ఆదాయం - 5, వ్యయం - 14, రాజపూజ్యం - 5, అవమానం - 4
ఈ సంవత్సరంలో గురుగ్రహము ఉగాది నుండి 1-6-2026 వరకు ద్వితీయ స్థానములో సువర్ణమూర్తిగా సంచారము చేయును. తదుపరి 31-10-2026 వరకు ద్వితీయస్థానములో లోహమూర్తిగా, 24-1-2027 వరకు రజితమూర్తిగా, అనంతరం ఉగాది వరకు మళ్లీ లోహమూర్తిగా సంచారము చేయును. రాహు-కేతువులు ఉగాది నుండి 5-12-2026 వరకు రజితమూర్తులుగా, తదుపరి ఉగాది వరకు సువర్ణమూర్తులుగా సంచారము చేయుదురు. ఈ రాశి స్త్రీ–పురుషులకు సంవత్సర ఫలితములు సామాన్యంగా ఉండును. రైతు సోదరులు మంచి-చెడును విచారించి ప్రతి నిర్ణయములో జాగ్రత్తలు పాటించవలెను. వృత్తి, వ్యాపార, ఉద్యోగస్తులు, న్యాయవాదులు, వైద్యులు, రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లు గృహాభరణాలు మొదలైన ఖరీదులు చేసి ఉన్న ధనమంతా ఖర్చు చేసి, చివరకు కొంత అప్పులు చేయవలసి వచ్చే పరిస్థితులు కలుగవచ్చును. పిల్లల వివాహములు జరుగుటకు అవకాశములు ఉన్నవి.
పెద్దపరిశ్రమల వారు అత్యంత జాగ్రత్తవహించవలెను. చిన్న పరిశ్రమల వారికి ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. తొందరపాటు నిర్ణయాలు లేకుండా ప్రశాంతంగా ఆలోచించి వ్యవహరించవలెను. ఆర్భాటాలకు ఇది సరైన కాలము కాదు. వెండి, బంగారం ధరలు స్థిరంగా ఉండవు; ఈ వ్యాపారస్తులకు పరిస్థితులు అర్థం కానివిధంగా అటూ ఇటూ మారుచుండును. అపరాలు, ధాన్య ధరలు వ్యాపారుల నైపుణ్యంపై ఆధారపడి మారుచుండును. గ్యాంబ్లింగ్ వంటి మార్గాలు వ్యాపారులకు నష్టదాయకములు. హోల్‌సేల్ వ్యాపారుల దోపిడీ కారణంగా రిటైల్ వ్యాపారులు సమస్యల సుడిగుండంలో పడే అవకాశములు ఉన్నవి. ఎవరికి వారు చేయు వ్యాపారము గాని, ఉద్యోగముగాని నిరంతరం జాగ్రత్తగా నిర్వహించవలెను. అంతర్గత శత్రుత్వముతెలియకుండానే ఉండగలదు. ఒక వైపు గౌరవము ఉండినా, మరో వైపు అర్థం కాని పరిస్థితులు ఎదురవుతాయి.
ఎవరికీ హామీగా నిలవకుండుట మేలైనది. ఈ సంవత్సరంలో పిల్లల వివాహములు జరుగుటకు జాతకములు కలిసినపుడు అనుకూల సమయం. వివాహాలు, విడాకులు, ప్రేమ సంబంధాలు వంటి విషయాలలో హడావుడి లేకుండా మంచిని స్వీకరించి చెడును వదలవలెను. ఏ రంగంలో ఉన్నవారైనా ప్రతి నిమిషము జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించవలెను. కృత్తిక నక్షత్రజాతులు పగడము ధరించి సూర్యనమస్కారములు చేయుచు ఆదిత్యహృదయ పారాయణం చేయవలెను. రోహిణి నక్షత్రజాతులు ముత్యము ధరించి దుర్గాదేవికి పూజలు చేయించవలెను. మృగశిర నక్షత్రజాతులు పగడము ధరించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజలు చేయుచు “ఓం శరవణభవ నమః” మంత్ర జపము నిరంతరం చేయవలెను. స్కందగిరిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకము, హోమము చేయుట వలన మనశ్శాంతి కలుగును. గోవుకు 450 గ్రాముల కందులు నానబెట్టి దాన పెట్టిన శుభప్రదము. యోగ, ధ్యానం, ఆక్యుప్రెషర్, మూలికల కషాయముల ద్వారా ఆరోగ్యం పరిపూర్ణంగా ఉండును. అదృష్ట సంఖ్య–6.



