Previous Page Next Page 
నేటి కాలపు మేటి కథకులు పేజి 2


    నర్సమ్మ జీవితం ఒక కష్టాల కడలి. బీదరికం వల్ల పన్నెండేళ్ళకే ముఫ్ఫై ఏళ్ల వ్యక్తితో పెళ్లవుతుంది. వ్యసనపరుడూ, స్త్రీ ల్తోలుడూ అయిన భర్తతోనూ, గయ్యాళి, క్రూరురాలు అయిన అత్తతోనూ అష్టకష్టాలు పడి చివరికి ఓ కొడుకును కంటుంది. కొన్నాళ్ళకు భర్త, అత్త పోయినా కొడుకును పెంచి పెద్దజేసి కలెక్టర్ ను చేస్తుంది. చివరికి ఓ డబ్బున్న అమ్మాయిని పెళ్ళి చేసుకొనేందుకు ఆ కొడుకు తన తల్లి చనిపోయిందని, తనకు ఎవ్వరూ లేరని చెబుతాడు. బండ చాకిరీ కింద నలిగిపోయి రూపు మారిపోయిన ఆవిడ.....వంట చేయడంలో మాత్రం సిద్ధహస్తురాలు. ఆ వంటే తన వృత్తిగా మార్చుకుంటుంది. ఎవరికైనా నామమాత్రపు డబ్బులతో వంట చేసి పొట్ట పోసుకుంటుంది.
    ఒకరోజు రచయిత్రి ఇంటికి రామం కుటుంబం అతిథులుగా వస్తారు. నర్సమ్మ వంట బాగా మెచ్చుకుని వచ్చే వారం తన తల్లి తద్దినానికి వంటకు రమ్మని వీళ్ళతో అడిగిస్తారు. ఆమె ససేమిరా వెళ్ళనంటుంది. చివరికి రచయిత్రి అడిగినప్పుడు 'ఎవరికయినా చనిపోయాకే తద్దినం పెడతారు. నాకు మాత్రం బతికుండగానే తద్దినం పెట్టడం....దానికి కూడా నేనే వంట చేయడం! ఎలా వెళ్తానమ్మా?' అంటుంది. స్త్రీలు చదువు లేకపోయినా, భర్త లేకపోయినా, జీవితపు ప్రతి దశలో పరిస్థితులు ప్రతికూలించినా తమకు తెల్సిన విద్యను, పనిని ఆధారం చేసుకుని ఎలా బ్రతుకుతారో, ఆత్మాభిమానాన్ని ఎలా కాపాడుకుంటారో 'కొడుకు కొడుకనీ మురువకే' కథలో చూడొచ్చు.
    'అభిమాన భంగం' కామేశ్వరి గారి అత్యుత్తమ కథల్లో ఒకటి. ఎవరైనా స్త్రీ అత్యాచారానికి గురైనప్పుడు మానభంగం అనే మాటను తరచూ వాడుతుంటారు. అసలు ఆ మాట వాడడమే తప్పు. దాన్నొక ఆక్సిడెంట్ గానే చూడాలి అనేది ఇంకా మన సమాజం నేర్చుకోవాల్సే ఉంది. అయితే నిత్యం నాలుగు గోడల మధ్య ఎందరో స్త్రీల, గృహిణుల అభిమానం అటు కుటుంబ సభ్యుల వల్లగానీ, భర్త వల్ల గానీ దెబ్బతింటూనే ఉంది. మాటల ద్వారా, చేష్టల ద్వారా మనసును గాయపర్చడం మానభంగం కంటే ఘోరమైనది అన్న విషయాన్ని 'అభిమాన భంగం' కథలో గృహిణి పాత్ర ద్వారా తెలియపరుస్తారు.
    పెళ్ళయిన తెల్లవారో మర్నాడో పెళ్ళికూతుర్నీ పెళ్ళి కొడుకునీ శోభనం పేరుతో గదిలోకి పంపి బయట గొళ్ళెం పెట్టడం మనవాళ్ళలో సంప్రదాయం. వధూవరులిద్ధరికీ అలా ఏకాంతం కల్పిస్తున్నామనుకునే ఈ ఆచారంలో ఏకాంతం మాటెలా ఉన్నా వాళ్ళిద్దరికీ ఇరకాటంగా ఉండే మాట వాస్తవం. ఇప్పుడిప్పుడు ఇలాంటి అలవాట్లు పోతున్నాయి. 'తలుపు గొళ్ళెం' కథలో నాయనమ్మకు అలా కొత్తదంపతులని గదిలో ఉంచి తలుపేసి గొళ్ళెం పెడితే ఆ అబ్బాయి అమ్మాయిని ఎంత హింసిస్తాడో అని విపరీతమైన భయం. అందుకు కారణం లేకపోలేదు. బాల్యంలోనే వివాహమవడం తెలిసీ తెలియని వయసులో పెళ్ళి పేరుతో భర్తకు ఆమె దేహంపై లభించిన హక్కుతో సాగించిన బలాత్కార శృంగారం, ఎటూ పారిపోలేని, ఎవరికీ చెప్పుకోలేని దైన్యం..... ఇవన్నీ ఆమె స్వీయ అనుభవాలు. అలాంటి నరకమే ఇప్పటి అమ్మాయిలకి కూడా ఎదురవుతుందేమోననే నాయనమ్మ భయాన్ని చూపించిన ఈ కథ ఒకనాటి స్త్రీల దాంపత్య అనుభవాలు ఎలా ఉండేవో చెబుతుంది.
    'సశేషం' కథలో ఆదునికత పేరుతో ఇప్పటి యువతులు ఏం కోల్పోతున్నారో తెలిపారు రచయిత్రి, ప్రసాద్, రమల కూతురు భావన. సరదాలు, సంతోషాలు స్నేహితులు, పార్టీలు, పబ్బులు..... వీటితో అనుక్షణం ఉల్లాసంగా ఎంజాయ్ చేయడమే జీవితం అని భావించే పాతికేళ్ళ యువతి. ఏ రోజూ రాత్రి పన్నెండు లోపు ఇల్లు చేరదు. వాలెంటీన్స్ డే రోజున ఓ పబ్బులో రాత్రి రెండు గంటలకు ఫ్రెండ్స్ తో తాగి డాన్సు చేస్తూ పోలీస్ రెయిడ్ లో దొరుకుతుంది. ఇంటికి ఫోన్ రాగానే తల్లిదండ్రులు పరిగెత్తి వెళ్ళి కేస్ బుక్ అవకుండా పోలీసుల్ని బతిమిలాడి కూతుర్ని ఇంటికి తీసుకొస్తారు. ఆ మర్నాడే పేపర్లో ఈ విషయం రావడంతో వేరే ఇల్లు చూసుకోమని కూతురికి సీరియస్ గా చెబుతాడు ప్రసాద్. ఉక్రోషంతో తన కొలీగ్ అపర్ణ ఇంట్లో ఉందామని అడుగుతుంది. కానీ, అతి మామూలుగా, తక్కువ సౌకర్యాలతో ఉండే ఆ షేరింగ్ ఇల్లు భావనకు నచ్చదు. ఆ సందర్భంగా తండ్రి లేని తనెంత కష్టపడి చదువుకుని ఉద్యోగం చేసి తల్లికి సపోర్ట్ చేస్తుందో చెప్పి బ్రెయిన్ వాష్ చేస్తుంది అపర్ణ. చివరికి కొంత తగ్గి ఆలోచనలో పడుతుంది భావన. తాత్కాలికంగా సమస్య కొంచెం తగ్గినా వాస్తవాలు తెలుసుకోకుండా ఈ మితిమీరి స్వేచ్చ, అహంభావం, కోపం ముందుముందు ఏ ఉపద్రవం తెచ్చి పెడుతుందోనని భయపడుతుంది తల్లి.
    ఆడా మగా స్నేహాలు, ఎప్పుడైనా ఓ హోటల్ కి, బయటికి వెళ్ళడం తప్పు కాకపోయినా తాగడం, అర్దరాత్రి దాటాక ఇంటికి రావడం, తల్లిదండ్రులు ఏదైనా అంటే 'నేను చిన్నపిల్లనా, నాకు తెలియదా, నాకు స్వేచ్చ లేదా' అంటూ మాట్లాడే అమ్మాయిలంతా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ప్రతి పనికీ, చర్యకీ, ఇష్టానికీ కొన్ని పరిధులుంటాయనీ, హక్కులున్న చోట బాధ్యతలూ ఉంటాయనీ, ఏదైనా శ్రుతిమించితే నష్టపోయేది స్త్రీలేననీ రచయిత్రి హెచ్చరిస్తారు.    
    'భార్యాభర్తల మధ్య మరో స్త్రీ' అన్న సమస్య ఎంత పాతదో అంత కొత్తది. 'అందిన ద్రాక్ష' కథలో ఆఫీస్ లో కలిసి పనిచేసే రంజనతో తన భర్త భాస్కర్ కు అక్రమ సంబంధం ఉన్న విషయం ఋజువులతో సహా తెలుసుకున్న ప్రభావతి అతన్ని నిలదీస్తుంది. కోపంతో ప్రియురాలి ఇంటికి వెళ్ళిన భాస్కర్ కు మూడు వారాల్లోనే ఇంటా బయటా ఎన్నో చేదు అనుభవాలు ఎదురౌతాయి. తిరిగి తన ఇంటికి వచ్చిన భర్తను కొడుకు కోసం క్షమించినా....ఇక ముందు పిల్లవాడికి తండ్రిగా తప్ప, తనకు భర్తగా ఉండే అవకాశం లేదనీ, అలా అయితేనే ఇంట్లో ఉండనిస్తాననీ ప్రభావతి తేటతెల్లం చేస్తుంది. 'ఈనాటి ఆడది భర్త లేకపోయినా, కాపురం లేకపోయినా స్వశక్తితో తన కాళ్ళ మీద తాను నిలబడి పిల్లల్ని పెంచుకోగలదు. లోకంలో ఒంటరిగా బ్రతికే ధైర్యం ఆమెకు ఆర్ధిక స్వతంత్రం వల్ల వచ్చింది. పెళ్ళాం ఉండగా పరాయి ఆడదాని వెంటపడే మగ మనస్తత్వం ఈ తరం ఆడది సహించదు' అన్న మాటలు ఈ కథలోని ప్రభావతివే కయు, నేటి తరం చదువుకున్న ఇల్లాళ్ళందరివి కూడా!
    'ఇలాంటి అమ్మాయిలెందరో' అనే పేరుతో సెక్స్ వర్కర్ల గురించి ఓ కథ రాశారు. ఈ కథ ఇరవై ఏళ్ళ క్రితం వ్రాసినది. అరవై ఫ్లాట్స్ ఉన్న ఓ అపార్టు మెంట్ కాంప్లెక్స్ లోకి కొత్తగా ఓ అమ్మాయి వస్తుంది. ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళ నిబంధనలు ఏవీ పాటించదు సరికదా ఆమె ప్రవర్తన చూస్తే కుటుంబ స్త్రీలా అగుపించదు. భర్త ఊరెళ్ళాడనీ, వచ్చాక అడ్వాన్స్ చెల్లిస్తాననీ అంటుంది గానీ, రాత్రుళ్ళు అపరిచితులైన మగవారు ఆమెకోసం వస్తుంటారు. పగలంతా నిద్రపోవడం, సాయంత్రం చక్కగా తయారై తనతోబాటూ వచ్చిన ఇంకో అమ్మాయిని తీసుకుని బయటికెళ్ళి ఏ రాత్రికో రావడం అడ్డగించిన వాచ్ మన్ తో గొడవపడటం చేస్తుంటుంది. రచయిత్రి కూడా అదే అపార్ట్ మెంట్ లో ఉన్నట్లు నడిపిన కథ ఇది.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS