Previous Page Next Page 
విశిష్ట పేజి 27

    తెలిసినా తన ముందు ఎత్తే సాహసం ఎవరూ చేయరు.

    అది ఈనాటికి కొడుకు చేశాడు. తన అహం మీద, ఆత్మాభిమానం మీద దెబ్బకొట్టాడు.

    కాంతాన్ని తను లేవదీసుకు వచ్చినా ఆమెను గుళ్ళో పెళ్ళి చేసుకున్నాడు తన భార్యగా సమాజంలో గౌరవం కల్పించాడు.

    కాంతంతో సంసారం మొదలు పెట్టాక తను పద్దతిగానే వున్నాడు.

    కాంతం లేచివచ్చిన బాపతైనా గుణవంతురాలు. కట్టుకొన్న వాడికి సుఖసంతోషాలు కలుగజెయ్యడమే ధ్యేయంగా బ్రతుకుతోన్న మనిషి.
       
                                         *    *    *

    అదేరోజు డిశ్చార్జి అయ్యి ఇంటికి వచ్చింది విశిష్ట.

    డ్రామా కోసం మింగింది రెండు మూడు మాత్రలైనా ఇంకా మగత మగతగా, నీరసంగా వుంది.

    కూతురి పక్కన మంచం మీద కూర్చొని కమలా పండు ఒలిచి పెడుతున్నాడు రామకృష్ణ.

    రాత్రి అన్నం వండడానికి చేటలో బియ్యం పోసుకొని మట్టి పెల్లలు ఏరుతోన్న అన్నపూర్ణ ఒక నిట్టూర్పు విడిచి అంది.

    "ఏమిటో నండీ ఇదంతా! నాకేమిటో భయంగా వుంది. ఏ క్షణంలో ఏ ఉప్పెన మీద విరుచుకుపడుతుందో అన్నట్లుగా వుంది. అవతల వున్నది పెద్దవాళ్ళన్న ఆలోచన లేకుండా మీరు పోలీసులకి కంప్లయింట్ చేయడం ఏమిటో, ఈ పిల్ల ఆత్మహత్యకి ప్రయత్నించడం ఏమిటో నాకంతా అగమ్యంగా వుంది.

    పెద్దవాళ్ళతో పేచీ ఎటుతిరిగి వస్తుందో. ఇదంతా చూస్తుంటే గొర్రె కొండను ఢీకొట్టినట్టుగా వుంది. కొమ్ములు విరిగేది గొర్రెకే. కొండకేమీ కాదన్న సత్యం తెలిస్తే మీరింత సాహసం చేసేవారు కాదు!"

    "మనం గొర్రెలం కాదు! వాళ్ళు కొండా కాదు. వాళ్ళూ మనలాంటి మనుష్యులే. హోం మినిస్టరంటే దేశంలో శాంతి భద్రతలు కాపాడవలసిన వాడని అర్ధం. అలాంటిది వాడి కొడుకే ఒక ఆడపిల్ల వెంటపడి రేప్ చేస్తానని, సర్వనాశనం చేస్తానని ఆంబోతులా వీరవిహారం చేస్తుంటే చీమూ రక్తమూ వున్న ఏ తండ్రీ ఊరుకోలేడు. దీనికి తండ్రే కానక్కరలేదు. మానవత్వం వున్న వాడెవడైనా చూస్తూ ఊరుకోడు. పెద్దవాళ్ళతో పేచీ ఎందుకని ఊరుకొంటే దీన్ని అలుసుగా తీసుకొని వాడు ఇంకెంతైనా రెచ్చిపోతాడు.

    రేప్ కూడా చేస్తాడు. అప్పుడు........అప్పుడు దాన్ని కళ్ళముందు కూర్చోబెట్టుకుని కుళ్ళిపోవడం బాగుంటుందా?" ఆయన తీవ్ర స్వరంతో అన్నాడు.

    "అదికాదండీ. ఊరికే కాలేజీ మానిపించి ఇంట్లో కూర్చోబెడితే పోయేదానికి........"

    "కాలేజీ మానిపిస్తే పోయే పీడకాదే. దుష్టుడి చేతులు చాలాపొడవు. అవి మనం ఇంట్లో వుంటేనే కాదు. ఎంత దూరమైనా సాగుతాయి. తమ కసి తీర్చుకుంటాయి. వాడు మన ఇల్లు కూడా చూశాడట. ఆ చేతులను తెగనరికితే గాని మనమ్మాయి సేఫ్ కాదు. అయినా వాడి భయంతో పిల్లను కాలేజీ మానిపించి దాని చదువు పాడుచెయ్యడం ఏమిటి? ఆ కాలేజీలో చదివేది ఒక్క మనమ్మాయే కాదు. ఇంకా చాలామంది అమ్మాయిలున్నారు. వాడి కన్ను ఎప్పుడు ఎవరిమీద పడుతుందోనన్న భయంతో వాళ్ళంతా చదువులు మానేయాల్సిందేనంటావా?

    ముల్లు గుచ్చుకొంటుందని ఆ దారిన అందరూ నడవడమే మానెయ్యడం కాదు. ముల్లుని దారి నుండి పెరికివేయడమే సరైన పరిష్కారం. కీచకులు ఎక్కడైనా వుండొచ్చునేమోగాని సరస్వతీ మందిరాల్లో చదువులు చెప్పే గురువుల రూపంలో వుండకూడదు. వాళ్ళున్న చోట చదువుల విలువే పోతుంది. ఆ మందిరం పవిత్రతే పోతుంది" రామకృష్ణ ఆవేశంగా అన్నాడు.

    "పెళ్ళి కావలసిన పిల్ల. అంతా సక్రమంగా వున్నవాళ్ళకే సంబంధాలు కుదరడం కష్టంగా వుంది. ఇలా పబ్లిసిటీ తెచ్చుకొన్నాక దానికి సంబంధాలు వస్తాయన్న ఆలోచన వుందా?"

    "నా బిడ్డ ఏం తప్పు చేసిందని సంబంధాలు రావు?"

    "వాడు ఊరికే పాడు చేస్తానన్నాడో, చేశాడోనన్న ఆలోచన ఎవరికయినా వస్తే......."

    "ఆ మాట ముందుగా నీ నోటి నుండి వచ్చింది కాబట్టి నిన్నుప తంతాను."

    "నన్ను తన్ని నోరు మూయిస్తారేమోగాని లోకం నోరు మూయించలేరుగా? ఇదిగో తోక అంటే అదిగో పులి అనే లోకం ఇది."

    "చాల్లే! లోకాన్ని కాచి వడబోశావు!"

    "నాన్నా.......! మీ కోసం ఎవరోవచ్చారు కారులో.......!" శర్మిష్ట చెప్పింది.

    ఆయన వలుస్తూన్న కమలాపండు టీపాయ్ మీద పెట్టి టవల్ భుజం మీద వేసుకొని వెళ్ళాడు.

    కారు డ్రయివర్ కాక మరొకతను కూడా గేటు దగ్గరున్నాడు.

    "హోం మినిస్టరు మాధవరావు గారు మిమ్మల్ని తీసుకురమ్మని పంపారు. నేనాయన పి.ఎ.ని"

    "ఆయనకి నాతో ఏం పని?" అని అంటూ బెట్టుచేయదలుచుకోలేదాయన. సరేనని ఇంట్లోకి వచ్చి డ్రెస్ చేసుకొంటూ "హోం మినిస్టరుగారు పిలిచారట వెడుతున్నా" అన్నాడు.

    "మీరొక్కరే వెడతారా.......?" అన్నపూర్ణ ముఖం భయంతో పాలిపోయింది.  "పక్కింటి రామనాధం అన్నయ్యని తోడుగా తీసికెళ్ళండి."

    "నన్ను చంపుతారని భయమా?"

    "ఎవరినైనా నమ్మొచ్చునేమోగాని రాజకీయనాయకులను నమ్మకూడదండీ. మనిషిని మాయం చేయడం వాళ్ళకో లెక్కకాదు. ఎందరినో మాయం చేసి ఆ పదవిలోకి వచ్చి వుంటారు కాబట్టి."

    "చిన్న పిల్లాడికి అదిగో బూచి అని చెబుతున్నట్లు చెబుతున్నావే!" ఆయన నవ్వాడు.

    "మీకేమో అంతా నవ్వులాట. నాకేమో గుండె దడగా వుంది. వెంట రామనాథం అన్నయ్యని తీసుకుపోతే మీదేం పోతుంది?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS