'అవును, అలా చెయ్యరా ప్రభాకర్- మీ అమ్మకీ తృప్తిగా వుంటుంది. ఇప్పటినుంచి ఆస్థి పంపకాలంటూ అయితే కుటుంబం విడిపోతుంది. ఆవిడ వున్నన్ని రోజులు ఇదంతా ఆవిడదే గదా, తరువాతే మీకని రాసుకోండి. ఇప్పుడు ఈ ఆస్థి రాకపోతే గడవని వారెవరూ లేరుగదా, పెద్ద తమ్ముడు సుబ్బారావు అన్నారు. ఏమంటావు అమ్మా వదినా'.
'అయ్యో నాదేం వుంది నాయనా, ఎప్పుడన్నా ఈ ఆస్థులు వివరాలు ఆయన నాకేం చెప్పారా. ఏదో ఇంత తిని నా ఇంట్లో నేను పడివుండేట్టు చూడు బాబు ఇంకెవరి కొంప పట్టుకు వెళ్ళాడకుండా. నా బతుకు ఈ ఇంట్లో తెల్లారిపోతే చాలు నాయనా. మిగతాది ఎవరెవరు ఎలా కావాలంటే అలా రాయించుకోమను. పెద్దవాళ్ళు మీరు నలుగురు వుండగానే మంచి చెడ్డా ఆలోచించి ఎవరికి అన్యాయం జరక్కుండా నలుగురికి సమానంగా రాయించండి నాయనా" అంది అన్నపూర్ణమ్మ.
'చూడండి మామయ్యగారు. అత్తగారున్నన్నిరోజులు ఆస్థి అంతటిమీదా సర్వహక్కులు ఆవిడవే హక్కు. ఆవిడ తదనంతరం ఎవరెవరికి ఏం చెందాలో పెద్దవాళ్ళు మీరు ఆలోచించి రాయించండి. పెద్ద అల్లుడు అన్నాడు. ప్రభాకర్ కి అందరిమాటలు వింటుంటే వళ్ళు మండిపోతుంది. ఈ ఆస్థి తల్లితో ముడి పెట్టకుండా ఎవరిది వారికి రాసేస్తే బాగుండను అని ఉంది. కాని నలుగురు మధ్య ఎలా తేలిపోవడమో అర్థం కాలేదు. తెగేసి నా వాటా నాకివ్వండి అని తండ్రి పోయిన పదో రోజు చెప్పడం అంటే బంధువులందరి ముందు తేలిపోవడం ఏం బాగుంటుంది అని మధనపడ్డాడు. అన్నగారున్నారుగా అన్నకి వస్తే నాకు మాత్రం రాదా అన్నట్టు దివాకర్ గడుసుగా ఏం మాట్లాడలేదు ఆడపిల్లలు మాకేం అక్కరలేదు మాకున్నది చాలు అంటారేమోనన్న ఆశ లేకుండా వాళ్ళు ఏం మాట్లాడలేదు. పెద్ద బావగారి మాటలబట్టి తల్లి తదనంతరం నల్లురికి సమానంగా అన్నాడంటే ఆస్థి వాళ్ళు వదులుకోరు అని అర్థం అవుతుంది. తండ్రి ఏదో విల్లురాసిపోతే ఈ గొడవ రాకపోను అనుకున్నాడు. అతనికి అసంతృప్తిగా వుంది ఈ వ్యవహారం. కాని అతని భావాలతో ప్రమేయం లేనట్టే పెద్దలందరూ కల్సి ఆస్థి ఏ విధంగా రాయించుకోవాలో నిర్ణయించేశారు. ఈ ఇల్లు పెద్దకొడుకు ఈ వూర్లో ఉంటాడు కాబట్టి అతనికి చెందేట్టు, బెంగుళూరులో చిన్న కొడుకు ఎలాగో స్థలం కొనుక్కున్నాడు అక్కడ సెటిల్ అవుతాడు. కనుక పొలం అతని పేర పెడ్తే అది అమ్మి అతను ఇల్లు కట్టుకుంటాడో పొలమే ఉంచుకుంటాడో అతనికే వదిలారు. ఆడపిల్లలకి ఇంట్లో వున్న రెండు లక్షల క్యాష్, తల్లి బంగారం వచ్చేటట్టు ఇదంతా అన్నపూర్ణమ్మగారి తదనంతరం చెందేట్టు విల్లు రాసి సాక్షి సంతకాలు పెట్టించి తమ పని అయిపోయినట్టు పెద్దలంతా వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళెవరికీ అంత బాధ అనిపించలేదు. కాని అక్కడుండాల్సిన ప్రభాకర మాత్రం ఈ ఏర్పాటు ఏమీ నచ్చలేదు. నచ్చక చేసేదేంలేదు కనుక మొహం మాడ్చుకున్నాడు.
అన్నపూర్ణమ్మకి మాత్రం ఈ ఏర్పాటు సంతృప్తిగానే వుంది. ఆయన విల్లురాయకపోవడం మంచిదే అయింది. రాసివుంటే తనపేర ఏం రాసేవారుకాదు. ఆడపెత్తనం మంగలి వైద్యం 'ఆడదానిచేతిలో డబ్బు' 'మగాడి చేతిలో బిడ్డ దక్కవు' లాంటి అభిప్రాయాలు ఆయనివి. ఆడదంటే ఇంట్లో చాకిరికి, పిల్లలకి కనడానికి పెంచడానికి తప్ప ఎందుకు పనికిరాదనేపాతకాలం అభిప్రాయాలున్న మనిషాయన ఆడదెప్పుడూ తండ్రి, భర్త కొడుకు ఇలా ఎవరో ఒకరి మగవాడి రక్షణలోనే వుండాలిగాని ఆడదానికేం తెలుసు మేనేజ్ మెంట్ అనే మనస్తత్వం గల వ్యక్తి ఇద్దరు కొడుకులున్నారు గానీ రోజులు వాళ్ళ దగ్గిర వెళ్ళపోతాయిలే అని తన పేర ఏం రాసేవారుకాదేమో అప్పుడు తనకి కొడుకుల పంచనపడి వుండాల్సిన గతి పట్టేది. పోతూ పోతూ ఆయన చేసిన మంచిపనేమో ఇది! నలభై ఏళ్ళు కాపురం చేసినందుకు నిలవ నీడ దొరికింది ఇప్పుడు హు బ్రతికినన్ని రోజులు తనని ఓ మనిషిలా ఎప్పుడు చూశారు గనుక నీకేం తెలుసు నోర్మూసుకో వంటింట్లో పడివుండక తగుదునమ్మా అని మాట్లాడుతున్నావా అన్ని పాములూ తలెత్తితే తాడిపామూ తలెత్తిందిట లాంటి హేళన తప్ప తనని ఓ మనిషిగా ఆయన ఎప్పుడూ గుర్తించలేదు. కసుర్లు విసుర్లు తప్ప అభిమానం, ఆప్యాయత ఏం పంచిచ్చారు కనుక, చిరబుర్రులు, అథార్టి చలాయించి ఆజ్ఞలు జారీ చేయడం తప్ప అనురాగంతో వశపరుచుకున్నారా! కష్టంలో సుఖంలో తన సలహా ఎప్పుడన్నా అడిగారా, ఆచరించారా, మగాడ్ని సంపాదింస్తున్నవాడిని ఇదంతా నాది అని తప్ప మనది అని ఎన్నడన్నా అన్నారా? పెళ్ళాం కనక అదంతా భరించింది. మొదట్లో కష్టం అన్పించినా అలవాటయి తరువాత ఏం అనిపించకుండా తనమానాన తనుండేది ఇంట్లో చాకిరి చేసుకుంటూ పిల్లల్ని కనిపెంచుకుంటూ ఆయనగారు తిట్టిన రోజు ఏడ్చుకుని, దగ్గరికి తీసుకున్న రోజున పొంగిపోయి అదే లోకం అనుకుంటూ ఇన్నాళ్ళు గడిపింది. కాపురానికి వచ్చిన నలభై ఏళ్ళకి తనదంటూ విల్లురాయకపోబట్టి మిగిలింది. రాస్తే ఈ ఇల్లు పెద్ద కొడుక్కీ రాసిపోయేవారు. ఇన్నాళ్ళు మొగుడి జులుం, ఇప్పుడికి కొడుకు హయాంలో బట్టకట్టవలసి వచ్చేది. ఏదో అదేముడికి దయకలిగి విల్లు రాయలేదు నయమే అనుకుంది.
"ఏమిటండీ, మనకొచ్చేదేదో విడిగా రాయించుకోకుండా ఇలా ఆవిడగారున్నన్ని రోజులు ఉమ్మడిగా ఆస్థి వుండడానికి ఒప్పుకున్నారు. గదిలో పద్మ మొగుడ్ని దులపడం మొదలు పెట్టింది.
'ఏం చెయ్యమంటావు. పెద్దవాళ్ళంతా అలా అంటున్నప్పుడు నాన్న పోయిన పదోరోజు నా ఆస్థి నాకు పారేయండి అని ఎలా అడగమంటావు ప్రభాకర్ అన్నాడు.
"మీ బాబాయి, మామయ్య పెద్ద తగుదునమ్మా అని చెప్పవచ్చారు. వాళ్ళ సొమ్మేం పోయింది ఇతరులకి ఎన్ని నీతులైనా చెప్పొచ్చు. అంతా ఎవరిపాటికి వాళ్ళు చక్కగా వెడతారు. మనం ఇక్కడుండీ ఏడవాల్సిన వాళ్ళం. ఈవిడకి మనకీ లంపటం తప్పదుగా..."
పదిహేను రోజుల తర్వాత గాఢ నిద్రలో ఎందుకో ఉలిక్కిపడిలేచిన అన్నపూర్ణమ్మ పెరట్లోకి లేచి వెళ్ళింది. కొడుకు గదిలోంచి కిటికీ దగ్గరగా వినవస్తున్న మాటలకి ఆగిపోయింది.
"మనకొచ్చేదే విడిగా మన పేర వుంటే మన ఇష్టం వచ్చినట్టుండేవారం. ఇప్పుడింక మీ అమ్మగారి దయా దాక్షిణ్యాల మీద బతకాలా ఇదేం పనికిరాదు. ఎవరి వాటా వారు పంచేసుకుందాం అని చెప్పండి మీ తమ్ముడితో చెల్లెళ్ళతో మీ ఆస్థి మీ ఇష్టం మీ మామయ్య వాళ్ళ మాటలు వినాలని ఏం లేదు వుండాల్సింది చెయ్యాల్సింది మనం..."
"అంతా వూరుకుంటే మనం ఏదన్నా అని అందరిలో తేలికైపోవడం ఏం బాగుంటుంది. పద్మా అందరిలో చెడ్డవాళ్లం అయిపోతాం.
"అయితే అయ్యాం, ఎవరేం అనుకుంటారోనని నాకేం భయం లేదు. మీ అమ్మగారికింక పట్టుమని అరవై లేవు. ఇంకా పదేళ్ళో ఇరవై ఏళ్ళు బతుకుతారో ఎవడికి తెలుసు. అన్నాళ్ళు మనం నోరు మూసుకుకూర్చోవాలా, అదేం కుదరదు నేను చెప్తున్నాను."
"అబ్బ ఇప్పటికి వూరుకో పద్మా, నాల్గురోజులు పోనీ చూద్దాం. ఇంట్లోనే వుంటాంగా ఇప్పుడేం కొంపమునిగింది. నాన్నగారు లేరుగాని మిగతాదంతా అలా వుంటుందిగా' అన్నాడు ప్రభాకర్ పెళ్ళాన్ని అనునయిస్తూ - వింటున్న అన్నపూర్ణమ్మ మనసు బావురుమంది. ఇలా తన పేర ఆస్థి పెట్టడం కొడుక్కు ఇష్టం లేదన్నమాట. తనింకా వుండగానే తనకేం లేకుండా పంచుకు పోదాం అనుకుంటున్నారన్న మాట. ఈ ముసల్ది ఇంకా పదేళ్ళు, ఇరవై ఏళ్ళు అని అప్పుడే లెక్కలు ఆరంభించారన్నమాట. అనుకుంటూ మధన పడింది. కానీ, అనుకోని, వీళ్ళ మాటలు పట్టించుకుంటే తను బతకలేదు. ఇన్నాళ్ళు ఆయన హయాంలో ఇప్పుడింకా వీల్లేదు. తన బతుకు తనిష్టం వచ్చినట్టు కొన్నాళ్ళయినా బతకాలి.. తన ఇల్లు తన మొగుడాస్థి తనిష్టం.. అడగడానికి వీళ్ళెవరు, అనడానికి ఏం హక్కుంది వీళ్ళకి అనుకుందావిడ.
* * * * *
