Previous Page Next Page 
మణిదీపం పేజి 2

     ఆమె ఏదో పనిలో వున్నట్టుంది. అలాగే వచ్చింది.

    "ఈ అమ్మాయి మన వెంకట్ చెల్లెలట. పేరు అరుణోదయ. చాలా చక్కటి పేరుకదూ? ఏ.ఎస్.ఎమ్ గా పాన్ గల్ కి పోస్టింగ్ వచ్చింది. వెంకట్ ఉత్తరం రాశాడు. మనకీ దగ్గరలోనే ఇల్లు చూసి వుంచమని. వెంకట్ రాసినట్టుగా నువ్వు ఆ పల్లెటూళ్ళో యిల్లు తీసుకుని వుండడం కంటే యిక్కడ ఇల్లు తీసుకుని వుండి, యిక్కడినుండి తిరగడమే మంచిది. పాన్ గల్ కి బస్సులు బోలెడు!"

    "తెలిసినవాళ్ళు దగ్గరుంటే దిగులుండదని అమ్మకూడా అందండీ! ఇక్కడే మంచి ఇల్లు దొరికితే!"

    "నీకు ఇల్లు చూసిపెట్టే బాధ్యత మీ ఆంటీ తీసుకుంటుందిలే! అంతవరకు మా ఇల్లే మీ ఇల్లనుకుని వుండు!" మనస్పూర్తిగా అన్నాడాయన.

    ఆయనకీ నలభై, ఆమెకు ముప్పై అయిదు వయసుంటుందేమో! ఇద్దరూ సహృదయులూ, స్నేహశీలురుగా కనిపించారు అరుణోదయకి.

    రెండు రోజులు వాళ్ళింట్లో వుంది. పక్కనే చిన్న ఇల్లు అద్దెకు దొరికింది.

    ఒక సెలవు రోజు సిటీకి వెళ్ళి తనకు కావలసిన సామానుతో తిరిగొచ్చి ఆ యింట్లో దిగింది అరుణోదయ.

   
                               *    *    *    *


    "డాక్టరమ్మా!"

    పిలిచింది ఎవరినా అని దిక్కులు చూసింది అరుణోదయ.

    ఎవరూ లేరు!

    తనూ, కాంతమ్మ!

    "పయ్యంత నొప్పులు! నొప్పులకి సూదెయ్యి డాక్టరమ్మా!"

    "పయ్యంత అంటే?"

    "ఒళ్లంత నొప్పులమ్మా!"

    "ఓహో! 'పయ్యి' అంటే ఒళ్ళు అనా అర్ధం?"

    "పల్లెటూరోల్లం! మా బాసగంతే. పోయిన డాక్టరమ్మ బలవంతాన అట్టుకుపోయింది పిల్లలు గాకుండగ ఆపరేశను జేయించింది. కూలినాలి.....మోటు కట్టం జేసుకు బతికేటోల్లం. ఉప్పుంటే ఉప్పు, కారం వుంటే కారంతిని బతికేటోల్లం! మాకెందుకమ్మ ఆపరేశన్లు అంటే ఇన్లే! బలవంతాన అట్టుకుపోయి జేయించింది. ఆపరేశను అయినకాణ్ణించి ...ఇగో....ఇట్టగై పోయిన! కాళ్ళు చేతులు పుల్లలు! ఎదలెండుకుపోయినయ్! చంటిదానికి చుక్కపాలు లేవు!"

    "ఆపరేషన్ అయినాక హాస్పిటల్లో డబ్బులివ్వలే, బలానికి బాగా తినమని?"

    "ఏడొందలో ఎంతో ఇచ్చిన్రు. బలంగ గుడ్లూ, మాంసం తినమన్నరు! పైసలు చేతులపడేసర్కి నా మొగుడు కల్లంగట్ల పాత అప్పుంటే తీర్చి నాలుగు రోజులు కల్లుతాగి జల్సా చేసిండు!"

    "నీ మగడు కల్లు తాగి జల్సా చేస్తుంటే మరి నువ్వేం చేసినవ్?"

    "నేనేం చేస్త? ఆడముండను!"

    "మగడు వుండగానే ముండవి ఎలా అవుతావు? ఆడదానివను. ఒప్పుకొంటాను. ఆడదానివైతే మటుకు నీకేం తక్కువ? నువ్వు రాత్రికి వాడి పక్కన చేరకపోతే వాడికి నిద్రపట్టదు. నువ్వు కూదొండి కంచంలో పెట్టకపోతే వాడికి దిక్కుండదు. నువ్వే లేకపోతే వాడికి ప్రపంచమే వుండదు! అందుకని, వాడికి నీ అవసరం ఎంతుందో గుర్తుపెట్టుకో! తెలివిగా వాడి జుట్టు నీ చేతిలో పట్టుకో! అంతేగానీ, ఆడముండను అని నీకు నువ్వే తక్కువ చేసుకోకు! నువ్వే తక్కువ చేసుకొంటే అవతలివాడు యింకా తక్కువ చేస్తాడు!"

    ఏందేందో జెప్తున్నరు! నా కొక్కటీ సమజైతలేదు!" బుర్ర గోక్కుంది కాంతమ్మ.

    ఇంతకుముందే వచ్చింది మంగమ్మ అనే ఆవిడ. "నీ మగడికి పక్కెయ్యకు, కూడెట్టుకు అని జెప్పుతూంది డాక్టరమ్మ!" అంది.

    "నేను పక్కెయ్యకపోతే ఊళ్ళో ముండలు కరువా-ఏ ముండ తానికన్న పోతడు! ఇంట్లో కూడెట్టకపోతే బయటేడన్న గతికొస్తడు!"

    "ఇల్లు పెళ్ళాం వుండగా బయట ఎన్నాళ్ళు గడుపుతాడు? రెండు రోజుల్లో మళ్ళీ నీ దగ్గరికి రావలసిందే! తాగితే పక్కెయ్యనని చెప్పు! కూడొండనని చెప్పు!"

    "చెప్పి చెప్పి చాలైందిలే డాక్టరమ్మా! ఆడు ఇనడు! వాడు కల్లంగడికి, మేం కాటికి! ఆ సర్కారోడికి బుద్దిలేదు. ఉంటే ఊళ్ళల్ల ఇట్ల కల్లంగడి, సారా పాకెట్లు జనాన్ని నాసినం జేస్తుంటే చూస్తూ వూర్కుంటరా?"
    "మరి ఆ సర్కారోడికి బుద్ది చెప్పొచ్చుకదా, మీ ఆడవాళ్ళంతా ఒక్కటై, ఒక ఉద్యమంగా రూపుదాల్చి..."
    "అక్షరం ముక్క రానోళ్ళం! గదంత మాకేం తెలుస్తదిలే డాక్టరమ్మా? సూదెయ్యి పోతా!"

    "అక్షరం ముక్కలకి దీనికీ సంబంధం లేదు కాంతమ్మా! దేవుడు గొంతు యిచ్చాదెందుకు? బాధ కలిగితే అరవడానికే! ఒక్కరు అరిస్తే అరుపుగా వుండిపోతుంది. పదిమంది కలిసి అరిస్తే అది నినాదం అవుతుంది. మీరు రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించిన ఆ తాగుడు రాక్షసి మింగేస్తుంటే మీరెలా బాగుపడతారు? మీ బతుకుల్ని బాగుచేసుకోవాలంటే కల్లు సారాల్ని తరిమికొట్టండి."   


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS