2
ఆమర్నాడు తొమ్మిది ముప్పావుకు భాను మూర్తి జట్కా దిగేసరికి విశాల సరిగ్గా ఎదురు వచ్చింది. విష్ చేద్దామా , వద్దా అని సందేహించి చివరకు "నమస్తే!" అన్నాడు మెల్లగా.
"నమస్తే!" తలఎత్తి చూచి ప్రతి నమస్కారం చేసి తలదించుకుని వెళ్ళిపోయింది విశాల.
బండి దిగుతున్న మీనాక్షి -- "ఎవరా అమ్మాయి?" అంది విశాల వెళ్తున్న వేపే చూస్తూ.
"సుధీర స్నేహితురాలు."
మీనాక్షి ముఖం చిట్లించి - "నీకెలా తెలుసు?" అంది భానుమూర్తిని క్రాస్ ఎగ్జామిన్ చేస్త్గూ.
"నిన్న సుధీర పరిచయం చేసింది." చిరాగ్గా అన్నాడు.
మీనాక్షి మరేం మాట్లాడలేదు. గేటు తీసుకుని లోపలికి వెళ్ళింది.
భానుమూర్తి ముఖం అప్రసన్నంగా ఉంది. బండి దిగుతున్నప్పుడు ఉన్నంత ఉత్సాహం తర్వాత లేదు. జేబులో నుండి తాళం చెవి తీసి తలుపు తాళం తీశాడు. మీనాక్షి లోపలికి వెళ్ళి యిల్లంతా ఓసారి కలయజూసి వరండాలోకి వచ్చింది.
"ప్రక్క వాటాలో ఎవరుంటున్నారు?"
"రిటైర్డ్ టీచరట."
"ఆ అమ్మాయి అతని కూతురా?"
"తెలీదు"
"ఏ కులస్తులు?"
"ఏమో.... కులాన్ని గురించి నేనెందు కడుగుతాను?"
"మీనాక్షి గిరుక్కున తిరిగి లోపలికి వెళ్ళిపోయింది.
జట్కా అతను బండిలో ఉన్న సామాను తెచ్చి వరండాలో పెట్టి బాడుగ తీసుకుని వెళ్ళిపోయాడు.
"యిల్లెలా ఉంది?" లోపలికి వెళ్ళి అడిగాడు భానుమూర్తి.
"నీకు నచ్చిందిగా?"
"అంటే?"
"నీకు నచ్చితే చాలు! నాకు నచ్చినా నచ్చకపోయినా ఫర్వాలేదు."
వ్యధాపూరిత దృక్కులతో మీనాక్షి ముఖంలోకి చూశాడు.
మీనాక్షి చివాల్న ముఖం తిప్పుకుంది. ఏవో వస్తువులు సర్ధసాగింది. కుంకుమ రహితమైన ముఖంతో, శోభాహీనంగా ఉన్న మీనాక్షి భానుమూర్తి హృదయాన్ని కలిచి వేసింది. తనకున్న ఒకే ఒక తోబుట్టువును జీవచ్చవంలా తయారు చేసి తన కళ్ళ ముందు పెట్టి ప్రతిక్షణం తన హృదయాన్ని చిత్రహింస చేస్తున్న ఆ భగవంతుడికి తనేం అపకారం చేశాడో అర్ధం కాదు. బహుశా యిది శిక్ష కాబోలు! అయినా తనేం తప్పు చేశాడని? ప్రపంచంలో తప్పులు చేసే వాళ్ళందరికీ శిక్షలు పడుతున్నాయా? ఏమో....
"కూరలేం లేవు." తలెత్తకుండానే అంది మీనాక్షి.
"ఈ పూటకు హోటల్ నుండి కారియర్ తెస్తాన్లె! ఇవన్నీ సర్దుకుని వంట చేయడం కష్టం కదూ?"
"నీ యిష్టం." నిర్లిప్తంగా అని మళ్ళీ తన పనిలో మునిగిపోయింది.
భానుమూర్తి భారంగా నిట్టూర్చి హాలుకూ, నడవ కూ మధ్య ఉన్న గడప మీద కూర్చున్నాడు.
జీవితం గాన స్రవంతి లాంటిది. దానిలో ఎన్నో అపశ్రుతులు వస్తూనే ఉంటాయి. మీనాక్షి జీవితంలో కలిగిన అపశ్రుతి భానుమూర్తి హృదయ విపంచి మీద కూడా పలికింది. ఆ అపశ్రుతిని సరి చేసుకోవాలని భానుమూర్తి ఎంతగానో ప్రయత్నించాడు. ప్రయత్నం చేస్తున్నాడు.
"నిన్న నువ్వు రానందుకు అందరూ నొచ్చుకున్నారు, మీనాక్షీ!' అన్నాడు లేని నవ్వును తెచ్చి పెట్టుకుంటూ.
"పాపం!" తలెత్తకుండానే పెదవి విరిచి అంది.
"నీ ఆరోగ్యం నాగుండడం లేదని చెప్పాను. విజయ నిన్ను తీసుకు రమ్మంది."
"నన్నెవరూ చూడనక్కరలేదు."
"నీమాట నీదే! అమ్మే వుంటే అసలు నాకింత బాదే వుండేది కాదు. నీ మనసులోని వేదనేమిటో కన్నతల్లి తోనన్నా చెప్పుకోనుండేదానివి. ప్చ్! మనకా అదృష్టం కూడా లేదు." వ్రేలితో పిచ్చిగా నేలమీద రాస్తూ అన్నాడు.
"ఉన్నవాళ్ళంతా ఉద్దరిస్తున్నారుగా! చాలదూ!' ముఖం చిట్లించి అంది.
ఆ మాటతో భానుమూర్తి విహ్వలుడై పోయాడు. ఏమాటా చెప్పలేక ఒక్క క్షణం ఊరుకున్నాడు. "నీకు జరిగిన అన్యాయానికి ప్రతిక్షణం నా హృదయం ఎలా విలపిస్తుందో నీకెలా చెప్పను. మీనాక్షి!" రుద్ద కంఠంతో అన్నాడు తర్వాత.
'అవును. హృదయాలే వుంటే యింతటి అన్యాయం నాకెందుకు జరిగివుండేదో అర్ధం కావడం లేదు."అక్కడి నుండి లేచి వంటింట్లోకి చివాల్న వెళ్తూ అంది.
భానుమూర్తి నిరుత్తరుడై పోయాడు. ముఖం తెల్లగా పాలిపోయింది. కాస్సేపటికి తన్ను తాను సంభాళించుకుని తలెత్తి "అయితే కావాలనే నీకీ అన్యాయం చేశానంటావా" అన్నాడు.
మీనాక్షి మాట్లాడలేదు. వంటింట్లో ఏదో సర్దుతూనే ఉంది.
"నన్నెందుకు నువ్విలా అర్ధం చేసుకుంటున్నావో తెలీడం లేదు. నాకున్న ఒకే ఒక తోబుట్టువు నువ్వు. నీ జీవితం మూడు పువ్వులూ, ఆరు కాయలుగా వికసించాలని కోరుకునే వాళ్ళలో నేను మొదటి వాడ్ని. తలనిండా పూలు పెట్టుకుని, ముఖాన కుంకుమతో ఎప్పుడూ కలకలలాడుతూ వుండాలని కోరుకునే వాణ్ణి . నాయింటికి తీసుకొచ్చి నీకేన్నో సారెలూ, చీరలూ పెట్టాలని ఎంతో ఆశపడ్డాను. ఎన్నో ముచ్చటలు తీర్చుకోవాలనుకున్నాను. కానీ ఒక్కటీ తీరలేదు. ఒకే రక్తం పంచుకుని పుట్టిన వాళ్ళం. ప్రపంచంలో నీకు నేనూ, నాకు నువ్వు తప్ప మరెవ్వరూ లేరు. అలాంటి నిన్ను అన్యాయం చేస్తానా?" నన్నెందుకిలా అపార్ధం చేసుకున్నావు మీనాక్షి!" బొంగురు గొంతుతో అన్నాడు.
మీనాక్షి మాట్లాడకుండా నిశ్శబ్దంగా కూర్చుంది.
"జరిగిపోయింది జరిగిపోయింది. దాన్ని గురించి ఎన్ననుకున్నా ఏం లాభం చెప్పు? ఎన్ననుకున్నా అలా కాకుండా మరో విధంగా అవుతుందా? నువ్వలా బాధ పడుతూ వుంటే నాకెలా వుంటుంది చెప్పు?" అనునయంగా అన్నాడు.
"నా బాధ నాదే! అది నీదేలా అవుతుంది? మాట్లాడ్డాని కేం? ఎన్నయినా మాట్లాడచ్చు. అనుభవిస్తే తెలిసోచ్చేది." కాస్త కఠినంగానే అంది.
భానుమూర్తి అప్రతిభుడై పోయాడు. పెద్దగా ఏడుద్దామా అన్నంత దుఃఖం కలిగింది. కానీ మగవాడు గనక ఊరకుండి పోయాడు. నోట్లో నుండి ఒక్కమాట రాలేదు. మెల్లగా లేచి హల్లో కెళ్ళి యీజీ చైర్లో పడుకున్నాడు. హృదయం బరువుగా -- మోయలేనంత బరువుగా తయారయింది. కళ్ళు భారంగా మూతలు పడ్డాయి, అనురాగపూరితమైన తన చెల్లెలి హృదయం యింత కర్కశంగా ఎందుకు మారింది?
భగవాన్! ఎందుకీ పరీక్ష? బ్రతికినంతకాలం పరీక్ష లేనా? ఇదెక్కడి న్యాయం? జీవితంలో తనకు అట విడుపే లేదా? అయినా యిన్ని అగ్ని పరీక్షలు పెట్టి తన్ను పరీక్షించవలసిన అవసరమేమోచ్చింది?
చిన్నతనంలోనే నాన్న పోయాడు.
నాన్న ఎలా ఉంటాడో కూడా తనకసలు తెలీదు.
అమ్మను గూడా ఉంచడం యిష్టం లేక తీసికెళ్ళాడు భగవంతుడు.
పరపంచలు పట్టుకుని బ్రతికాడు.
అన్ని పరీక్షలకూ తట్టుకున్నాడు.
చెల్లెలి జీవితమే నాశనమైంది.
అందుకూ నోరెత్త లేదు. కానీ.... ఆ చెల్లెలి హృదయమే శిధిల మైంది. కుసుమ కోమలమైన హృదయం కఠిన శిలగా మారిపోయింది. ఇంత వరకూ ఏ చెల్లెలి అనురాగ జోలలో ఊగిపోయాడో యిప్పుడు ఆమె ద్వేషాగ్ని జ్వాలలో మాడిపోతున్నాడు. అంతకన్నా నరక ప్రాయమైన శిక్ష మరొకటేముంది? ఒకేఒక కన్నీటి బొట్టురాలి పడింది. చెక్కిలి మీద. కన్నీటి పాట లాంటి తన విషాద గాధను తలుచుకుంటూ మగత నిద్రలో మునిగిపోయాడు.
సరిగ్గా పన్నెండూ ఆ ప్రాంతంలో మెలకువ వచ్చింది. తనను లేపనందుకు మీనాక్షి మీద బాగా కోపం వచ్చింది. వరండాలో నిల్చుని వీధిలో వచ్చే పోయే వాళ్ళను చూస్తుంది మీనాక్షి.
కారియర్ యివ్వమని కూడా మీనాక్షి నడుగలేదు. తనే లోపలికి వెళ్ళి, వెతుక్కుని చెప్పులు తొడుక్కుని వెళ్ళాడు.
తిరిగి వచ్చేసరికి దగ్గర దగ్గర ఒంటి గంట యింది. కారియర్ వంటగదిలో పెట్టి పెరట్లోకి వెళ్ళి నీళ్ళు తోడుకుని కాళ్ళూ చేతులు కడుక్కుని వచ్చాడు. మీనాక్షి వరండా లో నుండి వచ్చి హల్లో చాప మీద కూర్చుంది.
భానుమూర్తి పీట వాల్చుకుని కూర్చున్నా అన్నం పెట్టేందుకైనా వెళ్ళలేదు మీనాక్షి.
తనే వడ్డించుకుని నాలుగు మెతుకులు కొరికి భోజనం అయిందని పించాడు భానుమూర్తి.
"అన్నం తిను" అన్నాడు హల్లో కొచ్చి.
"వద్దు"
"ఏం?"
"ఆకలిగా లేదు"
"ఆశ్చర్యంగా వుందే! ఒంటి గంటయినా ఆకలి కాకుండా ఎలా ఉంటుంది? అలిగావా ఏమిటి?" బాధగా నవ్వుతూ అడిగాడు.
"ఎవరి మీదా?" చురచురా చూస్తూ అంది.
"ఇంకెవరి మీదా? నామీదే!"
"ఎందుకూ?"
"అది తెలీకనే గా అడుగుతున్నాను?"
"నాలాంటి దానికి అలకలు కూడానా! అయ్యో రామ!"
"ఏం? నీకేం తక్కువైందని?"
"ఏం తక్కువైందో కనిపించటం లేదా? నానోటంటే ఏం చెప్పిస్తావు! అంత ఆనంద కరమైన విషయం కూడా కాదే యిది తిరిగి తిరిగి చెప్పుకుని సంతోషించను!" రాగం తీస్తూ అంది.
"తక్కువైందేదో కనిపించక కాదు. ఆవిషయంలో నేనేం చెయ్యలేను. తక్కిన విషయాల్లో నేనుండగా నీకేలోటూ రానివ్వను" బాధగా అన్నాడు.
