Next Page 
సాఫల్యం -1 పేజి 1


                             సాఫల్యం -1
                                                                                                   భూపతి

                 
    దూరంగా ఎక్కడో బాజాలు వినిపించాయి. పక్కనుంచి లేచి , తలుపు తీసుకుని బాల్కని లోకి వచ్చి నిలబడ్డాను. బాజాలు మరింత ఎక్కువగా వినిపించాయి. బహుశా పెళ్లి బాజాలయి వుండచ్చు.
    అవును. అంతే అనుకుంటూ పడక కుర్చీలో మెను వాల్చాను. గతం లోకి చొచ్చుకుపోతున్న మనస్సు ను అదుపులో పెట్టుకుందామని చేసే ప్రయత్నం విఫలమయ్యింది. కుర్చీలోంచి లేచి పిట్టగోడ దగ్గర నిలబడ్డాను. గతం ఆలోచించకూడదు అనుకున్నాను.
    గతం ఆలోచిస్తే గాని, భవిష్యత్తు ను నిర్ణయించు కోలేమని ఓ పెద్ద మనిషి అన్నాడు. గతం నాస్తి అని మరో నాస్తికున్నాడు. ఏమిటో ఈ అనడాలకు అంతూ పొంతూ ఉండదు.
    పెళ్లి బాజాలు మరికొంచెం ఎక్కువయ్యాయి .
    "పెళ్లి!!
    అది నీకు తీరని ముచ్చట అంది నా మనస్సు.
    దిక్కుమాలిన మనస్సు . రోజుకోసారయినా నన్ను చెప్పందే వూర్కోదు. ఇంకా పెళ్ళేవిటి! దిక్కుమాలిన యోచన గాకపోతే -- నలబై ఏళ్ళలోగా గనుక 'ప్రేమ' లో పడకపోతే ఆ తరువాత ఆ పదం జోలికే వెళ్ళద్దని ఎవరో అన్నారని బెర్నార్డ్ షా రాసినట్టు ఒకాయన ఓ ఉపన్యాసం లో అన్నాడు. ఏమిటో! మనిషి దశల్లో పిన్న దశ కూడా ఒకటని బహు కుటుంబీకు డోకాయాన అభిప్రాయ పడ్డాడు.
    ప్రేమించడమే మానవత్వం అన్నాడు మరో జ్ఞాని.
    కొత్త బట్ట కట్టని వాడు, కంట తడి పెట్టని వాడు, ప్రేమ అనే పదం జోలికి పోనివాడూ ఉండనే ఉండడట.
    అవును.
    నామటుకు అది నిజం అనిపించింది.
    ప్రేమలో గనుక పడకుండా ఉంటె ఏమయ్యేదో గాని, అందులో పడ్డ నేరానికి పెళ్లి చేసుకోకుండా ఉండిపోవలసి వచ్చింది. దాని వల్ల లాభమో, నష్టమో తేల్చుకునే స్థితికి ఇంకా రాకపోయినా , పెళ్లి కాకుండా వచ్చిన బాధ్యతలు మాత్రం నన్ను మనిషిగా నిలిపాయి.
    ఆ రోజులు తలుచుకుంటేనే నీరసం వచ్చి, రోజంతా మగతగా ఉంటుంది. కానీ మనస్సు మనం చెప్పినట్టు వినదు.
    ---ఆరోజు నేను పెద్ద చదువులకు వైజాగ్ వెళ్ళే రోజు, బీకామ్ ఆనర్స్ లో నాన్నగారు నాకు సీటు సంపాదించారు. తెల్లవారి వెళ్తాననగా రాత్రి భోజనాల దగ్గర నాన్నగారు "నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. న రూముకు రా" అన్నారు. నా గుండె దడదడ లాడింది. నాన్నగారు పెద్ద ఆఫీసరు చిన్న గుమాస్తాతో మాట్లాడినట్లు మాట్లాడుతారు. 'సరేనండి" అన్నాను. అనక గదికి వెళ్లాను.
    "కూర్చో" అన్నారు.
    కూర్చున్నాను.
    "నీకు ఇంటర్ లో మార్కులు చాలా తక్కువ రావడం వల్ల మరే యూనివర్శిటీ లోనూ సీటు దొరకలేదు. అవధాన్లు గారి ధర్మమాని అక్కడ దొరికింది. తప్పనిసరిగా వప్పుకున్నాను. కారణం నీకు తెలుసు. రేపు నువ్వు వెళ్తున్నావు. మనకి ఆ వూళ్ళో ఆప్తులు గాని, బంధువులు గాని, చుట్టాలు గాని, స్నేహితులు గాని ఎవ్వరూ లేరు. ఉన్నదల్లా ఒక్క అవధాన్లు గారే! ఆ సంగతి గుర్తుంచుకో. పోయినసారి, మొన్న వేసంగు లకు కూడా నువ్వు అతని ఇంటికి వెళ్లావు. నాకు చాలా కోపం వచ్చిన మాట నిజమే అయినా, మొదటి తప్పుగా వదిలేశాను. ఇప్పుడు నువ్వు ఆ వూరు వెళ్తున్నావు. మన గౌరవాలకు, అత్మాభిమానాలకు హాని కలిగేలా ప్రవర్తించక. మనిషికి కావలసింది గౌరవం, మర్యాదా----- నా ఉద్దేశం లో " అన్నారు.
    'అలాగేనండి" అని తల ఊపాను.
    "అంతే --------అందుకే పిలిచాను" అని పక్కనున్న పేపరు చేత్తో తీసుకున్నారు. నేను ఓ క్షణం అలాగే నిలబడి, బయటికి వచ్చేశాను. రాత్రి పడుకోబోయేముందు అమ్మ కంట తడి పెట్టుకుని "చెప్పినట్టు నడుచుకో నాయనా, మళ్ళీ ఆయనకు కోపం వస్తే ఎవరి తరం కాదు. ఏమిటో ఈ కక్షలు. నాకు వక్కగానోక్క అన్న -- వాడి వద్ద నుంచి నేనెన్నడూ ఒక్క కానీ ఆశించలేదు. కానీ, ఇవన్నీ అనుకునేం ప్రయోజనం . మేనమామ అక్కడున్నాడంటే ఆనందించడానికి పోయి భయపడవలసి వచ్చింది." అంది.
    "అసలేమిటమ్మా ఈ కక్షలు" అన్నాను నేను.
    "ఏమో, ఏదో ఉద్యోగం లో తగాదాలు వచ్చాయట. అంతే నాన్నగారు ఆ పూటే వుద్యోగం మానేసి వచ్చేశారు. ఈ పదేళ్ళ నుంచీ మళ్ళీ వాళ్లకి మనకి రాకపోకలు లేవు. ఈ మధ్యన ఆ ఊరెళ్ళి నువ్వు వాళ్ళింటికి వెళ్ళావని తెలిసి, నాన్నగారు ఎంత కోప్పడ్డారో తెలుసా" అంది. నేను తల వంచుకుని విన్నాను. "ఈసారి జాగ్రత్తగా ఉండాలి. ఆ వూళ్ళో ఉండాలి కూడా నువ్వు" అంది అమ్మ భయంగా . నేను మౌనంగా వింటున్నాను.
    అమ్మ నిట్టూర్చింది.
    "నాకు వక్కగా నొక్క కోరిక ఉంది. రమ పుట్టినప్పుడు నీ పెళ్ళాం అనుకున్నాం. అది నా కోడలవ్వాలని ఉంది. ఆ కోర్కె తీరే గీత ఉందొ లేదో-- ప్చ్-- అసలు దాన్ని చూసే పదేళ్ళయింది" అంది అమ్మ కన్నీరు తుడుచుకుంటూ.

                           *    *    *    *
    విశాఖ పట్టణం జేరాను. అవధాన్లు గారు కుదిర్చిన రూములో చేరాను. ఆ పూట అయన బలవంతం మీద వాళ్ళింట్లో భోజనం చేశాను. భోజనం చేశాక, తిన్నగా రూముకు వచ్చి, బట్టలు మార్చుకుని మామయ్య ఇంటికి బయల్దేరాను. రమని చూడాలన్న ఉత్కంట , చూడబోతున్నానన్న ఆనందం నాలో ఎక్కువయ్యింది. గుండె దడదడ లాడింది.
    వాళ్ళింటి గుమ్మం దగ్గర నిలబడ్డాను. తలుపు వొర వాకిలిగా తీసి ఉంది. తలుపు తోయ్యబోయే సరికి అవతల నుంచి ఎవరో తీశారు.
    "ఎవరు" అంటూ రమ వచ్చింది.
    నా గుండె ఝల్లు మంది.
    ఆమె నన్ను చూసి సిగ్గు పడింది. ఆమె కళ్ళు మెరిశాయి. పెదిమలు వణికాయి. చెవుల జూకాలు వూగాయి.
    జూకాలంటే నాకు భలే ఇష్టం.
    రమ లోపలకు పరుగున వెళ్లి అత్తయ్య ను పిలుచుకు వచ్చింది. అత్తయ్య వస్తూనే నన్ను చూసి, "రావొయ్! ఏమిటి అలాగ బయటే నిలబద్దావ్" అంది. నేను లోపలకు వెళ్లి కుర్చీలో కూర్చున్నాను. అత్తయ్య కుశల ప్రశ్న లన్నీ వేసి "పనిమీ దోచ్చావా? ఏమిటి విశేషాలు?" అంది. అదీ చెప్పాను.
    "బాగుంది మా వూళ్ళో వో నాలుగేళ్ళు ఉంటావన్న మాట" అంది. నేను నవ్వి వూరుకున్నాను. "ఒక్క నిమిషం అగు. కాఫీ చేసిస్తాను." అని లోపలకు వెళ్ళింది. నేను తలయెత్తి రమ కేసి చూశాను. నాకేసి చూస్తున్న ఆమె కళ్ళు సిగ్గు పడ్డాయి. తలవంచుకుని గోడకి అనుకుని నిలబడింది.
    "బాగా చదువుతున్నావా?" అన్నాను. నా గొంతు అనుకున్నంత ఉదృతంగా రాలేదు. రమ ఫక్కున నవ్వింది. "ఇప్పుడేగా ఇంకా స్కూళ్ళు తెరిచింది. అప్పుడే ఏమిటి" అంది. నేను నాలిక్కరుచుకున్నాను. ఛీ అనుకున్నాను. కాస్త తెలివిగా మసులుకుందాం , తెలివి తేటలు చూపిద్దాం అనుకున్నపుడే సుద్ద తెలివి తక్కువ తనం బయట పడుతుంది. అత్తయ్య కాఫీ చేసి పట్టుకొచ్చింది. అడ తాగి , గ్లాసు నేల మీద పెట్టేసరి కల్లా మామయ్య వచ్చాడు. నన్ను చూసి, లాంచనంగా ప్రశ్నలు వేసి, లోపలకు వెళ్ళిపోయాడు. అతని రాయసం చూసి నాకు ఒళ్ళు మండింది. కాస్సేపలాగే కూర్చుని లేచి, "అయితే నేను వెళ్లొస్తాను." అన్నాను.
    "మంచిది" అన్నాడతను. అత్తయ్య తల వూపింది. నాకేసి చూస్తున్న రమ కేసి చూసి, రూముకు వచ్చేశాను. ఇక నుంచి వాళ్ళింటికి వెళ్ళకూడదు అని ఘోరంగా నిర్ణయించు కోబోయి అస్తమాను వెళ్ళకూడదు అనుకున్నాను.
    ఆరాత్రి చాలాసేపటి వరకు నిద్ర పట్టలేదు.
    రమను నేను ప్రేమించాను.
    ఆరాధించాను.
    "నా జీవితం ఆమెతో తప్ప మరెవరితో నూ పంచుకోలేను' అని నిర్ణయించు కున్నాను----
    -ఆలోచనలో నిద్ర ఎప్పుడు పట్టిందో తెలియదు గాని, సుశీల లేపెసరికి ఉలిక్కిపడ్డాను. "రాత్రంతా కుర్చీలోనే పడుకున్నారా" అంది సుశీల.
    "లేదు. తెల్లవారు ఝామున పడుకున్నా నంతే" అన్నాను. అవసరమైనచోట్ల అబద్దం ఆడట మనేది చాలా సునాయాసంగా జరిగిపోతుంది.
    రాత్రి గుర్తుకు వచ్చిన గతం నాలో నీరసాన్ని పోసింది. యాంత్రికంగా కాలకృత్యాలు తీర్చుకుని, పేపరు చూస్తూ కూర్చున్నాను. భోజనం చేశాక ఆఫీసుకు బయల్దేరాను. మెట్లెక్కి మేడ మీదకు వెళ్లేసరికి నా రూము ముందు నిలబడిన ఒకతను "నమస్కారం సార్' అన్నాడు చేతులు జోడించి. నేను తలతో నా నమాస్కారం విషయం  సూచించి, గదిలోకి వెళ్లి కూర్చున్నాను. ఫ్యూను ఒక చీటీ తెచ్చి నా బల్ల మీద పెట్టాడు. పేరు చదివాను.


Next Page 

WRITERS
PUBLICATIONS