"గోడమీద రాతలకి మరి అర్ధమేమిటో?" అని వ్యంగ్యంగా అడిగాడు ఆర్ష్.
ఏ "గోడమీద రాతలు?"
"ఏమీ ఎరగనట్లు మాట్లాడవద్దు సాధనా! ఇప్పటికే కురైపతి తెలివి తక్కువవల్ల ఇటు ప్రజల దృష్టిలోకి అటు ప్రభుత్వం దృష్టిలోకి దేవాలయంలో త్రవ్విన విషయం తెలిసిపోయింది. ఇప్పుడు పరమేశ్వరీ ఆలయంలో భక్తులసంఖ్య పెరగటమేకాక వచ్చేపోయే జనసందోహమూ అధికారులదృష్టి వుత్త తెలివితేటలూ, చాకచక్యమూ చాలవు, మెరపువేగమూ, పిడుగుపాటులా ప్రవర్తించడమూ కావాలి. తస్మాత్త్ జాగ్రత్తోం జాగ్రత్త" అని హెచ్చరిక చేస్తూ గుడిచుట్టూ త్రవ్వటమే కాదు. గుడిని త్రవ్వేస్తాము. గుడిలో విగ్రహాలు ఎత్తుకు పోతాము" అని గోడమీద హెచ్చరికలు రాస్తే ఇంక ఏమి సాధించగలవు? అసలు ఆ రాతలు రాయడంలో నీ వుద్దేశ్యమేమిటి?" కరకుగా అడిగాడు ఆర్ష.
"చాలా తెలివిగా ఎంతో ముందు చూపుతో ఈ రాతలు నేనే రాశాను బాస్" ఏ మాత్రం జంకులేకుండా చెప్పింది సాధన.
"నువ్వు......నువ్వు......రాశావా?" ఆశ్చర్యంగా అన్నాడు ఆర్ష.
"మీరే అడిగారు కదా బాస్! ఈ రాతలు నువ్వెందుకు రాశావు అని. గుడి గోడమీద ఈ జాగ్రత్త అనే మాటను ఇంత వివరంగా నేనెందుకు రాశానో చెబితే మీరే చాలా ఆశ్చర్యపోతారు చాలా పెద్ద ప్లాన్ తో తిరిగులేని పధకం వేసి రాసిన రాతలు అని ఆ రాతలే చలనం సంచలనం తీసుకువచ్చాయి అలా తీసుకురావటంవల్ల కేవలం ఆ రాతలవల్ల నా మార్గం చాలా సులువు అయ్యింది" అంది సాధన.
లంబా చాలా ఆశ్చర్యపొయ్యాడు. సాధన చెబుతున్నది వింటూంతే అతనికి అంతా అయోమయం ఐపోయింది. సాధన ప్లాన్ ని భగ్నం చెయ్యటానికి బాస్ దృష్టిలో సాధన ఫూల్ కావటానికీ ఈ కేసులో సాధన అపజయంపాలు కావటానికి గుడిలోపలి గోడమీద మారువేషంలో తను వెళ్ళి స్వయంగా తనేరాశాడు.
ఇప్పుడు బాస్ అడుగుతూ వుంటే ఇప్పుడు సాధన తనే రాశానని ధైర్యంగా చెబుతున్నది. రాశిందెవరో సాధనాకి తెలియదు కానీ ఈ సమయంలో తను రాయలేదని చెబితే బాస్ కి ఎక్కడ కోపంవచ్చి అబద్దం ఆడితే గోడకట్టినట్టు ఉంటుందిట. ఏదో అబద్దంచెప్పి ఈ విషయం కప్పిపెట్టాలని చూస్తున్నది. ఓవేళ ఈ విషయాన్ని కప్పిపుచ్చాలని చూసినా తను అడుగడుగునా సాధనకి అడ్డుతగులుతూ ఆమె ఈ కేసులో పూర్తిగా అపజయం పొందేటట్లు చేస్తాడు. అలా చెయ్యకపోతే తనపేరు లంబాయే కాదు.
లంబా తనుచేసిన పనికి మురిసిపోతూ అలా అనుకున్నాడు.
"బాస్ ఈ చీటీ చదివి ఆపై నన్ను ప్రశ్నించండి!" అంటూ సాధన మడతపెట్టబడ్డ చిన్న కాగితాన్ని ఆర్షకి అందించింది.
ఆర్ష ఆ కాగితం అందుకుని మడతవిప్పి చదివాడు.
ఆ కాగితంలో రెండేరెండు ముక్కలున్నాయి."బాస్! మన ప్రక్కలో బల్లెం ఇక్కడే ఉంది! మీతో నేను సీక్రెట్ గా మాట్లాడాలి.
సాధన
అని వుంది. అది చదివిన ఆర్ష తలపంకించి కాగితం జేబులో పెట్టుకున్నాడు.
ఏం జరుగుతుందో అని లంబా కుతూహలంగా చూస్తూ వుండిపోయాడు. ఆర్ష లేచి నిలబడ్డాడు.
"సాధనా! నీకు నేను ఫస్టు అండ్ లాస్టు వార్నింగు ఇవ్వబోతున్నాను. నువ్వు చేసినవని నాకు ఎంతమాత్రం నచ్చలేదు. ఐనా ఈసారికి నిన్ను వదలిపెడుతున్నాను. ఎందుకంటే చేజేతులారా నువ్వు నీప్రాణం మీదకు తెచ్చుకుంటానంటే నేను చెప్పేది ఏమీలేదు. సరే ఈ విషయం ఇంతటితో వదిలేద్దాం. నీతో ఒక సీక్రెట్ చెప్పాలి పద" అంటూ ప్రక్క గదిలోకి నడిచాడు ఆర్ష.
ఆర్ష వెనుకనే తలవంచుకొని సాధన లోపలికి వెళ్ళింది.
రోగమేమిటో తెలియకపోయినా 'రోగం కుదిరింది' అనుకున్నాడు లంబా.
ఆర్ష సాధన ప్రక్కగదిలోకి వెళ్ళగానే ఆ గది తలుపు మూసుకున్నాడు.
11
"థాంక్స్" అంది సాధన.
"ఎందుకు?" ఏమీ ఎరగనట్టు అడిగాడు ఆర్ష.
"మీరు నన్ను అర్ధంచేసుకున్నందుకు బాస్!"
"అపార్ధం చేసుకోనందుకు......అంటే బాగుంటుందేమో!"
"రెండుమాటలకి అర్ధం వకటేకదా బాస్!"
సాధన ఆ మాట అనంగానే ఆర్ష నవ్వాడు.
స్పెషల్ రూమ్ లోకి వెళ్ళగానే సాధన 'థాంక్స్' చెప్పింది.
ఆర్ష నవ్వీనవ్వనట్టు నవ్వి ఊరుకున్నాడు. తనో కుర్చీలో కూర్చుంటూ సాధన నిండా కూర్చోఅన్నట్టు చెయ్యి చూపించాడు.
ఆర్ ష ఎదురు కుర్చీలో సాధన కూర్చుంది.
'ఊ' అన్నాడు ఆర్ ష.
ఆర్ష ఊ అన్నాడు అంటే దానర్ధం చెప్పు అని. అంతక్రితం సాధన మాటలనిబట్టి నిర్భయంగా తన ఎదుట నిలిచి సమాధానం చెప్పటం ఇదంతా గ్రహించాడు.....ఏదో ఉందనీను..... ఆ మాత్రం గ్రహించలేక పోతే ఆ మనపేరు ఆర్ ష అయేదికాదు. వక్కసారంటే వక్కసారి కూడా పోలీసులకి చిక్కకుండా ఉండేవాడుకాదు. ఇంతమందికి బాస్ అయేవాడు కాదు.
ఆర్ ష ఊ అనంగానే సాధన చెప్పసాగింది.
"బాస్! మీరు వెంటనే నన్ను అర్ధంచేసుకున్నందుకు నా మాటల్లోని గూడార్ధం గ్రహించినందుకు మరోసారి థాంక్స్ చెపుతున్నాను.
మీరు నన్ను ఈపని సాధించుకురమ్మని పంపించిన తర్వాత వక రోజంతా వంటరిగా కూర్చుని చదరంగం ఆడినట్టు పథకాలువేస్తూ అవి సక్సెస్ కాకపోతే ఏంచేయాలి! తిప్పి ఎలా కొట్టాలి! ఎత్తుకు పై ఎత్తు ఏమిటి? అని ఆలోచనే సరిపోయింది.
కురైపతి చేసిన తొందరపాటు పనికి అక్కడంతా అస్తావిస్తంగా తయారైంది. కరక్టుగా చెప్పాలంటే ఐదునిమిషాలలో పూర్తికావలసిన పని ఐదేళ్ళు కష్టపడితేగాని సాధించలేము అన్నట్టు తయారైంది.
