ఆదాయం - 11 వ్యయం - 5 రాజపూజ్యం - 2 అవమానం - 6
గురువు ఉగాది నుండి ది. 1-6-2026 వరకు అష్టమ స్థానమున సువర్ణమూర్తిగా సంచరించును. తదుపరి 31-10-2026 వరకు భాగ్యస్థానమున తామ్రమూర్తిగా, ఆపై 24-1- 2027 వరకు సామాన్య ఫలితములు ఇస్తాడు. అనంతరం మరల ఉగాది వరకు భాగ్యస్థానమున తామ్రమూర్తిగా సంచారము చేయును. శని ఉగాది నుండి పంచమ స్థానమున రజతమూర్తిగా సంచరిస్తాడు. రాహు–కేతువులు ఉగాది నుండి ది. 5-12-2026 వరకు తామ్రమూర్తులుగా, తదుపరి ఉగాది వరకు రజతమూర్తులుగా సంచరించుదురు. ఈ రాశి స్త్రీ–పురుషులు, రైతు సోదరులకు అనుకూల కాలం. మంచి పంటల దిగుబడి పొందుటకుముహూర్తబలం అవసరం. వృత్తి, వ్యాపార, ఉద్యోగస్తులకు, కాంట్రాక్టర్లు, లాయర్లు, డాక్టర్లు, రాజకీయ నాయకులు, బిగ్ ఇండస్ట్రీ వారికి అధిక ఆదాయ సూచనలు ఉన్నాయి. స్మాల్ ఇండస్ట్రీ వారికి సామాన్య ఫలితములు.
మీ మాటకు విలువ పెరుగుతుంది. సంతృప్తి అధికంగా ఉంటుంది. విద్యార్థులకు అనుకూల కాలం. స్త్రీలు ఆనందంగా ఉంటారు. కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఆకస్మిక ధనసంపాదన యోగం ఉంది. బ్యాంకు బ్యాలెన్స్ పెరుగుతుంది. విందు–వినోదముల యందు ఆసక్తి పెరుగుతుంది.అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నవంబర్– డిసెంబర్ మాసములలో గురుబలం తగ్గుట వలన మానసిక ఒత్తిడి కలగవచ్చు. ఆరోగ్యంపై అధిక శ్రద్ధ అవసరం. యోగ, ధ్యానం, ఆక్యుప్రెషర్ చేయుట వలన అనారోగ్యములు దూరంగా ఉంటాయి. చిట్స్, షేర్లు వంటి పెట్టుబడులు ఈ కాలములో అనుకూలం కాదు. తొందరపాటు నిర్ణయముల వలన కొత్త సమస్యలు కలుగగలవు. గతంలో ఉన్న కోర్టు సంబంధిత సమస్యలు రాజీ మార్గములో పరిష్కరించుట శ్రేయస్కరం. ప్రతిష్ఠకోసం పట్టు పట్టక, సమయానుకూలంగా స్పందించాలి. ఆచితూచి వ్యవహరించుట వలన ఇబ్బందులు ఉండవు. విజయం మీ వైపు ఉంటుంది. వెండి, బంగారం, రాగి, నవరత్నములు, సుగంధ ద్రవ్యముల ధరలు నియంత్రణలో ఉండవు. స్టీల్, సిమెంట్, కంకర, ఇసుక, కలప ధరలు అందుబాటులో ఉంటాయి. పౌల్ట్రీ పరిశ్రమ సామాన్య ఫలితములు ఇస్తుంది. రొయ్యల పంటలకు దిగుబడి తగ్గే సూచనలు ఉన్నాయి.
గురుబలం కొరకు గురువుకు పూజలు, సాయిబాబా, దక్షిణామూర్తి పూజలు చేయవలెను. శనిపూజలు చేయుట వలన శనిబలంతో కార్యసాధనలో విజయం కలుగుతుంది. ఆధ్యాత్మికంగా శాంతి లభిస్తుంది. విశాఖ నక్షత్రం వారు కనకపుష్యరాగం ధరించి దక్షిణామూర్తి, సాయినాథుని పూజలు చేయాలి. గురువారం శనగలు, గుగ్గిళ్లు ప్రసాదములుగా పంచాలి. అనూరాధ నక్షత్రం వారు ఇంద్రనీలం ధరించాలి. ఎరుపు నువ్వులు 1¼ కిలోలు కడిగి ఎండపోసి, నలుపు వస్త్రం ½ మీటరు దానం చేయాలి. శనికి నువ్వుల నూనెతో తైలాభిషేకం చేయించాలి. జ్యేష్ఠ నక్షత్రం వారు జాతి పచ్చ ఉంగరాన్ని కుడిచేయి చిటికినవేలుకు ధరించాలి. శ్రీ వేంకటేశ్వర స్వామికి అలంకరణ చేసి, చక్కెర పొంగలి నైవేద్యంగా సమర్పించుట వలన కోరికలు నెరవేరుతాయి. మంగళవారం రాత్రి 500 గ్రాముల పచ్చిపెసలు నానబెట్టి, బుధవారం ఉదయం పావురాలకు దానంగా చల్లాలి. అమావాస్య రోజున పితృదేవతలకు తర్పణలు ఆచరించుట శుభప్రదం. అదృష్టసంఖ్య–9.



