Previous Page Next Page 
విశిష్ట పేజి 24

    "వాడు వట్టి ప్రొఫెసర్ కాదు నాన్నా! వాడి తండ్రి హోం మినిష్టర్! డబ్బు , పలుకుబడి కావలసినంత వున్నవాడు. వాడిని ఎదిరించడమంటే ప్రాణాంతకమే.

    "రణరంగంలో నిలబడ్డప్పుడు చంపడమో, చావడమో రెంటిలో ఏది జరిగినా గౌరవప్రదమే కాని పారిపోవడం మాత్రం గౌరవప్రదం కాదు. ఏది ఎలా జరిగినా సరే! వాడి అంతు తేల్చుకోడానికే నేను నిశ్చయించుకున్నాను."

    "ఎలా తేల్చుకోవాలనుకుంటున్నారు?"

    "ముందు మీ ప్రిన్సిపాల్ ని కలుస్తాను. మా పిల్లల్ని చదువులకోసం పంపిస్తున్నాంగాని, కాలేజీలు స్వయంవర వేదికలనుకొని పంపలేదని చెబుతాను. ఈ లెటర్ ఆయన చేతికిచ్చి ఏం చర్య తీసుకుంటాడో అడుగుతాను"

    మరునాడు కాలేజీకి వెళ్ళాడు రామకృష్ణ. ప్రిన్సిపాల్ ని కలిసి పృధ్వీ వ్రాసిన లెటరిచ్చాడు.

    ఆయన అంతా చదివి -

    "చెప్పండి! ఈ లెటర్ నాకివ్వడంలో మీ ఉద్దేశ్యం ఏమిటి? నేనేం చేయగలను మీకు?" అన్నాడు మృదువుగా.

    "క్రమశిక్షణ కింద అథడి మీద చర్య తీసుకుంటారని ఈ లెటరు మీ చేతికిచ్చాను. ఈ లెటరు ఏ స్టూడెంటో రాస్తే నేనింత రియాక్ట్ అయ్యేవాడిని కాదు. పవిత్రమయిన ఆచార్య పదవిలో వుండి ఒక స్టూడెంట్ కు ఇలా వ్రాయవచ్చా?" కఠినంగా అడిగాడు రామకృష్ణ.

    ఆయన అదోలా కనుబొమ్మలెత్తి -

    "ఇందులో తప్పుపట్టాల్సిందేమీ కనిపించడంలేదే! మీ అమ్మాయి మీద యిష్టం కలిగిందని, పెళ్ళి చేసుకుంటానని రాశాడు. అతని ప్రపోజల్ మీకు నచ్చితే ఓకే అనొచ్చు. లేకుంటే "నో" అనొచ్చు."

    "సార్! ఇది విశ్వవిద్యాలయం అనుకుంటున్నారా? స్వయంవర వేదిక అనుకుంటున్నారా?"

    "మీ ఉద్దేశ్యం నాకర్ధమైంది ఇది విద్యాలయమే. అయినా ఇది కో - ఎడ్యుకేషన్ కాలేజీ. యవ్వనంలోకి అడుగుపెట్టిన యువతీ యువకులు తమకు నచ్చినవారి పట్ల ఆకర్షితులవడం సహజాతి సహజం! ప్రేమించిన వారిని జీవిత భాగస్వాములుగా ఎన్నుకోవడం సహజమే.

    ఎందుకంటే -ఇక్కడ చదువు పూర్తిచేసుకొని ఇంటికి వెడుతూనే ఓ ఇంటివాళ్ళయి జీవితంలో స్థిరపడే ఆలోచన వుంటుంది కాబట్టి.

    అఫ్ కోర్స్! అందరి ప్రేమలూ, అందరి ఆశలూ నెరవేరవనుకోండి. అది వాళ్ళ వాళ్ళ ఫేట్......."

    "అలా దంపతులయ్యే యువతీ యువకులకు మీరు పౌరోహిత్యం నెరపేలా వున్నాలే......." చురుగ్గా అన్నాడు రామకృష్ణ.

    "అదేం లేదు. మీరు అపార్ధం చేసుకుంటున్నారు. ఇక్కడ సహజంగా జరిగే విషయం చెప్పానంతే. కో -ఎడ్యుకేన్ కాలేజీ! వయసు లోకి అడుగుపెట్టిన యువతీ యువకులు, ఆకర్షణలూ, ప్రేమలూ సహజం కదా?"

    "మీవంటి సహృదయులు, ప్రోత్సాహకులుండబట్టే ఇక్కడ విద్యార్ధులను పెళ్ళి కాకుండానే తల్లులను చేస్తున్నారు మీ లెక్చరర్స్. మోసపోయి ఆత్మహత్యలకు గురి అవుతున్నారు అమ్మాయిలు. కాస్త అందమైన ఆడపిల్లలు లైంగిక వేధింపులకు గురి అవుతున్నారు.........."

    ఇంతసేపు నెమ్మదిగా, శాంతంగా మాట్లాడుతున్న ప్రిన్సిపాల్ కి చిర్రెత్తుకొచ్చినట్టుగా అయింది.

    "ఎవరు ప్రేమించి మోసపోతున్నారో, ఎవరెవరు పెళ్ళికాకుండానే కడుపులు తెచ్చుకుంటున్నారో చూస్తూవుండటమేనా నా పని? ప్రిన్సిపాల్ గా నాకంతకంటే పని లేదనుకున్నారా?"

    "మీకున్న పనులేమిటో తెలీదుగాని ఈ లెటరు విషయంలో ఏం చర్య తీసుకోబోతున్నారో నాకు చెప్పండి. మిగతాదంతా నాకనవసరం."

    "మీరే చెప్పండి ఏం చర్య తీసుకోమంటారో?"

    "ఈ విషయం పై అధికారుల దృష్టికి తెచ్చి సస్పెండ్ చేయించండి లేదా యిక్కడి నుండి బదిలీ చేయించండి."

    "సస్పెండ్ చేయించేంత తప్పు ఈ లెటరులో లేదుకదా? అయినా మాటవరుసకి ఒక మాట అంటాను. ఏమీ అనుకోకండి. అతడి ప్రపోజల్ గురించి ఒక ఆడపిల్ల తండ్రిగా మీరు ఆలోచించవచ్చుకదా? మంచి అందగాడు, మంచి ఉద్యోగంలో వున్నాడు. పోతే ఎన్ని తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తిపాస్తులున్నాయి.

    ముఖ్యంగా తండ్రి ప్రముఖ రాజకీయ నాయకుడు. ప్రస్తుతం హోం మినిస్టరుగా చేస్తున్నాడు. రేపోమాపో సి.ఎం. కావచ్చుని ఊహాగానాలు వినవస్తున్నాయి.

    మీరు మామూలు బడిపంతులు కదా! ఎన్ని జన్మలెత్తినా ఇలాంటి సంబంధం తెచ్చుకోగలరా మీ అమ్మాయికి? వలచి వచ్చాడని తేలిక చెయ్యకుండా వాస్తవ ప్రపంచంలోకి వచ్చి ఆలోచించండి."

    "నిజంగా జ్ఞానమున్న తండ్రి అయితే తన బిడ్డనిచ్చేచోట చూసేది సంపద, హోదాలు కాదు. సచ్ఛీలత, స్వచ్ఛత! అవి వుంటే చాలు తన కూతురు సుఖపడుతుందని నమ్ముతాడు. ఆడపిల్లలతో ఆడుకొనే ఈ తుంటరికి సచ్చీలత వుందా?

    తనని ఎదిరించిందన్న కోపంతో నా కూతుర్ని సర్వనాశనం చేస్తానన్నవాడికి స్వచ్ఛత వుందా? ఇలాంటి వాడికి  పిల్లనిచ్చేకంటే బండెడు రాళ్ళు కట్టి బావిలో తొయ్యడం మంచిదని భావించే మనిషిని నేను."

    "ఏం మనిషండీ మీరు? ఈ కాలంలో పుట్టాల్సిన వారు కాదు. మీకు రాముడ దొరకాలంటే మీ అమ్మాయికి పెళ్ళి చెయ్యడం కష్టమే. వయసులో వున్న పెళ్ళికాని బ్రహ్మచారి ఎఫైర్స్ మామూలే. చూసీ చూడనట్టు పోతే మంచిది శల్యపరీక్షకు కూర్చుంటే అన్నీ కష్టాలే. అన్నీ సమస్యలే. అన్నీ ఈజీగా తీసుకుంటే తప్ప మనిషి బ్రతకలేని కాలం వచ్చింది"

    "మీ సలహాలకి కృతజ్ఞతలు. నేనే నా కూతుర్ని స్వయంగా వధ్యశిల మీదకి ఎక్కించి దాని అదృష్టాన్ని పరీక్షించలేను. వస్తాను........" విసురుగా లేచి వచ్చేసిన రామకృష్ణ పృధ్వీ ఏ క్లాసులో వున్నది తెలుసుకొని అటు నడిచాడు.

    పృధ్వీ టేబుల్ మీద చేతులు ఆనించి ఆంగ్లంలో ఉపన్యసిస్తున్నాడు.

    క్లాసు నిశ్శబ్దంగా వుంది.

    రామకృష్ణ విసవిసా అతడి దగ్గరికి నడిచి -


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS