Previous Page Next Page 
బేబి!ఓ బేబి!! పేజి 2

    "మీ అంతవారు నాకు ఫోన్ చెయ్యటం ఆశ్చర్యంగా వుంది. ఇంతకీ ఏం పనిమీద చేసారో తెలపండి"

    "ఏదయినా నవల రాస్తున్నారా...? డిస్టర్బ్ చేస్తే వెరీ సారీ"

    "....నో సార్! అలాంటిదేమీ లేదు. కొంపదీసి మీరుకూడా ఏదయినా పత్రిక పెడుతున్నారా? నవలగాని రాసిపెట్టాలా."

    "పత్రిక పెట్టి నవలలు చదివేంత ఓపిక....సెలక్షన్ చేసేంత తెలివీ నాకు లేవుగాని, రేపు మీరొకసారి నన్ను పర్సనల్ గా కలవగలరా?"

    భార్గవకి ఆశ్చర్యమేసింది. హైద్రాబాద్ ని ఐదు నిమిషాల్లో కొనెయ్యగల అతిపెద్ద శ్రీమంతుల్లో శరత్ ఒకడు. అలాంటివాడికి తనతో పర్సనల్ గా పనేమిటి? అయినా ఆ మేగ్నేట్ కు తను కొద్దిపాటి పరిచయస్థుడే. సుగాత్రి ఇండస్ట్రీస్ కు తనంత తానుగా వెళ్ళి అతన్ని పలకరించేవాడు గాని....ఆయనే ప్రత్యేకంగా ఇలా ఫోన్ చేయటం ఇదే ప్రధమం. అందుకే భార్గవకి ఆశ్చర్యంగా వుంది.

    "శరత్ గారూ! పర్సనల్ గా కలిసేంతటి పనా? ఫోన్ లో చెప్పకూడదా?"

    "నో మిష్టర్ భార్గవా! ఎంతమాత్రం చెప్పరానిదే! మీరు రేపు నాకు ఎప్పుడు టైమిస్తున్నారు చెప్పండి ...ఎంతమాత్రం మిస్ కావద్దు"

    భార్గవ ఆలోచిస్తున్నాడు.

    "శరత్ గారూ! మీరేమీ అనుకోకపోతే..."

    "పర్లేదు...చెప్పండి"

    "నేను రేపు వుండటంలేదు. ఎర్లీ మార్నింగ్ విజయవాడ వెళుతున్నాను. ఇంకో మూడువారాల్లో ముగియనున్న ఒక సీరియల్ బుక్ ప్రింట్ చేయటానికి పబ్లిషర్స్ నుంచి నిన్ననే ఓ టెలిగ్రాం వచ్చింది. వెళ్ళక తప్పటంలేదు ....సారీ....రేపు గాక మరెప్పుడయినా అపాయింట్ మెంటివ్వండి. తప్పక కలుస్తాను"

    "భార్గవగారూ! మీరు చాలా ఈజీగా తీసుకుంటున్నట్టున్నారు! కాని నా సమస్యకు మీరే పరిష్కారమవుతారని..."

    ఫోను తీగల్లోంచి రింగులు తిరిగి వచ్చిన బాధా ప్రకంపనాలేవో భార్గవ చెవిని తాకాయి.

    "నిజం శరత్ గారూ! రేపు విజయవాడ వెళ్ళక తప్పటంలేదు. రాగానే మీకు ఫోన్ చేసి చెపుతాను సరేనా...? ఇంతకీ మీ సమస్యకేదో రచయితగా సలహానివ్వగలనేమో గాని...మీకు సాయం చేసేంతటి గొప్పవాన్నేం కాదు....కాదంటారా?"

    "లేదు...మీరు నా కోర్కెను ఒప్పుకుంటేనే నా ఇండస్ట్రీలు, ఆస్థిపాస్తులు నిలిచే అవకాశం వుంది....అందుకే బాగా ఆలోచించి....మిమ్మల్ని ఎన్నుకున్నాను" చివరి వాక్యం ఒత్తుగా పలికాడు అవతలి వ్యక్తి.

    "కోట్లకు అధిపతి అయుండి మీరు నన్ను ఏదో కోరటం విచిత్రంగా వుంది. టూకీగానయినా మీ కోర్కె చెప్పండి. తీర్చగలవాన్నయితే తప్పకుండా..."

    "ఒక రచయితగా నువ్వు సహృదయంతో అర్ధం చేసుకుంటావని, నిన్ను కోరేది. నా విచిత్రమైన కోరికను ఇంతవరకూ ఎవరూ కోరలేడేమో.

    ఐ మీన్ ఈ సృష్టిలో ఏ భక్తుడూ భగవంతున్ని కోరని కోరిక....

    ఏ మగాడూ మరే మగాన్ని కోరని కోరిక..."

    ఆ మాటల్లో గుండెల్లో కుదించబడిన వేదనల మధనంలోంచి పుట్టిన వేదాంతంతో కూడా గాఢమైన నిట్టూర్పు.

    కొద్దిక్షణాలు ఫోన్ తీగలమధ్య నిశ్శబ్దం ప్రసరించింది.

    భార్గవ ఆశ్చర్యంనుంచి తేరుకోకమునుపే 'వుంటాను మరి' అంటూ లైను కట్టయ్యింది. భార్గవ మనస్సు నవల ముగింపు మీదకు వెళ్ళలేదు. కో అంటే కోటిమంది పరుగెత్తుకొచ్చే అతనికి...కోర్కె తీర్చుకోవటానికి తపనే ఎందుకెన్నుకున్నాడు?

    ఇంతకీ ఏమిటా కోరిక?

    ఇంతవరకూ ఏ మగాడూ మరే మగాన్ని కోరని కోరిక!

    ఏమిటది? ఏమై వుంటుంది?

    గదిలో 'ధబ్' మన్న శబ్దంతో ఉలిక్కిపడి తలత్రిప్పి చూసాడు భార్గవ. బాబిగాడు మంచం పైనుంచి పడ్డాడు. వెంటనే లేచి ఎత్తుకొని మళ్ళీ పడుకోబెట్టి దుప్పటి కప్పాడు.

    "కోటి కాంతి పుంజాల్ని వెదజల్లే నా బంగారు కొండా...నా భవితకూ, నా కవితకూ అండగా నిల్చే అందాల కొండా! నువ్వేరా నా జీవితం!" అనుకుంటూ నుదుటిమీద ముద్దెట్టుకున్నాడు. టేబుల్ మీది ఫ్రేములోంచి ఆమె సంతృప్తిగా ముసిముసిగా...నవ్వుతున్నట్టుగా వుంది. ఆ నవ్వే....

    అయిదేళ్ళ క్రితం బాబీగాడ్ని ప్రసాదించి, ప్రవాహమై సముద్రం లాంటి శూన్యంలో ఆమె కల్పిపోయిన ఆ నవ్వుల జ్ఞాపకాలే భార్గవను కలతపెడతాయి. ఆ కలతల్లోంచే కథలు రాస్తాడు. అన్నీ భార్యకు అంకితం చేస్తాడు. బాబీగాడు వున్నా భార్య లేకపోయేసరికి అతనెప్పుడూ ఒంటరిలా ఫీలవుతుంటాడు.

    కాని___

    "ఒంటరిగా ప్రయాణించే వాడే వేగంగా ప్రయాణం చెయ్యగలడు" కిప్లింగ్ కొటేషన్ తో తనను తాను సమాధాన పరుచుకుంటాడు. శరత్ అడిగే కోర్కె ఏమిటో అర్ధంగాక, ఎంతమాత్రం అంచనా వేయలేక, నవల ముగింపు మీద మనసు పడక నిర్లిప్తంగా అలాగే కూచుండిపోయాడు చాలాసేపు.

    బయట చీకట్లు దట్టంగా అల్లుకుంటున్నాయి. ఆ సమయమే అలాంటిది. వెలుతుర్ని చీకటి....భార్యని భర్త.....తల్లిని పాప....ప్రేమతో అల్లుకునే సమయం. అయిదేళ్ళుగా అలాంటి పద్దెనిమిది వందల రాత్రుల్ని ఎలాంటి ప్రేమానురాగాల్ని పొందక గడిపాడు తను.

    భార్గవ దృష్టి ఫోటో ఫ్రేమ్ పైకి మళ్ళింది.

    బయటి ప్రపంచపు శోకాల్ని చూడలేనట్లు ఆమె నవ్వు ఫ్రేములోనే బంధింఛబడింది అప్పటివరకూ ఆరిపోయినట్టున్న నీటిపొర మళ్ళీ అతడి కళ్ళను తడి చేసింది.   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS