ఆదాయం - 8, వ్యయం - 11, రాజపూజ్యం - 1, అవమానం - 7
ఈ రాశివారికి గురుగ్రహము ఉగాది నుండి 1-6-2026 వరకు జన్మస్థానములో సువర్ణమూర్తిగా సంచారము చేయును. తదుపరి 31-10-2026 వరకు ద్వితీయస్థానములో తామ్రమూర్తిగా, 24-1-2027 వరకు మళ్లీ సువర్ణమూర్తిగా, అనంతరం ఉగాది వరకు తామ్రమూర్తిగా సంచరించును. శనిగ్రహము ఉగాది నుండి మరల ఉగాది వరకు దశమ స్థానములో సంచారము చేయును. రాహు–కేతువులు ఉగాది నుండి మరల ఉగాది వరకు లోహమూర్తులుగా సంచారము చేయుదురు. ఈ రాశి స్త్రీ–పురుషులకు ఈ సంవత్సరం ఆర్భాటములకు సమయముకాదు. రైతు సోదరులు ముహూర్తబలంతో వ్యవసాయము లాభసాటిగా సాగించగలరు. వృత్తి, వ్యాపార, ఉద్యోగస్తులు, న్యాయవాదులు, కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులు, పెద్దపరిశ్రమల వారు, చిన్న పరిశ్రమల వారు – అందరూ అత్యంత జాగ్రత్తగా వ్యవహరించవలసిన పరిస్థితులు ఉన్నాయి. శనిగ్రహ ప్రభావము బలంగా ఉన్నందున శనిభగవానుని ఆరాధన చేయువారికి ఎంత కష్టం కనిపించినా, తెలియకుండానే సమస్యలు సానుకూలంగా పరిష్కారమయ్యే అవకాశములు ఉన్నాయి. శనికి తైలాభిషేకము, నవగ్రహ జప–దాన–ప్రదక్షిణలు చేయుట శుభప్రదం. అపరాలు, బియ్యం ధరలు అర్థంకాని విధంగా మారుచుండును. వెండి, బంగారం, రాగి, లోహాలు, ఇనుము, సిమెంట్, ఇసుక, కంకర, టేకు ధరలు నిలకడగా ఉండవు. ప్రతిరోజు శకునం చూసి బయటకు వెళ్లుట మంచిది. ప్రతి విషయంలో సమస్యలుగా అనిపించినా, ఓర్పుతో వ్యవహరించవలెను. కిరాణా, ఫ్యాన్సీ, వస్త్ర, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ వ్యాపారములు మరియు పెద్దమాల్స్ వైపు ప్రజల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఆర్భాటములు, హడావుడి పెరుగును. రియల్ ఎస్టేట్ రంగము కొంత పుంజుకునే అవకాశములు ఉన్నాయి. పాలు, పండ్లు, కూరగాయలు, పూల ధరలు పెరుగుటకు సూచనలు ఉన్నాయి.
కొన్ని విషయాలలో తొందరపాటు మంచిది కాదు. ఆచితూచి ఆలోచించి నిర్ణయములు తీసుకొనవలెను. ఆదాయం ఉన్నప్పటికీ ఖర్చులు ఉంటాయి. ఆర్భాటాలకు దూరంగా ఉండుట శ్రేయస్కరం. లంచగొండితనంపై నిఘా పెరుగును; ఏసీబీ దాడులు జరుగుట అవకాశములు ఉన్నాయి. వాస్తు లోపములు కలిగిన గృహముల వలన మానవునికి అనేక విధముల కష్టనష్టములు కలుగవచ్చును. ఉద్యోగస్తులకు స్థానచలనసూచనలు ఉన్నాయి.
నక్షత్ర వారీ పరిహారములు: మృగశిర నక్షత్రజాతులు పగడము ధరించి, కందులు దానము చేసి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజలు చేయవలెను. ఆరుద్ర నక్షత్రజాతులు గోమేధిక రత్నము ధరించి, ప్రతి నెల ఆరుద్ర నక్షత్ర దినమున శివునికి మహాన్యాస రుద్రాభిషేకముచేయించవలెను. శ్రీ దుర్గాదేవికి కుంకుమ పూజలు, నిమ్మకాయల దండ అలంకరణ చేయుట శుభప్రదం. పునర్వసు నక్షత్రజాతులు కనకపుష్యరాగము ధరించి, గురువారమున శనగగల గుగ్గిళ్ళు ప్రసాదముగా పంచవలెను. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణము, అష్టోత్తర–సహస్రనామ పారాయణము, యోగ, ధ్యానము చేయుట వలన ఆరోగ్యం నిలుస్తుంది. ఆరోగ్యం అమ్మకానికి దొరకదు, కొనటానికి రాదు; ఆచరణ ద్వారానే లభిస్తుంది. నవగ్రహ ఆరాధన, శివారాధన నిరంతరం చేయవలెను.అదృష్ట సంఖ్య - 5.



