Previous Page Next Page 
మణిదీపం పేజి 3

    "పొద్దున లేచి అంత గంజి కాచి గొంతుల పోసుకుని కూలినాలికి ఉరికేటోల్లం. మాకు అదంత ఏడ ఈలైతది?"

    "బలానికి టానిక్ రాసిస్తాను. తెచ్చుకొంటావా?"

    "గా పైసలు నాకాడుంటే ఇట్లెందుకైత? కడుపునిండ తిని కండ పడ్తుంటి. గా టానిక్కు నీకాడ వుంటే ఇయ్యి! సూదిమందులూ, మందు బిళ్ళలూ ఇచ్చినట్టే టానిక్కులియ్యదా సర్కారు?"

    "సర్కారు టానిక్కులియ్యదుగానీ నువ్వు కూలి, నాలి చేసి తెచ్చే డబ్బు ఏం జేస్తవు?"

    "ఏం జేస్తను. ఓ పూట గంజినీళ్ళు తాగుతాం నేను. పిల్లలు."

    "ఎంతమంది పిల్లలు?"

    "ఆరుమంది.అందరూ ఆడముండలే! మగనలుసు పుడతాడనుకొంటె నీకంటే ముందున్న డాక్టరమ్మ బలవంతాన అట్టుకెళ్ళి ఆపరేశను జేయించింది. ఆపరేశను జేయించుకుంటే బక్కగన్నా అయితరంట! దొడ్డుగన్నా అయితారంట!"

    "ఆపరేషన్ చేయించుకొంటే సన్నం, లావు కాదు. సరైన ఆహారం తీసుకొని తగు మోతాదులో పనిచేస్తుంటే మామూలుగానే వుంటారు. ఆపరేషన్ చేయించుకొన్నాక కొంతమంది ఏం చేస్తారంటే బాగా బలంరావాలని ఇష్టంవచ్చినట్టుగా తినేస్తుంటారు. ఆపరేషన్ చేయించుకున్నవాళ్ళు పనిచెయ్యకూడదని మంచం ఎక్కి దిగరు! అలాంటివాళ్ళు లావుగా ఊరిపోతారు" నెమ్మదిగా చెప్పింది అరుణోదయ.

    "కొడుకు కొడుకనుకుంట ఆ పటేలుగారి పెళ్ళం ఏడో కాన్పులో పిండం అడ్డం తిరిగి సావలే? కాన్పు మీద కాన్పొచ్చి ఎట్టగైనవో చూడు. ఆ డాక్టరమ్మ బలవంతాన ఆపరేశను జేయించకపోతే ఈ తలికి మళ్ళ కాన్పొచ్చి సక్కగా కాటికి బోతుంటివి. బొక్కల పందిరివైనవ్. ఇంకా పిల్లల్ని గన నీకే నీ తానపానమేడుంటే! సర్కారోళ్ళు చెప్పినట్టు ఒకరిద్దరు పిల్లలైతేనే ముద్దు. అందుకనే నా కోడలికి ఇద్దరు పిల్లలు పుట్టంగనే ఆపరేశను జేయించిన" గర్వంగా చెప్పింది మంగమ్మ.

    అరుణోదయ చీటీ రాసి కాంతమ్మ చేతిచ్చింది.

    "ఈ టానిక్ తెప్పించుకొని వాడు. ఈ టాబిలెట్స్ పూటకు ఒకటి చొప్పున రెండు వేసుకో."

    మంగమ్మ కూడా తనకి ఒళ్ళు నొప్పులని మందు రాయించుకొని వెళ్ళింది.

    నడివయసు వుంటుందేమో అతడికి. పెళ్ళాం కాబోలు పట్టుకునడిపించుకు వచ్చింది.

    అతడు దగ్గరికి వస్తూంటే సారా వాసన గుప్పుమని కడుపులో తిప్పినట్టుగా అయింది అరుణోదయకి.

    "కడుపులో ఒకటే నొప్పంట డాక్టరమ్మా! కొంచెం చూడు! వెంట వచ్చినామె చెప్పింది.

    అతడిని బెంచీమీద పడుకోబెట్టి కడుపు వత్తి చూసి, "ఏం తిన్నావు?" అని అడిగింది.

    "పొద్దున్న సగం రొట్టె తిన్న!"


    "ఇంకా ఏం తిన్నవ్?"

    "ఇంకేం తినలే."

    "ఏం తాగినవ్?"

    "..." నీళ్ళు నములుతున్నట్టు చూశాడు.

    "సారా తాగావా?"

    "లేదు."

    "అబద్దం చెపితే మందివ్వను."

    "ఏదో.....కాసింత..."

    "రోజూ ఇలాగే సారాయి తాగుతుంటావా?"

    "చేతుల దుడ్డుంటే చాలు పెండ్లం, పిల్లల్ని పస్తు పడుకోబెట్టి తాగుతడు దొంగసచ్చినోడు."

    "ఎందుకని తాగుతావ్?"

    "కష్టాలు, బాధలు ఏమీ గుర్తుండవు. సుకంగా కంటికి నిద్రోస్తున్నది."

    అరుణోదయ ఇంజక్షన్ బాటిల్ చేతిలో పట్టుకొని చూపుతూ-

    "ఇది విషం. ఇది తాగు" అంది.

    "ఇదేం అన్నేలం తల్లీ? మందివ్వమని వస్తే విషం తాగమంటవ్?" ఆయాసంతొ అతడి కళ్ళు అరమూతలౌతుంటే అన్నాడు.

    "విషం తాగితే ఏమౌతుంది?"

    "ఇదేం పరాచికం తల్లీ? ఇసం తాగితే మణుసులు బతుకుతర?"

    "అవును! బతకరు. చస్తారు! చస్తే బాధలు, కష్టాలు ఏమీ వుండవు. కంటినిండా నిద్రొస్తుంది మళ్ళీ లేవకుండా. నువ్వు రోజూ తాగే సారా నున్ను కొంచెం కొంచెం చంపేసే విషమే కదా? నువ్వు రోజూ తాగే సారా నీ ఒంట్లో రక్తాన్ని తాగేసింది. మాంసాన్ని తినేసింది. చూడు ఎలా వున్నావో? ఒట్టి ఎముకల గూడువి మిగిలావు. రోజూ కొంచెం కొంచెం చచ్చేకంటే ఒక్కసారి చస్తే హాయి కదా."

    "మందియ్యి డాక్టరమ్మా! కడుపులో పేగులు వడిదిరుగుతున్నాయి." అరుణోదయ చెప్పేదంతా వినే ఓపిక లేనట్టుగా అన్నాడు.   


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS