Previous Page Next Page 
కన్నీటికి వెలువెంత? (కథలు) పేజి 2


    "మరేం భయంలేదు కదా. అంతా సరిగా వుందాండి తల్లి" ఆదుర్దా పడింది.
    "భయానికి ఏం లేదనుకోండి. అయినా మీరు కాస్త ముందుగా తీసుకురావల్సింది. సరే యిప్పుడింక నా దగ్గరికి తీసుకొచ్చారు గనక ఇంక భయం లేదనుకోండి. నేను చూసుకుంటాను లెండి. అసలిదివరకు ఏ డాక్టరికీ చూపించలేదా?.... ఏం అమ్మా మీ ఆయన నీకేం మందు లిప్పించలేదా? టూ బాడ్, రానీ పాపని చూడడానికి వచ్చినప్పుడు నేనే అడుగుతానుండు. అని నవ్వుతూ 'డోంట్ వర్రీ, యూ విల్ బి సేఫ్ యిన్ మై హాండ్స్" అంటూ భుజం తట్టింది. "సరే మందులు ఇంజక్షన్సు రాసిస్తాను. ఈ నెలయినా ఇప్పిస్తే కాస్త కోలుకుంటుంది అమ్మాయి.... ఇంకా ఇరవై రోజుల పైన టైముందిలేండి...." అంది డాక్టరు.
    "ఇంజక్షన్సు మీరే ఇస్తారా అండీ?"
    "మీ యిష్టం, ఎవరిచ్చినా ఈయవచ్చు అనుకోండి. కాని ఎప్పటికప్పుడు ఏ మాత్రం ఇంప్రూవ్ మెంటు వుందో నేను చూస్తూండడం అవసరం..." అంటూ ఆపేసింది. ఆ మాట అన్నాక అవతలివాళ్ళు ఆవిడ దగ్గిరకే తీసుకురాక మానరని ఆవిడకి తెల్సు. ఒక్కొక్క ఇంజక్షనుకు పది రూపాయలు బిల్లు వేయవచ్చు అన్న విషయం ఆమెకెవరూ చెప్పనక్కర లేదు.
    "సరే. అయితే వస్తాం.... మీ బిల్లు___" అన్నాడా పెద్దమనిషి.
    "బయటగదిలో నర్సు వుంటుంది. అక్కడ ఈయండి." నిర్లక్ష్యంగా అంది డాక్టరు. అదో పెద్ద విషయం కానట్లు, బిల్లుకి అంత ప్రాముఖ్యం లేనట్టు. కాని పై గదిలో నర్సు పేషెంట్లు వెళ్ళడానికి ముందే రెడీగా నిల్చుని డాక్టరుగారి విజిటింగు ఫీజు పాతిక రూపాయలు అక్కడ పెట్టందే, ఎంత తెల్సినవాళ్ళనీ వెళ్ళనీయదని, మళ్ళీ మర్నాడు వచ్చే పేషెంట్లు కూడా రేపటి సంగతి రేపు, ఈరోజుది ఈరోజు అంటుందని పాపం ఆ పెద్దమనిషికి తెలియక డాక్టరు మంచిని, మాట మంచిని, ఆమె శ్రద్ధా సక్తులని మన స్ఫూర్తిగా మనసులోనే మెచ్చుకుంటూ అతి శ్రద్ధగా, కృతజ్ఞతలో నమస్కారంపెట్టి శెలవు తీసుకున్నాడు.

