కన్నీళ్ళ పర్యంతమైపోయింది విశిష్ట.
ఇలాంటి శాడిస్టుతో మాస్టారు ఎలా కాపురం చేస్తున్నాడో అర్ధం కాలేదు.
"మీకో యిద్దరు ఆడపిల్లలున్నారుకదా? వాళ్ళవి వాళ్ల తండ్రితో ఇలాగే ఊహిస్తారా మీరు?"
ఆవిడకి దిమ్మతిరిగిపోయినట్టుగా అయింది. ఆవిడలో అహం తోక తొక్కిన త్రాచులా లేచింది.
"నా ఇంటికి వచ్చి నన్నే అవమానిస్తావా? ఎంత ధైర్యమే నీకు? నా పిల్లలూ నువ్వూ ఒకటా? మాస్టారుతో ఏం చెప్పాలని వచ్చావో నాతో చెప్పి వెళ్లు. నేనాయనతో చెబుతానంటే మాస్టారుతోనే మాట్లాడాలి అన్నావే! దానికి అర్ధం ఏమిటి? ఆయన తండ్రిలాంటి వాడైతే నేను తల్లి లాంటిదాన్ని కాదా? నాతో చెప్పొచ్చుకదా? మాట్లాడడం చాతకానివాళ్ళ దగ్గర నీ తెలివి చూపించవమ్మాయ్! నా దగ్గరకాదు" ఆవిడ ఝాడిస్తున్నట్లుగా అంది.
"అమ్మా! తల్లీ! మాస్టారితో నాకున్నది గురుశిష్యుల సంబంధమే. మీరు ఊహించిందేమీలేదు. మీరు ఏదేదో ఊహించుకుని మాస్టార్ని హింసించకండి. ఆయన ఉత్తముడు. అలాంటి సచ్చరితులు నూటికో కోటికో ఒకరుంటారు. అలాంటివారిని భర్తగా పొంది మీరు అదృష్టవంతులయ్యారేమోగాని మాస్టారే........ పాపం......." అంటూ ఒక దండం పెట్టి చివ్వునలేచి బయటికి వచ్చింది విశిష్ట.
వాకిలి దాటకుండానే శర్మ ఎదురొచ్చారు కూరగాయల సంచీతో.
"ఏమ్మా? నాకోసం వచ్చావా?"
"అవునండీ! వచ్చి చాలా సేపైంది. రేపు కాలేజీలో మాట్లాడతాను" అంటూ గబగబా వెళ్ళిపోతున్న విశిష్టను ఆశ్చర్యంగా చూశాడు.
"ఆగు విశిష్టా! సంగతేమిటో చెప్పెళ్ళు"
"రేపు మాట్లాడతాలే మాస్టారూ!"
ఆ అమ్మాయి ఎందుకలా పరుగెత్తినట్టుగా వెళ్ళిపోయిందాని ఆయన ఆశ్చర్యపడుతూ "విశిష్ట అలా పరిగెత్తినట్టుగా వెళ్ళిపోయిందేం? ఆగమన్నా ఆగలేదు. నువ్వేమన్నా అన్నావా?" అనడిగాడు భార్యను.
ఒక అగ్నిపర్వతం బ్రద్దలైనట్టుగా అయింది నవరత్నం.
ఎగజిమ్మిన లావాలో ఆయన ముఖం నల్లగా మాడిపోయింది.
మరునాడు కాలేజీలో ముందుగా ఆయనే పలకరించాడు విశిష్టను. "నిన్న మా ఆవిడ ఏదో అన్నట్టుంది. అది బొత్తిగా పాతకాలం మనిషి. ఏమీ అనుకోవద్దమ్మా!"
"పాతకాలపు మనుషులైతే ఇలా మాట్లాడతారా మాస్టారూ?" విశిష్ట స్వరంలో ఆశ్చర్యం, ఆవేదన!
"అది పెద్దగా చదువుకోలేదు. పల్లెటూళ్ళో పుట్టి పెరిగింది. దాంపత్య జీవితంలో అడుగు పెడుతూ పెడుతూనే దానికి ఒక విషయం తెలిసింది. నేనే చెప్పాను. అది సహృదయంతో అర్ధం చేసుకుంటుందేమో అనుకున్నాను.
కాని పెడర్ధం తీసుకుంది. ప్రతిదీ అనుమానంగా చూడ్డం మొదలు పెట్టింది. నేననుకుంటుంటాను ఆమె మనిషికాదు అగ్నిపర్వతం ఆ రూపంలో వుంటుందేమోనని, ఎప్పుడు పగిలి లావా విరజిమ్ముతుందో తెలియదు. అగ్నిపర్వతం సమీపంలో కాపురం వున్నట్టుగా ఎప్పుడూ భయం భయంగా వుండేది పెళ్ళయిన మొదట్లో.
ఇప్పుడు అలవాటైంది. అది ఏం ప్రళయం సృష్టించినా తేలిగ్గా తీసుకోవడం నేర్చుకున్నాను."
"ఆమెకు మీరు చెప్పిన విషయం ఏమిటి?" కుతూహలంతో అడిగింది విశిష్ట.
"పెళ్ళికి ముందు నేనొక అమ్మాయిని ప్రేమించాలే! ఆ సంగతి చెప్పాను."
"పెళ్ళెందుకు చేసుకోలేదు?"
"మా కులాలు వేర్వేరు కావడంవల్ల! మా పెద్దవాళ్ళు ఒప్పుకోక పోవడంవల్ల! అది సరేగాని నిన్న మా యింటికి ఎందుకు వచ్చావమ్మా?"
"నేనొక సమస్యలో చిక్కుకున్నాను మాస్టారు. మీరేమైనా సలహా యిస్తారేమోనని"
"నీకు సమస్యా? ఏమిటమ్మా!"
"లాస్టవర్ మీరు ఖాళీగా వుంటారుకదా? లైబ్రరీలో వుంటారా? అక్కడికి వస్తాను"
"అలాగే!"
పృధ్వీ వాళ్ళకి కొంచెం దూరంలో వుండి యిటే దీర్ఘంగా చూస్తున్నాడు.
సాయంత్రం లైబ్రరీలో కలుసుకున్నారు శర్మ, విశిష్ట.
కరుణ విషయంలో తను కల్పించుకోవడం వల్ల పృధ్వీ తన వెంటపడిన సంగతి చెప్పింది.
అంతా విని అన్నాడు శర్మ "వాడివి సొల్లుకూతలు! కొంరికి లేకితనం నాలుకమీద వుండి ఏదేదో కూస్తారు. అన్నంతమాత్రాన వాడు నిన్నేం చేస్తాడు?"
"ఇదంతా తేలిగ్గా తీసుకునే విషయం కాదు మాస్టారు! వాడు అన్నంత పని చేసే మనిషే అనిపిస్తోంది. ఈ విషయం ఎవరికీ చెప్పకుండా చెయ్యకుండా నేనొక్కదాన్ని ఎదుర్కోలేనేమోనని భయం వేసింది. అందుకే........ పెద్దవారు.....మీతో చెబితే ఏమైనా సలహా ఇస్తారేమోనని."
"వాడికి ఒంటరిగా చిక్కకుండా నీ జాగ్రత్తలో నువ్వుండమని సలహా యిస్తాను. అంతకిమించి చెయ్యడానికి ఏముంది?" ఆయన నిస్సహాయంగా చూశాడు.
"మీకతడు శిష్యుడేకదా? ఒకసారి మందలించలేరా?"
"వాడు గురుశిష్యుల సంబంధాన్ని గౌరవించే మనిషైతే చెప్పొచ్చు. ఏం చెప్పినా, ఏం తిట్టినా దున్నపోతు మీద వర్షం పడ్డట్టే"
"మీరేమీ నాకు సహాయపడలేరా?" హతాశురాలైనట్టుగా అడిగింది.
"ఇది నా ఒక్కడి వల్ల అయ్యే పని కాదు. పదిమంది కలవాలి ఇది. చాలా సున్నితమైన విషయం. పదిమందిలో పడితే పహాస్యంగా మారుతుందేమోనని భయం మళ్ళీ. ఎవరు ఏ విధంగా స్పందిస్తారో తెలియదు."
వీళ్ళకి కొంచెం దూరంలో పృధ్వీ వచ్చి కూర్చొన్నాడు.
