ఆ ఆలయంలో నూనెతో కాకుండా నదీ జలంతో దీపాన్ని వెలిగిస్తారు!
ఆ ఆలయంలో నూనెతో కాకుండా నదీ జలంతో దీపాన్ని వెలిగిస్తారు!
దీపం చైతన్యానికి, జ్ఞానానికి, ఆత్మకు ప్రతీక అని చెబుతారు. దైవం ముందు దీపం వెలిగించడం అంటే.. మనిషిలో అజ్ఞానాన్ని దైవం ముందు ఉంచి, జ్ఞానాన్ని ప్రసాదించమని వేడుకోవడం. ఇంట్లో అయినా, బయట అయినా, దేవాలయంలో అయినా, వృక్షాల దగ్గర అయినా దీపం వెలిగించడం భారతీయుల సంప్రదాయం. భారతదేశంలో అద్బుతమైన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిలో గడియాఘాట్ ఆలయం కూడా ఒకటి. ఈ ఆలయంలో వెలిగించే దీపమే చాలా ప్రత్యేకం, ఎంతో అద్బుతం కూడా. అసలు ఈ ఆలయం ఎక్కడుంది? ఇక్కడి దీపాన్ని నీళ్లతో వెలిగించడం వెనుక రహస్యం ఏంటి? పూర్తీగా తెలుసుకుంటే..
గడియాఘాట్ ఆలయం..
మధ్యప్రదేశ్‌లోని గడియాఘాట్ మాతా ఆలయం వింత నమ్మకాలు, రహస్య సంఘటనల కారణంగా దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. కాళిసింధు నది ఒడ్డున ఉన్న ఈ ఆలయాన్ని, నెయ్యి లేదా నూనెతో కాకుండా నదీ జలంతో వెలిగే దీపాన్ని చూడటానికి చాలా మంది సందర్శిస్తారు. ఈ అద్భుతాన్ని వీక్షించడానికి ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు. ఆలయంలోని ప్రశాంతమైన వాతావరణం , నదీ తీరం ఆధ్యాత్మిక ప్రశాంతతను అందిస్తాయి.
ఈ ఆలయం మధ్యప్రదేశ్‌లోని అగర్ మాల్వా జిల్లా, నల్ఖేడా ప్రాంతానికి సమీపంలో ఉన్న గడియా గ్రామంలో ఉంది. స్థానికులు దీనిని గడియాఘాట్ వాలీ మాతాజీ ఆలయం అని పిలుస్తారు. ఇక్కడి ఆలయ ప్రధాన అర్చకుల చెప్పేదాన్ని బట్టి.. ఇక్కడ ఎల్లప్పుడూ ఒక నూనె దీపం వెలుగుతూ ఉండేది. కానీ ఒక రోజు అమ్మవారు అతనికి కలలో కనిపించి, నదీ జలాలతో దీపాన్ని వెలిగించమని ఆదేశించిందట. మొదట అతను సంకోచించాడు. కానీ మరుసటి రోజు కాళిసింధ్ నది నుండి నీటిని తెచ్చి దీపంలో పోశాడు. దీపాన్ని వెలిగించగానే ఆశ్చ్యరకరంగా దీపం వెలిగింది.
ఈ సంఘటన జరగగానే ఆలయ అర్చకుడు కొంతకాలం భయపడ్డాడట. దాదాపు రెండు నెలల పాటు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదట. ఆ తర్వాత, కొంతమంది గ్రామస్తులకు ఈ విషయం తెలిసిందట. మొదట్లో ప్రజలు దాన్ని నమ్మలేదు. కానీ అర్చకుడు స్వయంగా దీపంలో నీళ్ళు పోసి వెలిగించగా, జ్వాల వెలిగింది. దీని తర్వాత, ఈ వార్త ఆ ప్రాంతమంతా వ్యాపించింది. అప్పటి నుండి, ఈ ఆలయంలో కాళిసింధ నది నీటితో దీపం వెలిగించే సంప్రదాయం కొనసాగుతోంది. దీపంలో పోసిన నీరు జిగట పదార్థంగా మారి, దీపం వెలగడం మొదలవుతుందని ప్రజలు చెబుతారు.
ఆలయానికి సంబంధించిన ఈ రహస్య సంఘటన ఇప్పటికీ ప్రజలను ఆశ్చర్యపరుస్తోంది. చాలా మంది భక్తులు దీనిని అమ్మవారి అద్భుతంగా భావిస్తారు. ఈ దీపానికి సంబంధించిన అనేక వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే వర్షాకాలంలో కాళిసింధ నది నీటిమట్టం పెరిగి ఆలయం మునిగిపోవడం వల్ల అక్కడ పూజలు, ప్రార్థనలు నిలిపివేస్తారు. ఆ తర్వాత, శరదృతు నవరాత్రులలో ఘటస్థాపన రోజున దీపాన్ని మళ్లీ వెలిగిస్తారు.
ఎలా వెళ్లాలంటే..
ఈ ఆలయాన్ని సందర్శించాలంటే ముందుగా మధ్యప్రదేశ్‌లోని అగర్ మాల్వా జిల్లాకు ప్రయాణించాలి. అక్కడి నుండ నల్ఖేడా ప్రాంతం మీదుగా రోడ్డు మార్గంలో గడియా గ్రామానికి సులభంగా చేరుకోవచ్చు. ఈ ఆలయం కాళిసింధ్ నది ఒడ్డున ఉంది. ప్రైవేట్ వాహనాలు , స్థానిక రవాణా సౌకర్యం అందుబాటులో ఉంటుంది. నవరాత్రుల సమయంలో భక్తులు ఎక్కువగా కనిపిస్తారు, ఆ సమయంలో ఆలయ వాతావరణం అత్యంత భక్తిమయంగా , ఆకర్షణీయంగా మారుతుంది.
*రూపశ్రీ.