బయట ఆడవాళ్ళకు రక్షణ కరువైందన్న అభిప్రాయం బలపడుతోంది చాలామందిలో. ఆ అభిప్రాయం తొలగించాల్సిన బాధ్యత మనమీద వుందంటారా, లేదంటారా?"
నిశ్శబ్దంగా తలదించుకున్నాడు డి యస్పీ ధర్మరాజు.
* * *
పృధ్వీ తండ్రి మాధవరావు మధ్యాహ్న సూర్యుడిలా మండిపోతున్నాడు.
అది పోలీసుల మీద కాదు - కొడుకు మీద.
"కరుణ ఆత్మహత్య కేసులో నిన్ను తప్పించడానికే నేను ప్రతిపక్షాల నుండే కాదు - స్వపక్షం నుండి కూడా ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాను. ఆరునెలలైనా తిరక్కుండా మళ్ళీ మరో అమ్మాయి నీ కారణంగా నిద్రమాత్రలు మింగి చావుకి దగ్గరైందంటే నేనే నిన్ను క్షమించలేకపోతున్నాను.
అయినా నీకిదేం పాడు బుద్దిరా? లక్షణంగా పెళ్ళి చేసుకోవచ్చుకదా? నువ్వు ఊ అంటే చాలు బంగారంలాంటి పిల్లను నీ భార్యగా తెచ్చేవాడిని. పెళ్ళి చేసుకోరా అంటే తల అడ్డంగా ఊపే నువ్వు ఇలా అడ్డుదారుల్లో సుఖాల కోసం ఎగబడ్డంలో నీ మనస్తత్వం నాకు అర్ధంకావడంలేదు. నువ్వు కష్టపడి చదివి వుంటే నువ్వు సంస్కారవంతుడివి అయ్యేవాడివేమో! నువ్వు ప్రతి క్లాసు దాటడానికి మార్కులు కొన్నాను కదా?
చివరికి పి.హెచ్.డి.కి కూడా డబ్బులు గుమ్మరించాను. నిన్ను లెక్చరర్ గా వేయించడానికి నా పలుకుబడినీ, డబ్బునూ ఉపయోగించాను ఇదంతా చేసి నువ్వొక నికృష్టుడిగా మారడానికి కారకుడినయ్యాను! కుక్కను కనకపు సింహాసనం మీద కూర్చోబెట్టినట్టుగా అయిందికదా!
"ఈ రోజు పత్రికల్లో చూశావా? నిన్నూ నన్నూ ఏకిపారేశారు. నీ ఫోటోవేసి నీ మన్మధలీలలు బాక్స్ కట్టి వేశారు. హోం మినిస్టర్ మాధవరావు కుమారుడు పృధ్వీకుమార్......... అహా తండ్రికి ఎంత ఘనమైన కీర్తి తెచ్చావో. ఆనందంతో నా గుండె పొంగిపోతోంది థూ! కరుణ ఆత్మహత్య చేసుకున్నప్పుడే నిన్ను జైలు ఊచల వెనక్కి నెట్టాల్సినమాట. నిన్ను సేవ్ చేసి నేను చాలా తప్పు చేశాను. ఎక్కడా తలెత్తుకోకుండా చేశావుకదరా? హాస్పిటల్లో ఆ పిల్ల చావాలి. నీకు ఉరిశిక్ష పడినా ఆశ్చర్యంలేదు.
"హోం మినిస్టరు కొడుక్కే ఉరిశిక్ష వేసే దమ్ము ఎవరికుంది డాడీ? ఏదో జరిగిందని అంతగా ఫీలవుతావేం? మీకుందికదా ఆయుధం? ఇదంతా ప్రతిపక్షాల కుట్ర అని ప్రెస్ కి ఓ స్టేట్ మెంట్ ఇచ్చేయండి" పృధ్వీ అన్నాడు ఈజీగా తేల్చేస్తూ.
"హోం మినిస్టర్ పదవంటే కర్ణుని కవచకుండలాల్లా పుడుతూనే వెంట తెచ్చుకున్నానా? చ్చచేదాక నాతో వుంటుందా? గాలిలో దీపాల్లాంటివి ఈ రాజకీయ పదవులు. సందు దొరికితేచాలు దుమారం రేపడానికి సిద్దంగా వుంటాయి ప్రతిపక్షాలు.
నైతిక బాధ్యత వహించి పదవికి రిజైన్ చెయ్యమని ఒత్తిడి వచ్చినా ఆశ్చర్యంలేదు. అవినీతి పరుడైనా కొడుకును వెంటేసుకువస్తే సమ్మెలు, దెబ్బలు నాకూ తప్పవు."
"మీ పదవిని పదిలం చేసుకోడానికి నన్ను బలిపశువును చేసేలా వున్నారే" ఉక్రోషం వ్యక్తం చేశాడు.
"నీకసలు బుద్దీ జ్ఞానం వున్నాయిరా? చక్కగా ప్రొఫెసరుగా చేస్తున్నావు. ఎంత డిగ్నిఫైడ్ గా వుండాలి?"
"అబ్బ! సుత్తి ! ముందు ఈ గండం నుండి బయటపడే మార్గం చూడమంటుంటే."
"చూస్తానురా! నీలాంటి కులదీపకుడు పుట్టాక తప్పుతుందా?"
"నన్ను రెచ్చగొట్టే మాటలు మాట్లాడకండి డాడీ! నీకిదేం బుద్ది అంటే ఇది జన్మ సంస్కారం అంటాను. నాకు కొత్తగా వచ్చిన బుద్దులు కావు. మీ బుద్దులే వచ్చాయంటాను. మా అమ్మకి మీరు రెండో భర్త అని నాకు తెలియదా? చక్కగా సంసారం చేసుకుంటున్న మా అమ్మని........"
"చాలు చాలు!" ఆయన వినలేకపోతున్నట్లుగా అసహనంగా అరిచాడు. "ఇంకెవరైనా అంటే అంతగా హర్ట్ అయ్యేవాడుకాదేమో! కన్న కొడుకే తన గతం కేసి వేలుపెట్టి చూపుతుంటే ఆయన పెద్దరికం దెబ్బతిన్నట్లుగా అయింది. అమావాస్య నాటి రాత్రిలా ఆయన ముఖం నల్లబడిపోయింది.
పృధ్వీ వాళ్ళమ్మ చాలా అందగత్తె!
ముప్పయ్యేళ్ళ క్రితం తనకి రాజకీయాలంటే ఏమిటో కూడా తెలియదు. లేబర్ కాంట్రాక్టర్ గా పల్లెపల్లెకూ తిరిగి లేబర్ ని తీసుకుపోయే వాడు. ఒకసారి పోచంపాడు ప్రాజెక్టు కోసం తీసుకుపోయిన లేబర్ లో మట్టిలో మాణిక్యంలా పృధ్వీ వాళ్ళమ్మ కాంతం కనిపించింది. తనకి మొదటి చూపులోనే కన్ను చెదిరినట్లుగా అయింది. చాలా శ్రమతో వలవేసి పట్టాడు. ఆమెను లేవదీసుకుపోయాడు.
అప్పటికే కాంతం వివాహిత.
తనకీ పెళ్ళయ్యి ఒక కొడుకు కూడా వున్నాడు.
ఒక మగడి ఆలిని లేవదీసుకుపోయాడని తెలిసి కాంతం తరపు బంధువులు, తన భార్య తరుపు బంధువులు తమని వెదికి చంపడానికి బయలుదేరారు.
వాళ్ళ భయంతో తను కొన్ని సంవత్సరాల పాటు అజ్ఞాతవాసంలో వుండిపోయాడు. అందరి ఆగ్రహావేశాలు చల్లారాయని తెలిశాక తిరిగి వచ్చాడు కాంతంతో.
అప్పటికే పృధ్వీ పుట్టాడు.
కాంట్రాక్ట్ పనుల్లో లక్షలు లక్షలు సంపాదించాడు. ఒక గన్ మేన్ని పెట్టుకున్నాడు.
తన పెద్దభార్యా, కొడుకూ పుట్టింట్లోనే వుండిపోయారు.
ఆ కొడుక్కి తనంటే అసహ్యం!
తను రాజకీయాల్లో ప్రవేశించి అంచలంచలుగా పైకి వచ్చాడు. తనని కన్నెత్తి చూసే ధైర్యం లేకండా చేసుకున్నాడు.
తన గతం చాలా మందికి తెలియదు.
