Previous Page Next Page 
విశిష్ట పేజి 22

    "నేనేమంటానమ్మా? నిన్నూ, మీ నాన్ననూ అడిగి చెబుతున్నాను!"

    విశిష్ట గాయపడ్డట్టుగా అంది. "ఆ రోగ్ తో నాకు పెళ్ళా? ఆ మాట తలుచుకుంటేనే నాకు కంపరంగా వుంది. ఈ మాట నాదాకా రాకుండా అక్కడే కట్ చేయవలసిన మాట మాస్టారు! వాడికి అక్కడే అప్పుడే చెప్పుచ్చుకు కొట్టినట్టు జవాబు చెప్పలేకపోయారా?"

    "చెప్పుచ్చుకు కొట్టినట్టే జవాబు చెప్పానమ్మా! పందికి పన్నీరు పట్టనట్టే దుర్మార్గుడికి మంచిమాటలు పట్టవు! తను చెడ్డవాడినని ఒప్పుకుంటూనే నీ సహచర్యంలో మంచివాడిగా మారే అవకాశం ఇమ్మంటున్నాడు!"

    "మీరతడి మాటలు నమ్మారా?"

    "పెళ్ళి చేసుకుంటాననడమా? పెళ్ళయ్యాక మారడమా?"

    "పెళ్ళి చేసుకుంటాననడం!"

    "అందులో నమ్మకపోవడానికి ఏముంది? పదిమంది ఎదుటా జరిగే పెళ్ళిలో మోసం ఏముంటుంది?"

    "మీరెంత అమాయకులు మాస్టారూ! వాడు పెళ్ళి చేసుకోడు. చేపని పట్టడానికి ఎరని వేసినట్టు, పులిని కొట్టడానికి మేకని కట్టేసినట్టు 'పెళ్ళి' అన్నది ఆశపెట్టి నన్ను చిక్కించుకోవాలన్న ప్లాన్ ఇది!

    ఒకవేళ నన్ను నిజంగానే పెళ్ళి చేసుకుంటానన్నా నేను చేసుకోను గాక చేసుకోను."

    "అతడింటి ముందు ఎన్నో గొప్ప గొప్ప సంబంధాలు క్యూ కట్టి వున్నప్పుడు అతడు అందరినీ కాదని నిన్నే పెళ్ళాడతాననడం నీకు గర్వకారణం కాదా?"

    "అతడి మన్మధలీలలు చూసి గర్వపడమంటారా?"

    "ఆస్తి, అందం, అన్నీ వున్నవాడు. ఉన్నది ఒకే లోపం. అదీ నిన్ను చేసుకుని నీ సహచర్యంలో దిద్దుకుంటానంటున్నాడు కదా? అతడు మారే అవకాశం మనం ఇవ్వడం న్యాయం కదా? ఇంట్లో చక్కగా వండి వడ్డించే భార్య వున్నప్పుడు పూటకూళ్ళకు ఎందుకు వెడతాడమ్మా?"

    "రొచ్చుగుంటల్లో పొర్లి గింతలకు అలవాటుపడ్డ పంది పందిరి మంచంవేసి పడుకోమంటే పడుకుంటుందా మాస్టారూ మీరు అమాయకులు కాకపోతే! అయినా నా మనిషిగా రాయబారానికి వెళ్ళి అతడి మనిషిగా తిరిగిరావడం నాకు బాధ కలిగిస్తోంది"     "నేను ఇప్పుడూ నీ మనిషినే. నేను నీ తరపునే మాట్లాడతాను కాని అతడు నిన్ను స్వంతం చేసుకోవడానికి ఎంతకైనా తెగించేలా వున్నాడు" అంటూ అతడన్న మాటలు చెప్పాడు. "ప్రతీకారంతో వాడు మృగంలా మారిపోతే అందుకు బాధ్యత మనదేనంటున్నాడు. వాడి చేతిలో పాడుకావడం కంటే వాడి భార్యగా మిగిలిపోవడమే మర్యాదకదాని గాని.....అంతేగాని వాడిని కట్టుకుని నువ్వు రాణివాసం అనుభవిస్తావని కాదమ్మా నేను చెప్పేది!" ఆయన చాలా నొచ్చుకుని అన్నాడు.

    "వాడు బెదిరిస్తే బెదిరి లొంగిపోవడమేనా మనం చేయాల్సిన పని? వాడికి సరైన బుద్ది చెప్పలేమా?" 

    "ఏం చెప్పగలం? వాడు తుంటరేకాదు మందీమార్బలం, ధనబలం వున్నవాడు! వాడి తండ్రి హోంమనిష్టరు. తనను నమ్మించి మోసం చేసిన వాడు వాడేనని కరుణ అంతమందిలో చెప్పి ఆత్మహత్య చేసుకున్నా వాడిని ఏ చట్టం శిక్షించగలిగింది? ఏ సమాజం వాడిని బహిష్కరించింది? పోలీసులు, చట్టం వాడి కనుసన్నలలో మెలుగుతుంటే బలహీనులం వాడికి దాసోహమనక ఏం చేస్తాం?"

    "వాడికి ధనబలం, మందీ మార్బలం వుంటే మనకు నైతిక బలముంది మాస్టారూ! చరిత్ర తిరగేసి చూడండి. నైతికబలం ముందు అధర్మం, అన్యాయం ఎప్పుడైనా గెలిచాయా?"

    "ఈ మాటలన్నీ చెప్పుకోడానికి బాగుంటాయి గాని ఏమైనా జరుగరానిది జరిగితే ఎలాగన్నది నా భయం."

    "వాడు నన్నేం చేయలేడు మాస్టారూ!"

    "ఇది నీ అభిప్రాయం, మీ నాన్నగారి అభిప్రాయం కూడా కనుక్కుంటే......."

    "ఈ విషయాలేవీ నాన్నగారికి తెలియడానికి వీల్లేదండీ! ఈ విషయం మనమధ్యనే వుండిపోవాలి" ఖచ్చితంగా చెప్పింది విశిష్ట.

    శర్మిష్ట టీ తెచ్చిస్తే తాగి కప్పు కిందపెట్టి లేచాడు శర్మ. "నేనిక వస్తానమ్మా!"

    మరుసటి రోజు కాలేజీలో పృధ్వీ కలిసినప్పుడు "విశిష్టకి చెప్పాను తను ఆలోచించుకోడానికి టైం కావాలంది.

    ఈలోగా ఆ అమ్మాయినేమీ ఇబ్బంది పెట్టకు" అని చెప్పాడు శర్మ. విశిష్ట అన్న మాటలు యథాతథంగా చెబితే అతడు వెంటనే ప్రతీకారేచ్చతో చెలరేగిపోతాడన్న భయంతో చిన్న అబద్దం ఆడితే తప్పేమిటనుకున్నాడు.     

    "పెళ్ళికి ఒప్పుకొనేట్టుందా?" అతడి కళ్ళు ఆశతో మెరుస్తున్నాయి.

    "ఒప్పుకోకపోతే నువ్వు వదలవుకదా? వప్పుకుంటుంది కొంచెం టైమివ్వు."

    "ఓ.కె! పృధ్వీ పెదవులమీద దరహాసం, అతడి కళ్ళలో పంచరంగుల కలలు.

    ఆమె పెళ్ళికి సుముఖురాలైతే చాలు. ఆ బింకమంతా వదిలి మెత్తబడిపోతుంది. మెత్తబడిన ఆమెను తనకనుకూలంగా మలుచుకోగల చతురత తనకుంది. ఆమె తన చేతిలో బంగినిపల్లి మామిడిపండు అవుతుంది. చీకి చీకి..... టెంకనూ, తోలునూ చెత్తబుట్టలోకి విసురుతూ.......అప్పుడు అడుగుతాడు ఎవరు గెలిచారో చెప్పమని,. అప్పుడు చెస్తాడు విజయాట్టహాసం.

                                           *    *    *

    పృధ్వీతో అబద్దమాడిన విషయం దాచలేదు శర్మ, విశిష్టకి చెప్పాడు.

    "వాడు మూర్ఖుడు, వాడినుండి తెలివిగా తప్పించుకోవాలి. అందుకే ఇప్పుడే యుద్ధ ప్రకటన చేయొద్దు. నాలుగైదు నెలలు ఉపాయంగా గడుపు కొచ్చావంటే నీ పరీక్షలైపోయి యూనివర్శిటీనుండి బయటపడవచ్చు. తరువాత వాడు నిన్నేమీ చెయ్యలేడు." "ముసుగులో గుద్దులాటలు దేనికి మాస్టారూ! వాడు నన్నేం చేయగలడు? ఈసారి నా జోలికి వస్తే చెప్పిడిచి కొడతాను. ఇంతవరకు గురువు కదాని మర్యాదగా వూరుకొన్నాను. ఇహ నేనేం భయపడను. అడుగడుగునా ఇలాంటి లుచ్చాగాళ్ళు వుంటూనే వుంటారు. వాళ్లకు భయపడుతూ పోతే మేం ఒక్కడుగు కూడా ముందుకు వేయలేం."

    "మరి నీ ఇష్టం. బలవంతులతో ఆడపిల్లకి పేచీ ఎందుకని చెప్పాను. సాహసం మంచిదే! కాని మదపుటేనుగు లాంటి పురుషుల విషయంలో ఆడపిల్ల సాహసించడం మంచిది కాదని చెబుతున్నాను"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS