Previous Page Next Page 
సంసారంలో శ్రీశ్రీ పేజి 5

    మనిషికి తెగువా, తెంపరితనమూ
    పొగరూ చిగురు కావాలి

    అన్యాయాలను నరకాలంటే
    అక్రమాలపై  ఉరకాలంటే

    ఏకాకిని  పలుగాకులు పొడిచే
    ఈ లోకంలో నడవాలంటే

    గుండెధైర్యమే కావాలి, నువు
    పొగరుబోతువై పోవాలి.
   
    రాకపోదు  రేపు మాకు
    ఆరిపోదు  ఆశ మాకు
    మాదే ఈ యుగం
   
    సాగే  అడుగులు  అగవులే
    వడివడి  పరుగిడులే

    కాలే  బ్రతుకులు  పోరునులే   
    మనిషే  మారునులే
   
    బ్రతికే దారులు  కలవు చాల   
    ఎదలో  ఆశను  విడువ నేల

    ఒకడే  చాలు సవాల్ చేయ
    చవటలతో  పనియేల

    ఆకలి  తీరదు  కేకలేస్తే
    రూకలు రాలవు  చేయిజాస్తే

    చీకటి  తెరలను  తొలగిస్తాం   
    ఆశాజ్యోతులు వెలిగిస్తాం
   
    ఆరిన దీపము  మరల వెలగదు, చ_
    ల్లారిన  కోపము  తిరిగి రగలదు

    మనసు మనసుకీ  మమతల  వంతెన
    గుండె గుండెకీ  వెలుగుల నిచ్చెన

    దైవంగా చూడాలన్నారు
    అలా ఆ నాడు

    ఆ దైవాన్నే  బట్టలు  విప్పి  ఆడిస్తున్నారు   
    ప్రబుద్దులంతా  ఈ నాడు


                                    శ్రీశ్రీ  చిన్ననాటి  ముచ్చట్లు


    మూడోరోజు  ఉదయం  ఎనిమిది  గంటలకి డ్రైవర్ సుబ్బారావు వచ్చాడు. "అయ్యగారు మిమ్మల్ని తీసుకురమ్మంటున్నారమ్మా" అన్నాడు. ఆనాడు సుబ్బారావు అన్న మాటలు, రవణమ్మ గారన్న మాటలు  నేను మరచిపోలేదు. అందుకే ససేమిరా రానన్నాను. ఎంతో బతిమాలాడు. కానీ నేను  వెళ్ళలేదు. చివరికి  చేసేదేమీలేక  తిరిగి వెళ్ళిపోయాడు.

    కానీ మరో గంటలో  తిరిగివచ్చేశాడు. "మిమ్మల్ని తీసుకురాకుండా  హాస్పిటల్లో  అడుగుపెట్టద్దని  అయ్యగారు  కోపం పడుతున్నారమ్మా! అక్కడ నానా అల్లరిగా  వుంది. దయచేసి  మీరు రండమ్మా" అన్నాడు.

    "సరే. నువ్వెళ్ళు. నేను వస్తాలే" అన్నాను.

    "రండి. కార్లో వెళదాం" అన్నాడు.

    "ముందే చెప్పానుగా. ఇప్పట్లో  నీ కారు ఎక్కను. అరగంటలో  అక్కడుంటాను. వెళ్ళు" అని త్వరగా తయారై టాక్సీలో  వెళ్ళాను.

    ఆవిడగారు. శ్రీశ్రీగారి ముఖం  చాలా గంభీరంగా వుంది.

    "నన్ను  మర్చిపోయావేమిటి?" అని అడిగారు.

    "మరచిపోతే  ఎందుకొస్తాను" అని అంటూ వుంటే నా కళ్ళలో  నీళ్ళు తిరిగాయి.

    "నేను ముందే చెప్పాను  సరోజా! నాకోసం  దాని బాధ భరించక  తప్పదని. సరే. నువ్వంత బాధపడుతూ  రానక్కరలేదు. నా ఆరోగ్యం  తేరుకున్నాక  నేనే వస్తాలే. మరో రెండు  రోజులుండి  డాక్టర్ గారు ఇంటికి వెళ్ళిపోమన్నారు. పదిహేను  రోజులు పూర్తి రెస్ట్ లో వుండాలన్నారు. నువ్వు కూడా రెస్ట్ తీసుకో" అని చెప్పారు.

    "సరే. మిమ్మల్ని  చూశాను. మీరు బాగున్నారు. నేనిక వెళతాను. సెలవిప్పించండి" అన్నాను.

    "అంటే....మరి రావా?" అన్నారు.

    "చూడండి. నేనెక్కడికీ  పోను. మీరు బాగా  కోలుకున్నాక ఇంటికి  రండి" అన్నాను.

    "అదేమిటి సరోజా! ఇప్పుడేగా  వచ్చావు. కూర్చో" అంటూ, "ఫేస్ ఫుల్ గా వేద్దూ" అన్నారు. వేశాను.

    "నాకో సిగరెట్  అందిస్తావూ?" అని  అడిగారు. అగ్గిపెట్టెతో  సహా ఇచ్చాను.

    "ఏమైనా  మంచి మాటలు  చెపుదూ" అన్నారు.

    "సర్లేండి. నేనింకా  మిమ్మల్ని  ఆ మాట  అడుగుదామనుకుంటున్నాను. మనస్సు  అసలు బావుండడంలేదు. మీరు మీ గురించి చెప్పండి. నాకు కాస్త ఉత్సాహం వస్తుంది" అన్నాను.

    "ఫేస్ ఫుల్ గా తిప్పలేదా?" అన్నారు.

    "ఫుల్ గానే వుందండీ" అన్నాను.

    "సరిగ్గా  గాలి తగలడంలేదు. గాలి  తిని బతికేస్తానని  మా పెద్దబావ  అనేవాడు" అన్నారు.

    "గాలి తినడం ఏమిటండి బాబూ!" అని నవ్వాను.

    "ఊరికే  అంటున్నాలే! గాలి_ముఖ్యంగా  సముద్రపు గాలి అంటే నాకు  విపరీతమైన ఇష్టం. సముద్రపు ఒడ్డున  నిల్చొని  సూర్యోదయం చూడడమంటే చెప్పలేనంత  ఇష్టం. అలాగే కార్తీకమాసం  వెన్నెలంటే  సరదా. తూర్పున సూర్యుడు ఉదయించిన  సమయానికే నేను పుట్టానట. చైత్రశుద్ధ షష్టినాడు  పుట్టానని  మా పెద్దబావ, శ్రీరామనవమి రోజున పుట్టానని మా అమ్మమ్మ అంటూ వుండేవారు. నా ఏణ్ణర్ధమప్పుడే  మా అమ్మ చనిపోయింది. నాకు అన్నలూ అక్కలూ తమ్ముళ్ళూ చెల్లెళ్ళూ ఎవ్వరూలేరు. నేను మాతృప్రేమకీ, సోదర సోదరీ ప్రేమకీ దూరంగా  బ్రతికాను. అందువల్లనే  ప్రేమంటే  ఒక అపనమ్మకం  నాలో చిన్నప్పటి నుండీ  వర్ధిల్లుతూ  వచ్చింది. మా నాన్న మాత్రం నన్ను అతి గారాబంగా  పెంచాడు" అన్నారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS