Previous Page Next Page 
బేబి!ఓ బేబి!! పేజి 24

    "కుక్కల్తో సమానంగా పరిగెత్తలేకపోతే...బూట్లు చేతపట్టుకొని పరిగెత్తమను. అదేమో-పొలిటికల్ మర్డర్ గదా! హోం మినిస్టర్ గాడేమో నామీద చిర్రుబుర్రు లాడుతుండు. అసలు వాడికి హోం మినిస్టర్ ఇచ్చాడు గాని....మన డిపార్ట్ మెంట్ లో హోంగార్డ్ గా ఇవ్వాల్సింది. అప్పుడు తెలిసేవి మన ఇబ్బందులేవో? రెండు రోజుల్లో మరిన్ని ఆధారాలతో నువ్వే రంగంలోకి దిగు....తెల్సిందా?" అరిచాడు అవతలి వ్యక్తి.

    "ఎస్ సర్! ఎస్ సర్! ఒకేసారి. తప్పకుండాసర్. నేనే దిగుతాను సార్" అన్నాడు అతి వినయంగా అమితేష్.

    "ఈ రంగంలో నువ్వింకా సీనియర్ వి కావాలి మిష్టర్ అమితేష్. సూక్ష్మదృష్టి అవసరం. దేనినీ తేలిగ్గా తీసిపడెయ్యకూడదు. హత్య జరిగిన స్థలంలో రెండు ఆవగింజలు, ఒక గుండుసూది దొరికినా వాటితోనే శోధించాలి. అలాంటివి మన ఉద్యోగాలు. అర్ధమయిందా?" మరోసారి అరిచి ఫోన్ పెట్టేసినాడు అవతలి వ్యక్తి.

    అమితేష్ కూడా ఫోన్ పెట్టేసి డామిట్స్ అని "ఇప్పుడు నీక్కాదు హెచ్చరిక వచ్చింది...నాకు" అన్నాడు రోషాన్ని భార్గవ మీద కక్కి నవ్వేస్తూ.

    "ఎవరాయన?"

    "డిప్యూటి జనరల్ ఆఫ్ పోలీస్. పాతబస్తీలో జరిగిన ఒక పొలిటికల్ మర్డర్ కేసు ఆధారాల గురించి..."

    "మరి నే వెళ్తాను...మళ్ళీ ఎప్పుడు కలువమంటావ్?" అన్నాడు లేస్తూ భార్గవ.

    "యూ డోంట్ వర్రీరా! ఆ పని నాకు అప్పజెప్పావ్ గదా! నిశ్చింతగా వుండు. కాకపోతే, ఈ రెండ్రోజుల వరకూ పాతబస్తీ మర్డర్ కేసులో బిజీగా వుంటానేమో? ఈ లోపుగా నీకేమైనా మళ్ళీ బెదిరింపులొస్తే...నాకు వెంటనే ఫోన్ చేసి చెప్పు. ముఖ్యంగా నువ్వెక్కడ వున్నప్పుడు ఐమీన్ ఏ చోట వున్నప్పుడు బెదిరింపు వచ్చిందన్నది. ఆ ఏరియా అంతటినీ ఆపరేట చేయడానికి ట్రై చేస్తాను. నా అసిస్టెంట్ తో సహా. ఈ ప్రింట్స్ నా దగ్గరే వుంటాయి" అని కరచాలనం చేశాడు.

    "థాంక్యూ...అమితేష్"

    "ఒకే...చూసావా? ఇప్పటి డిజిపిగారి తిట్లన్నీ టేపులో నిండి పోయాయి" అంటూ దాన్ని రివైండ్ చేసి మళ్ళీ రికార్డింగ్ బటన్ నొక్కి తుడిచేశాడు.

    భార్గవ మరోసారి థాంక్స్ చెప్పి వెనక్కి తిరగ్గానే....

    'మిస్టర్ భార్గవా! ఈవిడగారి ఫింగర్ ప్రింట్స్ లో ప్రత్యేకత ఏమంటే....లెటర్ రాస్తున్నప్పుడు అన్ని వేలిముద్రలూ పడ్డాయి గాని....ఒక్క బొటనవ్రేలి ముద్ర మాత్రం పడలేదు. బహుశా ఆ అమ్మాయికి బొటనవ్రేలు వుండకపోవచ్చు. అదీ ఫింగర్ ప్రింట్స్ ఫొటోస్ లో కన్పించిన స్పెషాలిటీ" అన్నాడు అమితేష్.

    గిరుక్కున తిరిగిన అతడూహించని మాటది.

    అంటే!

    అంటే!!

    అంటే!!!

    ఒక్కసారిగా భూనభోమండలం పటేల్ మన్న ప్రతిధ్వనులు...

    గుండె కండరాలు బిగుసుకుపోయి కవాటాల్ని కత్తిరించినట్లు ఊపిరాడని ఉద్వేగం.

    నిక్షిప్తమైన పిరికితనం రక్తంతో సుళ్ళు తిరుగుతుంటే...కపాలంలో మెదడు నరాలు చిట్లినట్లు....క్రమంగా కళ్ళకింది శూన్యం పెరిగి...పెరిగి...

    నిస్తేజమైన... నిశ్శబ్దమై....నిశిరాత్రి అగాథాల అట్టడుగుల్లోకి కూరుకు పోతున్నట్టు....

    అతని శరీరంపై గొడ్డళ్ళతో నరికిన అరణ్యంలా రోమాలన్నీ నిటారై...చర్మంరంధ్రాల్లో చెలమలూరి జారుతున్న స్వేదం...

    అది చూసి అమితేష్ హుతాశుడయ్యాడు.

    తడినిండిన గొంతుకతో సహారా ఎడారి ప్రవహించి....కళ్ళలో ప్రేతకళ నింపుకుని నిస్తేజంగా... నిర్వీర్యంగా నిల్చిపోయాడు భార్గవ. అలాగే....

    భార్గవ దృక్కులు చూసి ఒళ్ళు జలదరించింది డిటెక్టివ్ అమితేష్ కి గూడా. క్షణంలో తమాయించుకుని "ఏమిటి భార్గవా! అలా అయిపోయావే..ఏమైందిరా? ఏమైంది? భార్గవా! చెప్పరా?" అతడు లేచొచ్చి అతని భుజాలు పట్టి కుదుపుతూనే వున్నాడు.

    భార్గవ ట్రాన్స్ లో వున్నట్టు నిల్చున్నాడు. అమితేష్ ఆందోళనతో కుదుపుతోనే వున్నాడు. అప్పటికీ రెండు నిమిషాల తర్వాత- అతడు మామూలు మనిషైనట్టు...

    "నువ్వింతకు ముందు ఏమన్నావ్ అమితేష్... బొటనవ్రేలు లేదా?" భయం తాలూకు ఛాయలు మొహంలో స్పష్టంగా తారట్లాడుతున్నాయి.

    "ముందు నువ్వు రిలాక్స్ అవు...రా...కూచో" భుజాలు పట్టి కూర్చోబెట్టాడు అమితేష్. వెంటనే రెండు కాఫీలు తెప్పించాడు.

    అమితేష్ ఆలోచిస్తున్నాడు. "రియల్లీ సడెన్లీ షాక్...బొటన వ్రేలు లేని వ్యక్తికి....భార్గవకు ఏదో సంబంధం వుండి వుండాలి!

    ఆమె అతనికి తెలిసిన శత్రువే అయి వుండాలి. ఇప్పుడు తన పరిశోధన మరింత తేలికవుతుంది. అన్ని విషయాలు రాబట్టాలి. పరిపరి విధాల ఆలోచించిన పదిహేను నిమిషాల తర్వాత__

    "నిజం చెప్పరా? బొటనవ్రేలు లేని వ్యక్తి ఎవరైనా నీకు తెలుసా?" అడిగాడు అమితేష్. భార్గవ కొద్దిసేపటి మౌనం తర్వాత చెప్పాడు.

    "నా నవలలో అతి కురూపి పాత్ర మౌనికది....మవునిక నా నవలా నాయిక. ఆమె కురూపితనంలో భాగంగానే ఆమెకు బొటన వ్రేలుండదు. నవల మొదట్నుంచీ అంతే!! నవల్లో మవునిక ప్రత్యేకతలునే...బొటన వ్రేలులేని కురూపితనం అది నేను సృష్టించిన పాత్ర. అందవికారి అయినా మవునిక, గొంతు మాత్రమే అందమయింది. సీరియల్ కూడా ఇంకా ఇలాగే కొనసాగుతుంది."   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS