Previous Page Next Page 
బేబి!ఓ బేబి!! పేజి 25

    ఆ మాటవిని...అమితేష్ నిమిషం పాటు వెన్నెముక పొడుచుకొచ్చినట్లు నిటారుగా అయ్యాడు. ఏ ఆలోచనకూ ఏదీ ఊహకందటంలేదు.

    అసలేం జరుగుతుంది...??

    ఒక పాత్రకు ప్రాణం వచ్చి సృష్టికర్తనే హెచ్చరించటం...!!

    పకడ్బందీ పథకమా? లేక పాత్రకే ప్రాణం వచ్చిందా? అమితేష్ లో అనన్యమైన ఊహలు. ఇన్నేళ్ళ తన డిటెక్టివ్ పరిశోధనలో ఎదురైన కేసు. తను అతి తేలిగ్గా తీసుకున్న ఆడపిల్ల హెచ్చరిక....ఆఖరికి ఎటు మలుపు తిరుగనుంది??? అతడు ఫింగర్ ప్రింట్స్ ను మరింత తీక్షణంగా చూస్తున్నాడు.

    భార్గవ పరిస్థితి వేరు. కుర్చీ వెనక్కివాలి....మెడ వెనక్కివంచి కళ్ళు మూసుకున్నాడు నిస్సత్తువగా!!
   


                          *    *    *    *    *


    ఇంటి ముందర పెద్ద షామియానా__

    రంగురంగుల విద్యుత్ దీపాల బల్బులు రెండంతస్తుల భవంతినంతా ఆక్రమించుకుని రంగుల వెలుగులు విరజిమ్ముతున్నాయి. అక్కడంతా హడావిడిగా వుండక్కడ. కార్లు, స్కూటర్లు, సైకిల్ మోటార్లు మీద అతిధులంతా ఒక్కొక్కరే వస్తున్నారు. శరత్ అందర్నీ విష్ చేసుకుంటూ హడావిడిగా తిరుగుతున్నాడు.

    ఆరోజు శరత్, సుగాత్రి ల మారేజ్ డే.

    బెడ్ రూంలో సుగాత్రి పొడవైన జడకు నిర్లిప్త మల్లెపూల దండ అల్లుతోంది. కొత్తపెళ్ళి కూతురిలా బుగ్గన బ్యూటీస్పాట్ పెట్టింది.

    "అక్కా! మీ వయసెంతుంటుంది?" అడిగింది నిర్లిప్త.

    "ఇరవై ఎనిమిది!" చెప్పింది సుగాత్రి.

    "అయినా పదహారేళ్ళ అమ్మాయిలా వున్నావిప్పుడు" అంది గల గలా నవ్వుతూ.

    బయట నిఖిల్ కూడా అతిధులకు అన్ని సదుపాయాలూ కలగజేస్తున్నాడు. వస్తున్న వ్యక్తులంతా పెద్దపెద్ద హోదాగల వ్యక్తులే! ముసలాయన తన రూంలో విపరీతంగా దగ్గుతున్నాడు. మధ్యమధ్యలో రామా, కృష్ణా అనుకుంటూ.

    "మిస్టర్ నిఖిల్. ఎవరి కేమీ లోటురాకుండా అన్నీ సప్లయ్ చేయించు. ఎవరూ నిరాశగా పోకూడదు. మన ఫంక్షన్ నుండి..." ఆర్డర్ వేస్తూ శరత్ చెప్పాడు.

    "ఎస్ సర్" నిఖిల్ వినయంగా అని, మిగతా ఏర్పాట్లు చూస్తున్నాడు. సుగాత్రి తయారై రాగానే హాపీ మేరీజ్ డే చెప్పారంతా. ఆ కోలాహలంలో ఆమె తిరుగుతుంటే మెరుపు తీగె పాకుతున్నట్టు జిగేల్ మన్నాయి అందరి కళ్ళూ.

    బాబీ పెద్ద ఆరందిలా అందర్నీ పరిచయం చేసుకుని పలకరిస్తూ కలియ తిరుగుతున్నాడు.

    "బాబీ! మీ నాన్న రాలేదా" అన్నాడు నిఖిల్.

    "రాలేదు. ఎక్కడికెళ్ళారో? తెలీదు."

    హాల్ లోపల మంచి మ్యూజిక్ వస్తోంది సన్నగా. అందరూ కూల్ డ్రింక్స్, స్వీట్లూ తీసుకుంటున్నారు బయట-

    పిలవని పేరంటంలా పిల్లల కోడిలా వస్తున్న దేవకమ్మను గుమ్మంలోనే ఆపింది పనిమనిషి రంగి. రంగిని చూడగానే దేవకమ్మ గతుక్కుమంది. ఆ వీధిలో దేవకమ్మ భయపడేది రంగి ఒక్కదానికే. దేవకమ్మ అక్రమ సంబంధాలు రంగికి తెలుసు కాబట్టి....

    "ఏటి? యాడికొత్తున్నావ్... బాగా మెక్కిపోదామనా? నీ అసోంటోల్లకు గాదు ఈడ పేర్చిపెట్టింది. యెళ్ళేల్లు...ఇదేమన్నా సావిడి కొట్టవనుకున్నావా ఏటి? సత్రం అనుకున్నావా?" అంది గెంటేస్తూ.

    "ఏమిటే? నువ్వే యజమానురాల్లా మాట్లాడుతున్నావ్? వాళ్ళిద్దరికీ సంతానం కలగాలని నేను కూడా ఓ ఆశీర్వాదం పడేసిపోదామని..."

    "యేటీ? ఓ ఆశీర్వాదం పడేసి అరకిలో స్వీటూ, ఆరు కూల్ డ్రింకులూ ఆరగించి పోదామనా.... నీ ఆశీర్వాదం పడితే పుట్టేటోడు సత్తాడు గాని, ఎల్లెల్లు" అంది రంగి కసురుకుంటూ.

    "ఇదుగో రంగీ. మంచి మాటకొద్దీ చెపుతున్నా. నన్ను వెళ్ళనీ" రెట్టిస్తూ అంది దేవకమ్మ.

    "బేగిరం నువ్వే ఈన్నించి కదలకపోతే నేనే మెడపట్టి గెంటేత్తా.. ఏమనుకున్నావో" రంగి కోపానికి శాపనార్ధాలు పెడుతూ వెళ్ళింది దేవకమ్మ.

    లోపల__

    "బాబాయ్. మీరు నా ప్రశ్నకు జవాబు చెప్పనే లేదు" అన్నాడు బాబీ శరత్ తో.

    "అవును కదూ! ఆ ప్రశ్నేమిటో నాకు గుర్తులేదు."

    "అయ్యో. అప్పుడే జ్ఞాపకశక్తి తగ్గితే ఎలా? మళ్ళీ చెపుతున్నా! ఒక యంత్రాన్ని చూస్తే....ఆ యంత్రాన్ని కనుగొన్న శాస్త్రజ్ఞుని పేరులోని మొదటి అక్షరం లాగే కన్పిస్తుంది దాని రూపం-ఆ యంత్రమేమిటి? దాన్ని కనుగొన్న శాస్త్రజ్ఞుడి పేరేమిటి? ఆ పేరులోని మొదటి అక్షరం ఏమిటి?" దీర్ఘిస్తూ చెప్పాడు బాబీ.

    "నీకుగాని ఏమైనా తెల్సిందా నిఖిల్" అడిగాడు శరత్ ప్రక్కనున్న నిఖిల్ తో.

    "లేదు సార్. నాకేం తెలీటంలేదు"

    శరత్ ఓసారి తీక్షణంగా ఆలోచించాడు. ఆలోచిస్తోనే ఫోన్ మ్రోగటంతో అటు చూశాడు. అరనిమిషం సేపు చూసి జవాబు తట్టినట్లయి...."తెల్సిందిరా బాబీ! ఆ యంత్రం పేరు టెలిఫోన్!" అన్నాడు.

    "మరి దాని ఆకారం ఎలా వుంది చెప్పు" అన్నాడు బాబీ.

    "దాన్ని కనుగొన్నది గ్రాహంబెల్ కదా! నిజమే....టెలిఫోన్ ఆయన పేరులోని మొదటి అక్షరం లాగే 'గ్రా' ఆకారంలో వుంటుంది.

    "థాంక్యూ బాబాయ్! మీరే గెల్చారు. నేనే మీకిప్పుడు స్వీట్ తినిపిస్తాను" అన్నాడు ఆనందంగా.

    ఫోన్ కోపం శరత్ అక్కడ్నించి వెళ్ళాక నిఖిల్ అన్నాడు.

    "ఒరే బాబీ....ప్లీజ్....ప్లీజ్....నాకొక చిక్కుముడి చెప్పరా! రేపు ఆంటీకి వేయాలిగదా." వచ్చిన అతిధులు ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్నారు.    "


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS