాట్లాడాలో పాలుపోలేదు.
"మిమ్మల్ని పెళ్ళి తాంబూలాలు తీసుకోడానికి పిలువలేదు. తమరు తీరికగా వేంచేస్తామంటే కుదరదు. అరెస్ట్ చేసి తేసీకుపోవడానికి వచ్చాను." అతడి గొంతులో వెటకారం. "ఊ! బయల్దేరు లేదంటే బలవంతంగా లాక్కుపోవాల్సి వస్తుంది."
"ఆడపిల్ల ఒక్కతీ ఎలా వస్తుందయ్యా? తండ్రి వచ్చాక వస్తుంది" అన్నపూర్ణ ధైర్యం కూడదీసుకుంటూ అంది.
"తను ఆడపిల్లనని పోలీసు రిపోర్ట్ యిచ్చినప్పుడు తెలియదా? హోంమినిస్టరు కొడుకు మీదే కంప్లైంట్ ఇచ్చింది కదా? దానికి విచారణ జరగొద్దా? నువ్విష్టమొచ్చినప్పుడు రావడంకాదు. మేం పిలిచినప్పుడు రావాలా పోవాల. ఊ నడూ లేకపోతే బరబర లాక్కుపోయి జీపెక్కించాల్సి వస్తుంది. సీను బాగుండదు."
