తనకి సమాధానం చెప్పకుండా సురేంద్రనాథ్ ఆలోచిస్తుంటే ఒళ్ళు మండిపోయింది గోవర్ధనరావుకి. విషయం బైటికి లాగాలంటే చేయాల్సింది బెదిరింపు. పోలీసులని పిలవటం ఇష్టంలేదు. సూది పోయిందని సోది చెప్పించుకుంటే సోదిలోకి సూది రాకపోగా పాతరంకులన్నీ బైటపడ్డాయట. అలా ఈ సమయంలో పోలీసులని పిలుస్తే శీతల్ విషయం బైట పడొచ్చు. దాంతో కోరి తెచ్చుకున్న ప్రమాదం కింద వ్యవహారం తయారవుతుంది. కనుక పోలీసుల దాకా వ్యవహారం పోనీయక బెదిరింపుతోనే తేల్చుకోవాలి.
అలా అనుకున్న గోవర్ధనరావు ఆవేశంగా పలికాడు. "మీరు ఇలా నాన్చితే పోలీసులకి కబురు అందించాల్సి వస్తుంది."
"అలా చేస్తే హత్య విషయం బైటికి వస్తుంది" గబుక్కున పైకి అనేశాడు సురేంద్రనాథ్.
"వ్వాట్?" అంటూ తెల్లబోయాడు గోవర్ధనరావు.
నోరు జారిం తరువాత పైకి బొంకి లాభం లేదని "ఎస్, మర్డర్, పెళ్ళి పందిట్లో యిలాంటి విషయాలు బైటపడటం కూడా అంత మంచిది కాదు కాని తప్పలేదు" ముఖం గంభీరంగా చేసుకుని చెప్పాడు సురేంద్రనాథ్.
"వాటీజ్ దిస్ నాన్ సెన్స్! పెళ్ళి పందిరిలో పరిహాసాలు మంచిదే కాని దిసీజ్ టూమచ్" గోవర్ధనరావు అరిచినంత పని చేస్తూ అన్నాడు.
"సరదా ఆచారం అంటూ ఇప్పటికిప్పుడు చంపింది గాక అమ్మాయిని మాయం చేశారు" నోటికొచ్చింది అని కళ్ళు వత్తుకుంది ఇందిరారాణి.
"ఎవరు మాయం చేశారుట?" సురేంద్రనాథ్ బింకంగా అడిగాడు.
"మీరే" ఆయన వేపు సూటిగా వేలు చూపిస్తూ అన్నాడు గోవర్ధనరావు.
"ఏంటి డాడీ, ఈ గోల మీరైనా గట్టిగా మాట్లాడండి" అంతవరకు మౌనంగా వున్న నయనబాబు కోపంగా అన్నాడు.
శీతల్ కనపడకుండా పోయిన వార్త పెళ్ళిపందిరి దావానలంగా వ్యాపించింది. ఈ పెళ్ళి అయిందా నయనబాబుకి అనుమానమే. గతంలో జరిగిన సంఘటన బెదిరింపు ఇవేవి అతను మరచిపోలేదు. పెళ్ళి కొడుకు సరదాగా నవ్వుతూ త్రుళ్ళుతూ తిరుగుతున్నాడు. లోలోన మాత్రం ఏదో ఘోరం జరుగుతుందేమోనన్న ఆరాటం అనుక్షణం వేధిస్తూనే వుంది. అతను భయపడ్డంతా జరిగింది. యిప్పుడు యేదో చేయాలన్న కసి, యేమీ చేయలేని అసమర్ధతతో కోపం తమాయించుకోలేకుండా వున్నాడు.
అంతకంతకు వాళ్ళ మధ్య మాటలు ముదిరి పోయాయి.
"వాళ్ళు గోవా నుంచి రాలేదు మిష్టర్ గోవర్ధనరావు!" సురేంద్రనాథ్ స్వరం గంభీరంగా వినవచ్చింది.
"వాళ్ళు గోవా నుంచి వస్తే నాకెందుకు, రాకుంటే నాకెందుకు. వాళ్ళెవరన్నది అప్రమత్తం నాకు కావాల్సింది మా అమ్మాయి శీతల్ తక్షణం నా కళ్ళముందు వుండటం" గోవర్ధనరావు కోపంగా అన్నాడు.
"ఇంటా వంటా లేని ఈ కొత్త ఆచారం విషయం మీరు చెప్పగానే అప్పుడే నాకేదో అనుమానం వచ్చింది" ఇందిరా రాణి ముక్కు తుడుచుకుంటూ అంది.
ఈ సమయంలో తను గట్టిగా వుండకపోతే ముందుగా తన చేతికి అందించిన పెద్ద మొత్తం డబ్బు కక్కమంటాడు గోవర్ధనరావు. అప్పుడే ఆ డబ్బులో సగం ఖర్చయిపోయింది. సగం అప్పులు తీరాయి కదా అని సంతోషిస్తుంటే అనుకోకుండా అవాంఛనీయ సంఘటన జరిగిపోయింది. ఇది చాలా విషమపరిస్థితి, దుర్ఘటన. నేరం చేసింది. పెళ్ళికూతురు అయితే, దోషిగా నిలబడాల్సిన పరిస్థితి తనకి ఎదురయింది. ఈ సమయంలో తను గట్టిగా నిలబడకపోతే వ్యవహారం చాలా దూరం పోతుంది. అలాగనుకున్న సురేంద్రనాథ్ చేతులు కాలకముందే ఆకులు పట్టుకున్న అతి జాగ్రత్తపరుడిలా చెప్పాడు.
"వచ్చిన ముగ్గురూ గోవా నుంచి వచ్చారో, గోరింట్ల పాలెం నుంచి వచ్చారో నాకు తెలియదు. వాళ్ళు సి.బి.ఐ. వాళ్ళు."
"ఏమిటి మీరనేది?" ఆ మాట వినగానే క్షణకాలం అవాక్కయి నిలిచిన గోవర్ధనరావు అంతలోనే తేరుకుని అడిగాడు.
"వచ్చిన వాళ్ళు సి.బి.ఐ. వాళ్ళు అంటున్నాను అంతే" సి.బి.ఐ. అన్నమాట నొక్కి పలుకుతూ అన్నాడు సురేంద్రనాథ్.
"వాళ్ళెందుకు వచ్చారు?"
"ఆ విషయం నాకెలా తెలుస్తుంది! వచ్చిన సి.బి.ఐ. వాళ్ళకి తెలియాలి, మీకు తెలియాలి."
"నాకు తెలియడం ఏమిటి?"
"ఉపేంద్ర కుమార్ ని ఓ ఆడపిల్ల హతమార్చింది..."
"ఉపేంద్రకుమార్...?"
"అయితే ఉపేంద్రకుమార్ తెలుసన్నమాట...?" సురేంద్రనాథ్ అన్నాడు.
"ఉపేంద్ర తెలియడమేమిటి?" తెల్లబోయి అడిగాడు గోవర్ధనరావు.
"ఉపేంద్ర కుమార్ కాస్త ఉపేంద్ర అయ్యాడన్న మాట. వెరీగుడ్! ఇంతకన్నా సాక్ష్యం ఇంకేం కావాలి!" వ్యంగ్యంగా అన్నాడు సురేంద్రనాథ్.
గోవర్ధనరావు పళ్ళ బిగువున కోపం ఆపుకుని "మగ పెళ్ళివారని....కాబోయే వియ్యంకుడివని ఇంతవరకు తగ్గి మాట్లాడాను. మిస్టర్ సురేంద్రనాథ్! ఇప్పుడు చెప్పండి. ఈ నాటకం అంతా ఏమిటి?" తీవ్రంగా అడిగాడు. ఎంతగా కోపం ఆపుకున్నా మాటల్లో వేడి, వాడి బయటికి రానేవచ్చింది.
"దీనినే సమర్ధింపు, చాతగాని కోపం వగయిరా వగయిరాలంటారు మిష్టర్ గోవర్ధన రావ్! నేను ఉపేంద్ర కుమార్ పేరు ఎత్తగానే ఎందుకు తెల్లబోయావ్? పైగా ఎప్పటినుంచో వాడితో పరిచయం వున్నట్టు బొడ్డుకోసి నీవే పేరు పెట్టినట్టు ఉపేంద్ర అనికూడా అంటివి. హతుడు తెలుసుకాబట్టి....ఈ హత్య ఎవరుచేశారో తెలియబట్టి..."
