Previous Page Next Page 
ఆంతస్తులూ అంతఃకరణలూ పేజి 2

 

    విశాల నెమ్మదిగా గదిలో నుండి వరండాలోకి వచ్చింది.
    "ఏయ్! విశాలా! ఎక్కడికి? భోం చెయ్యకుండా వెళ్ళావంటే యిక నీతో చచ్చినా మాట్లాడను." ఆత్రంగా విశాల వెంటే వెళ్తూ అంది సుధీర'.
    "చాలా అలసిపోయినట్లున్నావు. ఇదంతా యీ రోజు పెట్టుకోకుంటేనేం" అన్నాడు భానుమూర్తి.
    "ఈరోజు నా పుట్టిన దినం కూడానాయె! రెండూ కలిసి వస్తాయని నాన్న యీ ఎర్పాటంతా చేశారు" అంది విజయ.
    "ఆమధ్య నీడగ్గర్నుండి ఉత్తరాలు రాకుంటే యిక్కడ మేమంతా ఎంతో కంగారు పడిపోయాము."
    "నిజంగానా?" తలెత్తి అంది.
    "అబద్దాలు చెప్పాల్సిన అవసరం ఏముంది? అయినా అంత నమ్మరాని విషయం కూడా కాదె యిది?" విజయ ముఖంలోకి పరిశీలనగా చూస్తూ అన్నాడు.
    విజయ చిన్నగా నవ్వి మౌనంగా క్రిందకు దారి తీసింది. భానుమూర్తి వెనకే వెళ్ళాడు.
    "వచ్చావా, భానూ? మీనాక్షి రాలేదు కదూ?" లలితమ్మ , భానుమూర్తి ని చూడగానే అడిగింది.
    "ఎంత బ్రతిమలాడినా రాలేదత్తయ్యా!"
    అతిధులంతా వరుసలు తీర్చి కూర్చున్నారు. నోకర్లు చాలా జాగ్రత్తగా వడ్డన చేస్తున్నారు. సుధీర విశాల ప్రక్కన ప్రక్కన కూర్చున్నారు. విజయ మటుకు సుధీరకు ఎదురుగా కూర్చుంది. విజయకు కొంత దూరంలో అదే వరుసలో కూర్చున్నాడు భానుమూర్తి లలితమ్మ ప్రక్కగా. విశాల అన్నీ ప్రక్కకు నెట్టేస్తుంది. సుధీర గదమాయించి తినిపిస్తుంది. ఎదురుగా కూర్చొనున్న భానుమూర్తి అది చూసి నివ్వకుండా ఉండలేక పోయాడు.
    "విశాల ఏం చేస్తుందత్తయ్యా ?' లలితమ్మ నడిగాడు భానుమూర్తి మెల్లగా.
    "సెకండరీ గ్రేడ్ టీచరు. ప్రైవేటు గా యింటర్ పాసయింది. బి.ఏ కి వెళ్తుంది. చదువు విషయంలో సుధీర కొంచెం సాయం చేస్తుంది."
    "అలాగా!' అన్నాడు విశాల వైపు చూస్తూ. పేరుకు తగ్గట్టు విశాలమైన నేత్రాలు, విశాల నేత్రాల నుండి ప్రవహిస్తున్న కాంతి ప్రవాహం, సన్నగా, ఎత్తుగా మరీ పొడవు గాని ముక్కు, పలచని పెదిమల క్రింద చిన్ని గడ్డం , గడ్డం కింద చిన్న సొట్ట - అందాన్ని  మరికొంచెం ఎక్కువ చేస్తూ, చామనచాయ కన్నా మరొక్క ఛాయా ఉన్న రంగులో విశాల అందం మెరుపు తీగలా కళ్ళు జిగేల్ మనిపించదు. సన్నగా ఉండడం మూలాన అంత పొడగరి కాకున్నా పొడుగ్గా కనుపిస్తుంది. సాధారణమైన జరీ నేత చీరలో విశాల అంగ సౌష్టవం అజంతా సుందరిలా హృదయాన్ని ఆశ్చర్యంతో ముంచి వేయదు. మెల్లగా -- మృదువుగా- హాయిగా వచ్చి తాగే చంద్రికలోని సౌందర్యం- లావణ్యం- సౌకుమార్యం - విశాలవి.
    విశాల ప్రక్కనే కూర్చోమన్న సుధీర వేపు చూశాడు భానుమూర్తి. "ఈమధ్య కాస్త లావై నట్లుంది' అనిపించింది. పచ్చని చాయలో తీర్చిదిద్దినట్లున్న రూపురేఖల్లో ప్రతి ఒక్కర్ని ఆకర్షించేటంతటి శక్తి ఉంది సుధీర అందానికి అందాన్ని యినుమడింప జేసే అలంకరణ.
    'అరటాకు మింగేవు!" సుధీర అరిచింది.
    భానుమూర్తి అరటాకు వైపు చూశాడు. ఖాళీగా ఉంది! తనలో తనే నవ్వుకున్నాడు మెల్లగా.
    "ఎవర్ని గురించి ఆలోచన?' సుధీర ప్రశ్నించింది.
    "నిన్ను గురించే!"
    సుధీర ఫకాలున నచ్చింది. విశాల పెదిమలు విడివిడనట్లు నవ్వింది. విజయ నవ్వాలని ప్రయత్నించి నవ్వలేక పోయింది.
    భోజనాలయ్యాయి. విజయ ప్రభాదేవిని ఆశీర్వదించి అతిధులంతా యిళ్ళకు బయలు దేరారు.
    ఆరోజు విజయ ప్రభాదేవి ఫారిన్ నుండి వచ్చిన అవకాశాన్ని పురస్కరించుకుని గోపాలరావు గారు బందు మిత్రులకు గ్రాండ్ డిన్నర్ ఏర్పాటు చేశారు.
    "ఇదో! విశాలా! ఒక్కత్తివి వెళ్ళగలవా? మా బావను తోడు పంపుతాను."
    "నిక్షేపం లా వెళ్ళగలను. నాకేం ఎస్ కార్డు అక్కర్లేదు" అని నవ్వుతూ వెళ్ళిపోయింది విశాల.
    అతిదులందర్నీ సాగనంపే సరికి దగ్గర దగ్గర పది గంటలయింది. భానుమూర్తి వెళ్తుంటే మరి కాసేపు ఉండమంటూ ఆపింది లలితమ్మ. అందరూ హాలు ప్రక్కగా ఉన్న గదిలోకి వచ్చి కూర్చున్నారు.
    "ఇప్పుడు జీతమెంతోస్తుందోయ్?' గోపాలరావు అడిగేడు.
    "రెండు వందలు పైగా."
    "ఇక పెళ్ళి చేసుకోవచ్చన్నమాట!"
    "ఇప్పుడిహ పెళ్ళి చేసుకోనంటూ తప్పించుకొనేందుకు వీల్లేదు. జీతం తక్కువనీ, అప్పు లున్నాయనీ మమ్మల్నంతా యిన్ని సంవత్సరాలుగా దబాయించావు" అంది లలితమ్మ.
    "మరి తక్కువ కాదేమిటి?" నవ్వుతూ అన్నాడు.
    "ఇంకా తక్కువ జీతం వచ్చేవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవడం లేదా? బ్రహ్మచారి ముదిరినా, బెండకాయ ముదిరినా కష్టమే."
    "నువ్వెప్పుడూ అంతేనమ్మా!క్ బి.సి నాటి మాటలు చెప్తుంటావు! బావ ముదిరి పోయిన బ్రహ్మచారే అనుకుందాం. వేలెత్తి చూపించగల ఒక్క అవలక్షణమన్నా ఉందా? చెప్పు?"
    "నీకెందుకే, తల్లీ, అంత కోపం! మీ బావలో అవలక్షణాలున్నాయని నేను చెప్పానా?" వయసు ముదిరితే పిల్ల నెవరిస్తారు?"
    "అదా నీ భయం! భారతదేశంలో ఏ వయసులో ఉన్న మగాడి కైనా పెళ్ళి కాదన్న దిగులు లేదు. కాబట్టి బావ పెళ్ళి విషయంలో నీకు దిగులెం అక్కరలేదు! అందులోనూ యింత అందమైన కోతిబావకు పిల్ల నివ్వకపోతారా?"
    "నేను కోతినైతే నువ్వు కొండముచ్చువు కాదేం?" సుధీర ముఖంలోకి చూసి నవ్వి అన్నాడు భానుమూర్తి.
    "ఆడపిల్లల్నలాంటి పేర్లతో పిలవచ్చా? నీకు కొండముచ్చులాంటి పెళ్ళాం వస్తుందిలే చూడు!' బెదిరించింది సుధీర.
    లలితమ్మ గోపాలరావు నవ్వుకుంటున్నారు. విజయకు మటుకు ఆ సంభాషణ ఏమాత్రం రుచించుట లేదు.
    "ఏరి కోరి అలాంటి పిల్లను తెచ్చి నా మెడకు కడ్తావు గాబోలు! అంత అన్యాయం చేస్తే నీకందరూ ఆడపిల్లలే పుడతారు!"
    "ఎలాంటి వరాన్ని ప్రసాదించావు మహాత్మా!" చేతులు జోడించి నాటక పక్కీలో అంది సుధీర.
    "అది వరం కాదు. శాపం!" అన్నాడు భానుమూర్తి.
    "శాపమెలా అవుతుంది? వరమే! ఈ కాలంలో మగపిల్లలు పరిష్కారం లేని సమస్యగా తయారయ్యారు. ఆడపిల్లలయితే హాయి! అణిగి మణిగి చేతి కిందుంటారు . స్కాలర్ షిప్పుల తోటి చదివించుకోవచ్చు. ఉద్యోగాలు సులభంగా దొరుకుతాయి! అంతకన్నా ఏం కావాలి?"
    "పెళ్ళిళ్ళు కావు!"
    "ఓస్! అంతే కదా! దేశ జనాభాను తగ్గించేందుకు ప్రభుత్వంలో సహకరిస్తున్నా మన్న మాట! అంటే పరోక్షంగా దేశ సేవచేస్తున్నట్లు!"
    "ఇక చాల్లే! ఆపండి!" విజయ చిరాగ్గా అంది.
    భానుమూర్తి ఓరగా చూశాడు విజయ వేపు. విజయ ముఖం మునపటి కన్నా యింకా గంబీరంగా వుంది. కిటికీ లోంచి వెన్నెల్లోకి చూస్తుంది. ఫారిన్ నుండి వచ్చాక కాస్త తగ్గినట్లే కనిపించింది. విజయ - భానుమూర్తి కళ్ళకు. ఫాషన్లు ఎక్కువయ్యాయి. మాటల్లోనూ, నడక లోనూ ఓ విధమైన హుందాతనం వచ్చింది.
    మొదటిసారిగా విజయను గదిలో చూసిన భానుమూర్తి ఆశ్చర్యానికి అంతే లేకపోయింది. నడి నెత్తి మీద ముడి. స్లీవ్ లెస్ లోనేక్ జాకెట్టు. జరీ నైలాన్ చీర. కుడిచేతికి వాచీ. అంతకు తప్ప మరే ఆభరణం కానీ, అలంకరణగానీ లేదు. క్రాపు చేయించుకుని, గౌను వేసుకోలేదు. అదే ఎంతో నయమని తృప్తి పడ్డాడు భానుమూర్తి.
    "భానూ! ఇక నువ్వు తప్పించుకొనేందుకు వీల్లెదబ్బాయ్! తొందర్లో పెళ్ళి చేసుకుని తీరాల్సిందే!" తెచ్చి పెట్టుకున్న కోపంతో అంది లలితమ్మ.
    "నువ్వు అమ్మాయిని చూసి పెట్టకుండా పెళ్ళి చేసుకోమంటే ఎవర్ని చేసుకుంటాడు? బొమ్మగ్గానీ చేస్తావేమిటి?" సిగరెట్టు పొగ వదులుతూ తమాషాగా నవ్వి అన్నాడు గోపాలరావు.
    "మీ అమ్మాయిల్ని ఇవ్వనంత మాత్రాన భానుకు పెళ్ళి కాదేమిటి? ఇంతకన్నా చక్కని చుక్కనే తెచ్చి చేస్తాను."
    "ఇకనేం? ఇంతోటి అత్తయ్య ఉండగా నీకేం కొదవలేవోయ్? సిగార్ యష్ ట్రే లో దులుపుతూ అన్నాడు అయన.
    భానుమూర్తి ఏమీ మాట్లాడలేదు.
    విజయ లేచి, 'గుడ్ నైట్" అని వెళ్ళిపోయింది.
    గోపాలరావు కూడా బద్దకంగా ఆవులించి, నిద్ర వస్తుందంటూ లేచి వెళ్ళిపోయాడు.
    "విజయ నిచ్చేది లేదా...." అంది సుధీర సందేహంగా తల్లి ముఖంలోకి చూస్తూ.
    లలితమ్మ జవాబు చెప్పలేదు.
    "సుధీ! నీకు నోటికి ఎంతోస్తే అంత మాట్లాడుతున్నావు! మీరంతా ఒకటయినా విజయ మీ మాట వినదు. అలాంటి తెలివి తక్కువ పని ఎప్పుడూ చెయ్యదు." చర్రున కుర్చీలో నుండి లేస్తూ అన్నాడు భానుమూర్తి.
    "అబ్బ! అబ్బాయి గారి కెంత కోపమొచ్చింది! అసలు విజయ నిన్ను చేసుకోదని బాగా తెలుసు!"
    "నాకేనేమిటి? అందరికీ తెలుసు!" కోపంతో భానుమూర్తి ముఖం ఎర్రబడింది. "నే వెళ్తా నత్తయ్యా!" అంటూ లేచి సరసర హల్లో నుండి వరండా లో కెళ్ళాడు.
    'అంత కోపంలో వున్నావేం?' నవ్వుతూ అంది విజయ.
    భానుమూర్తి జవాబు చెప్పకుండా తల వంచుకు నిలబడ్డాడు.
    "నేనంతా విన్నాను. అందని పండ్ల కాశించడం అవివేకం కదా, భానూ!"
    భానుమూర్తి తలెత్తి చూశాడు.
    విజయ కళ్ళు నవ్వుతున్నాయి.
    ఆ అవమానానికి తట్టుకోలేక పోయాడు.
    కళ్ళల్లో నీళ్ళు చిప్పిల్లాయి.
    చివాలున తల తిప్పుకున్నాడు.
    వెళ్ళేందుకు రెండడుగులు ముందుకు వేశాడు.
    "భానూ!" బాధగా పిలిచింది.
    "ఏం?" వెనక్కు తిరిగి అడిగాడు.
    "ఆహా.... ఏం లేదు.... సుధీర మాటలు మనసులో పెట్టుకోకు."
    భానుమూర్తి విజయ ముఖంలోకి ఓసారి చూసి మౌనంగా వెళ్ళిపోయాడు.
    విజయ అలాగే వెన్నెల కేసి చూస్తూ నిల్చుంది.  


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS