అద్బుతమైన దేవాలయం.. సర్పదేవుడు వచ్చేముందు సంకేతం కనిపిస్తుందట!

 

అద్బుతమైన దేవాలయం.. సర్పదేవుడు వచ్చేముందు సంకేతం కనిపిస్తుందట!

ప్రపంచంలో ఎన్నో రహస్యమైన ఆలయాలు ఉన్నాయి, వీటిలో కొన్ని అయోమయాన్ని కలిగిస్తాయి, మరికొన్ని ఆశ్చర్యపరుస్తాయి, ఇంకొన్ని ఆసక్తి పెరిగేలా చేస్తాయి.  కానీ ఒక ఆలయం అన్ని హావభావాలు ఒకేసారి పుట్టేలా చేస్తుంది.  ప్రపంచ ఏడు వింతలలో ఈ ఆలయం కూడా ఉంది.  ఆ ఆలయాన్ని కుకుల్కాన్ ఆలయం అని పిలుస్తారు. ఇది ప్రపంచంలోని అత్యంత పురాతన ఆలయాలలో ఒకటి. మెక్సికోలోని పురాతన నగరమైన చిచెన్ ఇట్జాలో ఉన్న ఈ ఆలయం మాయన్ నాగరికత కాలంలో నిర్మించబడిందని చెబుతారు.  ఆనాటి నాగరికలో నిర్మించబడిన  అద్భుతమైన ఇంజనీరింగ్ ,  ఖగోళ శాస్త్రానికి ఒక ప్రధాన ఉదాహరణగా దీన్ని చెబుతారు.  దీని గురించి తెలుసుకుంటే..

కుకుల్కాన్ ఆలయం..

ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది పర్యాటకులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. దూరం నుండి చూస్తే ఇది ఒక పిరమిడ్‌ను పోలి ఉంటుంది. ఈ ఆలయంలో ఒక  ప్రత్యేకత ఉంది.  అందేంటంటే..  కొన్నిసార్లు దాని మెట్లపై ఒక పెద్ద సర్పం కనిపిస్తుందని చెబుతారు. ఒక నిర్థిష్టమైన కోణం నుండి పిరమిడ్‌పై సూర్యకాంతి పడినప్పుడు, కాంతి , నీడలు కలిసి మెట్లపై సర్పం వంటి ఆకారాన్ని సృష్టిస్తాయట.

ఈ దృశ్యం చూస్తుంటే ఒక భారీ సర్పం నెమ్మదిగా కిందికి దిగుతున్నట్లుగా కనిపిస్తుందట. ఈ దృశ్యం ఒక అద్బుతంగా అనిపిస్తుందని,  ఈ ఆలయాన్ని సందర్శించిన ప్రజలు భావిస్తారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇలా సర్పం కనిపించడం అనేది  సంవత్సరంలో కేవలం కొన్ని రోజులు మాత్రమే కనిపిస్తుంది. ప్రపంచం నలుమూలల నుండి వేలాది మంది ప్రజలు ఈ దృశ్యాన్ని వీక్షించడానికి వస్తారట.

కుకుల్కాన్ ఆలయం ఎప్పుడు ఎవరు నిర్మించారంటే..

ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు, దీని నిర్మాణం ఎంత కాలం క్రితం పూర్తయింది అని చాలా మంది ఆశ్చర్యపోతుంటారు. వేల సంవత్సరాల క్రితం మాయా నాగరికత ఈ ఆలయాన్ని నిర్మించిందని నమ్ముతారు. ఆ కాలంలోని ప్రజలు ఖగోళ శాస్త్రం , గణిత శాస్త్రంలో అత్యంత అభివృద్ధి చెందినవారు. సూర్యుని దిశ , కాలానుగుణ మార్పుల ప్రభావాలు దాని మెట్లపై నేరుగా ప్రతిబింబించే విధంగా వారు ఈ ఆలయాన్ని రూపొందించరట.

పగలు, రాత్రి నిడివి దాదాపు సమానంగా ఉండే వసంత, శరదృతువులలో అక్కడ పాము నెమ్మదిగా కిందకు దిగుతున్నట్టు కనిపించడం  అత్యంత స్పష్టంగా కనిపిస్తుందని అంటారు. ఈ సమయంలో సూర్యకిరణాలు ఆలయ నిర్మాణంపై పరావర్తనం చెంది, ఈ అద్భుతమైన ఆకారాన్ని సృష్టిస్తాయి.

కుకుల్కాన్ ఎవరు?

 ఈ ఆలయంలో  కుకుల్కాన్ ను ప్రతిష్ఠించారు. మాయన్ నాగరికతలో కుకుల్కాన్‌ను  సర్ప దేవుడు అని పిలిచేవారని చెబుతారు. వారి ప్రకారం, ఈ దేవత భూమిని, ఆకాశాన్ని అనుసంధానించేదిగా ఉండేది.  అందుకే వారు ఈ నమ్మకం ఆధారంగా ఆలయాన్ని నిర్మించారు. మెట్లపై నుండి పాము దిగడం కనిపించినప్పుడు, ప్రజలు దానిని కుకుల్కాన్ దేవుడు భూలోకానికి రావడానికి సంకేతంగా భావిస్తారు.

ఏడు ప్రపంచ వింతలలో ఒకటి..

మాయన్ నాగరికత  ఈ విశిష్ట వారసత్వం శాస్త్రవేత్తలను, చరిత్రకారులను నిరంతరం ఆశ్చర్యపరుస్తూనే ఉంది. ఆధునిక సాంకేతిక యుగంలో కూడా, వేల సంవత్సరాల క్రితం ఇంత కచ్చితమైన వాస్తుశిల్పాన్ని ఎలా సృష్టించగలిగారని ప్రజలు ఆశ్చర్యపోతుంటారు.

ఈ కారణంగానే చిచెన్ ఇట్జా ప్రపంచంలోని ఏడు అద్భుతాలలో ఒకటిగా చేర్చబడింది. ఈ దేవాలయం కేవలం ఒక చారిత్రక కట్టడం మాత్రమే కాదు, ప్రాచీన జ్ఞానం, విజ్ఞానం, నమ్మకాల యొక్క అద్భుతమైన మేళవింపుగా  కూడా పరిగణించబడుతుంది.

                                     *రూపశ్రీ.