                                              *    *    *    *

    సరోజనీ మెటర్నిటీ హోమ్ కి ఆ నగరంలో మంచి పేరు ప్రతిష్ఠలే వున్నాయి. డాక్టరు సరోజనీ గైనికాలజీ స్పెషలిస్టు అవడం ఒక కారణం. ఆ చుట్టుపక్కల ఆ మాత్రం సదుపాయాలున్న నర్సింగు హోమ్ మరోటి లేకపోవడంతో సరోజిని ఖరీదు___ అందుబాటులో లేకపోయినా అంతో ఇంతో వున్నవాళ్ళందరూ ఆమె దగ్గిరికి వెడుతుంటారు. వెళ్ళక తప్పదు అని అనాలేమో, ఏమాట కామాటే చెప్పుకోవాలి... ఆవిడ విజిటింగు ఫీజు పాతిక రూపాయలు, ఆవిడ నర్సింగు హోమ్ లో రూముకి రోజుకి ఇరవై రూపాయలు. నార్మల్ డెలివరీ అయినా రెండొందల బిల్లు. కాస్త కాంప్లికేటెడ్ పురుళ్ళకి మూడొందలు నాలుగువందలు పుచ్చుకుంటే ఏంగాక, ఆవిడ నర్సింగు హోమ్ మంచి నీటుగానూ దాన్లో పేషంట్లకి మంచి ఎటెన్ షన్, డే డ్యూటీకి ఇద్దరు నర్సులు, నైడ్యూటీకి ఇద్దరు నర్సులు అంతా మంచి సిస్టమేటిక్ గా జరుగుతుందంటారు అందరూ.
    డాక్టరు సరోజనీలాగే ఆవిడ నర్సింగు హోమూ అందంగా ఆధునికంగా వుంటుంది. ఆవిడలాగే నున్నగా ఆవిడ నర్సింగు హోమ్ ఫ్లోరింగు మెరుస్తూంటుంది. ఆవిడ కట్టే అందమైన ఖరీదయిన చీరల్లాగే నర్సింగు హోమ్ లో అందమైన, ఖరీదయిన పరదాలుంటాయి. ఆవిడ మంచి ఖరీదయిన ఉడుకులాం వాసన వేస్తే ఆవిడ నర్సింగు హోము లాసార్ వాసన లేస్తుంటుంది. రోజూ ఆవిడ విరిసీ విరియని గులాబీ తలలో పెట్టుకోవడమే గాక గులాబీలను పేషెంట్ల గదుల్లో ఫ్లవర్ వాజుల్లో పెట్టిస్తుంది. మొత్తానికి డబ్బు మాట ఎలా వున్నా నర్సింగు హోములో హాయిగా వుంటుందని అనుకోకుండా వుండలేరు ఎవరూ. డబ్బు గుంజితే గుంజిందికాని మంచి శ్రద్ధ చూపిస్తుంది. హస్తవాసీ మంచిదే అనుకుంటారు పేషెంట్లు వెళ్ళేటప్పుడు.
    ఆవిడ మనిషెంత అందంగా నాజూగ్గా వుంటుందో ఆవిడ మనసంత వికారంగా, కఠినంగా వుంటుందంటారు తెలిసినవాళ్ళు. జీవితంలో ఆవిడకి డబ్బు సంపాదించడమే ధ్యేయం. ఆవిడ మనీకి తప్ప, మైండుకి ఏ విలువా ఈయదని, ఆవిడ మైండు, హార్టు వగైరాలన్నీ మనీ క్రింద కప్పబడి వుంటాయని, ఆ మనీ సంపాదించడం కోసం పాపానికీ పుణ్యానికి వెరవదనీ ఆ మనీకోసం జిత్తులు, ఎత్తులు ఎన్నైనా వేస్తుందనీ అనుకుంటారు ఆవిడని తెల్సినవాళ్ళు.
    కాన్పుకి పేషంటుని టేబిల్ మీదకి ఎక్కించిం దగ్గిరనించి తెగ గాభరాపడిపోతుంది. నాలుగు గట్టినొప్పులు పడనీయదు. "అయ్యో అయ్యో పిల్ల అలిసిపోతుంది. అంత అలసిపోకూడదు. 'అయ్యో అయ్యో పిల్ల అలిసిపోతుంది. అంత అలసిపోకూడదు. 'అయ్యో పాపం అమ్మాయి ఓర్చుకోలేక పోతుంది.' అంటూ స్వంత కూతురు నొప్పులు పడ్తోంటే చూడలేని తల్లిలా గిలగిల లాడ్తుంది. "లాభంలేదు. అమ్మాయి ఇంక కష్టపడలేదు. ఫోర్ సెప్స్ వేసి తీసేస్తాను." అంటూ హడావిడిపడ్తుంది. అలా గాభరాపడే డాక్టరుని చూసి నెప్పులు పడే ఆడవాళ్ళు వాళ్ళ భర్తలు, తల్లులు తండ్రులు నిజంగా ఈ డాక్టరు ఎంత మంచిది, ఎంత జాలి గుండె, పేషెంటుని ఎంత జాగ్రత్తగా చూస్తుంది. ఇంత శ్రద్ధ ఇంకో డాక్టరెవరూ చూపించరు అనుకుంటూ ఆవిడపట్ల కృతజ్ఞతతో వాళ్ళ మనసులు నిండిపోతాయి తప్ప డాక్టరుగారి ఆ గాభరా, ఆ ఆదుర్దా ఆవిడకి ప్రతీ కాన్పుకీ అలవాటయిన వ్యవహారం అని అలా అలా ఎన్నో కాన్పులకి అలవాటయిన ఆ నటన యిప్పుడు ఆవిడకి మామూలు అయిపోయిందని, నటించక్కరలేకుండానే నోట్లోంచి ఆ మాటలు వస్తాయని వాళ్ళు గ్రహించలేరు. ఆవిడ మొహంలో హావభావాలు ఆమెకి తెలియకుండానే మారిపోతుంటాయని చస్తే వూహించలేరు. ఆ ఆదుర్దా అంతా ఫోర్ సెప్స్ వేస్తే మరో వంద బిల్లు ఎక్కువ చేయవచ్చని. నొప్పులు మామూలు నొప్పులే అయినా ఏదో బిడ్డ బయటకి రాదన్నంత హడావిడి తను పడి, పేషెంట్ల తాలూకువాళ్ళని పెట్టి ఆ కాంప్లికేటెడ్ కేసుని తనుగాబట్టి గట్టెక్కించినట్టు, అందు మూలంగా ఆమె పడిన కష్టానికి మరికాస్త బిల్లు వడ్డించవచ్చని ఆవిడ అనుకుంటుందన్న విషయం వాళ్ళ వూహకి ఎలా అందుతుంది?
    కాన్పులకేకాదు. మామూలు ఏ గర్భిణి స్త్రీయో పరీక్ష చేయించుకోడానికి వచ్చినా పరీక్షిస్తూ ఆదుర్తాగా "బిడ్డ సరిగా తిరుగుతూందా" అనో "నొప్పి ఏమన్నాగాని వస్తుందా" అంటూ అడుగుతుంది. దాంతో టేబిల్ మీద పేషంటు గాభరాపడ్తూ "ఏం డాక్టర్, అలా అడుగుతున్నారు" అంటూ కలవరపడ్తారు. ఆవిడ కాస్త ఆలోచన నటించి మరోసారి పరీక్షిస్తుంది సీరియస్ గా మాట్లాడకుండా! పేషెంటు మరింత గాభరాపడుతుంది. "కాస్త గట్టిగా నొప్పి వస్తే పురుడు వచ్చేట్టుంది" అంటుంది. దాంతో ఏ ఏడో నెలో వున్న ఆ పేషెంటు "అయ్యో! అదేమిటండి, ఎలాగండీ, అంటూ భయంగా చూస్తుంది. అప్పుడు డాక్టరు దీర్ఘంగా ఆలోచిస్తూ, చేతులు కడుక్కుంటుంది. తాపీగా పేషెంటుని మరిచిపోయి అవతల పేషెంటు డాక్టరు నోట్లోంచి రాబోయే మాట కోసం ప్రాణాలుగ్గపట్టుకుని ఎదురు చూస్తూంటుంది. డాక్టరింకా ఆలోచిస్తూనే కాగితం తీసి రాస్తుంది. "చూద్దాం. మరేం పరవాలేదులే.... ఇంజక్షన్సు యిస్తాను.... అంతా నేను సరిచేస్తాగా! కంగారు పడకు. ఇంట్లో అట్టే తిరక్కు. భయపడకు నేనున్నానుగా" అంటూ ధైర్యం చెపుతుంది. పేషెంటుకి పోయిన ప్రాణం తిరిగి వస్తుంది. ఏదో క్రిందపడి పోవడానికి సిద్ధంగా వున్న నెల తక్కువ బిడ్డని క్రిందపడకుండా నెలలు నిండేవరకూ నిలిపి వుంచింది. ఈ డాక్టరు గాబట్టి అనిపించి వాళ్ళు ఆవిడపట్ల కృతజ్ఞతతో, గౌరవంతో ఉక్కిరిబిక్కిరి అయి ఆవిడ బిల్లు ఎంత వేసిందో కూడా పట్టించుకోకుండా ఇచ్చేస్తారు తప్ప డబ్బెక్కువ లాగడానికి అలా అందని వాళ్ళు ఊహించలేదు. అలాగే ప్రతీ కేసుని, సింపుల్ కేసుని, కాంప్లికేటెడ్ చేసేసి ఎక్కువ డబ్బు లాగుతుందనీ పాపం చాలామంది గ్రహించలేరు. జనరల్ ఆస్పత్రిలో మూడు నిమిషాలలో అయ్యే 'కార్టరైజేషన్' లాంటి సింపుల్ వాటికి కూడా ఓ అరగంట చేసి మూడొందలు గుంజుతున్న విషయమూ గ్రహించలేరు. జనరల్ ఆస్పత్రికి వెళ్ళే పేషెంట్లని అక్కడి డాక్టర్లు సరోజినీదేవితో లాలూచీలు వుండే డాక్టర్లు కాస్తో కూస్తో డబ్బున్న పేషంట్లని ఫలానా నర్సింగుహోమ్ అయితే మీకు చాలా సదుపాయంగా వుంటుంది. మంచి ఎటెన్ షన్ వుంటుంది. ఆ డాక్టరు చాలా మంచిది" అంటూ సరోజినీ నర్సింగుహోము వైపు డైవర్టు చేయడానికి ప్రయత్నిస్తారు. జనరల్ ఆస్పత్రి చుట్టూ తిరిగే ఓపికలేని డబ్బున్న వాళ్ళు, పొరుగూరినుంచి వచ్చే ధనవంతులు, పని త్వరగా ముగించుకోవాలని ఆరాటపడేవాళ్ళు, జరనల్ ఆస్పత్రిలో చెడిపోయిన ఎక్విప్ మెంటు ఎప్పుడు బాగవుతుందో, అసలు బాగవుతుందో లేదో (అసలు చెడి పోయిందో లేదో) తెలియనివాళ్ళు అందరూ సరోజినీదేవి నర్సింగ్ హోమ్ కి వెళ్ళి జనరల్ ఆస్పత్రిలో ఏ పాతిక రూపాయలతో అయ్యేదానికి రెండొందలు సమర్పించుకున్నామన్న సంగతి గుర్తించుకోకుండా పని త్వరగా ముగిసింది, నర్సింగ్ హోము చాలా బాగుంది అనుకుంటారు తప్ప, ఇలాంటి కేసులకి వచ్చే డబ్బు ఆ డాక్టరు ఈ డాక్టరు చెరి సగం పంచుకుంటారన్న సంగతి గ్రహించలేరు! ఎవరన్నా గ్రహించినా మరో గత్యంతరంలేక మనసులో తిట్టుకుంటూనే వాళ్ళవసరం కోసం అక్కడికి వెళ్ళకా తప్పదు. వెళ్ళి ఆవిడ కోరినంత సమర్పించుకొనక తప్పదు!


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS