వో రోజు పొద్దున్నే స్నానం చేసి, నోటికొచ్చిన సినిమా పాట పాడుకుంటూ బట్టలు మార్చుకుంటూన్నాను. పక్కవాటా లోంచి వో కోమల కంఠం నా పాటకి చరణం అందుకుని పూర్తీ చేసింది. నేనో క్షణం కొయ్యబారి పోయాను. ఇంటిగల వాళ్ళకు ఆడపిల్లలు లేరు నాకు తెలిసినంత వరకు. ఇక పాట నందుకున్న యీ కోమల కంఠ కోమలి ఎవరు!!
అవతలి కోమలి పాట చప్పునాపెసింది. నేను యధాలాపంగా మళ్ళీ పాడబోయి, పెద్దమనిషి తరహాగా ఉండదని వూర్కున్నాను. ఇంతలో వో ఆరేళ్ళ పిల్ల లోపలకు పరుగున వచ్చి, చుట్టూ చూసి, తెల్లబోయి వెనక్కు తిరిగి వెళ్ళిపోయింది.
"పాపా! పాపా" అన్నాను నేను.
పాప ఆగింది.
"మాట , మాటిలిరా" అన్నాను నెమ్మదిగా వచ్చింది. "నీ పేరేమిటి' అనడుగుతూ బుగ్గ మీద చిటిక వేశాను. ఆ పిల్ల మిలమిల్లాడే కళ్ళను చక్రాల్లా పెద్దవి చేసి, తిప్పుతూ "నా పేరా.... మరి లత..... హేమలతన్నమాట" అంది. నిజంగా ఆ పాప హేమలతే! బంగారు ఛాయ, చక్కని కళ్ళు. భగవంతుడు అందమంతా ఆడవాళ్ళ కే యిస్తున్నాడు. ఈ పక్షపాతం సృష్టిలోనే ఉంది.
పాప పారిపోయింది.
నేను అడ్డం ముందు నిలబడి తల దువ్వుకో నారంభించాను. కోమలి కంఠం మళ్ళీ మరింత మనోహరంగా వినిపించింది. నేనలాగే ద్రవీభావించేలోగా ఆగిపోయింది. తల దువ్వుడు పూర్తీ చేసి , భోజనానికి కూర్చున్నాను. ముగించే లోగా రెండు మూడు సార్లు నాలుగేసి అక్షరాల వరకూ పాట రూపంలో వినిపించాయి. చై కడుక్కోడానికి పెరట్లోకి వెళ్ళేసరికి మళ్ళీ వినిపించింది. వెంటనే బాల్చీ తిరగేసి, దాని మీద నిలబడి, అవతల ఇంట్లోకి చూశాను. గోడవతల వారి పెరట్లో మల్లె పందిరి క్రింద వో అందమైనమ్మాయి గ్లాసులు కడుగుతూ పాడుతోంది.
ఇంతలో కాళ్ళ క్రింద బాల్చీ టకటక లాడింది. అయినా తెగించి అలానే నిలబడ్డాను. ఆమె లోపలకు వెళ్ళిపోయింది. నే నుస్సురుమంటూ బాల్చీ దిగాను. ఇంటి గలవాళ్ళింటికి వచ్చిన ఆ పిల్ల వాళ్ళకి చుట్టమా, పక్కమా అనే విషయం ఆలోచించుకుంటూ ఆఫీసు కి వెళ్ళి, సాయంకాలానికి ఆఫీసు నుంచి అదే విషయం మళ్ళీ ఆలోచిస్తూ యింటికి చేరాను. బూట్లు విప్పుకుంటూ ఉండగా లత వో పళ్ళెం పట్టుకు వచ్చి "మా అత్తయ్యిమ్మంది" అంది.
"మీ అత్తయ్యేవరు?" అన్నాను.
"మా అత్తయ్య.... మరేం...." అంటూ పక్కింటి కేసి తిప్పి కళ్ళతో చూపించింది. "జానకమ్మ గారా" అన్నాను. 'అవును. మా అత్తయ్యే" అంది. నేను ఆ పళ్ళెం అందుకోగానే లత పరుగున వెళ్ళి పోయింది. పళ్ళెం మీద మూత తీసి చూశాను. పులిహోర, బొబ్బట్లు, లడ్లు, ....వొహ్.. మంచి బేరం తగిలిందే అనుకుంటూ పళ్ళెం ఖాళీ చేసి వో చెంబుడు మంచి నీళ్ళు తాగాను. బట్టలు మార్చుకుని, ముఖం కడుక్కుని, తలుపు వేసి జానకమ్మ గారింటికి వెళ్ళాను. వీధిలోనే ఆవిడ ఎదురయ్యింది. "రా నాయనా' అందావిడ. ఆవూరు మొత్తం మీద నన్ను అండీ అని పిలవని జంట జానకమ్మ గారూ, వాళ్లాయనా... అంతే.
"ఎవిటివాళ్ళ విశేషం? దండిగా తగిలింది నాకు బేరం?" అన్నాను కుర్చీలో కూర్చుంటూ. తన చేతి కసలు బొత్తిగా ఎముకే ఉండదని , పొట్టకి తిన్నది గాక పరులకు పెట్టినదే పుణ్యమని ఆవిడ ఉపన్యసించి, అనక "మా మేనకోడలు పుట్టినరోజివాళ " అంది.
"ఎవరూ లతా" అన్నాను.
"అవున్నాయనా" అందావిడ. పెరట్లో పాటపాడి నమ్మాయి పుట్టినరోజు కానందుకు కించపడ్డాను. ఇంతలో లత "అత్తయ్యా' అంటూ పరుగున వచ్చి నన్ను చూసి, ముచ్చటగా సిగ్గుపడింది.
"ఏయ్! లతా యిలారా" అన్నాను చనువుగా వచ్చింది. రెండు చేతులూ కలిపి వో చేతితో పట్టుకుని , "మరి నీ పుట్టినరోజని చెప్పకుండా యిస్తే ఎలా" అన్నాను.
లత కిలకిల నవ్వింది. "నా పుట్టినరోజు పొద్దున్నే అయిపొయింది. తలంటు కూడా అంటుకున్నాగా" అంది.
"వెరీగుడ్" అన్నాను. జానకమ్మగారు లోపలకు వెళ్ళి వో గ్లాసుడు కాఫీ తెచ్చి యిచ్చింది. "ఎందుకండీ " అంటూనే ఆలస్యం చేయకుండా లేచి అందుకుని "పాపం మీకు చాలా శ్రమ యిచ్చాను" అన్నాను. ఆవిడ హుందాగా నవ్వింది. ఇంతా తిని ఏమీ మాట్లాడకుండా ఉంటె బాగుండదని "చుట్టాలోచ్చారనుకుంటాను" అన్నాను. "మరేనయ్యా! మా మేనగోడళ్ళు" అందావిడ. ఇంతలో లత మళ్ళీ వచ్చింది. వస్తూనే "బొబ్బట్లు చాలా బావున్నాయా' అనడిగింది చనువుగా నా కుర్చీకి దగ్గరగా వచ్చి నిలబడుతూ, "హబ్బో.... బ్రహ్మాండము.... చాలా బాగున్నాయి. అన్నీ తినేశా ననుకో..... పళ్ళెం కూడా తినేద్దామనుకున్నాను' అన్నాను. "ఎబ్బే! పళ్ళెం తింటారేమిటి" అంది. "తినరు" అన్నాను. లత మళ్ళీ వెళ్ళిపోయింది. జనకమ్మగారు కూడా దిగ్గున లేచి వెళ్ళిపోయింది. నా కళ్ళు ఆ కోమలిని వెతక నారంభించాయి. ఇంతలో చక్కని ఆకుపచ్చ చీర, పట్టు రవిక తొడుక్కున ఆమె పక్క గదిలోంచి పెరట్లో కి వెళ్ళిపోయింది. నా ఒళ్ళు ఝల్లుమంది. ఆమె వాటం చూస్తె ఎక్కడికో వెళ్ళేలా ఉంది. బయట నిలబడితే, చక్కగా చూడచ్చనిపించి, కుర్చీలోంచి లేచి, "అయితే నే నోస్తానండి" అన్నాను. "మంచిది నాయనా" అంటూ ఆవిడ బయటకు వచ్చి, "ఒక్కడివీ వండుకు తింటున్నావ్. ఏవైనా అవసరముంటే అడుగు" అంది. "అలాగేనండి" అంటూ బయట పడి, యింటికి వచ్చి వీధరుగుకు అనుకుని నిలబడ్డాను.
వారు వచ్చారు. చక్కని చామన చాయ-- నల్లత్రాచువంటి జడ. మూర్తిభవించిన స్త్రీమూర్తిలా ఆమె లతతో నా ముందు నుంచి వెళ్ళిపోయింది. నేను అరుగు మీద కూలబడ్డాను. నాలో ఏదో అనుభూతి కలిగింది. ఆమెను మరొకసారి చూడాలనిపించింది. ఇంతలో వాళ్ళిద్దరూ మళ్ళీ వెనక్కు తిరిగారు. నేను లేచి నిలబడ్డాను. సరిగ్గా యింటి ముందు వరకూ వచ్చారు. ఆమె "లతా! నేనిక్కడుంటా -- నువ్వెళ్ళి రుమాలు పట్రా" అంటూ ఆగిపోయింది. లత తల వూపి లోపలకు పరిగెత్తింది. 'ఆమె' వంటరిగా రోడ్డు మీద నిలబడి వుంది. ఆమె కేసి చూస్తున్న నా కళ్ళు-- నాకేసి చూసిన ఆమె కళ్ళను కలుసుకున్నాయి. నా గుండె జల్లుమంది. వో క్షణం లో సగం సేపు నాకేసి చూసి, ఆమె తల వాల్చేసుకుంది. ఇంతలో లత రుమాలు తీసుకు వచ్చింది. ఇద్దరూ వెళ్ళిపోయారు. వెళుతూ వెళుతూ ఆమె నాకేసి మరోసారి చూసి వెళ్ళిపోయింది. నేను నిట్టురుస్తూ లోపలకు వచ్చి కుర్చీలో కూలబడ్డాను.
మంచం మ్మీంచి లేచాను. చలిగాలి విపరీతం అయింది. మరో సిగరెట్టు ముట్టించాను. పాడు నిద్రకోసం కమనీయమైన, సుమధురమైన స్మృతులను పాడుచేసుకోడం నా కిష్టం లేదు. సిగరెట్టు పొగ గాలిలో సుడులు తిరుగుతూ పోయింది. మరో దమ్ము లాగి సిగరెట్టు కేసి చూశాను. పెట్టిలోంచి తీసినపుడు హుందాగా, పొడుగ్గా గర్వంగా వున్న సిగరెట్టు సగానికి కాలి, తన అహంకారానికి తనే పశ్చాత్తాపపడుతున్నట్టుగా కనుపించింది. మరో దమ్ము లాగి, సిగరెట్టు పారేశాను. మళ్ళీ మంచం చేరాను.
