Previous Page Next Page 
మణిదీపం పేజి 4

    "తాగడం మానేస్తానని చెబితేనే మందిస్తాను."

    "నీమీదొట్టు! ఇంకా తాగను."

    "మాట నిలబెట్టుకుంటావా?"

    "ముందు మందియ్యి తల్లీ!"

    "చూస్తాను కదా, ఎంతవరకు మాట నిలబెట్టుకుంటావో? ఇంటికి వచ్చి చూస్తుందా అని అనుకోవద్దు. మీ ఇల్లెక్కడో తెలుసుకుని వస్తాను. ఆరోగ్యం పాడయ్యాక మందులు తినడంకాదు. ముందు ఆరోగ్యం కాపాడుకోమని నా సలహా!"

    "మంచి మాట చెప్పినవ్ డాక్టరమ్మా! మంచి మాట చెప్పేవాళ్ళు లేకే ఇట్లా తాగుతున్నడు" అంది వెంట వచ్చినామె.

    "మా పట్టాణవాసంలో గాలి కలుషితం. నీళ్ళు కలుషితం- పాలు కల్తీ_ అంతా కల్తీ, కలుషితం. ఇక్కడ మీకు స్వచ్చమైన గాలి, ఫ్రెష్ గా కూరగాయలు, చిక్కటి పాలు, గెడ్డ పెరుగు, కమ్మటి నెయ్యి! మీరు కష్టించి పండించిన ధాన్యం! ఎంత ఆరోఘ్యమ్గా వుండాలి మీరు? ఇలా తాగుడికి బానిసలై ఆరోగ్యం చెడగొట్టుకోవడం తగునా? ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు."

    వచ్చిన ప్రతి పేషంటుకి ఏదో ఒక సుభాషితం చెప్పకుండా పంపలేదు అరుణోదయ.

    గర్భిణీ స్త్రీలకు మందులతో పాటు మంచి సలహాలు, పసిపిల్లల పెంపకం అన్నీ ఓపికగా చెబుతుంది. వాళ్ళు అమాయకంగా తనని 'డాక్టరమ్మా' అని పిలుస్తుంటే నవ్వుకుంటుంది.

    డాక్టరు కావాలని ఎన్నో కలలు కంది. కలలు కల్లలైనాయి. ఇలాగైనా 'డాక్టరమ్మా' అని పిలిపించుకొంటూంది, ఇక్కడ పనిచేసే డాక్టరు సెలవుమీద పోవడం వల్ల తనే డాక్టరమ్మ అయి కూర్చుంది.

    వచ్చి వారం రోజులు కాకముందే ఊళ్ళో జనం చిత్రంగా చెప్పు కోవడం మొదలు పెట్టారు అరుణోదయ గురించి. అందరూ ఎంత చక్కగా మాట్లాడుతుంది అనుకోవడమే.

    ఊళ్ళో వున్న పెద్దలు ఒకరిద్దరు కలిసి మనస్పూర్తిగా అభినందించారు ఆమెను. "ఎవరొచ్చినా జీతం డబ్బుల కోసం వచ్చి పనిచేసేవాళ్ళని చూశాంగానీ, జనం బాగు కోరేవారిని మిమ్మల్నే చూస్తున్నాం" అంటూ.

    ఒకరోజు దేవకి అన్న యువతి వచ్చింది.

    ఆమె మూడోసారి గర్భిణి, చాలా నీరసంగా వుంది.

    అరుణోదయ మందులవీ ఇచ్చి, "ఈసారి పిల్లలు లేకుండా ఆపరేషన్ చేయించుకో దేవకీ" అని చెప్పింది.

    "మగపిల్లాడు పుడితే అలాగే చేయించుకుంటాను సిస్టర్."

    "ఇంతకుముందు?"

    "ఇద్దరూ ఆడపిల్లలే. ఈసారి కూడా ఆడపిల్ల పుడితే నన్ను మా ఇంట్లో చంపేస్తారు. మొదటిసారి ఆడపిల్ల పుట్టినప్పుడే మా వారికి నామీద కోపం వచ్చింది మగపిల్లాడిని కనలేదని. రెండోసారి కూడా ఆడపిల్ల పుట్టాక ఆరు నెలల వరకు ణ ముఖమైనా చూడలేదు మావారు.

    పిల్లను తొట్టెలో వేస్తే ఆయనగానీ, మా అత్తగారుగానీ ఎవరూ రాలేదు. నేనే పాపని తీసుకుని వచ్చేశాను- పుట్టింట్లో ఎన్నాళ్ళుంటానని. రెండోపిల్ల పుట్టినప్పటి నుండి నన్నాయన సరిగా చూడడం లేదు. పిల్ల పుట్టి ఏడాదిన్నర అయింది. ఒకసారి కూడా కన్నెత్తి చూడలేదా పిల్లని ఆయన."

    "ఆడపిల్లలు పుడితే ఒక్క నీ తప్పే ఎలా అవుతుంది? ఆడపిల్ల పుట్టినా, మగపిల్లాడు పుట్టినా ఇద్దరి బాధ్యతా వుంటుంది కదా? ఆ మాత్రం ప్రాధమిక పరిజ్ఞానం లేదా మీ ఆయనకు? ఇంతకీ చదువుకున్నవాడేనా?"

    "ఇంటర్ పాసైండు. వ్యవసాయం చూసుకుంటాడు."

    "మరి ఆ మాత్రం తెలీదా ఆడపిల్ల పుడితే ఒక్క నీ తప్పే లేదని? ఒకసారి నా దగ్గరికి తీసుకురా-నేను నచ్చజెప్పుతాను."

    "ఎవరు చెప్పిందీ వినదు. అదొక మొండిరకం."

    "వారం రోజుల్లో ప్రసవం వస్తుంది. కాన్పు ఎక్కడ చేసుకోవాలనుకున్నావు?"

    "రెండు కాన్పులు మా పుట్టింట్లో తేలిగ్గానే అయినాయి. ఈసారి కూడా మా ఇంట్లోనే అనుకున్నాను."

    "ఈసారి వీక్ గా వున్నావు. హాస్పిటల్ కే రా."

    "అట్లాగే వస్తాన్లే వస్తానుగానీ నాకు ఒక్క మేలు చెయ్యి సిస్టర్."

    "ఏమిటి?"

    "ఈసారీ ఆడపిల్ల పుడితే తీసికెళ్ళి ఎవరయినా పిల్లలు లేనివాళ్ళకు ఇచ్చెయ్యి. ఎవరూ తీసుకోకపోతే నువ్వే దాని గొంతులో ఇంత విషం పోసి చంపెయ్యి" అంటుంటే దేవకి గొంతు దుఃఖంతో వణికింది.

    "ఛీ! ఏం మాటలు మాట్లాడుతున్నావు?"

    "ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలున్నారు. వాళ్ళని ఎప్పుడూ దరిద్రపు ముండా, జేష్ఠముండా అని తిడుతూ వుంటుంది మా అత్తగారు. సరిగ్గా తిండి కూడా పెట్టదు. కన్నపేగు కదిలి ఇదేమని అడిగితే ఆడముండలకి ఈ తిండే దండగ అంటుంది మా అత్తగారు. మా వారయితే ఒక్కసారి కూడా వాళ్ళని ప్రేమగా దగ్గరికి తీయలేదు! కుక్క్లాకన్నా హీనంగా చూడబడే ఆ ఇద్దరికీ తోడు మూడోది కూడా ఎందుకు?" అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకొంది.

    "తొమ్మిది నెలలు కడుపులో మోసి ఇలా ఎలా మాట్లాడుతున్నావ్?" ఆశ్చర్యపోయింది అరుణోదయ.   


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS