బడామంగళ్.. జ్యేష్టమాసంలో ఈ 7 మంగళవారాలు వదులుకోకండి!
బడామంగళ్.. జ్యేష్టమాసంలో ఈ 7 మంగళవారాలు వదులుకోకండి!
మంగళవారం హనుమంతుడి ఆరాధనకు ఎంతో శ్రేష్టమైన రోజు. హనుమంతుడిని ప్రతి మంగళవారం వివిధ నియమాలతో ఆరాధిస్తే ఎన్నో సమస్యలు తీరతాయి. ఇక ఇవి పరిష్కారం కావు అనుకునే సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. ప్రస్తుతం జ్యేష్టమాసం జరుగుతోంది. వైశాఖ, జ్యేష్ఠ మాసాలలో వచ్చే 7 మంగళవారాలు హనుమ ఆరాధనకు ఎంతో శ్రేష్టమని చెబుతున్నారు పండితులు. ఇంతకూ ఈ మంగళవారాలు ఎందుకంత ప్రత్యేకంగా భావిస్తారు? ఈ మంగళవారాలలో హనుమను ఎలా ఆరాధించాలి? ఈ మంగళవారాలలో హనుమను ఆరాధిస్తే కలిగే ఫలితం ఏమిటి? తెలుసుకుంటే..
జ్యేష్టమాసం బడామంగళ్..
మే నెలలో 12, 19, 26 తేదీలలో మంగళవారం వస్తుంది. అలాగే జూన్ నెలలో 2, 9, 16, 23 తేదీలలో కూడా మంగళవారం వస్తుంది. ఈ తేదీలలో వచ్చే మంగళవారాలను బడా మంగళ్ అని అంటారు.
7 మంగళవారాల పూజ ఎందుకు చేయాలి?
పైన పేర్కొన్న తేదీలలో వచ్చే మంగళవారాలలో పూజ చేయడం వల్ల పనులలో అడ్డంకులు తొలగుతాయి. ధైర్యం పెరుగుతుంది, మనఃశాంతి కలుగుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా హనుమంతుడి అనుగ్రహం కలుగుతుంది.
ఈ మంగళవారాలలో ఏం చేయాలి?
బడా మంగళ్ కింద వచ్చే మంగళవారాలలో హనుమాన్ చాలీసా తప్పనిసరిగా చదవాలి.అలాగే సుందరకాండ పారాయణ లేదా శ్రవణం చేయడం, రామ నామ జపం, కుదిరిన వారు రామనామ లేఖనం, కుదిరితే ఉపవాసం, ప్రతి మంగళవారం హనుమంతుడి ఆలయం దర్శనం వంటివి తప్పక చేయాలి.
దానాలు..
బడామంగళ్ లో వచ్చిన మంగళవారాలలో కొన్ని దానాలు చేయడం వల్ల ఎంతో పుణ్యం దక్కుతుంది. ఇది వేసవికాలం కాబట్టి జలదానం, మజ్జిగ వంటి పానీయాలు చేయడం చాలా మంచిది. అలాగే పక్షులకు నీరు పెట్టడం, పేదలకు అన్నదానం చేయడం కూడా చేయాలి.
నియమాలు..
బడామంగళ్ మంగళవారాలలో హనుమను ఆరాధించేవారు కొన్ని నియమాలు పాటించాలి. ఈ రోజుల్లో మాంసాహారం తినకూడదు, మద్యపానం, ధూమపానం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. కోపాన్ని నియంత్రణలో పెట్టుకోవాలి. సాత్విక జీవనం గడపాలి. పరిశుభ్రంగా ఉండాలి. ఇతరులకు హాని చేయకూడదు. ఇతరుల విషయంలో చెడు ప్రవర్తన కూడా ఉండకూడదు.
ఫలితాలు..
ఈ 7మంగళవారాలు పాటించడం వల్ల పైన చెప్పుకున్న ఫలితాలు లభించడమే కాకుండా.. 7 తరాల వరకు హనుమ అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.
*రూపశ్రీ.