Previous Page Next Page 
డేంజర్ డేంజర్ పేజి 7

   
    "ఈ పండు తిన్నావా?" కీర్తి గాభరాపడుతూ అడిగింది.    
    "ఉహు, ముందు నీకు చూపించి..."    
    "గుడ్! అడవిలో పళ్ళు కనపడితే తొందరపడి తినకూడదు, రుచి లేనివి, ప్రాణం తీసేవి, రూపం మార్చేవి, రోగం తెప్పించేవి ఎన్నో రకాల ఫలాలు అడవుల్లో వుంటాయి."    
    "ఎలామరి వీటిని చూస్తుంటే ఆకలేస్తుందే!"    
    "పక్షులు కోరిన పండు మంచి వాటికిందలెక్క. ఇక్కడ పక్షులున్నాయిగాని అవి మన పెంపుడివి కాదే"    
    గోమతి నవ్వింది. "మనతోపాటు ఓ పెంపుడు పక్షి కూడా వుంటే బాగుండును." అంది.    
    "మాటలతో కాలయాపన జరుగుతున్నది గోమతీ!"    
    "అయితే ఏంచేద్దాం కమల్!"    
    "ఇలాంటి పళ్ళు లతలనిండా వున్నాయా! ఎండిపోయి నవి, రాలిపోయినవి, పచ్చివి, సగం కొరికేసినవి వున్నాయా!"    
    "వివరాలు దేనికీ?"    
    "తిరుగు ప్రశ్న వేయవద్దు గోమతీ! జవాబివ్వు"    
    కమల్ కి కోపం వచ్చిందని గ్రహించింది గోమతి. మగాడు కదూ అధికారం చలాయిస్తున్నాడు అనుకుంది.    
    "కొన్నిపళ్ళు రాలి కిందపడివున్నాయి. కుళ్ళ పిసపిస లాడుతున్నాయి. లతలకి అయితే అన్నీ ఇలాంటి పళ్ళే వున్నాయి. అన్నట్లు ఆకులకి ముళ్ళు లాంటి వున్నాయి."    
    "అహో" అని దీర్ఘంగా ఆలోచ్సితూ వుండిపోయింది కీర్తి.    
    "ఈ పళ్ళు తినొచ్చా కమల్!"    
    "తినటం మంచిది కాదు."    
    "అదేం!"    
    "నువు చెప్పిందాన్ని బట్టి ఇవి విషపు పళ్ళేమోనని అనుమానంగా వుంది. కొరివితో తలగోక్కోతం నాకిష్టం లేదు గోమతీ."    
    "అయితే ఏం చేద్దాం!" పల్లవైపు ఆశగా చూస్తూ అంతలోనే నిరాశ పడుతూ అంది గోమతి.    
    "పళ్ళు అలావుండనీ గోమతీ! ఈ తఫా ఇటువైపు వెళ్ళిరా" అంది కీర్తి.    
    గోమతి అనుమానంగా చూసింది.    
    "నేనేదో అనుమానిస్తున్నానని నామాట ఆజ్ఞలా వుందని అపోహ పడవద్దు. ఏ పనిచేసినా ఆలోచించి చేయటం మనకేమంచిది. నీ ఇష్టం గోమతి నీమాట నేనన్నా వినాలి నా మాట నీవన్నా వినాలి."    
    గోమతి మరేమి అనలేదు గిరుక్కున తిరిగి మరోవైపు బైలుదేరింది.    
    కాలు బాధ ఎక్కువ కావటంతో కీర్తికాలు పట్టుకుకూర్చుండి పోయింది.    
    తను ఈ పరిస్థితులలో దూరం నడవ లేదు. నడవగల గోమతి విసుగుపడుతున్నది. గోమతి అమాయకంగా అపార్ధం చేసుకుంటున్నది. తను స్త్రీనని తన వల్ల అపాయం లేదని చెప్పొచ్చు అది తన ఉద్యోగ ధర్మానికి విరుద్దం. బైటపడితే చెప్పాల్సిందేకాని నోరు కదపరాదు.    
    పంచదార చిలకలు తినటానికున్నాయని చెప్పొచ్చు. ముందుదారి వుందేమో చూసుకోవాలి, నీళ్ళు దొరుకుతాయేమో చూసుకోవాలి. రెండూ కానరాకపోతే అప్పుడు ఏంచేయాలి! నేనేం చేయాలి? గోమతి ఏం చేయగలదు?    
    కీర్తి ఆలోచిస్తూ కూర్చుంది. కాలుపోటు ఎక్కువయింది. ఉన్నట్లుండి జ్వరంకూడా వచ్చింది. శరీరమంతా చలితో కుదిపేస్తున్నది. దీనికితోడు దాహం బాధ రెట్టింపయింది. కళ్ళుమూసుకుని పచ్చిక మీద పడుకుండిపోయింది.    
    సరీగ ముప్పావు గంటకి గోమతి తిరిగి వచ్చింది.    
    కీర్తి కాలిబాధతో దొర్లుతు నెమ్మదిగా మూలుగుతున్నది.    
    "కమల్" గోమతి దగ్గరగా వచ్చి పిలిచింది.    
    వినీ వినపడనట్లు ఊ అంది కీర్తి.    
    "ఏమయింది కమల్"    
    "జ్వరం, కాలిబాద ఎక్కువయింది. బహుశా సెప్ టిక్ అవుతుందేమో అని అనుమానంగా వుంది. నువ్వెళ్ళిన పని ఏమయింది."    
    "సెప్ టిక్ అయితే ప్రమాదం కదా కమల్"    
    గోమతి అన్నది వినిపించుకోలేదు కీర్తి. "నువ్వెళ్ళిన పని ఏమయింది" అంది.    
    "దారి బాగానే వుంది. చెట్లు దూరం దూరంగా వున్నాయి. చెట్ల సందునుంచి ఎండపడున్నది. అక్కడానేల మీద చిన్న చిన్న గుబుర్లున్నాయి. వాటికి ఈ కాయలున్నాయి చూడటానికి రేగికాయల్లా వుంటే కోసుకొచ్చాను" అని గోమతి తను తెచ్చిన కాయలు చూపించింది.    
    అవి రేగికాయలే. పండటానికి సిద్దంగా వున్నాయి.    
    "రేగిచెట్లు ఎప్పుడూ చూడలేదా?"    
    "చూశాను అవి పెద్ద పెద్ద చెట్లకి కాస్తాయిగా" అమాయకంగా అంది గోమతి.    
    "పెద్ద చెట్లకి కాస్తాయి. నేలమీద గుబురుగా వున్న చెట్లకీ కాస్తాయి" అంది కీర్తి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS