ఆమె విముక్తి
కిటికీలోంచి మసక వెలుగు గదిలోకి ప్రసరించింది. కలత నిద్రలో ఉన్న అనసూయకి మళ్ళీ మెలకువ వచ్చింది.
అలవాటుగా గోడ మీద దేవుడి పటానికి దండం పెట్టుకుంది. మునుపటిలా దేవుడు స్పష్టంగా కనపడటం లేదు. అలవాటుగానే గడియారం చూసింది. టైము కూడా తెలీటం లేదు.
స్టూలు మీది కళ్ళజోడు తీసి పెట్టుకుని మళ్ళీ టైము చూసింది. ఐదున్నరయింది. గంటలు కొట్టే గడియారం అయితే చూడకుండానే తెలుస్తుందని కొన్నది. కానీ గంటల వల్ల నిద్రాభంగం అని సైలెంట్ చేసేశారు. ఇంకాసేపు పడుకోవచ్చు. అయినా పడుకుంటే.. కందిరీగల గుంపులాంటి ఆలోచనల్ని తప్పించుకోవటం కష్టం. లేచి ఏదో ఒక పని చేయాలి. ఇంతకాలం చేసిందదేగా! మనసు నోరు నొక్కి పెట్టటానికి ఏదో ఒక వ్యాపకాన్ని కల్పించుకుని బిజీగా జీవితాన్ని నడిపింది. ఇప్పుడింక శరీరం సహకరించలేనని మొరాయిస్తోంది. విశ్రాంతిని కోరుతోంది. కానీ మనసు దాడిని తట్టుకోవటం కష్టంగా ఉంది.
రాత్రి పొద్దుపోయే దాకా గుండెల్లో సన్నని నెప్పి. కలతనిద్ర. మళ్ళీ తెల్లారింది... మెల్లగా లేచి బాత్ రూంకి పోవాలని ప్రయత్నించింది. కాళ్ళు తడబడుతున్నై. బెడ్ పక్కనున్న చేతి కర్ర ఆధారంగా జాగ్రత్తగా వెళ్ళి వచ్చి పడుకుంది. మళ్ళీ ఆలోచనల దాడి.
కడుపులో మంట. మందుల వల్లేమో! ఏదైనా తింటే తగ్గుతుందేమో! ఇంత పొద్దున్నే తనకోసం ఎవరు ఏం చేస్తారు? ఎందుకు చేయకూడదు? మనసు ప్రశ్నస్తోంది.
తను మాత్రం వాళ్ళకోసం చీకటి పొద్దుల్లో లేచి ఆదరాబాదరాగా టిఫిన్లు వంట, బాక్సులు ,స్కూలు బ్యాగులు, బూట్లు, సాక్స్...మధ్యలో "అనూ! నా టవల్!' అంటూ శ్రీపతి కేకలు. పిల్లలు అరుపులు, ఏడుపులు... అసలు అన్ని పన్లు ఎలా చేయగలిగిందో! ఇప్పుడు ఆశ్చర్యంగా అన్పిస్తుంది.
తనలో అంతశక్తి ఉండేదంటే నమ్మలేకపోతోంది. మరి ఆ వయసులో ఉన్న తన తర్వాతి తరం అలా లేదే? వాళ్ళకి అవసరం లేదా? తమ ఆరోగ్యాల పట్ల ముందు నుంచే జాగ్రత్తగా ఉంటున్నారా!? తనలాగా శ్రమించి ఆరోగ్యం పాడు చేసుకునేవాళ్ళు ఈ తరంలో కన్పించరు. వాళ్ళది స్వార్ధమా? జాగ్రత్తా? ఒకవేళ స్వార్ధమైతే అది మంచి స్వార్ధమే! మరి తనకెందుకు లేకపోయింది?
పెద్దాడు, కోడలు ఎనిమిదింటికి కానీ గదిలోంచి బయటికి రారు. ఉద్యోగం చేసే కోడలు కదా! మరి తను కూడా ఉద్యోగం చేసిందిగా! ఏం ఉద్యోగంలే! టీచర్ గా అత్తెసరు జీతం. సాఫ్ట్ వేర్ కోడల్ని పొద్దున్నే లేవమని చెప్పే ధైర్యం ఎవరికుంటుంది. ఇప్పటికీ బాగా గుర్తు. పెద్దాడ్ని కడుపుతో ఉన్నప్పుడు ఓరోజు నలతగా ఉండి ఎండెక్కి నిద్రలేచిన తనని శ్రీపతి ఎన్ని మాటలన్నాడు? జన్మంతా గుర్తుండేలా! ఎంతయినా ఇప్పటి ఉద్యోగినులకు భర్తల అండ ఓ పెద్ద రిలీఫ్.
నిద్ర పట్టక పక్కకు తిరిగి పడుకుంది అనసూయ. మళ్ళీ ఏవేవో ఆలోచనలు.
చిన్నాడు ఐ.ఎ.ఎస్. పరీక్షకు ప్రిపేరు అవుతున్నాడు, వాడేప్పుడు పడుకుంటాడో... ఎప్పుడు లేస్తాడో....? వాడికి పెళ్ళయితే వాడికీ ఆఫీసరైన భార్యే వస్తుంది. ఇంక ఆ అమ్మాయికి ఇంటి బాధ్యతేముంటుంది. ఇలా అయితే ఈ ఇంటి బాధ్యత ఎవరిది...? తనెంత కాలం ఉంటుంది.
ట్రింగ్..ట్రింగ్... కాలింగ్ బెల్ మోగుతుంటే శ్రీపతి లేస్తాడేమోనని కాసేపు చూసింది. శ్రీపతి కదల్లేదు. అతనూ తనకన్నా పెద్దవాడేగదా! ఏం ఓపిక ఉంటుంది. మొదట్నుంచీ ప్రతి పనీ తనే చేయటం అలవాటు చేసింది. అయినా విసుక్కుంటూనే ఉంటాడు.
ఓసారి శ్రీపతికి పెద్ద జబ్బు చేసి సంవత్సరంపాటు మంచంలో ఉంటే అన్నీ తనే చేసింది. కానీ ఇప్పుడు కొంత అనారోగ్యంతో బాధపడే తనకి శ్రీపతి ఏమీ చేయలేకపోతున్నాడు. ఆడవాళ్ళు సేవ చేసినట్లు మగవాళ్ళెందుకు చేయరు. మళ్ళీ కాలింగ్ బెల్ మోగుతోంది... త్పనిసరిగా లేచి చేతి కర్ర సాయంతో వెళ్ళి తలుపు తీసింది.
ఎదురుగా పాలవాడు.. పాల ప్యాకెట్లు అందిస్తూ చేతికర్రకేసి సానుభూతిగా చూశాడు. మళ్ళీ అదే చూపు.... తను భరించలేని జాలి చూపు... ప్యాకెట్లు తీసుకుని తలుపేసింది.. మరీ అంత విసురుగా వేయకుండా ఉండాల్సింది.
ఎంతైనా ఈ మధ్య తనకు చిరాకు, కోపం ఎక్కువయ్యాయని ఇంట్లో వాళ్ళ కంప్లైంట్. శరీరం అనారోగ్యం పాలయితే మనసు ఆరోగ్యంగా ఎలా ఉంటుంది. ఎంత బాగాలేకపోయినా చిరునవ్వులు చిందిస్తూ శాంతంగా ఆడవాళ్ళు నటించాల్సిందేనా? పెళ్ళయింది మొదలు ఎన్నో బాధ్యతల్ని ఇటూ అటూ నెత్తిన వేసుకుంది. ఉద్యోగం, పిల్లలు, భర్త, ఇల్లు సంతోషంగా నిర్వర్తించింది. ఈ పక్షవాతం వచ్చి కాలు చచ్చుబడ్డప్పటి నుంచి మనసు నరకంగా మారిపోయింది. యాంత్రికంగా చేతులు పనిచేస్తున్నాయి!
మిల్క్ బాయిలర్ వికృతంగా అరుస్తోంది. ఉలిక్కిపడి ఆపే లోపే శ్రీపతి ధుమధుమలాడుతూ లేచాడు.
"నిన్నెవరు లేవమన్నారు" విసుక్కున్నాడు అలవాటుగా.
మనసులో మరో ముల్లు బలంగా దిగింది.
"నిద్రపట్టక లేచాను లెండి" తప్పు చేసినట్లు సంజాయిషీ స్వరంతో అంది.
"నీకు ఎటూ నిద్ర పట్టదు. మమ్మల్ని నిద్రపోనీయవు. మరోసారి విసుక్కుంటూ బాత్ రూం కేసి నడిచాడు. ఈ విసుక్కోవటం అతనికి కొత్తకాదు. పెళ్ళయింది మొదలు అతని నోట ప్రేమ పూర్వకమైన మాట విని ఎదుగదు. ఎంత రుచిగా వంట చేసినా ఎంత మంచిపని చేసినా భార్యని మెచ్చుకోవటం అతనికి తెలీదు. కారణం తనకీ తెలీదు. పిల్లల్ని కూడా ఓసారైనా మెచ్చుకోవటం చూసి ఎరుగదు. వాళ్ళెంత ర్యాంక్ సాధించినా... బాగా సంతోషంగా ఉన్నట్లు కన్పించినా ఏదో ఒక మాట అని బాధ పెట్టందే ఉండలేడు శ్రీపతి. అతనికి సరదాలు లేవు, హాయిగా నవ్వలేడు. అలాగని విరాగి కాదు. డబ్బు వ్యామోహం ఎక్కువే!
పెద్దాడు పుట్టినప్పుడు... ఇప్పటికీ ఆ దృశ్యం కళ్ళముందు కదుల్తుంది. ముటముటలాడుతూ హాస్పిటల్ కి వచ్చి చూసి వెళ్ళాడు. తొలిసారి తండ్రి అయిన సంతోషం ఏ కోశానా లేదు. ఆమె ఆరోగ్యం గురించి గానీ పిల్లాడి గురించిగానీ అడక్కపోగా పిల్లాడు పుట్టిన ఘడియ, నక్షత్రం బాగాలేదని శాంతి, హోమం, జపాల గురించి ఏకరువు పెట్టి నూనెలో మొహం చూడాలనీ, చాలా ఖర్చవుతుందనీ అనసూయ తల్లిదండ్రులు తమ వాళ్ళకి బారసాల్లో చేయాల్సిన మర్యాదల గురించి చెప్పి వెళ్ళిపోయాడు.
అనసూయ చిన్నబుచ్చుకుంటే తల్లే ఓదార్చింది "కొందరంతేలేమ్మా! ప్రేమని ప్రకటించరు" అని.
"ప్రకటించలేని ప్రేమెందుకు" అనుకుంది మొదటిసారిగా.
ఆ తర్వాత క్రమంగా అతని పద్ధతి అలవాటవటానికి సెన్సిటివ్ నెస్ నోరు నొక్కేయక తప్పలేదు.
"కాఫీ..." గ్లాసు స్టూలు మీద పెట్టి వెళ్ళాడు శ్రీపతి. పరధ్యానంగా ముట్టుకుంది. చురుక్కుమన్న చేతిని వెనక్కి తీసుకుంది.
ఆ రోజు ఇంతే! పొరపాటున వేలు తెగింది. రక్తం కారుతుంటే ఆడపడుచు కంగారుపడిపోతోంది. శ్రీపతి చూశాడు "బాగా అయింది. అంత నిర్లక్ష్యం దేనికి" అంటూ నిరాసక్తంగా వెళ్ళిపోయాడు అక్కడ్నుంచి.
