ఆదాయం : 2, వ్యయం: 8 -రాజపూజ్యం: 4, అవమానం: 2

గురువు ఉగాది నుండి 1-6-2026 వరకు పంచమస్థానంలో లోహమూర్తిగా సంచరించును. తదుపరి 31-10-2026 వరకు షష్టమస్థానంలో సువర్ణమూర్తిగా, ఆ తరువాత ఉగాది వరకు కూడా షష్టమస్థానంలోనే సువర్ణమూర్తిగా సంచారము చేయును. శని ఉగాది నుండి మరల ఉగాది వరకు ద్వితీయస్థానంలో రజతమూర్తిగా సంచరించును. రాహు–కేతువులు ఉగాది నుండి 5-12-2026 వరకు లోహమూర్తులుగా, తదుపరి ఉగాది వరకు రజితమూర్తులుగా సంచారము చేయును.

ఈ రాశి స్త్రీ–పురుషులకు, ముఖ్యంగా రైతు సోదరులకు ఇది అత్యంత జాగ్రత్తగా వ్యవహరించవలసిన కాలము. ముహూర్తబలంతో వ్యవసాయం చేసినచో దిగుబడి ఉంటుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలలో ఉన్నవారు సహచరులతో కలిసిమెలసి ఉండాలి. లాయర్లు, డాక్టర్లు, కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులకు ఇది హెచ్చరికగా గోచరిస్తుంది. ఆర్థిక లోటు స్పష్టం గా కనిపిస్తుంది. అప్పులు చేసినవారికి ఇబ్బందులు తప్పవు. ఇది ఆర్భాటాలకు అనుకూల సమయం కాదు. అనేక అవరోధాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. వెండి, బంగారం, రాగి వారికి అదనపు ఆదాయం. ఇనుము, సిమెంట్, కంకర, కలప వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. పెద్దపరిశ్రమలు, చిన్న పరిశ్రమలు రెండూ వెనుకడుగు వేసే పరిస్థితులు ఉంటాయి.

శని ప్రభావం వలన అన్ని రంగాల వారికి ఒకే ముఖ్య సూత్రం — తక్కువగా మాట్లాడటం. ఇతరుల విషయాలలో జోక్యం తగదు. ఎదుటివారిని చులకనగా మాట్లాడితే కొత్త సమస్యలు తలెత్తుతాయి. భ్రమలకు తావు ఇవ్వకూడదు. ఘర్ష ణలను పూర్తిగా దూరంగా ఉంచాలి. పోలీస్ కేసులు, కోర్టు కేసులు వచ్చే అవకాశమున్నది. ఒక నిమిషం నిర్లక్ష్యం కూడా ఇబ్బందులకు దారి తీయగలదు. కూరగాయలు, పూలు, పచ్చి సరుకుల వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ధరలు వ్యాపారుల చేతివాటంలో ఉంటాయి. పోటీ తత్వం వలన అనేక మంది వ్యాపారస్తులు దివాళా తీసే పరిస్థితులు కనిపించవచ్చు. ఐపీ (ఇన్సాల్వెన్సీ) కేసులు పెరిగే సూచనలు ఉన్నాయి. కంప్యూటర్, టెక్నాలజీ రంగంలో ఉన్నవారు శనిపూజలు చేయుట వలన కొంత అనుకూలత పొందగలరు.

ప్రధానంగా నవగ్రహ ప్రదక్షిణలు, జపాలు, దానాలు, మహాన్యాస రుద్రాభిషేకం చేయుట వలన గౌరవానికి భంగం కలగకుండా కొంతవరకు కాపాడుకోవచ్చు. వాస్తు సరిగా ఉన్న గృహములో నివసిస్తూ, గ్రహ శాంతి పూజలు ఆచరించేవారు ఎన్నెన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రశాంతంగా ఉండగలరు. నక్షత్రాల వారీ పరిహారములు: ధనిష్టనక్షత్రం వారు జాతి పగడం ధరించి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజలు చేయాలి. శతభిష నక్షత్రం వారు జాతి గోమేధికం ధరించి, దుర్గాదేవికి అష్టోత్తర– సహస్రనామములు, శ్రీచక్ర కుంకుమపూజలు చేయాలి.పూర్వాభాద్ర నక్షత్రం వారు కనకపుష్యరాగం ధరించి దక్షిణామూర్తి పూజలు, సాయినాథుని ఆరాధన చేయాలి. అమావాస్య రోజున పితృదేవతలకు తర్పణలు ఇవ్వుట వలన మానసిక ఒత్తిడి బాగా తగ్గుతుంది. నమ్మకానికి, భరోసాకు అతిగా తావు ఇవ్వరాదు. ఎవరి మాటలు నమ్మితే వారు మోసం చేయగల పరిస్థితులు ఉన్నాయి. ధ్యానం, యోగ, ఆక్యుప్రెషర్, ఆయుర్వేద చికిత్సలు శారీరక–మానసిక ఆరోగ్యానికి సహాయపడతాయి. అదృష్ట సంఖ్య: 8.


More Rasi Phalalu 2026 - 2027