ఆదాయం - 2 వ్యయం - 8 రాజపూజ్యం - 1 అవమానం - 2

గురువు ఉగాది నుండి 1-6-2026 వరకు షష్టమస్థానంలో రజితమూర్తిగా సంచరించును. తదుపరి 31-10-2026 వరకు సప్తమస్థానంలో లోహమూర్తిగా, ఆ తరువాత ఉగాది వరకు కూడా సప్తమస్థానంలోనే లోహమూర్తిగా సంచారము చేయును. శని ఉగాది నుండి మరల ఉగాది వరకు తృతీయస్థానంలో తామ్రమూర్తిగా సంచరించును. రాహు–కేతువులు ఉగాది నుండి 5-12-2026 వరకు సువర్ణమూర్తులుగా, తదుపరి ఉగాది వరకు తామ్రమూర్తులుగా సంచరించును. ఈ రాశి స్త్రీ–పురుషులకు, ముఖ్యంగా రైతు సోదరులకు అత్యంత జాగ్రత్తఅవసరం. వ్యవసాయ పనులలో ముందస్తు ప్రణాళిక లేకపోతే నష్టాలు రావచ్చును. వాస్తు దోషాలు, గ్రహ కలయికల ప్రభావం వలన తీవ్రమైన మానసిక ఒత్తిడులు కలగవచ్చు; కావున ఆధ్యాత్మిక బలాన్ని తప్పనిసరిగా ఆశ్రయించాలి. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలలో ఉన్నవారు—డాక్టర్లు, లాయర్లు, కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులు, సామాన్య ప్రజలు—అందరూ కొంత ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. పిల్లల వివాహాలు ఈ కాలంలో కుదిరే అవకాశమున్నది. ఆర్భాట వ్యయం పెరిగి ఉన్న ధనం ఖర్చవుతుంది; కొత్త అప్పులు చేయవలసి వచ్చే సూచనలు ఉన్నాయి.

గురుబలం బలహీనంగా ఉండుట వలన ఆర్థిక స్థిరత్వం ఆలస్యమవుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గే పరిస్థితులు కనిపిస్తాయి. ప్రేమాభిమానం మాటలలో కనిపించదు. ఉద్రేకం, అహంకారం, ఈగోలకు ప్రాధాన్యత ఇవ్వడం వలన సమస్యలు తలెత్తుతాయి. వాత సంబంధ వ్యాధులు కలిగే సూచనలు ఉన్నాయి; ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయరాదు. గురు ధ్యానం చేయుట వలన కొంత మేలు జరుగుతుంది. ఈ సంవత్సరం నవగ్రహ ఆరాధన ద్వారానే స్పష్టమైన ఫలితాలు లభిస్తాయి. ఇష్టదేవతారాధనను ఆర్భాటం లేకుండా, వినయంతో చేసినచో అసూయ, ద్వేషాలు అంటవు. పెద్దపరిశ్రమల వారికి సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. చిన్న పరిశ్రమల వ్యాపారులకు మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. సరైన వ్యూహంతో, వాస్తు శాస్త్రం అనుసరించి, గృహదోష నివారణ పూజలు చేసుకునేవారు ఈ సంక్షోభాన్ని అధిగమించగలరు. “మా కుటుంబం ఎటువంటి ఒత్తిడికి గురి కాకూడదు” అని పట్టుదలతో, సంయమనం పాటించే వారికి ప్రతికూలతలు ఎక్కువగా ప్రభావం చూపవు. ఆకస్మిక ధనలాభం సూచనలు ఉన్నాయి. స్త్రీలకు గౌరవం పెరుగుతుంది. కుటుంబ సభ్యులు పరస్పర అవగాహనతో నడిచినచో సమాజంలో గౌరవమన్ననలు పెరుగుతాయి. మీ అదృష్టం మీ నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది.విద్యార్థులకు ఇది కొంత ఇబ్బందికర కాలము. అయినా సరస్వతి దేవి ద్వాదశ నామ జపం చేయుట వలన చదువులో పురోగతి సాధించగలరు, పోటీ పరీక్షలలో ప్రథమ స్థానానికి చేరే అవకాశం ఉంది.

నక్షత్రాల వారీ పరిహారములు: ఉత్తరాషాఢ నక్షత్రం వారు జాతి కెంపు ధరించి సూర్యనారాయణ పూజలు ఆచరించాలి. శ్రవణ నక్షత్రం వారు జాతి ముత్యం ధరించి, దుర్గాదేవికి కుంకుమతో అష్టోత్తర–సహస్రనామములు, శ్రీచక్రారాధన చేయాలి. ధనిష్టనక్షత్రం వారు జాతి పగడం ధరించి, 1¼ కిలో కందులు, ఎరుపు వస్త్రాలు దానం చేయాలి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజలు తప్పనిసరిగా చేయాలి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన గ్రంథాలను చదివి, ఇతరులకు చదివించేవారికి గృహయోగం కలుగుతుంది. గత జన్మ దోష నివారణకు అమావాస్య రోజున పితృ తర్పణలు ఆచరించాలి. ధ్యానం, యోగ, ఆక్యుప్రెషర్, ఆయుర్వేద ఆరోగ్య సూత్రాలు పాటించుట వలన మానసిక–శారీరక శాంతి లభిస్తుంది. అదృష్ట సంఖ్య: 8.


More Rasi Phalalu 2026 - 2027