Previous Page Next Page 
విశిష్ట పేజి 25

    "మీరేనా పృధ్వీకుమార్........?" అనడిగాడు కళ్ళలో ఎర్రజీరలు పొంగుకు వస్తూంటే.

    అతడు వ్రాసిన లెటరు అతడి ముఖం మీద కొట్టినట్టుగా విసిరి -  "ఇంకెప్పుడూ ఇలాంటి పనికిమాలిన రాతలు రాయకు. రాశావో మర్యాద దక్కదు. మళ్లీ నా పిల్లజోలికి వచ్చావా నేనూరుకోను. నీ బాబు హోం మినిస్టరయినా, చీఫ్ మినిస్టరయినా నేనేం అదురుకోను........" అనేసి గిర్రున వెనుదిరిగాడు.

    క్లాసులో అంతమంది స్టూడెంట్స్ ముందు జరిగిన అవమానానికి అతడి ముఖం నల్ల సిరా పులిమినట్టుగా అయింది.

    ఉరుమురిమి మంగలం మీద పడ్డట్టుగా ఇంటికి వెళ్ళబోతున్న విశిష్ట దగ్గరికి వచ్చి ఆగ్రహం ఆపుకోలేకపోతున్నట్లుగా ఆమె రెక్క పట్టి బలంగా లాగాడు.

    "నా కాళ్ళు కడిగి కన్యాదానం చెయ్యడానికి క్యూ కట్టిన జనాల్ని కాదని మీ నాన్నకి ఆ ఛాన్స్ నేనిస్తే తిరస్కరిస్తాడా? బహిరంగంగా అవమానిస్తాడా? వాడికి ఏదో మూడింది. అందుకే అలా చిందులేశాడు. ఇంతటితో వదులుతాననుకోకు. పెళ్ళి పీటల మీదికి ఎకక్డానికి మొండికేసిన నిన్ను నేరుగా పందిరిమంచం మీదికే ఎక్కిస్తాను! కాచుకో......." కర్కశంగా అని కదిలాడు.

                                             *    *    *

    ఎస్సై రమాకాంత్ తను కూర్చున్న కుర్చీకే అందాన్నిస్తున్నట్టుగా నిండుగా కూర్చుని వున్నాడు. పోలీసాఫీసర్ కి వుండాల్సిన దృఢత్వం, ఠీవి ఆ ముఖంలో కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్నాయి.

    పచ్చటి పసిమి, నల్లగా బొద్దుగావున్న మీసాలు, చిన్నగా కట్ చేసిన క్రాఫ్.

    ఫ్రెష్ రిక్రూట్ మెంట్. ఆ రంగంలోని మాలిన్యం ఇంకా అంటినట్టు లేదు.

    తెల్లవారుఝామున అయిదు గంటలకి పృధ్వీని వదిలిపెట్టారు పోలీసులు.

    ఓ గంట తర్వాత స్టేషన్ కి వెళ్ళాడు రమాకాంత్.

    "ఇప్పటికి అయిదుసార్లు హోం మినిస్టరు గారి నుండి మీకు ఫోన్ వచ్చింది. ఆయన ఫైర్ అయిపోతున్నాడు. డి,యస్పీ కి కూడా సెగ పెట్టినట్టున్నాడు. ఆయనా ఫోన్ లో గుర్రు గుర్రుమంటున్నాడు. సస్పెండ్ ఆర్డర్ తయారు అవుతుందని చెప్పమన్నాడు" డ్యూటీలో వున్న కానిస్టేబుల్ చెప్పాడు.

    అతడు చెబుతుండగానే ఫోన్ మ్రోగింది.

    రమాకాంత్ నింపాదిగా అందుకున్నాడు ఫోన్.

    అవతల నుండి ఏం వినబడిందో ఉలికిపాటునీ, గాబరానీ అభినయించాడు. "సారీ సార్ అతడు నిజంగా మీ అబ్బాయని తెలియదు. ఊరికే మీ పేరుని ఉపయోగించుకుని తప్పించుకోవాలని చూస్తున్నాడు అనుకున్నాను. హోం మినిస్టరు కొడుకేంటి? తన స్టూడెంట్ నే రేప్ చేస్తానని బెదిరించడం ఏమిటి అనుకున్నాను సారీ సర్. వెరీ వెరీ సారీ నావల్ల మరోసారి ఇలాంటి పొరపాటు జరుగదు. దానిదేముంది సార్? మీ అబ్బాయి నుండి తీసుకున్న స్టేట్ మెంటే కదా? మాయం చేస్తాను. అదేం పెద్ద పని గనుక?"

    అతడు ఫోన్ పెట్టేస్తుండగా స్టేషన్ ముందు జీపు దిగిన డీ యస్పీ బాణంలా దూసుకువచ్చాడు. "నీకేమైనా బుద్దుందా? హోం మినిస్టరు కొడుకుని అరెస్టు చేసి తీసుకువచ్చింది కాక దొంగనో, ఖూనీకోరునో బాదినట్లు బాదుతావా? పత్రికలకి రిపోర్ట్ యిస్తావా? నీకెంత ధైర్యం? ఏం చూసుకొని? ఆఫ్టరాల్ ఒక ఎస్సైగాడివి" నిప్పుల మీద ఉప్పులా చిటపట లాడిపోయాడు.

    "సారీ సర్! అతడు నిజంగా హోం మినిస్టరు కొడుకనుకోలేదు. అనుకుంటే అతడిని అరెస్ట్ చేసే దమ్ము నాకుందా? హోం మినిస్టరు కొడుకైనా గుంజుకొచ్చి చితకబాదేంత గొప్పవాడినని అనుకోవడంలేదు.

    నేనెంత? నా హోదా ఎంత? ఆఫ్టరాల్ ఎస్సైగాడిని!"

    "నీ తాహతు నీకు తెలిస్తే హోం మినిస్టరు కొడుకునని అతడు మొత్తుకుంటున్నా వినకుండా మెడ మీద చెయివేసి నెట్టుకుంటూ , కొట్టుకుంటూ జీపెక్కించి స్టేషన్ కి తీసుకువస్తావా........?" ఆయన కోపం ఇంకా తగ్గలేదు.

    "చెప్పాకద సార్? అతడు వట్టి బడాయికి చెబుతున్నాడనుకొన్నాను హోం మినిస్టరు కొడుకునని చెబితే వదిలిపెడతామన్న ఆశతో అలా బొంకాడనుకొన్నా. అయినా తన స్టూడెంట్ నే కామించి లైంగిక వేధింపులకు గురిచేస్తూ రేప్ చేస్తానన్న ఒక అధమాధముడిని హోం మినిస్టరు కొడుకన్న సాకుతో వదిలిపెట్టొచ్చా సార్? పరమ పవిత్రమైన ఆచార్య పదవికే కళంకం తెచ్చినవాడిని క్షమించవచ్చా సార్? వాడిని ఊరికే వదిలి పెడితే మన వృత్తికే కళంకం కదా? ఎందుకు ఈ కాకీబట్టలు? ఎందూకీ లా అండ్ ఆర్డర్?" రమాకాంత్ ఆవేశపడిపోయాడు.

    "ఇప్పుడర్ధమైంది. అంతా తెలిసే ఈ ఘనకార్యం చేశావు. నువ్వెంత అమాయకత్వం నటించినా నిజం బయటపడుతూనే వుంది రమాకాంత్. నేనూ నీలా వృత్తిని గౌరవించే మనిషిని కాబట్టి నీ అమాయకత్వాన్ని నమ్మినట్లు నటిస్తాను. కాని పై అధికారుల నుండి నిన్ను సస్పెండ్ చేయమని ఒత్తిడి వస్తే మటుకు నేను నిస్సహాయుడిని."

    "నేనేం తప్పు చేశానని నన్ను సస్పెండ్ చేస్తారు సార్? చట్టం దృష్టిలో హోం మినిస్టరు కొడుకైనా, సామాన్య పౌరుడైనా ఒక్కటేనని మీరొప్పుకొంటే నన్నెలా సస్పెండ్ చేస్తారు? నేను చేసింది తప్పెలా అవుతుంది?

    ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకొంటూ వ్రాసిన లెటరు చదివితో మానవత్వం అన్నది ఏ కొంచెం వున్నా రక్తం ఉడికిపోతుంది. మహిళాభ్యుదయమే సమాజాభ్యుదయమని ఉపన్యాసాలు యిస్తామే వాళ్ళు అడుగడుగునా మగవాళ్ళ వేధింపులకు గురి అవుతూ ఎలా అభ్యుదయం సాధిస్తారు? బస్సులలో, క్యూలలో , సినిమాహాళ్ళలో వాళ్ళకి జరిగే లైంగిక హింస ఇంతా అంతా కాదు!

    ఆఫీసుల్లో బాసుల వేధింపు! కాలేజీల్లో లేక్చరర్ల వేధింపు. ఇక వాళ్ళు ఎలా చదువుకొంటారు? ఎలా ఉద్యోగాలు చేస్తారు? ఎలా అభ్యుదయాన్ని సాధిస్తారు? ఎందరు ఆడవాళ్ళు ఎవరికీ చెప్పుకోలేక మూగబాధ అనుభవిస్తున్నారో నాకు తెలుసు సార్! వాళ్ళలో ఒకరిద్దరు ఇలా గొంతు విప్పుతారు!

    రక్షకభటులమని మనల్ని రక్షణ కోరుతారు. చాలాచోట్ల మనం భక్షకభటులమని నిరూపించుకొన్న ఘనత మనదే కద సార్? తమ పిల్లలని చదువుల కోసమని కాలేజీలకి పంపిస్తే జరిగే అవమానాలు చూసి స్కూల్ ఫైనల్ లో చదువులు మానిపించి పెళ్ళిళ్ళు చేసి పంపించేసే తలిదండ్రుల సంఖ్య పెరిగిపోతుందీ మధ్య.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS