Previous Page Next Page 
విశిష్ట పేజి 20

    వీళ్ళ సంగతేమీ తనకు పట్టనట్టుగా ఏదో మాగజైన్ తిప్పుతున్నాడు.

    "ఆయన ఇక్కడే వున్నారుగా? ఒక్కమాట అడిగి చూడండి మాస్టారు. అతడి రెస్పాన్స్ ఎలా వుంటుందో తెలుస్తుంది" అని శర్మని అక్కడే వదిలి తను క్లాసుకి వెళ్ళిపోయింది విశిష్ట.

    శర్మ లేచి పృధ్వీ దగ్గరికి వచ్చాడు.

    "నీకిదేం బుద్దిరా పృధ్వీ? కరుణ విషయంలో అయిందేదో అయింది. ఇప్పుడని ప్రయోజనం ఏమిటని వూరుకున్నాం. ఇప్పుడు మళ్ళీ విశిష్ట విషయంలో మొదలు పెట్టావట వెధవేషాలు. ఆ పిల్ల అందరాడపిల్లలాంటిది కాదు. నీ సంగతి పదిమందిలో వేసి నీ పరువు తీస్తుంది. స్టూడెంట్స్ చెవిలో వేసి వాళ్ళని కూడగట్టుకొన్నదంటే నీ పని లంకా దహనమే. స్టూడెంట్స్ కి పిచ్చెక్కితే కోతిమూకల కంటే దారుణంగా చెలరేగిపోతారు. అనవసరంగా ఆమె జోలికి వెడితే కొరివితో తల గోక్కున్నట్టేనని హెచ్చరిస్తున్నాను" సీరియస్ గా చెప్పాడు.

    అమాయకంగా ముఖం పెట్టాడు పృధ్వీ.

    "మీరనేదేమిటి సార్? విశిష్టని నేనేం చేశాను? ఆ అమ్మాయి నన్ను ప్రేమిస్తున్నానని, పెళ్ళి చేసుకొమ్మని వెంటపడింది. నేను కాదన్నానని ఇలా వ్యతిరేక ప్రచారం చేస్తోందన్నమాట. నా మాటగా ఆమెతో చెప్పండి. ఆమె నన్నల్లరి పెట్టాలనుకొంటే నేనూ అల్లరి పెట్టగలను. ఎవరో ఎందుకు? మీతోటే ఆమెకు సంబంధముందని మీ ఇంట్లో ఒక బాంబు విసిరానంటే అసలే అనుమానస్తురాలైన మీ భార్య మీ ప్రియ శిష్యురాలిని జుట్టు పట్టి నడిరోడ్డు మీదికి ఈడ్చి తన్నగలదు"

    "ఓరి దుర్మార్గుడా!" శర్మ దిమ్మెరపోయాడు.

    "నువ్వు ఏదో కూసినంత మాత్రాన అది అందరూ నమ్మేస్తారా?"

    "నిజానిజాలు తరువాత తేలుతాయి. ముందు దమారమైతే లేస్తుంది కదా? అది చాలదా. ఆమె జీవితం నాశనం కావడానికి.

    "నువ్వు కల్లుతాగిన కోతిలా పిచ్చి వేషాలు వేస్తుంటే ఇక్కడెవరూ చేతులు ముడుచుకు కూర్చోరు. ఒకరు చీపురు, ఒకరు చత్త, ఒకరు కర్రా పట్టుకువస్తారు. ఆడవాళ్ళంతా ఏకమై నిన్ను తంతారు. ఆడవాళ్ళు సంఘటితమైతే నువ్వెక్కడుంటావురా......? నిన్ను చెత్తతొట్టిలోకి విసిరేస్తారు జాగ్రత్త!"

    "మీకు ఆడవాళ్ళంటే చాలా గొప్ప గౌరవమున్నట్టుంది సార్.........! వాళ్ళని నెత్తిన పెట్టుకొని మాట్లాడుతున్నారు. కాని పాపం! మీ ఇంటి ఆడదానికే మీరంటే గౌరవం లేదు. ఒకరోజు మిమ్మల్ని పంకజం  మేడంతో అనుమానించి మీ భార్య మిమ్మల్ని వీధిలోకి గెంటి తలుపులు మూసుకున్న వైనం వింతగా మన కాలేజీలో చెప్పుకున్నారులెండి. నేనప్పుడు మీ స్టూడెంట్ ని, పదేళ్ళ క్రిందటి మాట.........!" ముసిముసి నవ్వుతో అన్నాడు పృధ్వీ.

    "అవును., నా భార్య అనుమానస్తురాలు, మూర్ఖురాలు, అయితే దానికీ దీనికీ సంబంధమేమిటంట.......?" చర్రుమన్నట్టుగా అడిగాడు శర్మ.

    "మా అమ్మగారి మూర్ఖత్వమే నా ఆయుధంగా చేసుకొని నేను తుఫాన్ సృష్టిస్తే?"

    "ఆహా అంతటి ఘటికుడివన్న మాట! నువ్వు సృష్టించే తుఫానుకు నేను భయపడతాననుకున్నావా?

    నీ ప్రవర్తన బాగాలేదని నేనీ రోజే మన ప్రిన్సిపాల్ గారికి రిపోర్ట్ చేస్తాను!"

    "బంగారంలాంటి జీవితాన్ని బహిరంగంగా అంతం చేసుకొన్న కరుణే నన్ను చట్టం ముందు దోషిగా నిలబెట్టలేకపోయింది. ఇహ మీరేం చేస్తారు నన్ను? నేనింతవరకు బలవంతంగా ఏ ఆడపిల్లనీ పాడుచెయ్యలేదు. నన్ను ఇష్టపడిన ఆడపిల్లలను కాదనలేని బలహీనత వుందంతే. ఈ బలహీనత ప్రతి మగాడికీ వుంటుందని నా నమ్మకం. వాళ్ళలో శారీరక సంబంధం ఏర్పడినంత మాత్రాన వాళ్ళని మెడకు కట్టుకోవాలని రూలెక్కడా లేదు.

    ఇహ మీ ప్రియ శిష్యురాలు విశిష్ట అంటే నాకు అభిమానమున్న మాట వాస్తవం. ఇంతవరకు నా పట్ల అనురక్తి చూపిన ఆడపిల్లలనే చూశాను. ద్వేషించే అమ్మాయిని ఇప్పుడు చూస్తున్నాను అందుకేనేమో ఆమె పట్ల నా కిష్టం ఏర్పడింది. నాకు తెలుసు! అలాంటి అరుదైన ఆడపిల్ల నా బార్య కాగలిగితే నా జీవితమే మారిపోతుంది. చెప్పండి మాస్టారు మీరామెను నాతె పెళ్ళికి ఒప్పిస్తారా?"

    హఠాత్తుగా ప్లేటు ఫిరాయించిన అతడికేసి అయోమయంగా చూశాడు శర్మ.

    "నీకు విద్య నేర్పిన గురువుతోటే పరిహాసాలా? ఈ పాపానికి నీ తల వెయ్యి వక్కపోతుంది జాగ్రత్త!"

    "ఇదేం పురాణయుగం కాదుగా మాస్టారు? శాపాలకే పాపాలనే తలలు వక్కలు కావడానికి? నిజానికి హాస్యం మీరాడుతున్నారుగాని నేను కాదు. నేను సీరియస్ గానే చెబుతున్నాను. విశిష్ట నాకు కావాలి! నా స్వంతం కావాలి! ఆమె సహచర్యంలో నా మాలిన్యమంతా కడిగివేసుకొని స్వచ్చంగా జీవించడం నేర్చుకొంటాను."

    "పందులకు పన్నీటి స్నానాలు పోస్తే పరిమళాలు వెదజల్లావురా! నీలాంటి లంపటుడితో విశిష్టకు పెళ్ళా? అది జరుగని పని! నీ ప్రపోజల్ ను నేను అంగీకరించలేకపోతున్నాను. ఇహ విశిష్టకేం చెబుతాను? విశిష్టే కాదు ఏ ఆడపిల్ల నిన్ను చేసుకొన్నా సుఖపడదు. నన్నడిగితే నువ్వు పెళ్ళి చేసుకోకుండా వుండిపోవడమే మంచిది. ఏ ఆడపిల్లనీ జీవితంలో భార్యగా అడుగుపెట్టినా సుఖపడదు. నీ మదన కామరాజు కథలు వినీ, చూసీ కన్నీరు మున్నీరుగా విలపించాల్సిందే, బ్రతుకును బలవంతంగా కడతేర్చుకోవాల్సిందే! అంతటి శిక్ష వేసుకొమ్మని, బ్రతుకును భారంగా మార్చుకొమ్మని చెప్పలేను!"

    "ఒక దుర్మార్గుడు మనిషిగా మారడానికి అవకాశం ఇచ్చి చూడడం మీ ధర్మ కాదా సార్?"

    "నాకు నమ్మకం లేదు నువ్వు మారతావని! ఒక అమాయకురాలి చావుకు కారణమైన నిన్ను చేసుకొమ్మని విశిష్టకి నేనెలా చెప్పగలననుకొన్నావు? నీలాంటి వాడిని కట్టుకొనేకంటే బండెడు రాళ్ళు కట్టుకొని బావిలో పడడం మంటిదంటాను!"

    పృధ్వీ తమాషాగా భుజాలు ఎగరేసి అన్నాడు! "నేను మనిషిగా మారే అవకాశం ఇచ్చి చూడమంటే మీరు కాదంటున్నారు. సరేలెండి కోరినది పొందలేనప్పుడు ఎలాగైనా పొందితీరాలన్న కసి చెలరేగడం సహజమే కదా? నేనింకా మృగంలా మారిపోతే అందుకు బాధ్యత వహించాల్సింది మీరూ, మీ ప్రియశిష్యురాలే, మీరు వద్దన్నకొద్దీ, కాదన్నకొద్దే ఆమె పట్ల కోరిక పెరిగిపోతుంది. ఆమెను పొంది తీరాలన్న కసి చెలరేగుతోంది. నేను తలచుకోవాలేగాని ఆమెను పొందడం నాకో లెక్క కాదు. నా తండ్రి హోం మినిస్టరు........! నేనేం చేసినా చూసీ చూడనట్టుగా పోయే పోలీసులు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS