వాళ్ళను దాటి కోర్టువరకూ వెడితే కళ్ళకి నల్ల గుడ్డ కట్టుకొన్న న్యాయదేవత! ఇప్పుడు మీరే తేల్చుకోండి. ఆమె ముళ్ళకంప మీద పడిన అరిటాకు కావడమో, మర్యాదగా కోరుకున్న వాడికి ఇల్లాలు కావడమో!"
"ఏం? బెదిరిస్తున్నావా?" చర్రుమన్నట్టుగా అడిగాడు.
"బెదిరింపు కాదు . వాస్తవంలో జరగబోయేది చెబుతున్నాను."
శిష్యుడి విశ్వరూపం చూస్తున్నకొద్దీ శర్మకు దిమ్మతిరిగిపోయినట్టుగా అయింది.
తమ ఇద్దరి మధ్య నడిచిన సంభాషమ గురించి వెంటనే విశిష్టకు చెప్పలేడాయన.
"ఏమన్నాడాయన?" అని ఆమె తిరిగి అడిగితే - "రేపు చెబుతానమ్మా" అంటూ ముఖం త్రిప్పుకొని ముందుకు కదిలాడు శర్మ. ఆ రోజంతా తీవ్రమైన ఆలోచన. ఈ సమస్యకు పరిష్కారం ఏమిటాని!
నిజంగా పృధ్వీ తలచుకుంటే విశిష్టను పాడుచెయ్యడం ఓ లెక్క కాదు. ధనం, మందీమార్బలం వున్నవాడు. ఏ గుండాలనో పంపి ఆమెను అపహరించొచ్చు. ఆమె జీవితం చిరిగిన విస్తరి అయ్యాక అప్పుడిక ఏం చేసినా ప్రయోజనం సున్నా!
ఒక దుర్మార్గుడు ఇంత నిర్భీతిగా, బాహాటంగా ఒకమ్మాయి మీద మనసు పడ్డాడని, ఆమెను ఎలాగైనా స్వంతం చేసుకుతీరతానని చెబుతుంటే వాడిని ఏమీ చేయలేని నిస్సహాయతకి తనమీద తనకే కోపం వచ్చింది శర్మకి. కారణం వాడు బలవంతుడు కావడం! ఎలాంటి దారుణాలు జరుగుతున్నా స్పందించని వ్యవస్థ మీద కూడా కోపం వచ్చింది.
పదిమందిలో ఈ విషయం పడేసి, వాళ్ళచేత తూ ఛీ అనిపించి మెత్తగా తన్నిద్దామన్నా వాడిని తన్నే దమ్ములు ఎవరికుంది? వాడేదో టైం పాస్ కి ఉద్యోగం చేస్తున్నాడేగాని వాడికి ఏం తక్కువవుందని? అంతులేని ఐశ్వర్యం వుంది. అధికార బలం వున్న తండ్రి వున్నాడు.
ఆ అండతో వాడు ఎంతకైనా తెగించగలడు. ఏమైనా చెయ్యగలడు.
ఈ పరిస్థితిలో......... బలవంతుడి ముందు బలహీనుడు తలవంచడమే క్షేమకరం.
విశిష్ట వాడి చేతిలో చెడిపోవడంకంటే అర్దాంగిగా వాడి జీవితంలో అడుగుపెట్టడమే ఉత్తమం.
ఈ సమస్యకు ఎవరైనా యిదే సలహా ఇస్తారు.
శర్మ ఎప్పుడైతే ఈ నిర్ణయానికి వచ్చాడో, పృధ్వీని సమర్ధించే వాదనను ఆయన తయారుచేసుకోవాల్సి వచ్చింది.
భార్యలను నిలువునా తగలబెట్టిన హంతకులనీ, కట్నం కానుకల పేరుతో అత్తమామలను దోచేసే దొంగలనీ కాళ్ళు కడిగి కన్యాదానం చేసే వాళ్ళున్నారు. నైతిక విలువలకి విలువనిచ్చే తనబోటి ఏ ఒకరిద్దరికో తప్ప అతడి స్త్రీలోలత్వం పెద్ద తప్పుగా కనిపించదు.
నిజానికీ పృధ్వీలో ఆ ఒక్క బలహీనత తప్ప ఇంకేం లోపముందని? అందం, ఐశ్వర్యం, హోదాగల ఉద్యోగం...... ఎవరైనా గంతులేసుకుంటూ ఇస్తారు పిల్లను. అంతటి గొప్ప సంబంధం పడడం తమ పిల్ల అదృష్టంగా భావిస్తారు.
అలాంటివాడు విశిష్టను భార్యగా పొందాలనుకోవడం అదృష్టమో, దురదృష్టమో కాలమే తేలుస్తుంది, అయినా ఈ ప్రపంచంలో భార్యాభర్తలుగా కాపురం చేసుకుంటున్న జంటల్లో ఎంతమంది శ్రీరామచంద్రులూ, ఎందరు సీతలూ వున్నారని? రేణుకాదేవిలా మానసికంగా చలించినా దోషమనే చెబుతున్నాయికదా మన పురాణాలూ, శాస్త్రాలూ!
ఈ దేశంలో ప్రతి ఇంటా ఒక రేణుక వుందన్నా ఆశ్చర్యంలేదు. ప్రతి మగాడిలో ఒక ఇంద్రుడున్నా ఆశ్చర్యంలేదు!
ఈ కాలంలో నైతిక విలువలకి ఎంతమంది ప్రాధాన్యత ఇస్తున్నారు అని?
మరుసటిరోజు కాలేజీలో కలిసినప్పుడు మళ్ళీ అడిగింది విశిష్ట పృధ్వీ ఏమన్నాడని.
"సావకాశంగా కూర్చొని మాట్లాడవలసిన విషయాలు వున్నాయమ్మా! నేను ఈ రోజు సాయంకాలం ఆరుగంటలకి మీ ఇంటికి వస్తాను. మీ నాన్నగారు ఇంటి దగ్గరే వుంటారా?"
"నాన్నగారితో ఏం పని మాస్టారు. ఆయనకిలాంటివి తెలిస్తే అనవసరంగా కలవరపడతారు. నన్ను కాలేజీ మానిపించి ఇంట్లో కూర్చోబెడతారు" విశిష్ట గాబరా వ్యక్తం చేసింది.
"ఆయన్ని కంగారుపెట్టే విషయం కాదమ్మా ఇది కేవలం నీతోనే తేల్చుకోవలసిన విషయమూకాదు. అందుకే మీ యింటికి వచ్చి మీ అందరి సమక్షంలో మాట్లాడదలుకొన్నాను."
"నాకేమీ అర్ధంకావడంలేదు" విశిష్ట అయోమయంగా చూసింది. "ఇంతకీ ఆ రోగ్ నన్ను వెంటాడడం మానేస్తానన్నాడా లేదా? అది చెప్పండి చాలు!"
"అదే విషయం.......నేను సాయంత్రం వచ్చి మాట్లాడతానన్నాగా? ఇప్పుడు నాకు క్లాసుంది. ఆయన హడావిడిగా వెళ్ళిపోతుంటే విస్తుపోయి చూసింది విశిష్ట.
విషయమేదో చాలా సీరియస్ గా వుందనిపించింది. లేకపోతే మాస్టారు ముఖం చాటేసినట్టుగా వెళ్ళిపోడు.
సాయంకాలం శర్మ వీళ్ళింటికి వచ్చేసరికి విశిష్ట తండ్రి ఇంట్లో లేడు. కూరగాయలకని మార్కెట్ కి వెళ్ళాడు. అసలు మాస్టారొస్తున్నారని విశిష్ట తండ్రికి చెప్పలేదు.
"నాన్న కాస్సేపట్లో వచ్చేస్తారు. మీరు కూర్చోండి. మాస్టారూ!" అని చెప్పి ఇంట్లోకి వెళ్ళి "మాస్టారుగారొచ్చారు టీ పెట్టమని" తల్లితో చెప్పి వచ్చి "నాన్నగారితో ఏం మాట్లాడాలనుకున్నారో నాతో చెప్పకూడదా?" అంది.
"నీతో చెప్పందే ముందు ఎలా ప్రొసీడ్. అవుతాం అమ్మా? ముందు మీ నాన్నగారి అభిప్రాయం కనుక్కున్నాక నీ అభిప్రాయం అడుగుదామని!"
"అభిప్రాయమా? దేనిమీద?"
"నువ్వంటే తనకి చాలా ఇష్టం ఏర్పడిందట. నిన్ను పెళ్ళి చేసుకొంటాడట. చాతనైతే నిన్ను పెళ్ళికి ఒప్పించమని చెప్పాడు నాతో!" ముఖం దించుకుని చెప్పాడు శర్మ. ఆమె కళ్ళలోకి చూసి చెప్పే ధైర్యం లేదు.
"మీరేమన్నారు?" ఊపిరి బిగబట్టినట్టుగా అడిగింది.
