"మీరు చూస్తూండండి మాస్టారూ! నేను భయంతో కాలేజీ మానెయ్యడం జరుగదుగాని వాడు రాజీనామా చేసి కాలేజీ నుండి వెళ్ళిపోయేలా చేస్తాను. పోలీసులతో మక్కెలిరగదన్నిస్తాను"
వారం పదిరోజులపాటు నిశ్శబ్దంగా వున్న పృధ్వీ ఒకరోజు ఒంటరిగా చిక్కించుకున్నాడు విశిష్టను.
"ఏం నిర్ణయించుకున్నావు మన పెళ్ళి విషయంలో?"
"నీ పెళ్ళి, నా పెళ్ళి వుంటుందేమోగాని మన పెళ్ళి అనేది జన్మలో వుండదు పృధ్వీ!"
"గురుదేవుడిని పేరుపెట్టి పిలుస్తావా? కళ్ళుపోతాయి"
"గురువుగా మన్నించడానికి తగని మనిషివి. నాకేం కళ్ళుపోవు గాని కూతురిలా చూడవలసిన శిష్యురాలిని కామించిన పాపానికి నీ రెండు కళ్ళు పోతాయి."
"ఎవరో కవి చెప్పినట్లు కాలేజీ అంటే గురువులు, శిష్యులే ఉండరు. పూలూ, సీతాకోక చిలుకలూ వుంటాయి.
పువ్వులున్నప్పుడు సీతాకోకచిలుకలు వాలడం సహజం కదా? ఈ సహజమైన విషయాన్ని ఎందుకు అంగీకరించవు? నేను నిన్ను కామించలేదు ప్రేమిస్తున్నాను. నువ్వంటే పిచ్చిగా పడిచస్తున్నాను"
"నువ్వు ప్రేమిస్తున్నావా? నీకు ప్రేమించే మనస్సుందా? వుంటే నేన్నీకు లొంగకపోతే ఎత్తుకుపోయి కాలరాస్తానంటావా? నీ తుచ్చవాంఛకు ప్రేమ అన్న ముసుగు ఎందుకు కప్పుతావు?" కఠినంగా అడిగింది.
"అనుభవం లేని పిల్లవి, ప్రతి ప్రేమకథా ముగిసేది వాంఛతోటే. ప్రతి పెళ్ళికథా పూర్తయ్యేది పందిరిమంచం మీదే! అది లేని మనిషి వున్నాడా? వున్నాడంటే వాడు అప్రయోజకుడి కింద లెక్క. కొందరు గుంటకాడి నక్కల్లా నాలిక తడుపుకొంటారు.
కొందరు మాత్రమే సింహంలా వేటాడి తీసుకొంటారు. నేను రెండవ కోవకు చెందిన మనిషిని. నాకు కావలసింది ధైర్యంగా అడిగితీసుకొంటాను. రాజ్యమైనా, స్త్రీ అయినా ఒక్కటే నా దృష్టిలో అది వీరభోజ్యం. నాకు కావలసిన దానికోసం నేనేమైనా చేస్తాను. ఎంతకైనా తెగిస్తాను. మధ్యలో తోకముడిచే రకం కాదు."
"ఇలాగే తోకాడించావంటే తోక కత్తిరిస్తాను నేను. అప్పుడు మొండి తోకతో ఊరంతా ఊరేగుదువుగాని" పళ్ళు పటపటలాడించింది విశిష్ట.
* * *
సాయంత్రం స్కూల్ నుండి వస్తూనే "పృధ్వీ ఎవరు విశిష్టా?" అనడిగాడు రామకృష్ణ.
"మా కాలేజీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్ నాన్నా! దేనికి అడుగుతున్నారు?" విశిష్ట గుండె దడదడ కొట్టుకోసాగింది.
"ఈ లెటరు చదువు."
తండ్రి అందించిన లెటరు చదివింది విశిష్ట.
"రామకృష్ణగారూ!
నేను మీ అమ్మాయి కాలేజీలో ప్రొఫెసర్ ని. నా పేరు పృధ్వీ కుమార్. కాలేజీలో సంవత్సరం పైగా మీ అమ్మాయిని చూస్తున్నాను. ఆమె రూపం కంటే ఆమె వ్యక్తిత్వం నాకు బాగా నచ్చింది. ఏ అమ్మాయిని చూసినా మనసు పడని నేను మీ అమ్మాయి మీద మనసు పారేసుకున్నాను. ఆమెతో పాణిగ్రహణం అభిలషిస్తున్నాను.
కానీ మీ అమ్మాయికి నేనంటే అయిష్టం. ఆడపిల్లలతో ఆడుకొనే మనిషినని ఆమెకెవరు చెప్పారో, ఆమె విన్నదంతా వట్టి అభూత కల్పనలని గట్టిగా చెప్పగలను. నా మీద మోజుపడ్డ ఆడపిల్లలు నేనందకపోయే సరికి కడుపుమంటతో కల్పించిన కథలు.
ఇంతవరకు నేను తప్పుచేయలేదని, నాది మచ్చలేని చరిత్ర అని చెప్పలేను, కొన్ని బలహీన క్షణాల్లో...... నన్ను నేను కోల్పోయిన మాట నిజం. అదీ మదపుటేనుగుల్లాంటి అమ్మాయిల ధాటికి తట్టుకోలేక. అంతే గాని అందరూ అనుకొంటున్నట్లుగా నాది ఆడపిల్లలతో ఆడుకొనే మనస్తత్వం కాదు."
నేను జీవితంలో మొట్టమొదటిసారిగా మనసుపడ్డ అమ్మాయి మీ విశిష్ట. ఆమె నాకు కావాలి. నా భార్యగా! నా జీవిత సహచారిగా. దానికి మీ అంగీకారం కావాలి. ఇట్లు పృధ్వీకుమార్.
విశిష్ట కవరు మడుస్తుంటే "ఏమిటమ్మా ఇది?" అని అడిగాడు వివర్ణమైన ముఖంతో.
"ఇందులో అర్దం కాకపోవడానికి ఏముంది నాన్నా? ఈయన నన్ను పెళ్ళిచేసుకోవాలనుకుంటున్నాడట."
"ఇలా,,,,,,,,,,సంగతని నాకెందుకు చెప్పలేదు?"
"ఈ లెటరులో వ్యక్తమౌతున్నట్టుగా ఉత్తముడు కాదు నాన్నా ఈయన. వట్టి దగుల్బాజీ! ఆడపిల్లల జీవితాలతో ఆడుకొనే మనిషి. వీడి ఆటకు ఎందరో బలి అయ్యారు."
"అవన్నీ వట్టి పుకార్లని......."
"పుకారు కాదు! అంతా యదార్ధమే. మన కరుణ బలి అయింది వీడి మోసానికే. కరుణ ఆత్మహత్య చేసుకొన్నాక అతడిని చట్టానికి పట్టివ్వాలని నేను చేసిన ప్రయత్నాలవల్ల అతడు నా మీద పగబట్టాడు. ఎలాగైనా నా జీవితం కాలరాయాలని అతడి ప్రయత్నం. ఆ ప్రయత్నంలో భాగమే ఈ పెళ్ళి నాటకం"
"నిన్ను పెళ్ళి చేసుకొని భర్త అధారటీతో హింసించాలనా?"
"అసలు పెళ్ళివరకు రానిచ్చే ఉద్దేశ్యం వాడికి వుందనుకోను. పెళ్ళి పేరుతో దగ్గరికి పిలిచి అవమానించొచ్చని ఇదొక ఎత్తుగడ.
"నువ్వు చెప్పేది నిజమే అయితే ఈ విషయం చాలా సీరియస్ గా తీసుకోవలసిందే. మరి ఇంత జరుగుతుంటే నాకెందుకు చెప్పలేదమ్మా?
"ఈ గొడవంతా దేనికని నన్ను కాలేజీ మానిపిస్తారేమోనని భయపడి..........
"కుర్రాళ్ళు ఈవ్ టీజింగ్ కి పాల్పడితే ఏదో కుర్రతనంలే అనుకోవచ్చు. వీడికేమొచ్చింది రోగం? ఆచార్య పదవిలో వుండి ఒక స్టూడెంట్ ను లైంగిక వేధింపులకు గురిచేస్తాడా? వీడి ఉద్యోగం ఊడగొట్టించి, వీడికి తగిన గుణపాఠం చెప్పకపోతే నా పేరు రామకృష్ణ కాదు" ఆయన ఆగ్రహంతో వూగిపోయాడు.
