"ఏం పోదుగాని నువ్వు అనవసరంగా గాబరా పడకు ! నాకేం కాదు!"
* * *
రామకృష్ణను చాలా గౌరవంగా ఆహ్వానించాడు మాధవరావు "రండి రామకృష్ణగారూ! కూర్చోండి!" సుఖంగా ఆనుకోడానికి పట్టుబాలీసులున్న సోఫా చూపించాడు.
"కూర్చొని మీరిచ్చే చందన తాంబూలాలు స్వీకరించడానికి రాలేదు. ఎందుకు పిలువనంపారో చెబితే చాలు....." చిటపట లాడిపోతున్నట్లుగా అన్నాడు రామకృష్ణ.
"మీరు మరీ అంత సీరియస్ గా వుంటే బాగుండదు రామకృష్ణగారూ. మనం స్నేహ సుహృద్భావ వాతావరణంలో మాట్లాడుకుందాం" ముఖంలో నవ్వు పులుముకొని అన్నాడు మాధవరావు.
అప్పుడా హాల్లో ఇద్దరే వున్నారు.
"స్నేహ సుహృద్భావాలా? ఇదెక్కడి వింత? నా కూతురి జీవితం నలిపి నాశనం చేస్తానన్న వాడి తండ్రితో నాకేం స్నేహం? మన మధ్య వున్నది ప్రస్తుతం శతృత్వమే. కల్లబొల్లి మాటలు కట్టిపెట్టి విషయంలోకి సూటిగా రండి"
"కొడుకు చెడ్డవాడైతే తండ్రీ చెడ్డవాడన్న అభిప్రాయానికి వచ్చినట్టున్నారు కాని........"
"మీరు చెడ్డవారు కాకపోవచ్చు. కాని మీ చేతిలో వున్న అధికారం, హోంమినిస్టరుగా మీకున్న పవర్స్, దొడ్డుదోవన మీరేమైనా చేయొచ్చునన్న ధీమా, మీరిస్తున్న అండ మీ కొడుకును కామాంధుడిగా మార్చిందని మాత్రం చెప్పగలను.
"మీరు నన్ను అపార్ధం చేసుకుంటున్నారు. నేను నా కొడుకును సపోర్ట్ చేసి మీ మీద కత్తిదూసే ఉద్దేశ్యంతో మిమ్మల్ని పిలువనంపలేదు మావాడివల్ల జరిగింది ఏదైనా జరగరానిదే జరిగింది. చాలా దారుణమైన విషయమే జరిగింది. అందుకు మిమ్మల్ని క్షమార్పణ అడుగుదామనే పిలిచాను. మీరొప్పుకుంటే వాడిచేతా క్షమార్పణ చెప్పిస్తాను. ఇంకెప్పుడూ మీ అమ్మాయి జోలికి రాకుండా చేస్తాను.........."
"ఇప్పుడు చెప్పండి! నేను దొడ్డిదోవన అధికార బలాన్ని ఉపయోగించే మనిషిలా కనిపిస్తున్నానా?"
"కరుణ అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకొన్నప్పుడు మీరు ఉపయోగించింది ఏమిటి? మీ అధికార బలాన్ని కాదా? ఆ అమ్మాయి అంత పబ్లిక్ లో మీ అబ్బాయి దోషి అనిచెప్పి ఒంటికి నిప్పంటించుకొని చస్తే కనీసం కేసు కూడా కాకుండా ఎలా మాయం చేశారు? ఎవరెవరికి మంత్రం వేశారో కొంచెం చెబుతారా?"
మాధవరావు ముఖంలో ప్రసన్నత కొంచెం చెదిరినట్టుగా అయింది. "ముందు మీ అమ్మాయి విషయం చూసుకోండి. చచ్చినదాని సంగతి ఇప్పుడెందుకు?" ఆయన మాటల్లో చిరాకు స్పష్టంగా ధ్వనించింది.
"మీరు చతురులు! రాజకీయ చతురులు. ఏదైనా పని సాధించాలంటే నయానా మొదలు పెడతారు. నయాన కాకపోతే భయపెడతారు. భయపెట్టినా లొంగకపోతే దండం ఉపయోగిస్తారు. ముందే దండం ఉపయోగించడం ఎందుకని నయాన మొదలుపెట్టారని నాకు తెలుసు చెప్పండి. మీ అబ్బాయి చేత క్షమార్పణ చెప్పిస్తే నేనేం చేయాలి?" సహనం కూడదీసుకొని శాంతంగా అడిగాడు రామకృష్ణ.
"వేరే ఏం లేదు. కేసు విత్ డ్రా చేసుకోవాలి! మనం రాజీ పడదాం. అనవసరంగా మనమధ్య పోరు ఎందుకు? తప్పు చేసింది మావాడు కాబట్టి నా తరపు నుండీ రాజీ ప్రస్తావన వచ్చిందిగాని......."
"అదీ అసలు సంగతి" రామకృష్ణ ముఖంలో నవ్వు చోటు చేసుకుంది "విత్ డ్రా చేసుకోకపోతే?"
"మీ ఇష్టం! పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరగాలని మీకంత సరదాగా వుంటే తిరగండి. కాని ఒక్కటి గుర్తుంచుకోండి. మీ మనిషి అనుకొంటున్న రమాకాంత్ ప్లేస్ లో నా మనిషి వస్తున్నాడు. కేసు కోర్టువరకూ పోదు. ఈ మాత్రం దానికి మీరు పోరాట బావుటాలు ఎగరేసి ఏం సాధిస్తారు?"
"నయానా భయానా అయిపోయింది. ఇక దండం వుపయోగించకుండా వుండరని నాకు తెలుసు. అయినా నాకు భయంలేదు. నేనేమైనా ఫర్వాలేదు. నా కూతుర్ని ఇంత మానసిక క్షోభకు గురి చేసిన నీ కొడుకు శిక్ష నుండి తప్పించుకోవడానికి మాత్రం వీల్లేదు. నీ కొడుక్కి శిక్షపడతే తప్ప నా కూతురికి న్యాయం జరగదు"
"గోటితో పోయేదానికి గొడ్డలిదాకా పోవడం దేనికని నిన్ను పిలిచి ఇంతదాకా మాట్లాడాను. పేపరు వాళ్ళను పిలిచి నేనూ చెప్పగలను. మీ అమ్మాయే మా అబ్బాయి వెంటపడి పెళ్ళి చేసుకొమ్మని వేధించేదని., వాడు అంగీకరించలేదన్న నిస్పృహతో ఆత్మహత్యకు పాల్పడి ప్రతీకార చర్యగా ఇంత కథ అల్లిందని మీ ప్రయత్నాలకు గండి కొట్టగలను. ఇంకా ఆ పిల్ల మంచిదికాదని చాలామందితో సంబంధాలున్నాయని........"
"నువ్వెంతకైనా సమర్ధుడివని నాకు తెలుసు మాధవరావ్. కాని సత్యానికీ ధర్మానికే విజయమని నమ్మే మనిషిని నేను. ఈ పోరాటంలో గెలుపెవరిదో చూద్దాం మరి సెలవా?"
రామకృష్ణ ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఇరుగు పొరుగు వాళ్లు చాలామంది గుమిగూడారు.
పక్కింటి రామనాధం భార్య సుందరమ్మ. అన్నపూర్ణను ఓదారుస్తోంది. "నువ్వనవసరంగా భయపడుతున్నావు అన్నపూర్ణొదినా? అన్నయ్య కేమీ కాదు. ఆయన క్షేమంగా తిరిగి వస్తాడు."
"రామనాధం అన్నయ్యని వెంటబెట్టుకు వెళ్ళమని ఎంత చెప్పినా వినకుండా ఒంటరిగా పులిబోనులోకి వెళ్ళినట్టుగా అక్కడికి వెళ్ళారు. తమ మీద పోలీసు కేసు పెట్టామన్న కోపంతో వాళ్ళేమైనా చెయ్యొచ్చు. మనిషిని మాయం చేసినా మనమేం చేయగలం?"
"ఛ! అలా ఎందుకు చేస్తారు? కేసు విత్ డ్రా చేసుకొమ్మని చెప్పడానికి పిలిచి వుంటారని నా మనసుకు తోస్తోంది" అన్నాడు రామనాధం.
"ఈయన ఒప్పుకునే రకం కాదుగా? మీకు తెలుసుగా ఈయన ఎంత మొండిమనిషో? కోపం వస్తే ఎదుటున్నది హోం మినిస్టరేకాదు. ప్రైమ్ మినిస్టరైనా లెక్కచేయక కడిగివేసే రకం. ఈయన మాటలకి తిక్కరేగి వాళ్ళేమైనా చేస్తారేమోనని నా భయం. ఆ హోం మినిస్టరు రాయలసీమకు సంబంధించిన మనిషి. వాళ్ళకు మనుషులను లేపెయ్యడం ఓ లెక్క కాదు."
ఆటో దిగి రామకృష్ణ ఇంట్లోకి వచ్చాడు.
