బద్రీనాథ్ క్షేత్రంలో విష్ణువు ద్యాన భంగిమలో ఎందుకు ఉంటాడు!
బద్రీనాథ్ క్షేత్రంలో విష్ణువు ద్యాన భంగిమలో ఎందుకు ఉంటాడు!
చార్ ధామ్ యాత్రలో బద్రీనాథ్ క్షేత్రం కూడా ఒకటి. బద్రీనాథ్ క్షేత్రానికి ఎంతో ఆధ్యాత్మిక, పౌరాణిక ప్రాముఖ్యత ఉంది. పూర్వకాలంలో ఇక్కడ శ్రీ హరి విగ్రహం కొలువై ఉండేదని చెబుతారు. ఆ తర్వాత జరిగిన దండయాత్రలలో శ్రీహరి విగ్రహాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించారు. కానీ ఆ విగ్రహం నాశనం కాకపోవడంతో దానిని అక్కడే ఉన్న లోతైన నారద కుండంలో దాచిపెట్టారట. ఎనిమిదవ శతాబ్దంలో ఆది శంకరాచార్యులు బద్రీనాథ్ ధామాన్ని సందర్శించినప్పుడు, ఆయన నారద కుండం నుండి శ్రీహరి విగ్రహాన్ని తీసి అక్కడ తిరిగి ప్రతిష్ఠించారు. విష్ణుమూర్తి ధ్యాన భంగిమలో కొలువై ఉన్న ఏకైక క్షేత్రం ఇదేనని నమ్ముతారు. బద్రీనాథ్ క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీహరి గురించి మరింత వివరంగా తెలుసుకుంటే..
శంకరాచార్యులు శ్రీహరి విగ్రహాన్ని కనుగొన్న ప్రదేశం..
పురాణాల ప్రకారం 8వ శతాబ్దంలో ఆది శంకరాచార్యులు సనాతన ధర్మాన్ని వ్యాప్తి చేయడానికి హిమాలయాలకు యాత్రకు బయలుదేరారు. తన యాత్రలో భాగంగా ఆయన బద్రీనాథ్‌ను కూడా సందర్శించారు. ఆధ్యాత్మిక సాధనకు ఆ ప్రదేశం అనువైనదని శంకరాచార్యులు భావించారు. ఆయన ధ్యానం చేస్తున్నప్పుడు, బద్రీనాథ్ లోని ప్రాచీన స్వామి విగ్రహం కనిపించకుండా పోయిందని గమనించారు. పురాణాల ప్రకారం, శంకరాచార్యులు అక్కడ తీవ్రమైన ధ్యానం చేశారు, దాని ఫలితంగా అసలైన విగ్రహం నారద కుండంలో ఉందని ఆదిశంకరులకు ఒక సంకేతం అందింది. ఆ రోజుల్లో ఈ కుండం అత్యంత లోతుగా ఉండి, బలమైన ప్రవాహాన్ని కలిగి ఉండటంతో, దానిలోకి ప్రవేశించడం ప్రమాదకరంగా ఉండేది.
ఆది శంకరాచార్యులు ధైర్యం చేసి నారద కుండంలోకి ప్రవేశించారని, అక్కడ ఆయనకు శాలిగ్రామ శిలతో చేసిన విష్ణుమూర్తి విగ్రహం లభించిందని నమ్ముతారు. శంకరాచార్యులు తన మొదటి ప్రయత్నంలో విరిగిన విగ్రహాన్ని కనుగొన్నారని, దానిని నీటిలో ముంచారని కూడా నమ్ముతారు. అయితే, ఆయన రెండవసారి ప్రయత్నించినప్పుడు, అదే విగ్రహం విరగకుండా ఆయనకు లభించింది. నారద కుండ్‌లో శంకరాచార్యులు వెలికితీసిన విగ్రహం విష్ణుమూర్తిని ధ్యాన భంగిమలో ఉన్నట్టు గోచరిస్తుంది.
శ్రీహరి ధ్యాన భంగిమలో ఎందుకున్నారు?
శంకరాచార్యులు విగ్రహాన్ని విష్ణుమూర్తి ఆశీర్వాదంగా భావించి, క్రతువులు నిర్వహించి అక్కడ విగ్రహాన్ని ప్రతిష్టించారు. అప్పటి నుండి, శంకరాచార్యుల సమక్షంలో బద్రీనాథ్ క్షేత్రంలో పూజలు మొదలయ్యాయి. జగత్తు శ్రేయస్సు కోసం విష్ణుమూర్తి అక్కడ ధ్యాన భంగిమలో కఠోర తపస్సు చేశారని చెబుతారు. ఆ సమయంలో, హిమపాతం నుండి ఆయనకు నీడను ఇవ్వడానికి లక్ష్మీదేవి బద్రి అనే రేగు చెట్టు రూపం ధరించింది. ఈ కారణంగానే ఈ క్షేత్రానికి బద్రీనాథ్ అని పేరు వచ్చిందట.
*రూపశ్రీ.