ఆదాయం - 2, వ్యయం - 11, రాజపూజ్యం - 4, అవమానం - 7
గురువు గ్రహము ది. 01-06-2026 నుండి వ్యయ స్థానములో రజితమూర్తిగా సంచారము చేయును. జూన్ 2, 2026 నుండి జన్మరాశిలో సువర్ణమూర్తిగా సంచరిస్తూ శుభఫలితములు ప్రసాదించును. మరల ది. 31-10-2026 నుండి ఉగాది వరకు లోహమూర్తిగా సంచారము చేయును. శని గ్రహము ఉగాది నుండి మరల ఉగాది వరకు రజితమూర్తిగా సంచారము చేయును. రాహు-కేతువులు ఉగాది నుండి ది. 05-12- 2026 వరకు సువర్ణమూర్తిగా, అనంతరం ఉగాది వరకు లోహమూర్తిగా సంచారము చేయుదురు. ఈ రాశి స్త్రీ–పురుషులకు మిశ్రమ ఫలితములు కలుగును. వ్యవసాయ సంబంధితులకు సామాన్యమైన దిగుబడి లభించును. ముహూర్తబలంతో ఆలోచించి చేసిన కార్యములలో అనుకూలత ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలలో పరిస్థితులు కంటికి కనిపించే విధంగా సాగును. లాయర్లు, డాక్టర్లు, కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులకు ఆదాయం వచ్చినప్పటికీ ధనం నిలవక ఖర్చుల రూపంలో వెళ్ళిపోవును. పిల్లల వివాహములు, గృహ నిర్మాణము, కారు, భూములు కొనుట వలన ఉన్న ధనం ఖర్చగును. బడ్జెట్ తగ్గి అప్పులు చేయవలసిన పరిస్థితులు ఏర్పడగలవు. వెండి, బంగారం, రాగి, ఇత్తడి ధరలు పెరుగుట–తరుగుట స్పష్టం గా అర్థంకాని స్థితిలో ఉంటాయి. పెద్దపరిశ్రమలకు ఈ కాలము చాలా అనుకూలముగా ఉండును. చిన్న పరిశ్రమలకు సామాన్య స్థితి. అపరాలు, బియ్యం ధరలు పెరుగును.
కుటుంబ కలహములు, మనశ్శాంతి లోపించుటకు సూచనలు ఉన్నాయి. తక్కువగా మాట్లాడి ఎక్కువగా పనులు చేయుట వలన తగాదాలు తగ్గును. ఇది వాదోపవాదాలకు అనుకూల సమయం కాదు. చాలా జాగ్రత్తగా వ్యవహరించవలెను. అధిక శ్రమ, మానసిక ఒత్తిడి ఉండును. ఆదాయమునకు మించిన ఖర్చులు ఏర్పడగలవు. జన్మరాశిలో గ్రహాల సమ్మేళనం లేకపోవుట వలన ప్రతి విషయంలో ఎదురీత భావము కలుగును. సర్పసూక్త పారాయణము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజలు, అభిషేకములు, హోమములు చేయించుకొనుట వలన మనోనిగ్రహము కలుగును. అర్థం కాని విధంగా ఆకస్మిక అనారోగ్య సమస్యలు. ఉదర సంబంధిత సమస్యలు, అపమృత్యు దోష సూచనలు ఉన్నప్పటికీ, శాంతి కార్యముల వలన నివారణ కలుగును. ఆకస్మిక ధనలాభములు ఉన్నట్లే ఆకస్మిక తగాదాలు కూడా ఉన్నవి. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. సమయము, సందర్భము గురించి ఆలోచించి నిర్ణయములు తీసుకోవలెను.
శివాలయాల వెనుక భాగములో ఉన్న నాగులకు సంప్రదాయబద్ధంగా పూజలు చేయవలెను. గృహనిర్మాణము ముహూర్తబలం లేక ప్రారంభించినచో నిర్మాణము ఆగిపోవుటకు అవకాశములు ఉన్నాయి. పునర్వసు నక్షత్రమువారు కనకపుష్యరాగము ధరించవలెను. దక్షిణామూర్తి, సాయిబాబా పూజలు చేసి శనగల గుగ్గిళ్లు ప్రసాదముగా పంచుట శుభప్రదము. పుష్యమి నక్షత్రమువారు ఇంద్రనీల ఉంగరము ధరించి, శనికి తైలాభిషేకము చేసి ఒక కిలోపావు నువ్వులు కడిగి ఎండబెట్టి పూజ అనంతరం దానం ఇవ్వవలెను. ఆశ్లేష నక్షత్రమువారు జాతి పచ్చ ఉంగరము ధరించవలెను. జాతి పచ్చను చిటికెన వ్రేలికి ధరించుట శ్రేయస్కరము. శ్రీవారికి అలంకరణ చేసి చక్కెర పొంగలి ప్రసాదములు పంచుట మంచిది. మహాన్యాస రుద్రాభిషేకము చేయించుట శుభఫలదాయకము. సంఘములో గౌరవ–మర్యాదలకు భంగం రాకుండా చాలా జాగ్రత్తగా మసలుకోవలెను. ధ్యానం, యోగ, ఆక్యుప్రెషర్, ఆయుర్వేద మందుల వలన ఎంత పెద్ద వ్యాధి అయినా అదుపులోకి రాగలదు. ప్రతినిత్యం అఖండ దీపారాధన దర్శనం చేయుటవలన గృహశాంతి కలుగును. ప్రతి విషయంలో అప్రమత్తంగా ఉండవలెను. ఇది అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన కాలము. ఎవరికీ అప్పు ఇవ్వవద్దు. విశ్వాసముతో శాస్త్రోక్తవిధానములను పాటించినచో అనుకూల ఫలితములు లభించును. అదృష్ట సంఖ్య – 2.



